ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోండి
జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి
రాజంపేట రూరల్:
జిల్లాలోని అర్హులైన రోగులు ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ టీ.వెంకటరమణారెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకున్న వారిని పిలిపించి వారికి కల్పించిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యశ్రీని వినియోగించే రోగులకు ఖర్చులు రూ.2 లక్షలు నుంచి రూ.2.50లక్షలకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. 2008 ఏప్రిల్ 15వ తేదీన ఆరోగ్యశ్రీ ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి 2014సెప్టెంబర్ 18వ తేదీ వరకు 80వేల మంది రోగులు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందారన్నారు. వీరికి సుమారు రూ.20,029కోట్లు ఖర్చు అయిందన్నారు. ఆరోగ్యశ్రీని జిల్లాలోని వారు కడప, తిరుపతి ఆసుపత్రుల్లో చికిత్సలు పొందవచ్చునన్నారు. కడపలోని రిమ్స్ వైద్యశాలలో అన్ని స్పెషాలిటీ కేసులను చూస్తారన్నారు. హిమాలయ హాస్పిటల్‌లో ప్రమాదగాయాలు, శస్త్రచికిత్సలు, గర్భకోశ వ్యాధులు, యూరాలజీ, న్యూరాలజీ సమస్యలు, అదే విధంగా వీటితో పాటు భారతి హాస్పిటల్‌లో కంటి వైద్య పరీక్షలు, తిరుమల హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ పరీక్షలు నిర్వహించుకోవచ్చునన్నారు. ప్రొద్దుటూరు జిల్లా హాస్పిటల్‌లో చిన్నపిల్లల జబ్బులు అదనంగా చూస్తారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 20వేల మంది రోగులు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధిపొందారన్నారు. వీరికి సుమారు రూ.45కోట్లు విడుదల చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ టీమ్ లీడర్ ఎస్‌ఎం తాజుద్దిన్, ఆరోగ్య మిత్ర కో-ఆర్డినేటర్ డీసీ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.