ఆలయ పుష్కరిణిలోకి దూకిన లావణ్యను కాపాడుతున్న భద్రతా సిబ్బంది (ఇన్‌సెట్) దంపతులకు కౌన్సెలింగ్ ఇస్తున్న ఎస్‌ఐ కృష్ణమోహన్
కాణిపాకం: పుష్కరిణిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం కాణిపాకంలో కలకలం సృష్టించింది. ఉదయం 11 గంటల వేళ నిజరూప దర్శన సేవ సమయంలో ఇది చోటుచేసుకోవడంతో భక్తులు ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను కాపాడారు. అదృష్టవశాత్తు పుష్కరిణిలో ఎక్కువగా నీళ్లు లేకపోవడం, మూడు అడుగుల లోతు వరకే నీళ్లు ఉండడంతో కాపాడటం సులువైంది. ఆపై, ప్రథమ చికిత్స చేసి వివాహితను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సాక్షాత్తు ఆమె భర్త కూడా ఆలయంలో పనిచేసే ఇంజినీరింగ్ శాఖ ఉద్యోగి కావడంతో తొలుత అతడిని పిలిపించారు. ఆ తర్వాత దంపతుల కుటుంబ సభ్యులనూ సైతం పిలిపించారు. దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకు తలబొప్పి కట్టించారు. వారిద్దరికీ కౌన్సెలింగ్‌తో ఎస్‌ఐ కృష్ణమోహన్ ఎట్టకేలకు హితబోధ చేసి దంపతుల కలహాలకు తాత్కాలికంగా తెరదించారు. ఇంటికి సాగనంపారు. ఎస్‌ఐ కథనం..యాదమరి మండలానికి చెందిన లావణ్యకు కాణిపాకం ఆలయంలోని ఇంజినీరింగ్ శాఖలో పనిచేస్తున్న బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి వాసి బద్రికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడున్నరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తన భర్త రెండు నెలలుగా ఇంటికి రాలేదంటూ లావణ్య కాణిపాకం ఈఓ కార్యాలయానికి వచ్చి తన భర్తను నిలదీసింది. అతను ఆమెను తీవ్రంగా మందలించి చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆలయ పుష్కరిణిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది.
Comments
Please login to add a commentAdd a comment