నాట్కో విస్తరణ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ నాట్కో విస్తరణ ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని మేకగూడ గ్రామంలో నాట్కో ఫార్మా కంపెనీకి ప్రస్తుతమున్న 34 ఎకరాల స్థలంలో రూ.480 కోట్ల వ్యయ అంచనాతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయితే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియెంట్స్ (ఏపీఐ), ఏపీఐ ఇంటర్మీడియెట్ల తయారీ సామర్థ్యం వార్షికంగా ప్రస్తుతమున్న 115.5 టన్నుల నుంచి 645 టన్నులకు వృద్ధి చెందనుంది. దీని ద్వారా 1,200 మందికి ప్రత్యక్షంగా, 300 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
‘‘నాట్కో ఫార్మా విస్తరణ ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది’’ అని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కొన్ని షరతులకు లోబడి ఈ ఆమోదం ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఏపీఐ, ఏపీఐ ఇంటర్మీడియెట్స్ తయారీ సామర్థ్య విస్తరణ ప్రాజెక్టుతో థెరప్యూటిక్ ఔషధాల అందుబాటును పెంచడమే కాకుండా, దిగుమతుల భారాన్ని తగ్గిస్తుందని నాట్కో ఫార్మా తెలిపింది. నాట్కోకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదుచోట్ల తయారీ కేంద్రాలున్నాయి.