రూపురేఖలు మార్చేస్తా
ప్రభుత్వ ఆస్పత్రులపై లక్ష్మారెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పా రు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టపర్చే కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నామన్నారు. నగరంలోని గాంధీ ఆస్పత్రిని శుక్రవారం ఆయన సందర్శిం చారు. సుమారు 8 గంటలపాటు ఆస్పత్రిలో ఉన్న మంత్రి అక్కడి లోటుపాట్లను తెలుసుకు న్నారు. వైద్యసేవలపై రోగులను ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర సిబ్బంది, ఆరోగ్యశ్రీ సీఈవో, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులతో సమీక్ష నిర్వహించా రు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ... నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం బడ్జెట్‌లో రూ.5966కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. తెలంగాణకు రెండు కళ్లుగా ఉన్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. ఉస్మానియా ఆస్పత్రి లో నూతన భవన సముదాయాల నిర్మాణాలకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. రూ.600 కోట్లతో రాష్ట్రంలోని ల్యాబోరేటరీలను పటిష్ట పరుస్తామన్నారు.
కో ఆర్డినేషన్ ఆఫీసర్ల నియామకం..
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఉస్మానియా, గాంధీ, ఎంజేఎం వంటి పెద్ద ఆస్పత్రుల్లో కోఆర్డినేషన్ ఆఫీసర్లను నియమించే ఆలోచన ఉందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కోఆర్డినేషన్ ఆఫీసర్లు ఆయా ఆస్పత్రుల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలు, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యల వంటి అంశాలను తన దృష్టికి తెస్తారన్నారు. కాగా, రాష్ట్రంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ స్టాఫ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ వేణుగోపాలరావు, ఆరోగ్యశ్రీ సీఈవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.