పెద్ద మాయ !
⇒ బిడ్డలు అదృశ్యమవుతున్నా తీరుమారని జీజీహెచ్
⇒ తాజాగా తొమ్మిదినెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన మహిళ
⇒ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో తరచూ ఘటనలు
⇒ ఆసుపత్రిలో పనిచేయని సీసీ కెమెరాలు
⇒ అధికారులు, సిబ్బంది తీరుతో రోగుల్లో భయాందోళనలు
నవ్యాంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి...కోస్తాంధ్ర జిల్లాలకు ఆరోగ్య ప్రదాయిని...గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లో అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కొందరు తల్లులకు గర్భశోకాన్ని మిగులుస్తోంది. ఎలుకలు పసికందుల ప్రాణాలు తీస్తున్నా, పసిబిడ్డలు మాయమవుతున్నా ఇక్కడి అధికారులు, సిబ్బంది తీరు మారకపోవడం భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా బుధవారం మరో బిడ్డ మాయమయ్యాడు ..
గుంటూరు : రెంటచింతల మండలం పశర్లపాడు గ్రామానికి చెందిన గోసి రమణకు తొమ్మిది నెలల క్రితం మగబిడ్డ పుట్టాడు. అనారోగ్యంగా ఉండడంతో అమ్మమ్మ హుస్సేనమ్మ ఆ బిడ్డను తీసుకువచ్చి జీజీహెచ్‌లోని పిలల్ల వార్డులో చేర్చింది. మూడు రోజులుగా ఆ వార్డులో తిరుగుతున్న ఓ మహిళ బాబును ఎత్తుకుని ఆడిస్తూ బుధవారం హుస్సేనమ్మ కళ్లుగప్పి బిడ్డతో సహా పరారైంది. దీంతో లబోదిబోమన్న అమ్మమ్మ జీజీహెచ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఆసుపత్రిలోని అన్ని వార్డులకూ పాకడంతో తీవ్ర కలకలం రేగింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆసుపత్రి భద్రతలో డొల్లతనం బయటపడుతున్నా సరిదిద్దే ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు. ఇక్కడే ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. దీనికి బాధ్యులను చేస్తూ పారిశుధ్య, భద్రత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకున్నారు. అతనికి రెట్టింపు పారితోషికం ఇచ్చి అధికార పార్టీ ఎంపీ అనుయాయులకు కాంట్రాక్ట్ అప్పగించారు. అయినా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పదిహేను రోజుల్లో ఆసుపత్రి నుంచి ఇద్దరు పసికందులను ఎత్తుకెళ్ళిన సంఘటన లు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీసీ కెమెరాలు పని చేయడం లేదు. గేట్‌పాస్‌లు, విజిటింగ్, స్టేపాస్‌ల పేరుతో హడావిడి చేసే ఆసుపత్రి అధికారులు, భద్రతా సిబ్బంది పసికందులు ఆసుపత్రి నుంచి అదృశ్యం అవుతుంటే ఏం చేస్తున్నారంటూ రోగులు ప్రశ్నిస్తున్నారు.
ప్రసూతి, పిల్లల వైద్య విభాగాల వద్ద ఆందోళన కలిగించే ఘటనలు ...
జీజీహెచ్ ప్రసూతి వైద్య విభాగం వద్ద తరచూ ఇబ్బందికర ఘటనలు జరుగుతుండడంతో రోగులు, వారి బంధువులు హడలిపోతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఐదుగురు శిశువులను అపహరించుకు వెళ్ళిన ఘటనలు జరిగాయి. ముగ్గురు వెంటనే దొరికినప్పటికీ ఇద్దరు తల్లులకు మాత్రం గర్భశోకం తప్పలేదు. తల్లులు ఆదమరిచి ఉన్న సమయంలో పసికందులను ఎత్తుకెళుతు న్నా అక్కడి భద్రతా సిబ్బంది పట్టుకోలేకపోవడం, కనీసం సీసీ కెమెరాలు సైతం పనిచేయకపోవడంతో దొంగలు ఎవరో గుర్తించలేని పరిస్థితి నెలకొంటుంది. గత ఏడాది ప్రత్తిపాడుకు చెందిన ఓ గర్భిణి జీజీహెచ్‌లో ప్రసవించగా పసికందును ఓ మహిళ ఎత్తుకెళ్ళింది. కొత్తపేట పోలీసులు అతి కష్టం మీద పట్టుకున్నారు. పది రోజుల క్రితం తాడికొండకు చెందిన ఓ మహిళకు ఆడ శిశువు పుట్టగా, అమ్మమ్మ ఆ శిశువును ఆసుపత్రి నుంచి తీసుకెళ్ళి సమీపంలోని బ్రిడ్జికింద వదిలి వెళ్తుండగా స్థానికులు పట్టుకుని ఆసుపత్రికి చేర్చారు.
ఏదీ భరోసా..?
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఆసుపత్రి ఉన్నతాధికారులు తూతూ మంత్రంగా విచారణలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. వైద్యులు, సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని నగరం కానున్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల దయనీయ పరిస్థితిని మార్చే వారే లేకుండా పోయారు.