కాణిపాకం ఆలయ ముఖచిత్రం
కాణిపాకం: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల నియామకానికి సంబంధించిన వివాదాన్ని మరిచిపోకముందే.. కాణిపాకం ట్రస్టుబోర్డు ఏర్పాటులో తెలుగుదేశం ప్రభుత్వం తప్పటడుగు వేసింది. ఆలయ చరిత్రను పరిశీలిస్తే.. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన కాణిపాకం దేవస్థానంలో ఉభయదారుల వ్యవస్థ కీలకమైంది. వంద సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధిలోనూ, వరసిద్ధుని వార్షిక బ్రహ్మోత్సవాల్లోనూ.. వీరు నిర్వహించే వాహన సేవలు కీలకం. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఈక్రమంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ట్రస్టు బోర్డు ఏర్పాటులో ఉభయదారులకు కీలక బాధ్యతలు ఇచ్చేవారు. అయితే ఇటీవల టీడీపీ ప్రభుత్వం విడుదల అయిన ట్రస్టు బోర్టు నియామక జీఓ ప్రకారం మొత్తం 14 మంది బోర్డు సభ్యుల్లో 11 మంది బయటి ప్రాంతాల వారికి పదవులను కట్ట బెట్టింది. అందులోనూ ఒక కీలక సామాజిక వర్గానికి సంబంధించిన ఒకరికి కూడా పదవి ఇవ్వక పోవడం సర్వత్రా విమర్శలకు తీవ్ర తావిస్తోంది.
దేవస్థానం అభివృద్ధిలో ముఖ్యపాత్ర
వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అభివృద్ధి, ఆలయ జీర్ణోద్ధరణ సమయంలో భూములు విరాళంగా అందజేసి, స్వామివారికి రోజూ పూజాదికాలు సంప్రదాయబద్ధంగా జరిపించడంలో 14 గ్రామాల ప్రజలు కీలకపాత్ర వహించారు. అప్పటి నుంచి ఉభయదారులుగా ఏర్పడి ఆలయ అభివృద్ధి, ఉత్సవాల నిర్వహణలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దాదాపు పది వేలకు పైగా కుటుంబాలు ఉన్న ఈ ఉభయదారుల్లో వంశపారంపర్యంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో పాలక మండలి ఏర్పాటు చేసేటప్పుడు సగానికి పైగా ఉభయదారులనే బోర్డు సభ్యులు నియమించేవారు. అయితే తాజాగా విడుదల చేసిన పాలక మండలి సభ్యుల్లో కేవలం ముగ్గురు ఉభయదారులనే సభ్యులుగా నియమించడం.. ఆలయ అభివృద్ధితో ఎలాంటి సంబంధం లేని 11 మంది వ్యక్తులకు బోర్డు సభ్యులుగా పదవులను కేటాయిం చడం చర్చనీయాంశమైంది.
టీడీపీ వర్గ పోరుతోవెయ్యి కుటుంబాలు అన్యాయం
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్గ పోరుతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఒక సామాజిక వర్గం తీవ్రంగా విమర్శిస్తోంది. వెయ్యికి పైగా కుటుంబాలు ఉన్న తమకు ఎలాంటి న్యాయం చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈవ్యవహారంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి లలిత కుమారి చక్రం తిప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న మరో వర్గానికి అధిష్టానం వద్ద చుక్కెదురు అయ్యినట్లు సమాచారం. దీంతో ఆ వర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది.
ఉభయదారులకు అన్యాయం
కాణిపాకం దేవస్థాన బోర్డు నియామకంలో స్థానిక ఉభయదారులకు తీరని అన్యాయం జరిగింది. ఉభయదారులకు సగానికి పైగా బోర్డులో కేటాయింపులు జరగాలని గతంలో న్యాయస్థానం సైతం ఆదేశించింది. అయితే ప్రస్తుత అధికార పార్టీ వాటిని పూర్తిగా విస్మరించి నిబంధనలకు విరుద్ధంగా నియామకం చేపట్టింది. 14 మందిలో బయటి ప్రాంతాల్లో ఉన్న 11 మందికి కేటాయింపులు చేశారు. ఇది పెద్దమోసం.
– చిన్నారెడ్డి, స్థానిక ఉభయదారులు, చినకాంపల్లె
ఓ సామాజిక వర్గానికి పూర్తిగా స్థానం కల్పించ లేదు
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ట్రస్టు బోర్డు నియామకంలో రెడ్డి సామాజిక వర్గానికి ఒక్క స్థానం కూడా దక్కక పోవడం దారుణం. వెయ్యికి పైగా కుటుంబాలు ఉన్న మా సామాజిక వర్గం ప్రతినిధులు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నెమలి వాహన సేవను నిర్వహించడం ఆనవాయితీ. ప్రభుత్వం నిబంధనలు పూర్తిగా విస్మరించింది.
– జగన్నాథ రెడ్డి,ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్, కాణిపాకం
Comments
Please login to add a commentAdd a comment