108కూ నిర్లక్ష్యం జబ్బు
చిత్తూరు(సిటీ): రోగులు, క్షతగాత్రుకు ప్రాణంపోసే 108 సిబ్బందిలోనూ నిర్లక్ష్యం జబ్బు పట్టుకుంటోంది. వింతవ్యాధితో బాధపడుతున్న ఓరోగిని అత్యవసరంగా తిరుపతి రుయా వైద్యశాలకు తీసుకెళ్లాలని, లేని పక్షంలో ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వైద్యులు చెప్పినా కాణిపాకం 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనం...వివరాలలోకి వెళ్లితే... నగర పరిధిలోని శ్రీలంక కాలనీకి చెందిన సోమనాథం, ఒరిస్సాకు చెందిన కీర్తన ప్రేమ వివాహం చేసుకున్నారు.
కీర్తన నాలుగు నెలల క్రితం ఒరిస్సాలోని ప్రభుత్వ వైద్యశాలలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు పుట్టినప్పటి నుంచి కీర్తన వింత వ్యాధితో బాధపడుతోంది. దీంతో కీర్తనను చికిత్స నిమిత్తం మంగళవారం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చేర్పించారు. అయితే ఆమె పరిశీలించిన వైద్యులు, రోగి స్థితి సీరియస్‌గా ఉందని, మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తీసుకుపోవాలని సిఫార్సు చేశారు. రోగిని తిరుపతికి తరలించడానికి డబ్బు లేక అల్లాడుతున్న నిరుపేద ముత్తు పరిస్థితిని చూసి చలించిన డాక్టర్ 108కు ఫోన్ చేశారు.
అప్పటికే వైద్యశాలలో ఉన్న కాణిపాకం రూట్ వాహనంలో రోగిని తీసుకెళ్లేందుకు ఉపక్రమించారు. అయితే తమ వాహనంలో రోగిని తిరుపతికి తీసుకెళ్లేందుకు రూల్స్ ఒప్పుకోవంటూ, అ వాహ నం సిబ్బంది అక్కడ నుంచి జారుకున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రికి వచ్చిన వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి చూసి స్పందించారు. డాక్టర్లతో చర్చించడంతో పాటు, కొంత ఆర్థిక సహాయం చేసి, చిత్తూరు వైద్యశాల అంబులెన్స్‌లో తిరుపతికి తరలింపజేశారు.