Natco Pharma Company
-
‘నాట్కో’ ట్రస్ట్‌తో ప్రభుత్వం ఎంవోయూ
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో సెంటర్‌ను లెవల్–1 క్యాన్సర్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీన్లో భాగంగా నాట్కో సెంటర్లో ప్రస్తుతం ఉన్న 100 పడకలకు అదనంగా మరో 100 పడకలతో బ్లాక్ నిర్మాణానికి ‘నాట్కో’ ఫార్మా సంస్థ వైద్య, ఆరోగ్య శాఖతో ఎంవోయూ కుదుర్చుకుంది. మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సమక్షంలో డీఎంఈ డాక్టర్ నరసింహం, నాట్కో ఫార్మా వ్యవస్థాపకుడు, నాట్కో ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ వి.సి.నన్నపనేని మంగళవారం ఎంవోయూ చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ.. ఈ సెంటర్లో రేడియేషన్, మెడికల్, సర్జికల్ వంటి అన్ని రకాల విభాగాల్ని ఏర్పాటు చేయడం ద్వారా క్యాన్సర్ రోగులకు సమగ్ర చికిత్స అందుతుందని వివరించారు. క్యాన్సర్ చికిత్స నిర్ధారణ కోసం అవసరమైన పెట్, సిటి మెషిన్ కొనుగోలుకు కూడా టెండర్లు పిలిచామని తెలిపారు. ఈ సెంటర్లో శిక్షణ పొందిన నర్సులు మాత్రమే పని చేసే విధంగా 30 ప్రత్యేక పోస్టులతో కలిపి మొత్తం 120 పోస్టుల్ని మంజూరు చేశామన్నారు. వి.సి. నన్నపనేని మాట్లాడుతూ సుమారు 35 వేల చదరపు అడుగుల్లో అదనంగా 100 పడకల క్యాన్సర్ బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. నాట్కో క్యాన్సర్ సెంటర్లోని రోగులకు ఉచిత మందుల పంపిణీలో భాగంగా ఈ త్రైమాసికానికి రూ.60 లక్షల విలువైన మందుల్ని కృష్ణబాబుకు ఆయన అందజేశారు. కార్యక్రమంలో నాట్కో ఫార్మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు, క్యాన్సర్ సెంటర్ సమన్వయకర్త యడ్లపాటి అశోక్‌కుమార్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. -
నాట్కో సీటీపీఆర్‌కు తొలగిన అడ్డంకి, షేర్లు జూమ్
హైదరాబాద్: క్లోరంట్రానిలిప్రోల్ (సీటీపీఆర్) పురుగు మందులను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టేందుకు నాట్కో ఫార్మాకు అడ్డంకి తొలగిపోయింది. ఢిల్లీ హైకోర్టు నుంచి ఈ మేరకు కంపెనీ ఉపశమనం పొందింది. సీటీపీఆర్ విషయంలో నాట్కో ఫార్మా పేటెంట్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ యూఎస్‌కు చెందిన ఎఫ్ఎంసీ కార్పొరేషన్ గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కాగా, సీటీపీఆర్‌ను దేశీయంగా తయారు చేయడం కోసం సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్, రిజిస్ట్రేషన్ కమిటీ నుండి అనుమతి పొందిన తొలి కంపెనీ తామేనని నాట్కో సోమవారం తెలిపింది. వివిధ పంటల్లో వచ్చే తెగులు నివారణకు ఈ పురుగు మందును వాడతారు. సీటీపీఆర్ ఆధారిత ఉత్పత్తుల విపణి భారత్‌లో సుమారు రూ.2,000 కోట్లు ఉంటుందని నాట్కో వెల్లడించింది. త్వరలో ఈ ఉత్పత్తులను ప్రవేశపెడతామని కంపెనీ ప్రకటించింది. ఈ వార్తలతో నాట్కో ఫార్మా షేరుపై ఇన్వెస్టర్ల ఆసక్తి నెలకింది. మంగళవారం ఉదయం ఈ షేరు రూ. 16.95 లేదా 3 శాతం పెరిగి రూ.654 వద్ద ఉంది. -
నాట్కో విస్తరణ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ నాట్కో విస్తరణ ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని మేకగూడ గ్రామంలో నాట్కో ఫార్మా కంపెనీకి ప్రస్తుతమున్న 34 ఎకరాల స్థలంలో రూ.480 కోట్ల వ్యయ అంచనాతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయితే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియెంట్స్ (ఏపీఐ), ఏపీఐ ఇంటర్మీడియెట్ల తయారీ సామర్థ్యం వార్షికంగా ప్రస్తుతమున్న 115.5 టన్నుల నుంచి 645 టన్నులకు వృద్ధి చెందనుంది. దీని ద్వారా 1,200 మందికి ప్రత్యక్షంగా, 300 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ‘‘నాట్కో ఫార్మా విస్తరణ ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది’’ అని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కొన్ని షరతులకు లోబడి ఈ ఆమోదం ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఏపీఐ, ఏపీఐ ఇంటర్మీడియెట్స్ తయారీ సామర్థ్య విస్తరణ ప్రాజెక్టుతో థెరప్యూటిక్ ఔషధాల అందుబాటును పెంచడమే కాకుండా, దిగుమతుల భారాన్ని తగ్గిస్తుందని నాట్కో ఫార్మా తెలిపింది. నాట్కోకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదుచోట్ల తయారీ కేంద్రాలున్నాయి.