సర్కారు వైద్యం.. ఇదేమి చోద్యం
ధర్మాసుపత్రికెళితే మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకం సామాన్యుడిలో సన్నగిల్లుతోంది. వేళకు రాని వైద్యులు.. పనిచేయని పరికరాలు.. మందుల కొరతతో ఇబ్బందులు.. వైద్య నిపుణులు లేక అవస్థలు.. వీటికితోడు కనీస మౌలిక వసతులు మృగ్యం. ఇన్ని సమస్యల నడుమ సగటు రోగికి సరైన వైద్యం అందడం దుర్లభంగా మారుతోంది. జన సంక్షేమం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పాలకులు పేదల ఆస్పత్రుల వైపు ఓ సారి దృష్టి సారించడం అవసరం.
సాక్షి, కడప : దేవుడి తర్వాత అంతటి పేరున్నది వైద్యులకే. అందుకే వైద్యోనారాయణోహరి అన్నారు. కానీ కాలక్రమంలో ఈ నానుడికి అర్థం మారిపోతోంది. నేడు ధర్మాసుపత్రుల్లో రోగుల నాడిపట్టి చూసే నాథుడే కరువయ్యాడు. జిల్లాలోని చాలా ఆస్పత్రుల్లో వైద్యులు తూతూ మంత్రంగా వైద్య సేవలు అందిస్తున్నారనే విమర్శలున్నాయి.
ప్రొద్దుటూరు పెద్దాస్పత్రికి అనారోగ్యం
జిల్లా ఆస్పత్రిగా గుర్తింపు పొందిన ప్రొద్దుటూరు ఆస్పత్రిని గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. అలాగే ఇతర డాక్టర్ల సమస్య కూడా ఉంది. సీటీ స్కాన్ చేసేందుకు అవసరమైన యూనిట్ లేకపోవడంతో చాలా చోట్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఎక్స్‌రే ప్లాంట్ పెద్దది పనిచేయకపోవడంతో కూడా రోగులకు సమస్యలు తప్పడం లేదు. ప్రతిరోజు సుమారు 500 నుంచి 600 మంది రోగులు వస్తుంటారు. పైగా జిల్లాలోని అతి పెద్ద ఆస్పత్రిగా పేరొందిన ప్రొద్దుటూరులో అన్ని శస్త్ర చికిత్సలు జరిగేలా నిపుణులతోపాటు యంత్రాలు, పరికరాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పేరుకే 24 గంటలు.. పనిచేసేది ఐదారు గంటలే!
మారుమూల ప్రాంతాల్లో నిత్యం వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన 24 గంటల ఆస్పత్రులు పడకేశాయి. ప్రత్యేకంగా ఆస్పత్రులకు సొంత భవనాలతోపాటు క్వార్టర్స్‌ను కూడా ప్రభుత్వం నిర్మించినా చాలా ఆస్పత్రుల్లో వైద్యులు ఉండడం లేదు. రకరకాల సాకులు చూపుతూ పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. 24 గంటల ఆస్పత్రులున్న ప్రాంతాల నుంచి కూడా రోగులు చిన్న సమస్యకే పట్టణాల వైపు పరుగులు తీస్తున్నారంటే అక్కడ ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయో స్పష్టమవుతోంది. కనీసం 24 గంటల ఆస్పత్రిగా గుర్తింపు ఉన్న చోట కూడా డాక్టర్లు కేవలం ఐదారు గంటలకు మించి ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఏదైనా జరిగినా ఇతర ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు.
ఆస్పత్రులను వేధిస్తున్న వైద్యుల కొరత
జిల్లాలోని పులివెందుల, కమలాపురం, రాజంపేట, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, వేంపల్లె, రాయచోటి, బద్వేలు తదితర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. ఇటు ఏరియా ఆస్పత్రులతోపాటు అటు పీహెచ్‌సీల్లో కూడా ఇదే సమస్య ఉంది. జిల్లాలో 166 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, దాదాపు 20 మందికి పైగా డాక్టర్లు ఇతర ప్రాంతాలకు పీజీ కోర్సుల నిమిత్తం వెళ్లారు. అంతేకాకుండా పులివెందుల ఏరియా ఆస్పత్రిలో 18 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరిగినా నేరుగా కడపకు సిఫార్సు చేయడం తప్ప స్థానికంగా శస్త్ర చికిత్సలు చేసే పరిస్థితి లేదు. జిల్లాలోని ప్రధాన ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వేధిస్తుండడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు.
జిల్లాలో వంద మందికిపైగా ఏఎన్‌ఎంల కొరత ఉంది. 84 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పలు ఆస్పత్రుల్లో మందుల కొరతతో రోగుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగాా ఉన్న ప్రైవేటు మెడికల్ షాపులే నిరుపేద రోగులకు దిక్కుగా మారాయి. డాక్టర్లు సూచించే మందులు చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండకపోవడంతో రోగులు ఆర్థిక భారమైనా తప్పనిసరి పరిస్థితిలో మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.