జెనీవా: కరోనా సోకిన వ్యక్తిని కలిసిన కారణంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియేసస్ డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం తాను క్వారంటైన్‌లో ఉంటున్నట్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. అయితే తనకు ఎటువంటి లక్షణాలు లేవని టెడ్రోస్ తెలిపారు. టెడ్రోస్ కలిసిన కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరో ఆయన వెల్లడించలేదు. ఐక్యరాజ్యసమితికి చెందిన డబ్ల్యూహెచ్‌వో జెనీవా కేంద్రంగా పనిచేస్తోంది. ఐదు లక్షల జనాభా గలిగిన జెనీవాలో రోజుకి 1000 కొత్త కరోనా కేసులు నమోదౌతున్నాయి. జెనీవాలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఆదివారం కఠిన ఆంక్షలు విధించారు. ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కోవిడ్‌ని కట్టడి చేసే కర్తవ్యనిర్వహణలో టెడ్రోస్ ముందుభాగాన ఉండి పోరాడుతున్నారు. రానున్న రోజుల్లో డబ్ల్యూహెచ్‌వో నియమాల ప్రకారం ఇంటి నుంచే పనిచేస్తానని టెడ్రోస్ వెల్లడించారు.
కోవిడ్‌ని దాచిన బ్రిటన్ యువరాజు
బ్రిటన్ యువరాజు విలియమ్స్‌కు ఏప్రిల్‌లో కరోనా సోకినప్పటికీ దాన్ని రహస్యంగా ఉంచారని, అప్పటికే ఆయన తండ్రి ప్రిన్స్ చార్లెస్ కోవిడ్‌తో క్వారంటైన్‌లో ఉన్నారని, అందుకే సన్నిహితులెవ్వరూ బాధపడకూడదని ఎవ్వరికీ చెప్పలేదన్న విషయాన్ని బ్రిటన్ మీడియా బయటపెట్టింది. బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించే వరుసలో రెండో స్థానంలో ఉన్న ప్రిన్స్ విలియమ్స్‌కి కోవిడ్ సోకడంతో ప్రభుత్వ నియమాలను అనుసరించి, ప్యాలెస్‌లోని వైద్యులు తూర్పు ఇంగ్లాండ్‌లోని నార్‌ఫోల్క్‌లోని సొంత ఇంటిలో క్వారంటైన్‌లో ఉంచి వైద్యం అందించినట్లు మీడియా పేర్కొంది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఏప్రిల్‌లో దాదాపు 14 టెలిఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌ని యువరాజు మాట్లాడారని, బర్టన్‌లోని క్వీన్స్ ఆసుపత్రికి చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ వర్కర్స్‌తో మాట్లాడారని ఆ కథనం పేర్కొంది. యువరాజు కరోనా వైరస్‌తో తీవ్రంగా ప్రభావితం అయ్యారని లండన్‌లోని ఇంటికే పరిమితమయ్యారని ఆ కథనం పేర్కొంది.
భారత్‌లో కొత్త కేసులు 45 వేలు
దేశంలో గత 24 గంటల్లో 45,231 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,29,313కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 496 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,22,607కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 75,44,798కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,61,908 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 6.83 శాతం ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 91.68 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.49గా ఉంది. గత 24 గంటల్లో సంభవించిన కరోనా మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 113 మంది మరణించారు. ఈ నెల 1 వరకూ 11,07,43,103 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఆదివారం మరో 8,55,800 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది.
క్వారంటైన్‌లో డబ్ల్యూహెచ్‌వో చీఫ్
Published Tue, Nov 3 2020 4:36 AM | Last Updated on Tue, Nov 3 2020 4:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment