Prisoner Escape
-
ఖైదీ పరారీయత్నం
అనంతపురం, బుక్కరాయసముద్రం: రెడ్డిపల్లి సమీపంలో ఉన్న జిల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పారిపోయేందుకు ప్రయత్నించి కలకలం రేపాడు. వివరాల్లోకి వెళ్తే... కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా నేలకుంట గ్రామానికి చెందిన ఎర్రిస్వామి ఏడాది క్రితం గుంతకల్లు సమీపంలో లారీలో వెళ్తూ రైల్వే గేటు ధ్వంసం చేశాడు. దీంతో రైల్వే పోలీసులు ఎర్రిస్వామిపై కేసు నమోదు చేయడంతో కోర్టు అతనికి ఏడాది పాటు జైలు శిక్ష వేసింది. అయితే ఎర్రిస్వామి జనవరి 26న గుత్తి కోర్టు నుంచి అనంతపురం జిల్లా జైలుకు వచ్చాడు. శుక్రవారం జైలు బయట పరిసర ప్రాంతాలు శుభ్రపరిచే సమయంలో పోలీసుల కళ్లుకప్పి పారిపోయాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మూడు గంటలపాటు జైలు పరిసర ప్రాంతాలన్నీ వెతికారు. చివరికి జిల్లా జైలు సమీపంలో ఉన్న నారాయయప్ప కుంట చెరువు నుంచి అనంత విద్యానికేతన్ పాఠశాల వెనుక భాగాన దాక్కున్న ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తీసుకొచ్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసు సిబ్బందికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెమోలను జారీ చేసినట్లు జైలు సూపరిండెంటెడ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. -
గాంధీ ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారీ
గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రిజన్స్వార్డులో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ పరారైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మీగూడకు చెందిన పసుపు విక్కీ వేధింపుల కేసులో అరెస్టై 2018 డిసెంబర్ 28 నుంచి నుంచి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. గత నెల 22న అతను జైలులోనే బ్లేడ్ ముక్కలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రక్తవిరోచనాలు కావడంతో జైలు అధికారులు అతడిని అదే రోజు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలోని ప్రిజన్స్వార్డుకు తరలించి వైద్యచికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీ రాత్రి బాత్రూంకు వెళ్లిన విక్కీ ఎంతకూ బయటికి రాకపోవడంతో సెంట్రీ డ్యూటీ నిర్వహిస్తున్న నవీన్‌కుమార్‌కు అనుమానంతో బాత్రూంలోకి వెళ్లి చూడగా గ్రిల్ ఉచలు కట్ చేసి ఉన్నాయి. నీళ్లు పట్టుకునే పైప్ సాయంతో రెండో అంతస్తు నుంచి కిందికి దిగి పరారైనట్లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. ప్రిజన్వార్డ్ గార్డ్ ఇన్చార్జ్ లాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రి వెనుకగేటు నుంచి పరారీ... ప్లాస్టిక్ పైప్ సాయంతో కిందికి దిగిన విక్కీ ఆస్పత్రి వెనుకవైపు ఉన్న గేటును దూకి పద్మారావునగర్ వైపు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ అస్పష్టంగా ఉండడంతో నిందితుడి కదలికలు గుర్తించడం కష్టసాధ్మైంది. బయటపడ్డ డొల్లతనం... గాంధీ ఆస్పత్రి ప్రిజన్వార్డు నుంచి ఖైదీ పరారు కావడంతో అధికారులు కంగుతిన్నారు. జైళ్లశాఖకు చెందిన పోలీసులే వార్డు బధ్రతను పర్యవేక్షిస్తారు. ఆస్పత్రి ప్రధాన భవనంలోనే ఉన్నప్పటికీ వైద్యులు, సిబ్బందిని మాత్రమే తనిఖీలు నిర్వహించి లోపలకు పంపిస్తారు. లోపల ఉన్న విక్కీ రంపం ఎలా సంపాదించాడనేది ప్రశ్శార్ధకంగా మారింది. ప్రిజన్వార్డులో రిమాండ్ ఖైదీలు మైఖేల్, గోలియాదవ్, విక్కీ మాత్రమే చికిత్సలు పొందుతున్నారు. కిటికీ గ్రిల్స్ ఉచలు కట్ చేసి విక్కీ పరారు కావడంతో ప్రిజన్వార్డు డొల్లతనంతోపాటు అక్కడ విధులు నిర్వహిస్తున్నపోలీసులు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సూర్యాపేటలో ఖైదీ పరారీ
-
రేపల్లె సబ్‌జైలు నుంచి ఖైదీ పరారీ
రేపల్లె: గుంటూరు జిల్లా రేపల్లె సబ్‌జైలు నుంచి ఓ ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కళ్లుగప్పి కుంచాల నాగరాజు(26) అనే ఖైదీ బుధవారం సాయంత్రం తప్పించుకున్నాడు. నాగరాజు స్వస్థలం సత్తెనపల్లి మండలం బడుగుబండ గ్రామం. దొంగతనం కేసుల్లో 5 నెలల నుంచి రేపల్లె సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పరారైన ఖైదీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఖైదీ నాటకం
రిమాండ్ ఖైదీ పరార్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి.. కడుపు నొప్పి అంటూ డ్రామా.. హెడ్ కానిస్టేబుల్‌ను బాత్రూంలో బంధించి.. నిజామాబాద్ క్రైం: ఆటోడ్రైవర్ హత్య కేసులో పట్టుబడిన రిమాండ్ ఖైదీ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. డ్యూటీలోని హెడ్ కానిస్టేబుల్‌ను బాత్రూమ్లోకి తోసి మరీ తప్పించుకు పోయిన ఘటన పోలీసు వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. విధుల్లో నలుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉండటంతో ఖైదీ సులభంగా తప్పించుకుని పారిపోయాడు. సిబ్బంది నిర్లక్ష్యం, ఖైదీ పరారీపై జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన నీరడి అరుణ్ బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి నెల రోజుల క్రితం తిరిగి వచ్చాడు. ఇదే గ్రామానికి చెందిన మంగలి హన్మాండ్లు, నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన రాజ్‌కుమార్ పాత స్నేహితులు. అరుణ్ ఇటీవల తన మకాన్ని నిజామాబాద్‌కు మార్చాడు. ఈ క్రమంలో ఆటోడ్రైవర్ షేక్ మహమూద్తో పరిచయం ఏర్పడింది. గల్ఫ్ నుంచి వచ్చిన అరుణ్ వద్ద డబ్బులు లేక పోవటంతో షేక్ మహమూద్‌ను హతమార్చి ఆటోను అమ్మి సొమ్ము చేసుకునేందుకు స్నేహితులు హన్మండ్లు, రాజ్‌కుమార్‌లతో కలిసి కుట్ర పన్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 5న విందు పేరుతో ముగ్గురు కలిసి మహమూద్‌ను జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లి శివారుకు తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం మహమూద్‌పై దాడిచేసి హతమార్చారు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి పెర్కిట్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై పారవేశారు. ఈ నెల 14న ఆటోడ్రైవర్‌ను హత్యచేసిన ముగ్గురు ఆటోను నిర్మల్‌లో విక్రయించేందుకు బయలుదేరారు. ఆర్మూర్ పోలీసులు మామిడిపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఆటోను ఆపి రిజిస్ట్రేషన్ పత్రాలు అడుగగా చూపించక పోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అరుణ్ హత్య వెలుగు చూసింది. పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుచగా కోర్టు రిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా సారంగపూర్ జిల్లా జైలులో ఉన్న ప్రధాన నిందితుడు అరుణ్ ఈ నెల 15న తనకు ఆరోగ్యం బాగా లేదని జైలు అధికారులకు తెలిపాడు. దాంతో వారు ఎస్కార్ట్ పోలీసులతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఖైదీల వార్డుకు తరలించారు. ఆదివారం ఉదయం విధుల్లో హెడ్‌కానిస్టేబుల్ పాపారావు ఉన్నారు. వార్డుకు కాపాలగా హెడ్‌కానిస్టేబుల్ ఒక్కరే ఉండడం గమనించిన అరుణ్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. తనకు కడుపునొప్పి తీవ్రంగా ఉందంటూ డ్రామా ఆడాడు. అరుణ్‌ను హెడ్‌కానిస్టేబుల్ బాతూరూంకు తీసుకువెళ్లాడు. బాత్రూంలోకి వెళ్లిన అరుణ్ అందులో నీళ్లు రావటంలేదని చెప్పటంతో హెడ్‌కానిస్టేబుల్ బాత్రూంలోకి వెళ్లి పరిశీలిస్తుండగా అతడిని ఒక్కసారిగా లోపలకు తోసి బయట నుంచి గొళ్లెం పెట్టేశాడు. నైట్‌ప్యాంట్ ధరించి ఉన్న హెడ్‌కానిస్టేబుల్ వార్డు ఇనుప డోర్‌కు వేసిన తాళాం చెవిని బెంచ్‌పై పెట్టాడు. ఆ తాళం చెవితో డోర్ తీసుకుని అరుణ్ తాపీగా పారిపోయాడు. వార్డులో ఉన్న మరోఖైదీ యాదయ్య అరుస్తూ అతనికి కేటాయించిన మంచానికి చేతికి గొలుసుతో తాళం వేసి ఉన్నప్పటికీ మంచంతో పాటు బాత్రూం వద్దకు వచ్చి గొళ్లెల తీశాడు. బాత్రూం నుంచి బయటకు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ ఆస్పత్రి పరిసరాలలో గాలించినప్పటికీ అప్పటికే అరుణ్ పారిపోయాడు. ఒకటవ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అప్రమత్తపై గాలింపు చర్చలు చేపట్టారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అరుణ్ పారిపోయిన చిత్రాలు సరిగ్గా రికార్డు కాలేదు. దాంతో వన్‌టౌన్ పోలీసులు ప్రధాన చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. విధుల్లో ఒక్కరే.. ఆస్పత్రిలో ఖైదీ వార్డుల బందోబస్తు కోసం ఏఆర్ విభాగానికి చెందిన వారిని నియమిస్తారు. ఏఆర్ ఏఎస్సై గులాం దస్తాగిరి, హెడ్‌కానిస్టేబుళ్లు నాగేశ్వర్, గోవింద్, ప్రసాద్‌లు వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో ఆదివారం ఉదయం పాపారావు ఒక్కరే విధుల్లో ఉండటంతో ఖైదీ గమనించి పారిపోయాడు. నలుగురి సస్పెన్షన్ నిజామాబాద్ క్రైం : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పారిపోయిన ఘటనలో నలుగురు పోలీసు సిబ్బందిపై జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ సస్పెన్షన్ వేటు వేశారు. సారంగాపూర్ జిల్లా జైలులో హత్యనేరంపై రిమాండ్‌లో ఉన్న ఖైదీ అరుణ్‌ను ఈ నెల 15న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. జైల్ నుంచి అరుణ్‌ను ఏఆర్ ఏఎస్సై గులాం దస్తగిరి, హెడ్‌కానిస్టేబుళ్లు పాపారావు, ప్రసాద్, నాగేశ్వరరావులు వైద్య పరీక్షల కోసం తీసుకువచ్చారు. ఆదివారం ఉదయం విధి నిర్వహణలో పాపారావు ఒక్కరే ఉండటంతో పథకం ప్రకారం హెడ్‌కానిస్టేబుల్‌ను బాత్రూంలోకి తోసి పారిపోయాడు. ఆ సమయంలో ఖైదీల గది మెయిన్ డోర్‌కు తాళం వేయాలి కాని, పాపారావు తాళం వేయకుండా నిర్లక్ష్యం వహించాడు. దాంతో ఖైదీ పారిపోయాడు. మిగతా సిబ్బంది ముగ్గురు విధులకు గైర్హాజరు కావటంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను మొత్తం నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. పారిపోయిన ఖైదీపై అండర్ సెక్షన్ 342 ప్రకారం కేసు నమోదు చేసి పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విధులను నిర్వర్తించే క్రమంలో ఎవరైనా అలసత్వం కాని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
ఖైదీ పరారైన ఘటనలో పోలీసుల సస్పెన్షన్
వరంగల్: జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ నేరస్థుడు పోలీసుల కళ్లు గప్పి పరారైన సంఘటనలో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల ఉప్పల సూరి అనే ఖైదీ పరారైన సమయంలో విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు ఇ. లింగారెడ్డి, ఎన్. మల్లారెడ్డి, డి. అంజయ్య లను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు వరంగల్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఉప్పల సూరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి భూపాలపల్లి డిపో బస్సులో వరంగల్‌కు తీసుకెళ్తుండగా, యశ్వంతాపూర్ సమీపంలోకి వెళ్లగానే మూత్రానికని చెప్పి, బస్సును ఆపించి పరారైన విషయం తెలిసిందే. -
ఖైదీ పారిపోతుండగా పోలీసులు కాల్పులు
ఖమ్మం : ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి శనివారం ఉదయం తుపాకుల మోతతో దద్దరిల్లింది. వైద్యం కోసం తీసుకొచ్చిన ఓ రిమాండ్ ఖైదీ పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. ఎట్టకేలకు పరారవుతున్న ఖైదీని పట్టుకున్నారు. కాగా పోలీసుల కాల్పులలో ఖైదీ స్వల్పంగా గాయపడ్డాడు. అనంతరం అతనికి చికిత్సకు తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఖైదీ పరారీ, పట్టుకున్న పోలీసులు
మహబూబ్ నగర్ : పోలీసుల కళ్లు గప్పి మహబూబ్ నగర్లో ఓ ఖైదీ పరారయ్యాడు. అయితే కొద్దిసేపట్లోనే ఆ ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. ఓ హత్యకేసులో వెంకటయ్య అలియాస్ బొట్టు సత్యం నిందితుడిగా ఉన్నాడు. మహబూబ్ నగర్ ఫ్యామిలీ కోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తూ ఈ రోజు శిక్ష ఖరారు చేసింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే వెంకటయ్య తప్పించుకుని పారిపోయాడు. జిల్లా పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి పిల్లలమర్రి దగ్గర వెంకటయ్యను పట్టుకుని జైలుకు తరలించారు.