రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన ఎం.కృష్ణయ్య రెండ్రోజులుగా తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతూ శుక్రవారం స్థానిక పీహెచ్‌సీలో కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్లాడు. ఉదయం 11 గంటలకు వెళ్ళిన అతనికి అప్పటికే పరీక్షలు పూర్తయినట్లు సిబ్బంది చెప్పారు. కిట్లు తక్కువగా ఉన్నందున 25 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నామని, రేపు ఉదయం 9 గంటల కల్లా వస్తే పేరు నమోదు చేసుకుని పరీక్ష చేస్తామని చెప్పడంతో తిరుగుముఖం పట్టాడు.
చైతన్యపురికి చెందిన పి.శ్రీనివాస్‌కు మూడు రోజులుగా జ్వరంతో పాటు దగ్గు వస్తోంది. దీంతో పక్కనే ఉన్న సరూర్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షకు వెళ్ళాడు. ఉదయం 10 గంటలకే అక్కడ రెండొందల మందికి పైగా పరీక్షల కోసం నిరీక్షిస్తున్నారు. కొంతసేపటికి వైద్య సిబ్బందిలో ఒకరు బయటకు వచ్చి ఈ రోజు 50 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నామని, ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నామని చెప్పారు. మిగిలినవాళ్లు రేపు రావాల్సిందిగా సూచించడంతో శ్రీనివాస్ దిల్‌సుఖ్‌నగర్‌లోని
ఓ ప్రైవేటు ల్యాబ్‌లో టెస్ట్ కోసం ఆన్‌లైన్లో బుక్ చేసుకున్నాడు. చదవండి: (వైరస్‌కు శక్తి పెరిగింది.. ఎయిర్ బోర్న్‌గా రూపాంతరం చెందింది)
సాక్షి, హైదరాబాద్: కరోనా రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపిస్తోంది. గడచిన రెండు వారాల్లోనే లక్షకు పైబడి కేసులు నమోదు కావడం వైరస్ వ్యాప్తి వేగాన్ని స్పష్టం చేస్తోంది. కరోనాకు కళ్ళెం వేసేందుకు పెద్దసంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని కేంద్రం సూచిస్తుండగా... రాష్ట్రంలో మాత్రం కోవిడ్–19 నిర్ధారణ టెస్టులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. కిట్ల కొరతే ఇందుకు కారణమని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో టెస్టుల కోసం వందల సంఖ్యలో పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నా.. ఒక్కో కేంద్రంలో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే పరీక్షలు చేసి చేతులెత్తేస్తున్నారు. దీంతో లక్షణాలున్న వారు సైతం సకాలంలో పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. వైరస్ సోకిందీ లేనిదీ నిర్ధారణ కాక కొందరు సాధారణ జీవనాన్ని కొనసాగించడం.. కుటుంబసభ్యులకు, ఇతరులకు వ్యాపించేందుకు కారణమవుతోంది. ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,148 పరీక్షా కేంద్రాల్లో 11,42,096 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,01,966 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 8.927 శాతంగా నమోదయ్యింది. చదవండి: (చైనాకు కలిసొస్తున్న కరోనా..!)
కిట్ల కొరతతో సతమతం
వైద్య, ఆరోగ్య శాఖకు కోవిడ్–19 నిర్ధారణ కిట్ల కొరత ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్రం కావడంతో పరీక్షల కోసం వందల సంఖ్యలో కేంద్రాల వద్ద అనుమానితులు బారులు తీరుతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పరీక్షా కేంద్రానికి 200 మందికి పైగా పరీక్షల కోసం రాగా.... కేవలం 50 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారు. కిట్లు లేవని, మిగతావారు రేపు రావాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా యాచారం పరీక్షా కేంద్రంలో కేవలం 25 మంది నుంచి మాత్రమే నమూనాలు తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా 25–50 పరీక్షలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో అన్నిచోట్లా ర్యాపిడ్ టెస్టులే చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు దాదాపు నిలిచిపోయాయి. వారం క్రితం వరకు అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో ఆవశ్యకతను బట్టి ఆర్టీపీసీఆర్ శాంపుల్స్ తీసుకుని ప్రభుత్వ కేంద్రాలకు పంపి పరీక్షలు నిర్వహిస్తుండగా... ఇప్పుడు 21 కేంద్రాలతో పాటు అన్నిచోట్లా ఈ నమూనాల స్వీకరణకు మంగళం పాడారు. మరోవైపు సెలవు దినాల్లో పరీక్షల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రోజూ నిర్వహిస్తున్న పరీక్షల్లో సగటున సగం మాత్రమే చేస్తున్నారు.
గణనీయంగా తగ్గిన పరీక్షలు
రెండు వారాల క్రితం రోజుకు లక్షకు పైబడి నమూనాలను పరీక్షించి ఫలితాలను ప్రకటించిన వైద్య, ఆరోగ్య శాఖ... ప్రస్తుతం 70 వేల నమూనాలను మాత్రమే సేకరిస్తోంది. అందులో కూడా 5 నుంచి 8 శాతం నమూనాల ఫలితాలను పెండింగ్‌లో ఉంచుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,148 కేంద్రాల్లో కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో ప్రభుత్వ కేంద్రాలు 1,085 ఉండగా.. మరో 63 ప్రైవేటు సంస్థలకు చెందినవి. ప్రభుత్వం నిర్వహిస్తున్న వాటిలో 21 కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తుండగా... 1,064 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్ష (ర్యాట్)లు చేస్తున్నారు. ఇక ప్రైవేటు కేంద్రాల్లో దాదాపు ఆర్టీపీసీఆర్ పరీక్షలే చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో మూడో వారం నాటికి రోజుకు లక్షకు పైగా నమూనాలను తీసుకుని పరీక్షించి ఫలితాలు ప్రకటించగా.. ఆ తరువాత నుంచి 50 వేల నుంచి 70 వేల నమూనాలను మాత్రమే తీసుకుని అందులో 95 శాతానికి సంబంధించి ఫలితాలు ప్రకటిస్తున్నారు. గడిచిన రెండు వారాల్లో ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో 8,89,902, ప్రైవేటు కేంద్రాల్లో 2,52,194 పరీక్షలు నిర్వహించారు. దీనిని బట్టి చూస్తే ఒక్కో కేంద్రంలో రోజుకు సుమారు 70 నమూనాలను మాత్రమే స్వీకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment