స్టాఫ్‌నర్స్ అనుమానాస్పద మృతి
భర్త వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ
చిట్వేలి: మండల కేంద్రమైన చిట్వేలి ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్న రమ్యశ్రీ(31) మంగళవారం ఉదయం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బంధువులు, పోలీసుల కథనం మేరకు...శ్రీకాళహస్తికి చెందిన రమ్యశ్రీ చక్రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తూ ఒకటిన్నర సంవత్సరం కిందట బదిలీపై చిట్వేలికి వచ్చింది. స్థానిక క్వార్టర్స్‌లోనే నివాసం ఉండేది. తల్లిదండ్రులు రాజేశ్వరి(కాళహస్తిలో హెల్త్‌సూపర్‌వైజర్), బత్తినయ్యలు తమ కుమార్తె రమ్యశ్రీని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్‌టెక్నిషియన్‌గా పని చేస్తున్న నరసింహరావుతో 2009ఆగస్టు 15వ తేదీన వివాహం జరిపిం చారు. రమ్యశ్రీ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన చిట్వేలికి చేరుకున్నారు. తమ కుమార్తె మృతికి భర్త వేధిం పులే కారణమని ఆరోపించారు. వివాహ సమయంలో ఇరవై తులాల బంగారు, రూ.2లక్షల నగదు వరకట్నంగా ఇచ్చామన్నారు. అయినా చీటికి మాటికి తమ కుమార్తెను వేధిస్తూ పలు ఇబ్బందులకు గురి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం తమ కుమార్తె తమకు ఫోన్ చేసి భర్త వేధిస్తున్నాడని, మీరు రావాలని కోరినట్లు చెప్పారు.
మంగళవారం వస్తాములే అని చెప్పామని, అంతలోనే తమ కుమార్తె శవమై మిగిలిందని వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, భర్తే ఏదో ఒక రూపంలో హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. ఈ విషయమై చుట్టు పక్కల వారిని విచారించగా తరచూ భార్యభర్తలు గొడవ పడే వారని, గొడవ అనంతరం తిరిగి బాగా కలసిమెలసి ఉండేవారని తెలిపారు. మృతురాలి భర్త నరసింహరావుకు మంగళవారం తెల్లవారుజామున భార్య కాఫీ ఇచ్చిందని, అనంతరం తాను బాత్‌రూములోకి వెళ్లగా భార్య వాం తులు చేసుకుంటూ కిందపడిపోవడంతో ఇరుగు పొరుగు వారిని పిలిచి ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చామని తెలిపారు. వైద్యపరీక్షలు నిర్వహించేలోపు మృతి చెం దినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా రమ్యశ్రీ పిల్లలు మురారి(4), ఉషాకిరణ్మయి(2)లు మాత్రం అమాయకంగా ఆడుకుంటుంటుండగా చుట్టుపక్కల వారు అయ్యో పాపం, ఇక వారి ఆలనా, పాలనా ఎవరు చూసుకుంటారోనని బాధపడ్డారు.