‘నాట్కో’ ట్రస్ట్‌తో ప్రభుత్వం ఎంవోయూ | Government MoU with Natco Trust | Sakshi
Sakshi News home page

‘నాట్కో’ ట్రస్ట్‌తో ప్రభుత్వం ఎంవోయూ

Published Wed, Feb 28 2024 5:12 AM | Last Updated on Wed, Feb 28 2024 5:12 AM

Government MoU with Natco Trust - Sakshi

గుంటూరు జీజీహెచ్‌లో 100 పడకలతో మరో క్యాన్సర్‌ భవనం 

సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్‌: క్యాన్సర్‌ రోగులకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్‌ వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో సెంటర్‌ను లెవల్‌–1 క్యాన్సర్‌ సెంటర్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీన్లో భాగంగా నాట్కో సెంటర్‌లో ప్రస్తుతం ఉన్న 100 పడకలకు అదనంగా మరో 100 పడకలతో బ్లాక్‌ నిర్మాణానికి ‘నాట్కో’ ఫార్మా సంస్థ వైద్య, ఆరోగ్య శాఖతో ఎంవోయూ కుదుర్చుకుంది.

మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సమక్షంలో డీఎంఈ డాక్టర్‌ నరసింహం, నాట్కో ఫార్మా వ్యవస్థాపకుడు, నాట్కో ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ వి.సి.నన్నపనేని మంగళవారం ఎంవోయూ చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ.. ఈ సెంటర్‌లో రేడియేషన్, మెడికల్, సర్జికల్‌ వంటి అన్ని రకాల విభాగాల్ని ఏర్పా­టు చేయడం ద్వారా క్యాన్సర్‌ రోగులకు సమగ్ర చికిత్స అందుతుందని వివరించారు.

క్యాన్సర్‌ చికిత్స నిర్ధార­ణ కోసం అవసరమైన పెట్, సిటి మెషిన్‌  కొనుగో­లుకు కూడా టెండర్లు పిలిచామని తెలిపారు. ఈ సెంటర్‌లో శిక్షణ పొందిన నర్సులు మాత్రమే పని చేసే విధంగా 30 ప్రత్యేక పోస్టులతో కలిపి మొత్తం 120 పోస్టుల్ని మంజూరు చేశామన్నారు. వి.సి. నన్నపనేని మాట్లాడుతూ సుమారు 35 వేల చదరపు అడుగుల్లో అదనంగా 100 పడకల క్యాన్సర్‌ బ్లాక్‌ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు.

నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లోని రోగులకు ఉచి­త  మందుల పంపిణీలో భాగం­గా ఈ త్రైమాసికాని­కి రూ.60 లక్షల విలువైన మందుల్ని కృష్ణబాబుకు ఆయన అంద­జే­శా­రు. కార్యక్రమంలో నాట్కో ఫార్మా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నన్నప­నేని సదాశివరావు, క్యాన్స­ర్‌ సెంటర్‌ సమ­న్వయకర్త యడ్లపాటి అశోక్‌కుమార్, గుంటూరు జీజీహెచ్‌  సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement