ఖైదీ నాటకం | Prisoner drama | Sakshi
Sakshi News home page

ఖైదీ నాటకం

Published Mon, Jul 18 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

ఖైదీ నాటకం

ఖైదీ నాటకం

  • రిమాండ్‌ ఖైదీ పరార్‌
  • ప్రభుత్వ ఆస్పత్రి నుంచి..
  • కడుపు నొప్పి అంటూ డ్రామా.. 
  • హెడ్‌ కానిస్టేబుల్‌ను బాత్‌రూంలో బంధించి..
  • నిజామాబాద్‌ క్రైం: ఆటోడ్రైవర్‌ హత్య కేసులో పట్టుబడిన రిమాండ్‌ ఖైదీ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. డ్యూటీలోని హెడ్‌ కానిస్టేబుల్‌ను బాత్‌రూమ్‌లోకి తోసి మరీ తప్పించుకు పోయిన ఘటన పోలీసు వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. విధుల్లో నలుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉండటంతో ఖైదీ సులభంగా తప్పించుకుని పారిపోయాడు. సిబ్బంది నిర్లక్ష్యం, ఖైదీ పరారీపై జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
    డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన నీరడి అరుణ్‌ బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి నెల రోజుల క్రితం తిరిగి వచ్చాడు. ఇదే గ్రామానికి చెందిన మంగలి హన్మాండ్లు, నిజామాబాద్‌ నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన రాజ్‌కుమార్‌ పాత స్నేహితులు. అరుణ్‌  ఇటీవల తన మకాన్ని నిజామాబాద్‌కు మార్చాడు. ఈ క్రమంలో ఆటోడ్రైవర్‌ షేక్‌ మహమూద్‌తో పరిచయం ఏర్పడింది. గల్ఫ్‌ నుంచి వచ్చిన అరుణ్‌ వద్ద డబ్బులు లేక పోవటంతో షేక్‌ మహమూద్‌ను హతమార్చి ఆటోను అమ్మి సొమ్ము చేసుకునేందుకు స్నేహితులు హన్మండ్లు, రాజ్‌కుమార్‌లతో కలిసి కుట్ర పన్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 5న విందు పేరుతో ముగ్గురు కలిసి మహమూద్‌ను జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లి శివారుకు తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం మహమూద్‌పై దాడిచేసి హతమార్చారు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి పెర్కిట్‌ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై పారవేశారు. ఈ నెల 14న ఆటోడ్రైవర్‌ను హత్యచేసిన ముగ్గురు ఆటోను నిర్మల్‌లో విక్రయించేందుకు బయలుదేరారు. ఆర్మూర్‌ పోలీసులు మామిడిపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఆటోను ఆపి రిజిస్ట్రేషన్‌ పత్రాలు అడుగగా చూపించక పోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అరుణ్‌ హత్య వెలుగు చూసింది. పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుచగా కోర్టు రిమాండ్‌ చేసింది. ఇదిలా ఉండగా సారంగపూర్‌ జిల్లా జైలులో ఉన్న ప్రధాన నిందితుడు అరుణ్‌ ఈ నెల 15న తనకు ఆరోగ్యం బాగా లేదని జైలు అధికారులకు తెలిపాడు. దాంతో వారు ఎస్కార్ట్‌ పోలీసులతో నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఖైదీల వార్డుకు తరలించారు. ఆదివారం ఉదయం విధుల్లో హెడ్‌కానిస్టేబుల్‌ పాపారావు ఉన్నారు. వార్డుకు కాపాలగా హెడ్‌కానిస్టేబుల్‌ ఒక్కరే ఉండడం గమనించిన అరుణ్‌ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. తనకు కడుపునొప్పి తీవ్రంగా ఉందంటూ డ్రామా ఆడాడు. అరుణ్‌ను హెడ్‌కానిస్టేబుల్‌ బాతూరూంకు తీసుకువెళ్లాడు. బాత్‌రూంలోకి వెళ్లిన అరుణ్‌ అందులో నీళ్లు రావటంలేదని చెప్పటంతో హెడ్‌కానిస్టేబుల్‌ బాత్‌రూంలోకి వెళ్లి పరిశీలిస్తుండగా అతడిని ఒక్కసారిగా లోపలకు తోసి బయట నుంచి గొళ్లెం పెట్టేశాడు.  నైట్‌ప్యాంట్‌ ధరించి ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌  వార్డు ఇనుప డోర్‌కు వేసిన తాళాం చెవిని బెంచ్‌పై పెట్టాడు. ఆ తాళం చెవితో డోర్‌ తీసుకుని అరుణ్‌ తాపీగా పారిపోయాడు. వార్డులో ఉన్న మరోఖైదీ యాదయ్య అరుస్తూ అతనికి కేటాయించిన మంచానికి చేతికి గొలుసుతో తాళం వేసి ఉన్నప్పటికీ మంచంతో పాటు బాత్‌రూం వద్దకు వచ్చి గొళ్లెల తీశాడు. బాత్‌రూం నుంచి బయటకు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్‌ ఆస్పత్రి పరిసరాలలో గాలించినప్పటికీ అప్పటికే అరుణ్‌ పారిపోయాడు. ఒకటవ టౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అప్రమత్తపై గాలింపు చర్చలు చేపట్టారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అరుణ్‌ పారిపోయిన చిత్రాలు సరిగ్గా రికార్డు కాలేదు. దాంతో వన్‌టౌన్‌ పోలీసులు ప్రధాన చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు.
    విధుల్లో ఒక్కరే..
    ఆస్పత్రిలో ఖైదీ వార్డుల బందోబస్తు కోసం ఏఆర్‌ విభాగానికి చెందిన వారిని నియమిస్తారు. ఏఆర్‌ ఏఎస్సై గులాం దస్తాగిరి, హెడ్‌కానిస్టేబుళ్లు నాగేశ్వర్, గోవింద్, ప్రసాద్‌లు వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో ఆదివారం ఉదయం పాపారావు ఒక్కరే విధుల్లో ఉండటంతో ఖైదీ గమనించి పారిపోయాడు. 
    నలుగురి సస్పెన్షన్‌
    నిజామాబాద్‌ క్రైం : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి రిమాండ్‌ ఖైదీ పారిపోయిన ఘటనలో నలుగురు పోలీసు సిబ్బందిపై జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. సారంగాపూర్‌ జిల్లా జైలులో హత్యనేరంపై రిమాండ్‌లో ఉన్న ఖైదీ అరుణ్‌ను ఈ నెల 15న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. జైల్‌ నుంచి అరుణ్‌ను ఏఆర్‌ ఏఎస్సై గులాం దస్తగిరి, హెడ్‌కానిస్టేబుళ్లు పాపారావు, ప్రసాద్, నాగేశ్వరరావులు వైద్య పరీక్షల కోసం తీసుకువచ్చారు. ఆదివారం ఉదయం విధి నిర్వహణలో పాపారావు ఒక్కరే ఉండటంతో పథకం ప్రకారం హెడ్‌కానిస్టేబుల్‌ను బాత్‌రూంలోకి తోసి పారిపోయాడు. ఆ  సమయంలో ఖైదీల గది మెయిన్‌ డోర్‌కు తాళం వేయాలి కాని, పాపారావు తాళం వేయకుండా నిర్లక్ష్యం వహించాడు. దాంతో ఖైదీ పారిపోయాడు. మిగతా సిబ్బంది ముగ్గురు విధులకు గైర్హాజరు కావటంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను మొత్తం నలుగురిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. పారిపోయిన ఖైదీపై అండర్‌ సెక్షన్‌ 342 ప్రకారం కేసు నమోదు చేసి పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విధులను నిర్వర్తించే క్రమంలో ఎవరైనా అలసత్వం కాని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని  హెచ్చరించారు. 
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement