Stomach pain
-
కడుపునొప్పితో యువతి ఆత్మహత్య
మండ్య: తీవ్రమైన కడుపు నొప్పిని భరించలేక యువతి ఒకరు ప్రాణాలు తీసుకుంది. మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని కణివెకొప్పలు గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. న్యాయవాది కణివె యోగేష్ కుమార్తె అయిన గౌతమి (21) కొంత కాలంగా తరచూ కడుపునొప్పితో బాధపడుతోంది. వైద్యులతో చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. ఉదయం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
శివమొగ్గ : బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శివమొగ్గ జిల్లా సొరభలో జరిగింది.భద్రావతికి చెందిన అక్షిత(30) సొరభ పట్టణానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకొని ఇదే పట్టణంలోని విద్యుత్ నగరలో నివాసం ఉంటోంది. పట్టణంలోనే బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. అయినా నయం కాలేదు. దీంతో ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సొరభ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు
హిందీ సీరియల్ యాక్టర్ అర్జున్ బిజ్లానీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలియజేస్తూ.. తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరాను. వైద్యులు శనివారం శస్త్రచికిత్స చేయనున్నారు. ఏది జరిగినా మన మంచికే’ అంటూ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. నాగిన్(తెలుగులో నాగిని) మిలే జబ్ హమ్, తుమ్ వంటి సీరియల్స్ తో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్. ఒకవైపు సీరియల్స్, మరోవైపు రియాల్టీ షోలల్లో పాల్గొంటూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తన నటనతో పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. నాగిని సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. అలియా భట్, రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి, తనదైన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌తో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అర్జున్ త్వరగా కోలుకోవాలంటూ అతని ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Arjun Bijlani 🧿 (@arjunbijlani) -
ఆ రోజే క్యాన్సర్ బయటపడింది
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడి సంబంధ పరిశోధన కోసం భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్–1 మిషన్ ప్రయోగంతో ఆనందంలో మునిగిపోయిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్నాథ్నూ అశుభ వార్త ఒకటి కొద్దిరోజులపాటు కలవరపాటుకు గురిచేసింది. ఆయన కడుపులో పెరుగుతున్న క్యాన్సరే అందుకు కారణం. శస్త్రచికిత్స, కీమోథెరపీ తర్వాత ఆయన ప్రస్తుతం క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. గత ఏడాది సెపె్టంబర్ రెండో తేదీన జరిగిన ఘటన తాలూకు వివరాలను ఆయన ఇటీవల వెల్లడించారు. టార్కామ్ మీడియా సంస్థ వారి ‘ రైట్ టాక్’ కార్యక్రమంలో భాగంగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో అందరితో ఆ విషయాలను పంచుకున్నారు. ‘‘ సెప్టెంబర్ రెండో తేదీన ఆదిత్య ఎల్–1 మిషన్ లాంఛ్ ప్రక్రియకు కొద్ది వారాల ముందు నుంచే కడుపు నొప్పిగా అది మొదలైంది. మొదట అదే ఏడాది జూలై 14వ తేదీన చంద్రయాన్–3 ప్రాజెక్ట్ సందర్భంగానూ అనారోగ్యం బారినపడ్డా. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పని ఒత్తిడి కారణంగా అలా అయ్యిందేమో అనుకుని దానిని సంగతి వదిలేశా. కానీ ఆ తర్వాతా కడుపు నొప్పి నన్ను వెంటాడింది. ఇక లాభం లేదనుకుని ఆదిత్య ఎల్–1 ప్రయోగం విజయవంతంగా పూర్వవగానే అదే రోజు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్‌లు, టెస్ట్‌లు చేయించుకున్నా. పెద్ద పేగులో చిన్నపాటి క్యాన్సర్ కణతి పెరుగుతోందని పరీక్షల్లో బయటపడింది. ఆ వార్త విని నా కుటుంబసభ్యులంతా షాక్‌కు గురయ్యారు. కుటుంబసభ్యులే కాదు ఇస్రోలో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, ఇంజనీర్లు హుతాశులయ్యారు. శస్త్రచికిత్స తప్పదని వైద్యులు సూచించడంతో నాలుగు రోజులు ఆస్పత్రికే పరిమితయ్యా. సర్జరీ, కీమో థెరపీ తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. ఏటా స్కానింగ్, చెకప్ చేయించుకుంటా. నాకు క్యాన్సర్ వంశపారంపర్యంగా వచి్చందని చెబుతున్నారు. దాన్ని జయించా. చిన్నపాటిది కాబట్టి మొదట్లోనే గుర్తించి శస్త్రచికిత్సతో తొలగించారు’’ అని సోమ్‌నాథ్ చెప్పుకొచ్చారు. -
ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు
ఓ మహిళ గత పది రోజులుగా తీవ్ర కడుపునొప్పిని అనుభవిస్తోంది. భరించలేక ఆస్పత్రికి వెళ్లితే తాను గర్భవతినని తెలుసుకుని షాక్ అయ్యింది. కానీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే..ఆ పిండం స్కానింగ్‌లో ఎక్కడ పెరుగుతోంది చూసి వైద్యులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఒకవేళ గర్భాశయంలో కాక వేరే ఎక్కడ పెరిగినా ఆ పిండం పూర్తిగా మనుగడ సాగించడం అసాధ్యం ఏదో ఒక సందర్భంలో విచ్ఛిత్తి లేదా అబార్షన్ అవుతుంది. కానీ ఇక్కడ ఆమె విషయంలో అలా జరగకపోవడం మరింత విచిత్రం. ఈ షాకింగ్ ఘటన ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఫ్రాన్స్‌కి చెందిన 37 ఏళ్ల మహిళ పదిరోజులుగా తీవ్ర కడుపు నొప్పిని భరిస్తోంది. తట్టుకోలేక ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి స్కానింగ్ చేసి చూడగా ఒక్కసారిగా విస్తుపోయారు వైద్యులు. ఆమె కడుపులో పిండం ప్రేగుల్లో పెరుగుతుండటాన్ని చూసి షాకయ్యారు. నేచరల్‌గా పిండం గర్భశయంలో పెరుగుతుంది. కొందరికి తాము ప్రెగ్నెన్సీ అని తెలియని ఎన్నో మహిళల కేసులు చూశాం. గానీ ఇలా పేగుల్లో బేషుగ్గా పిండం పెరగడం చూడటం ఇదే తొలిసారని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే..? ఒకవేళ పిండం గర్భశయం ట్యూబ్‌లో గాక బయట ఎక్కడ పెరిగినా..పిండవిచ్ఛత్తి అవ్వడం లేదా గర్భం నిలవకపోవడం వంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరంగా పిండం పేగుల్లో నిక్షేపంగా పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. సరిగ్గా అప్పుడామె 23 వారాల గర్భవతని కూడా వైద్యులు నిర్థారించారు. ఇలా ప్రేగుల్లో పిండం పెరగడాన్ని 'ఉదర ఎక్టోపిక్ గర్భం' అని పిలుస్తారని చెప్పారు. అయితే వ్యైదులు ఆ మహిళను తమ పర్యవేక్షణ ఉంచుకుని 29 వారాల అనంతరం విజయవంతంగా ఆమెకు ప్రసవం చేశారు. మూడు నెలల అనంతరం తల్లి, బిడ్డ క్షేమంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఇలాంటి ఎక్టోపిక్ గర్భాలు అంతర్గత రక్తస్రావం అయ్యి ట్యూబ్ పగిలిపోవడం జరుగుతుంది. దీని వల్ల తల్లి, బిడ్డలిద్దరికి కూడా ప్రమాదమేనని చెబుతున్నారు. ఇవన్నీ పరిగణలోనికి తీసుకుని ఆమెకు అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి డెలివరీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్లో దాదాపు 90% వరకు శిశువులను కోల్పోయే అవకాశాలే ఎక్కువుగా ఉంటాయని అన్నారు. ఒకవేళ శిశువు జీవించినా కూడా పుట్టుకతో వచ్చే లోపాలు లేదా మెదడు దెబ్బతినే అవకాశాలు ఉంటాయన్నారు. కానీ ఈ మహిళ విషయంలో అలాంటివి జరగనివ్వకుండా విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆరోగ్యంగా ఉన్న శిశువును బయటకు తీయగలిగామని తెలిపారు. (చదవండి: రెండు ప్రంచ యుద్ధాలను చూసిన బామ్మ! చివరి క్షణాల్లో..) -
మనిషి కడుపులో ఇయర్ ఫోన్లు, తాళం, బోల్టులు.. వైద్యుల అవాక్కు
పంజాబ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కడపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి స్కానింగ్ చేసి పరీక్షించిన వైద్యులు అతని కడుపులో ఉన్న వస్తువులను చూసి అవాక్కయ్యారు. వ్యక్తి కడుపులో ఏకంగా ఇయర్ ఫోన్స్, లాకేట్స్, బోల్టులు, నట్స్, ఇలా వందకు పైగా వస్తువును చూసి ఖంగుతున్నారు. వివరాలు.. మోగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. రెండు రోజులుగా వాంతులు, కడుపు నొప్పి, తీవ్రవైన జ్వరం ఉండటంతో మెడిసిటీ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు మెడిసిన్ ఇచ్చినా నొప్పి తగ్గకపోవడంతో.. స్టమక్ ఎక్స్‌రే చేయాలని నిర్ణయించారు. స్కాన్ చేసిన తర్వాత వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వ్యక్తి కడుపులో అనేక ఇనుప, ప్లాస్టిక్ వస్తువులు ఉన్నట్లు తేలింది. దీంతో దాదాపు మూడు గంటలపాటు శస్త్రచికిత్స చేసి అతడి శరీరంలోని వస్తువులను విజయవంతంగా బయటకు తీశారు. వ్యక్తి కడుపులో నుంచి తీసిన అనేక వస్తువుల్లో ఇయర్ ఫోన్లు, వాషర్లు, నట్స్, సేఫ్టీపిన్స్, బోల్ట్‌లు, వైర్లు, రాఖీలు, తాళం, తాళం చెవి లాకెట్లు, బటన్లు, రేపర్లు, హెయిర్‌క్లిప్‌లు, జిప్పర్ ట్యాగ్, మార్బుల్, ఇలా ఎన్నో ఉన్నాయి. చదవండి: బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు.. కొత్త కూటమికి సిద్ధమవుతున్న అన్నా డీఎంకే! సర్జరీపై మెడిసిటీ డైరెక్టర్ డాక్టర్ అజ్మీర్ కల్రా మాట్లాడుతూ.. తన కెరీర్లో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని ఇదే మొదటిదని అన్నారు. రెండు ఏళ్లుగా ఈ వస్తువులు బాధితుడి కడుపులో ఉండటంతో అనారోగ్యానికి గురయ్యాడని తెలిపారు. దాదాపు 3 గంటలపాటు శస్త్ర చికిత్స చేసి డాక్టర్లు వ్యక్తి కడుపులోని వస్తువుల్ని తొలగించారు.అతని శరీరంలో నుంచి వస్తువులన్నీ తీసేసినప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి కుదుటపడలేదని చెప్పారు. వ్యక్తి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. బాధితుడి కడుపులో అన్ని వస్తువులు ఉండటం తెలిసి తాము కూడా షాక్ అయ్యామని చెప్పారు. అవన్నీంటిని అతడు ఎలా, ఎప్పుడూ మింగాడో తెలీదని అన్నారు. కానీ అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, కడుపు నొప్పి గురించి అప్పుడప్పుడు చెప్పేవాడని తెలిపారు. ఆసుపత్రిలో చేరే కొన్ని రోజుల ముందు నొప్పి ఎక్కువై నిద్ర కూడా పోకపోవడంతో డాక్టర్లను సంప్రదించినట్లు చెప్పారు. ఎంతమంది వైద్యుల వద్దకు తీసుకెళ్లినా, వారు అతని నొప్పి వెనుకగల కారణాన్ని నిర్ధారించలేకపోయారని పేర్కొన్నారు. -
భార్య నల్లపూసల దండ మింగేసి గప్‌చుప్‌గా..
అనంతపురం క్రైం: క్షణికావేశంలో ఓ వ్యక్తి తన భార్య నల్లపూసల దండ మింగేశాడు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆ రహస్యాన్ని కడుపులోనే దాచుకున్నాడు. చివరకు కడుపునొప్పి తీవ్రం కావడంతో వైద్యులను సంప్రదించగా, అనంతపురం సర్వజనాస్పత్రి ఈఎన్టీ విభాగం వైద్యులు ఎలాంటి ఆపరేషన్ లేకుండానే నల్లపూసల దండను నేర్పుగా బయటకు తీసి అతడికి పునర్జన్మ ప్రసాదించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన రామాంజనేయులు (45) మూడు నెలల క్రితం తన భార్య నల్లపూసల దండను(బంగారం కాదు)మింగేశాడు. ఇటీవల కడుపు నొప్పి తీవ్రం కావడంతో విషయం కుటుంబీకులకు చెప్పాడు. దీంతో వారు అతడిని అనంతపురంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. రూ.వేలల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో మే 29న ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకురాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుకుమార్ రామాంజనేయులును పరీక్షించారు. వివరాలు ఆరా తీయగా, తాను చైన్‌ను మింగానని, ఏదైనా ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పడంతో వైద్యుడు ఎక్స్‌రేకి రిఫర్ చేశాడు. రామాంజనేయులు అన్నవాహిక వద్ద నల్లపూసల దండ డాలర్ ఇరుక్కుని, దండ కడుపులోని ఈసోఫాగస్ (ఫుడ్‌పైప్) వరకు వెళ్లినట్లు కనిపించింది. దీంతో వైద్యులు అతడిని అడ్మిట్ చేసుకుని ఆపరేషన్ లేకుండానే కడుపులో ఉండిపోయిన నల్లపూసల దండ బయటకు తీయాలని నిర్ణయించారు. మే 30న అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సుకుమార్, డాక్టర్ కృష్ణ సౌమ్య, స్టాఫ్‌నర్సులు, అనస్తీషియా వైద్యుడు డాక్టర్ వేమానాయక్, ఓటీ టెక్నీషియన్ రాజేష్‌లు రామాంజనేయులు అన్నవాహికకు మత్తు మందు ఇచ్చారు. ఫ్లెక్సిబుల్ గ్యాస్ట్రో ఎండోస్కోపీ ద్వారా నల్లపూసల దండను తొలగించారు. రామాంజనేయులు ఆరోగ్యంగా ఉన్నట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ సుకుమార్ తెలిపారు. శస్త్ర చికిత్స లేకుండా కడుపు లోపల ఉన్న నల్లపూసల దండను బయటకు తీసిన వైద్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ అభినందించారు -
యువకుడి కడుపులో 63 ‘స్టీల్ స్పూన్లు’.. ఏడాదిగా అవే ఆహారం!
లక్నో: ఏదైనా ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతేనే.. కడుపులో నొప్పితో సతమతమవుతాం. అలాంటిది ఓ వ్యక్తి ఏడాదిగా స్టీల్ స్పూన్లు తింటున్నాడు. పొట్ట నిండా స్పూన్లు ఉన్న ఈ షాకింగ్ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. బాధితుడి శరీరంలో ఏకంగా 63 స్టీల్ స్పూన్లు ఉండటం చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. గంటల తరబడి శస్త్రచికిత్స చేసి చెంచాలను బయటకు తీశారు. ఏం జరిగింది? జిల్లాకు చెందిన విజయ్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. దాంతో ఏడాది క్రితం కుటుంబ సభ్యులు డీఅడిక్షన్ కేంద్రంలో చేర్పించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం మరింత క్షీణించగా.. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. కడుపులో స్పూన్లు ఉన్నట్లు తేల్చారు. ఆపరేషన్ చేసి 63 చెంచాలను బయటకు తీశారు. అయితే.. స్పూన్లు ఎలా వచ్చాయని డాక్టర్లు ప్రశ్నించగా.. తాను గత ఏడాది నుంచి స్పూన్లు తింటున్నానని విజయం చెప్పటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ‘ఆ స్పూన్లు నువ్వే తింటున్నావా అని మేము అడిగితే అవునని చెప్పాడు. సుమారు 2 గంటల పాటు ఆపరేషన్ చేసి స్పూన్లు తొలగించాం. ప్రస్తుతం అతడు ఐసీయూలో ఉన్నాడు. పరిస్థితి విషమంగానే ఉంది. రోగి సుమారు ఏడాది కాలంగా స్టీల్ చెంచాలు తింటున్నాడు.’ అని డాక్టర్ రాకేశ్ ఖర్రాన్ తెలిపారు. మరోవైపు.. డీఅడిక్షన్ కేంద్రంలోనే విజయ్‌కి బలవంతంగా స్పూన్లు తినిపించారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇదీ చదవండి: 11కేవీ హైఓల్టేజ్ కరెంట్ తీగలపై స్టంట్స్.. తర్వాత ఏం జరిగిందంటే? -
షాకింగ్.. కడుపు నొప్పితో టాయిలెట్లోకి వెళ్లి.. బిడ్డతో బయటకొచ్చిన యువతి
కడుపు నొప్పితో విలవిల్లాడుతూ వాష్‌రూమ్‌లోకి వెళ్లిన యువతి అనుకోకుండా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. యువతికి కనీసం పొట్ట పొరగడం, ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎలాంటి లక్షణాలు కూడా లేకపోవడం మరింత చోద్యంగా మారింది. ఈ వింత ఘటన యూనైటెడ్ కింగ్డమ్లో వెలుగు చూసింది. జెస్ డేవిస్ అనే 20 ఏళ్ల యువతి యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌లో చదువుతోంది. ఓ రోజు రాత్రి యువతికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పీరియడ్స్(నెలసరి) అని భావించి వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. టాయిలెట్లో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా 3 కేజీల మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆశ్చర్యపోయింది. అసలు తాను గర్భవతిననే విషయం కూడా ఆమెకు తెలియదు. ఇక బిడ్డను ప్రసవించిన మరుసటి రోజే జెస్ డేవిస్ తన 20వ పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం. విషయంపై సదరు యువతి మాట్లాడుతూ.. ‘నాకు పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్‌గా రావు. కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు వికారంగా అనిపించేది. అందుకు కొన్ని మందులు వాడటం ప్రారంభించాను. ఆ రోజు ఉదయం తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. పీరియడ్స్ మొదలవుతున్నాయేమో అనుకున్నా. నడవలేని స్థిలిలో ఉన్నాను. కనీసం మంచం మీద పడుకోలేకపోయాను. అర్ధరాత్రి దాటాక కడుపునొప్పి ఎక్కువైంది. వెంటనే లేచి వాష్‌రూమ్‌కు వెళ్లా. నా పొట్టను కిందకు పుష్ చేశా. చదవండి: అక్కడ పానీ పూరీ అమ్మకాలు నిషేధం! ఎందుకంటే?... అప్పటికీ నాకు అనుమానం రాలేదు. కొద్దిసేపటి తర్వాత బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ తరువాతే గానీ జరిగిందేంటో అర్థం కాలేదు. బాత్రూమ్లో బిడ్డను చూసి ముందు నేను కల కంటున్నానేమో అనుకున్నాను. కానీ జీవితంలో ఇంత కంటే పెద్ద షాక్ మరొకటి లేదు. వెంటనే షాక్ నుంచి తేరుకొని బిడ్డను చేతుల్లోకి తీసుకున్నా. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెంటనే నా స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం చెప్పా. తాను అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు వెళ్లామని చెప్పింది. మొదట్లో శిశువుతో సమయం గడిపేందుకు కొంత టైం పట్టింది. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని వివరించింది. ఆసుపత్రిలో శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచారు. శిశువు 35 వారాలకే జన్మించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ కోలుకుంటున్నారని పేర్కొన్నారు. చదవండి: రోడ్డు మీద వెళ్తున్న మహిళ.. తలపై పడిన కొబ్బరికాయ.. వైరలవుతోన్న వీడియో -
బాలిక కడుపులో వెంట్రుకల ముద్ద
ఆరిలోవ(విశాఖ తూర్పు): తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతున్న బాలికకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి స్వస్థత చేకూర్చారు వైద్యులు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో ఆధునిక పద్ధతిలో ఈ సర్జరీ చేశారు. విమ్స్ డైరెక్టర్ కె.రాంబాబు తెలిపిన వివరాలివి.. రాజమండ్రికి చెందిన 13 ఏళ్ల బాలిక కొద్ది రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడేది. ఎన్ని ఆస్పత్రులకు తీసుకువెళ్లినా తగ్గకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఈ నెల 19న విశాఖలో విమ్స్‌కు తీసుకు వచ్చారు. ఇక్కడి వైద్యులు ఆ బాలికకు ఎండోస్కోపీ చేసి కడుపు లోపల వెంట్రుకలతో కూడిన పదార్థం ముద్దగా ఉన్నట్లు గుర్తించారు. దీనిని ట్రైకోబెజార్ వ్యాధిగా నిర్థారించారు. దీంతో ఈ నెల 23న లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి బాలిక కడుపులో ఉన్న వెంట్రుకలతో ఉన్న 300 గ్రాముల పదార్థాన్ని తొలగించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహించారు. అరుదైన శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకున్న బాలికను శనివారం డిశ్చార్జి చేశారు. 50 ఏళ్లలో 68 మందికి మాత్రమే.. ఇలాంటి వ్యాధి అరుదుగా వస్తుందని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. 50 ఏళ్లలో దేశంలో 68 మందికి మాత్రమే ఈ తరహా శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. విమ్స్‌లో చిన్నారికి జరిగిన సర్జరీ 68వది అని తెలిపారు. సర్జరీ విజయవంతంగా నిర్వహించిన వైద్యులను అభినందించారు. బాలిక పూర్తిగా కోలుకోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేసి తమ కుమార్తె ప్రాణాలను కాపాడారని విమ్స్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ స్రవంతి బృందం, విమ్స్ ఆర్ఎంవో డాక్టర్ విజయకుమార్ పాల్గొన్నారు. (చదవండి: చెత్తకు కొత్త రూపుం...వేస్ట్ క్రాఫ్ట్) -
ఏకంగా మొబైల్ ఫోన్ మింగేశాడు.. 6 నెలల తర్వాత ఏమైందో తెలుసా?
సాధారణంగా చిన్నపిల్లలు పాకుతూ నాణేలను, చిన్న చిన్న వస్తువులను మింగడం తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో కొంతమంది మరీ వింత వింతగా ఏది పడితే అది తినేస్తున్నారు. ఇసుక, మట్టి, వెంట్రుకలు, రాళ్లను కరకరా నమిలేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా మొబైల్ ఫోన్ మింగేసాడు. ఈ విచిత్ర సంఘటన ఈజిప్ట్ దేశంలో చోటుచేసుకుంది. తీవ్రమైన కడుపు నొప్పితో ఓ వ్యక్తి ఇటీవల ఆసుపత్రిలో చేరాడు. అయితే వైద్యులు అతని కడుపుని ఎక్క్‌రే తీసి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.పేషెండ్ కడుపులో మొబైల్ ఫోన్ కనిపించడంతో వైద్యులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. చదవండి: వైరల్: అభివృద్ధి అన్నందుకు యువకుడి చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే కాగా ఆరు నెలల క్రితం అతను పొరపాటున ఫోన్‌ను మింగిన్నట్లు వైద్యులకు తెలిసింది. అయితే కడపులో నుంచి ఫోన్ సహజంగా బయటకు వస్తుందని ఆ యువకుడు భావించాడు కానీ అది జరగలేదు. మొబైల్ కడుపులో ఇరుక్కొని ఆహారం జీర్ణం కాకుండా అడ్డుకుంది. దీంతో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈజిప్టులోని అస్వాన్ నగరంలోని ఆసుపత్రిలో అతనికి ఆపరేషన్ చేసి మొబైల్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. మింగేసిన ఫోన్ మూడు భాగాలుగా విడిపోగా.. బ్యాటరీ అతని కడుపులో పేలిపోతుందని వైద్యులు కంగారు పడ్డారు. కానీ చివరికి ఆపరేషన్ సక్సెస్ అయి సురక్షితంగా బయటపట్టాడు. చదవండి: వైరల్: ఒక్క క్షణం ఆలస్యమైతే ఆ గర్భిణీ పరిస్థితి ఏమయ్యేదో ! -
కడుపు నొప్పి: అల్లం, పుదీనా, గ్రీన్ బనానా.. వీటితో..
ఇంట్లో ఫేవరేట్ వంటలు చేస్తే ఆరోజు మన చేతికి ఎముక ఉండదు. లాగించెయ్యడమే... ఇక రోడ్డు పక్క స్టాల్స్, హోటళ్ల ఇష్టమైన, ఘుమఘుమలాడే చిరుతిండ్లు కనిపిస్తే ఇంకేముంది.. క్షణాల్లో అక్కడ వాలిపోతాం! ఆనక.. తిన్నది అరగక.. పడేతిప్పలు అన్నీఇన్నీకాదు. కడుపునొప్పితో ప్రారంభమై వాంతులు, మలబద్ధకం/విరేచనాలు... ఒక్కోసారి.. క్లైమాక్స్‌లో హాస్పిటల్ బిల్ చూసి మూర్చపోయేంత పనౌతుంది. పిల్లలు, పెద్దల్లో సర్వసాధారణంగా కనిపించే కడుపునొప్పికి వంటింట్లో దొరికే ఈ 5 రకాల పదార్థాలతో ఏ విధంగా ఉపశమనం పొందవచ్చో నిపుణుల మాటల్లో.. అల్లం కడుపునొప్పి సాధారణ లక్షణాలు వికారం, వాంతులు. వీటి నివారణకు ఎప్పుడైతే చర్యలు తీసుకుంటామో అప్పుడు మన శరీరం కొంత తేరుకుంటుంది. వికారం, వాంతులకు సహజమైన నివారణ మంత్రం అల్లం అని చెప్పవచ్చు. అల్లం నేరుగా తిన్నా లేదా వంటల్లో వాడినా ఎంతో మేలు చేస్తుంది. ద్రావణ రూపంలో తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు, తాపనివారణకు అల్లం అద్భుతమైన ఔషధమని ఫోర్టిస్ హాస్పిటల్‌కు చెందిన డా. అహుజా తెలిపారు. సీమ చామంతి కడుపునొప్పితో సహా వివిధ వ్యాధుల నివారణకు పూర్వకాలం నుంచే సీమ చామంతి వాడుకలో ఉంది. పేగు సంబంధిత వ్యాధులు అంటే గ్యాస్, అజీర్ణం, డయేరియా, వాంతులకు ఈ ఔషధమొక్క బాగా పనిచేస్తుంది. దీనిని కషాయం రూపంలో పిల్లలకు పట్టిస్తే కడుపునొప్పి ఇట్టే మాయం అవుతుంది. ఈ వ్యాధుల నివారణలో సీమ చామంతి ఔషదమొక్క కీలకపాత్రపోషిస్తున్నప్పటికీ, దీని పనితీరుపై మరికొంత అధ్యయనం చేయవలసి ఉంది. పెప్పర్మింట్(పుదీనా) ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనేది పెద్ద పేగు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధి. కడుపునొప్పి, ఉబ్బసం, మలబద్ధకం, డయేరియా వంటివి దీని ప్రధాన లక్షణాలు. అసౌకర్యాన్ని కలిగించే ఈ లక్షణాలను పెప్పర్మింట్ హెర్బల్‌తో నివారించవచ్చు. పేగుల్లో ఆకస్మికంగా సంభవించే కండరాల నొప్పి తగ్గించడానికి, వాంతులు, డయేరియాల నివారణకు పెప్పర్మింట్లోని మెంథాల్ ఉపయోగపడుతుందని బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అధ్యయనాలు వెల్లడించాయి. చదవండి: Red Lady Finger: ఎర్ర బెండీ.. భలే భలే.. వాళ్లకి మేలు! గ్రీన్ బనానా డయేరియా తీవ్రతను పచ్చ అరటితో తగ్గించవచ్చు. పచ్చ అరటిలో రెసిస్టెంట్ స్టార్చ్ అనే ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. అది యాంటి డయేరియా కారకాలు కలిగి ఉంటుంది. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల్లో నెమ్మదిగా పులిసిన షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పేగులు ఎక్కువ నీటిని పీల్చుకొనేలా ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా అరటిలో విటమిన్ ‘బి6’, పొటాషియం, ఫోలిక్ యాసిడ్లు కూడా ఉంటాయి. ఈ పోషకాలు తిమ్మిరి, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. డయేరియా నివారణలో పచ్చ అరటి ప్రయోజనాలపై వెనుజులాకు చెందిన పీడియాట్రీషియన్ డా. థైజ్ అల్వరెజ్ అకోస్టా నిర్వహించిన పరిశోధనాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పెరుగు జీర్ణక్రియ కార్యకలాపాల్లో మార్పుల కారణంగా కడుపునొప్పి సంభవిస్తుంది. అంటే కడుపులోని బ్యాక్టీరియా అసమతుల్యతం అవుతుందన్నమాట. ప్రోబయోటిక్స్ (మంచి సూక్ష్మజీవులు) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గ్యాస్, ఉబ్బసం వంటి రుగ్మతలకు పుల్‌స్టాప్ పెట్టవచ్చు. పెరుగులో జీవించి ఉండే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, డయేరియా (అతిసారా) నివారణకు తోడ్పడుతుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగిన వారు పెరుగు సేవిస్తే సులభంగా జీర్ణం అవుతుంది. ప్రోబయోటిక్ ఉత్పత్తులు ఐబీఎస్ రుగ్మతలకు ఉపశమనం కలిగిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలోని జువాలజీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ఎనా రే బెనర్జి వెల్లడించారు. చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
షాకింగ్ : బాలిక కడుపులో అరకేజీ జుట్టు
సాక్షి, చెన్నై : కడుపు నొప్పి అంటూ ఆస్పత్రిలో చేరిన ఓ బాలిక (13) కడపులో అరకేజీ జుట్టును వైద్యులు గుర్తించారు. ఆస్పత్రి సిబ్బంది షాకింగ్‌కు గురైన ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో సోమవారం చోటుచేసుకుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడోతరగతి చదువుతున్న ఓ బాలిక గత కొంతకాలం నుంచి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. దీంతో బాలికను తల్లిదండ్రులు సమీపంలో వీజీఎమ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు కడుపులో బంతి ఆకారంలో ఎదో వస్తువు ఉందని తొలుత గుర్తించారు. దానిని తొలగించాలంటే సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ వైద్యుడు గోకుల్ కృపాశంకర్ నేతృత్వంలోని వైద్యబృందం సర్జరీ నిర్వహించారు. ఈ క్రమంలోనే బాలిక కడుపులో అరకేజీ వెంట్రుకలు, ఖాళీ షాంపూ పాకెట్లు, మరికొన్ని ప్లాస్టిట్ వస్తువులు బయటపడ్డాయి. వీటిని చూసిన వైద్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అంతపెద్ద మొత్తంలో వెంట్రుకలు లభ్యంకావడంతో ఖంగుతిన్నారు. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులతో వైద్యులు మాట్లాడగా... ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. మొత్తానికి వైద్యుల కృషి ఫలించి బాలిక క్షేమంగా బయటపడింది. -
అజీర్ణం... కడుపు ఉబ్బరం ఎందుకిలా?
నా వయసు 40 ఏళ్లు. ఇటీవల కొంతకాలంగా నాకు కడుపులో విపరీతమైన మంట, నొప్పి వస్తున్నాయి. తిన్నది జీర్ణం కావడంలేదు. కడుపు ఉబ్బరంతోనూ బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయం అవుతుందా? జీర్ణకోశంలో ఉండే మ్యూకస్ పొరకు వచ్చే ఇన్ఫ్లమేషన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. కారణాలు: అక్యూట్ గ్యాస్ట్రైటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ►పెయిన్ కిల్లర్స్ వాడటం ►క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ►శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ►ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: ►కడుపునొప్పి, మంట ►కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ►అజీర్ణం, వికారం, రక్తపు వాంతులు ►ఆకలి తగ్గిపోవడం ►కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : ►సమయానికి ఆహారం తీసుకోవాలి ►పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ►ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స: సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
పాప ఎప్పుడూ ఏడుస్తూనే ఉంది...
మా పాపకు రెండున్నర నెలలు. ఈ మధ్య ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటోంది. డాక్టర్గారికి చూపిస్తే ‘ఈ వయసు పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంటుంది, ఆందోళన చెందాల్సిన అవసరంలేదు’ అంటూ కొన్ని మందులు రాశారు. మందులు వాడినప్పుడు కొద్దిరోజులు తగ్గినా ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. దయచేసి మా పాప సమస్యకు పరిష్కారం సూచించండి. పిల్లలు అదేపనిగా ఏడవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎలాంటి ప్రమాదమూ లేని చిన్న సమస్య మొదలుకొని, చాలా ప్రమాదకరమైన సమస్య వరకూ అన్నింటినీ వారు ఏడుపు ద్వారానే తెలియజేస్తారు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. అదేపనిగా ఏడ్వటానికి కొన్ని కారణాలివి... ఆకలేయడం, దాహంవేయడం, భయపడటం, మూత్ర విసర్జన కారణంగా డయపర్ తడి కావడం, బయటి వాతావరణం మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండి వారికి అసౌకర్యంగా ఉండటం, భయపెట్టే పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడం (ఇలాంటివి ఏవైనా సెలబ్రేషన్ సందర్భంగా బాణాసంచా కాలుస్తున్నప్పుడు పిల్లలు ఉలిక్కిపడి ఏడ్వటం చాలా సాధారణం), వారున్న గదిలో కాంతి మరీ ఎక్కువగా ఉండటం, వారున్నచోట పొగ కమ్ముకుపోయి ఊపిరి తీసుకోడానికి ఇబ్బందిగా ఉండటం. వారికి ఏవైనా నొప్పులు ఉండటం, దంతాలు వస్తుండటం, ఇన్ఫెక్షన్లు రావటం, కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్), జ్వరం, జలుబు, చెవినొప్పి, మెదడువాపు జ్వరం, గుండె సమస్యలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలను అన్నింటినీ పిల్లలు ఏడుపు ద్వారానే కమ్యూనికేట్ చేస్తారు. ఒకటి నుంచి ఆర్నెల్ల వయసులో ఉన్న పిల్లలు అదేపనిగా ఏడుస్తున్నారంటే దానికి కారణం ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటి సమస్యలు ఉండటం. మీ పాప విషయంలోనూ ఏడుపునకు మీ డాక్టర్‌గారు చెప్పినట్లుగా బహుశా కడుపునొప్పి (ఇన్ఫెన్టైల్ కోలిక్) కారణం కావచ్చని అనిపిస్తోంది. ఈ సమస్య సాధారణంగా ఆరువారాల నుంచి మూడు నెలలలోపు పిల్లల్లో వస్తుంటుంది. ఈ వయసు పిల్లలు ఎక్కువగా కడుపునొప్పితో ఏడుస్తుండటం తరచూ చూస్తుంటాం. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి. ఇలాంటి పిల్లల్లో ఏడుపునకు నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినప్పటికీ... ఆకలి, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను సరిగా ఎత్తుకోవడం (అప్ రైట్ పొజీషన్), లేదా కొద్దిసేపటికోసం వాళ్ల పొట్టమీద వాళ్లను పడుకోబెట్టడం (ప్రోన్ పొజిషన్), తేన్పు వచ్చేలా చేయడం (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్‌తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం. పాప ఒంటిమీద ఈ మచ్చలేమిటి? మా పాపకు 13 ఏళ్లు. దాదాపు ఆర్నెల్లుగా ఆమె ఒంటిమీద, ముఖం మీద చాలా మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు రావడానికి కారణం ఏమిటి? అవి పోవడానికి ఏం చేయాలి? మీ పాపకు ఉన్న కండిషన్ నీవస్ అంటారు. దీన్ని వైద్యపరిభాషలో మల్టిపుల్ నీవస్ అనీ, సాధారణ పరిభాషలో చర్మంపై రంగుమచ్చలు (కలర్డ్ స్పాట్స్ ఆన్ ద స్కిన్) అంటారు. ఇవి రెండు రకాలు. మొదటిది అపాయకరం కానివి. ఇవి చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. రెండోది హానికరంగా మారే మెలిగ్నెంట్ మచ్చలు. ఒంటిపై మచ్చలు పుట్టకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు 10 నుంచి 30 ఏళ్ల మధ్య రావచ్చు. నీవస్ చర్మానికి రంగునిచ్చే కణాల వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా (అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా) రావచ్చు. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలున్న సందర్భాల్లో ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్ బేసల్ సెల్ కార్సినోమా అనే కండిషన్ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతో పాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి ఈ మచ్చలతో పాటు జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ చూస్తుంటాం. అలాంటి వాళ్లకు ముఖం ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లోపాలు కనిపిస్తాయి. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి పైన చెప్పిన అపాయకరమైన పరిస్థితులేమీ మీ పాపకు లేనట్లుగా తెలుస్తోంది. కాబట్టి మీ పాపది హానికరం కాని సాధారణ నీవస్ కావచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్రమంగా క్యాన్సర్ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒంటిపై మీ పాపలా మచ్చలు ఉన్నవారు రెగ్యులర్‌గా డెర్మటాలజిస్ట్‌లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. అది ఎలాంటి మచ్చ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాలు గమనిస్తూ ఉండటం మంచిది. ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవంలో ఏదైనా మార్పు ఉందా?, బీ– అంటే బార్డర్... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా?, సీ– అంటే కలర్... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందా?, డీ– అంటే డయామీటర్... అంటే మచ్చ వ్యాసం (పరిమాణం) పెరుగుతోందా? ఈ నాలుగు మార్పుల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అప్పుడు బయాప్సీ తీసి పరీక్ష చేసి అది హానికరమా కాదా అన్నది వారు నిర్ణయిస్తారు. ఇక ఇలాంటివి రాకుండా ఉండాలంటే... ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం పూర్తిగా తగ్గించాలి. హానికారక అల్ట్రావయొలెట్ కిరణాలు తాకకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు ఎక్కువ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. మీ పాపకు ఉన్న మచ్చల్ని అప్పుడప్పుడూ డెర్మటాలజిస్ట్‌తో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఇలాంటి నీవస్‌లు ముఖం మీద ఉండి కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... వాటిని ఎక్సెషన్ థెరపీతో తొలగించవచ్చు. మీరొకసారి చర్మవ్యాధి నిపుణులను కలవండి. డా. రమేశ్‌బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
స్పైరస్ ఎంటరోస్కోపీ అంటే ఏమిటి?
మావారి వయసు 42 ఏళ్లు. కొన్నేళ్లుగా తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నారు. తీవ్రమైన నీరసం, మలంతో పాటు రక్తం కారడం జరుగుతుండటంతో మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాం. వారు సిటీలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవమన్నారు. హైదరాబాద్‌లో చూపిస్తే అక్కడ కొన్ని పరీక్షలు చేసి, చిన్న పేగుల్లో సమస్య ఉందని చెప్పారు. కాప్సూ్యల్ ఎండోస్కోపీ కూడా చేశారు కానీ ఫలితం లేదు. చిన్నపేగులో క్యాన్సర్ లేదా పాలిప్ ఉండవచ్చని అంటున్నారు మావారికి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఎంటిరోస్కోపీ అనే పరీక్ష వీలుకాదనీ, స్పైరస్ ఎంటిరోస్కోపీ అవసరమనీ, దాంతో అటు పరీక్ష, ఇటు చికిత్స... రెండూ జరుగుతాయని చెప్పారు. మాకెంతో ఆందోళనగా ఉంది. ఆ పరీక్ష/చికిత్స గురించి వివరాలు చెప్పండి. ‘స్పైరస్ ఎంటిరోస్కోపీ’ అనేది కూడా ఒక రకమైన ’ఎండోస్కోపీ’ పరీక్ష లాంటిదే. ఇది చిన్నపేగును పరీక్షించేందుకు ఉపకరించే ఓ ప్రభావవంతమైన పరీక్షాసాధనం. మన జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అది సరిగా పనిచేయకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. మీవారిలాగే చాలామంది కడుపునొప్పితో ఏళ్లతరబడి బాధపడుతూ కూడా... తమకు ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల లేదా మరో కారణం వల్ల ఇలా జరుగుతోందం టూ చిట్కావైద్యాలు చేసుకుంటూ చాలా అశ్రద్ధ చేస్తుంటారు. కానీ ఏళ్ల తరబడి తరచూ కడుపునొప్పి వస్తుంటే తప్పక డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని, తగిన సలహా / చికిత్స తీసుకోవాలి. మీవారికి మలంతో పాటు రక్తం రావడమనే లక్షణంతో పాటు, నీరసంగా ఉండటం అనేది చిన్నపేగుల్లోని సమస్యను సూచిస్తోంది. సాధారణంగా కడుపులో సమస్య ఉంటే ‘ఎండోస్కోపీ’ అనే పరీక్ష ద్వారా నోరు, అన్నవాహిక నుంచి జీర్ణాశయం వరకు ఉన్న సమస్యలను తెలుసుకోవచ్చు. మలద్వారం గుండా చేసే ‘కొలనోస్కోపీ’ పరీక్ష ద్వారా పెద్దపేగుకు ఏవైనా సమస్యలుంటే తెలుసుకోడానికి వీలవుతుంది. అయితే చిన్నపేగుల్లో ఉండే ప్రధాన సమస్యలను గుర్తించాలంటే ప్రత్యేకమైన ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది. అందులో క్యాప్సూల్ ఎండోస్కోపీ ఒకటి. అయితే మీవారి విషయంలో ఆ పరీక్ష చేసినా ఫలితం రాలేదని రాశారు. సాధారణంగా క్యాప్సూల్ ఎండోస్కోపీతో మొత్తం జీర్ణవ్యవస్థలో ఉండే అన్ని అవయవాల సమస్యలూ తెలుసుకోవచ్చు. ఒక్కోసారి క్యాప్సూల్ వెళ్లే మార్గంలో ఏ భాగమైనా మూసుకుపోతే అక్కడ క్యాప్సూల్ ఇరుక్కుపోతుంది. మీవారి విషయంలో ఇదే జరిగి ఉంటుంది. ఇది కాకుండా చిన్నపేగులో మాత్రమే ఉండే సమస్యలను తెలుసుకోడానికి చేసే మరో పరీక్షే ‘ఎంటిరోస్కోపీ’. బెలూన్ సహాయంతో చేసే ఈ పరీక్ష కొంతమందికి సూట్ కాదు. టైమ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. మీవారిలాగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ పరీక్ష వీలుకాదు. అందుకే మీవారికి పవర్ స్పైరస్ ఎంటిరోస్కోపీ అనే పరీక్షను సూచించి ఉంటారు. ఇది చాల సరళమైన, సురక్షితమైన, ప్రభావవంతమైన వైద్యపరీక్ష. చాలా తక్కువ సమయంలోనే దీన్ని చేయవచ్చు. ఈ ఎండోస్కోపీలో బెలూన్‌కు బదులు ఓవర్ట్యూబ్ను ఉపయోగిస్తారు. ఈ ఓవర్ట్యూబ్ సహాయంతో చిన్నపేగులోని మొత్తం దృశ్యాలను క్యాప్చర్ చేసి అక్కడి సమస్యలను స్పష్టంగా రికార్డు చేయవచ్చు. సాధారణ ఎంటిరోస్కోపీకి మూడు గంటల సమయం పడితే దీన్ని కేవలం గంటలోనే పూర్తిచేయవచ్చు. ఈ పవర్ స్పైరస్ ఎంటిరోస్కోపీతో కేవలం పరీక్ష మాత్రమే కాకుండా, చికిత్స కూడా చేయవచ్చు. దీంతో చాలా ప్రొసిజర్లను చేసి, చాలా సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కూడా అందించవచ్చు. ఈ విధానంలో రోగికి అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ చిన్నపేగుల్లో ట్యూమర్గానీ, పాలిప్స్గానీ, పుండుగానీ ఉన్నట్లయితే వాటిని తొలగించి, మంచి చికిత్స అందించవచ్చు. చిన్నపేగులో ఎక్కడైనా మూసుకుపోతే, ఆ ప్రదేశంలో దీనిసాయంతో వెడల్పు చేయవచ్చు. డాక్టర్‌కు కూడా ఇది చాలా సౌకర్యవంతంగా, చికిత్స చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక్కోసారి సీటీ, ఎమ్మారైలలో కూడా కనుగొనలేని (మిస్ అయ్యే) సూక్ష్మసమస్యలను సైతం ఈ పరికరంతో గుర్తించి చికిత్స అందించడం సాధ్యమవుతుంది. మీవారి విషయంలో డాక్టర్లు క్యాన్సర్ లేదా పాలిప్స్‌ను అనుమానిస్తున్నారని మీరు రాశారు. ఆ రెండు సందర్భాల్లోనూ ఈ స్పైరస్ ఎంటిరోస్కోపీతో చాలా సమర్థమైన చికిత్సను అందించే అవకాశం ఉంది. దీనితో ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి మీరు ఎలాంటి భయాలు, ఆందోళనలు పెట్టుకోకుండా మీవారికి అవసరమైన చికిత్స చేయించండి. డాక్టర్ బి. రవిశంకర్, డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్. -
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్
మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్స్ అందరికీ వచ్చినా ఇవి మహిళల్లో చాలా ఎక్కువ. మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ రావడం అన్నది తరచూ కనిపించే సమస్య. ఇక తమ ప్రమేయం లేకుండా మూత్రం కారిపోవడం (యూరినరీ ఇన్‌కాంటినెన్స్) అనే సమస్య వారిని చాలా ఇబ్బందికీ, ఆత్మన్యూనతకు గురిచేస్తుంది. అలాగే ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ సమస్య కూడా మహిళల్లో ఎక్కువ. దీన్ని ఒకింత తీవ్రమైన సమస్యగా డాక్టర్లు పరిగణిస్తుంటారు. ఈ ఇన్ఫెక్షన్ పైకి పాకితే కిడ్నీని సైతం ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మహిళలు సాధారణంగా బయటకు చెప్పుకోడానికి కూడా బిడియపడుతూ, తమలో తామే బాధపడుతుంటారు. ఇలాంటివన్నీ చాలా సాధారణమనీ, కిడ్నీ లేదా మూత్రసంబంధిత స్పెషలిస్టులను సంప్రదిస్తే చాలా సులువుగా పరిష్కారమయ్యే సమస్యలేనని అవగాహన కల్పించడానికే ఈ కథనం. వేర్వేరు వయసులో... చిన్నవయసులో తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే : చిన్నవయసు నుంచే ఇలా కనిపిస్తున్నాయంటే అది పుట్టుకతో వచ్చిన సమస్య (కంజెనిటల్ అనామలీస్)కారణంగా ఇన్ఫెక్షన్లు తరచూ వచ్చే ప్రమాదం ఉంది. కారణం తెలుసుకోకుండా ఎన్నిసార్లు చికిత్స ఇప్పించినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాదు. పైగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదమూ పొంచి ఉంటుంది. యౌవనంలో: ఇక యువతుల్లో, కొత్తగా పెళ్లైన మహిళల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సాధారణం. కొత్తగా పెళ్లయిన వాళ్లకి హనీమూన్ సిస్టయిటిస్ అనే సమస్య కనిపిస్తుంది. ఇక వయసు పైబడిన మహిళల్లో (పోస్ట్ మెనోపాజల్ వుమన్‌లో) కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వచ్చే సమస్య. నెలసరి ఆగిపోయికవచ్చే హార్మోన్ల ప్రభావంతో ఈ సమస్యలు వస్తుంటాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం వల్ల మూత్రనాళం సన్నబడే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రాశయంలో మూత్రం నిల్వ ఉండటంతో అది మాటిమాటికీ వచ్చే అవకాశం ఉండి, ఇది ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. ఈ హార్మోన్ల లోపం కారణంగా మూత్రాశయ కణాలకు అనారోగ్యకరమైన బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది. యూరినరీ ఇన్‌కాంటినెన్స్: ఈ సమస్య ఉన్నవారిలో తమ మూత్రవిసర్జనపైన తమకే నియంత్రణ ఉండదు. ఈ సమస్య కూడా పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ. కాన్పులు కష్టమైనవారిలో, స్థూలకాయంతో... హార్మోన్ సమస్యలతో బాధపడుతున్న వారిలో, మరికొంతమందిలో మెనోపాజ్ ఆగిపోయాక ఈ సమస్య కనిపిస్తుంది. కొందరిలో ఏ అవసరం లేకుండానే మూత్రాశయ కండరాలు సంకోచిస్తుంటాయి. మరికొంతమందిలో మూత్రాశయ నాడులు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. యాభైఅయిదేళ్ల లోపు వయసున్నవారిలో సగం మంది మహిళలు ఈ సమస్యకు లోనవుతుంటారు. కానీ సిగ్గు, బిడియం కారణంగా అందులో పది శాతం మంది కూడా వైద్యులను సంప్రదించడానికి ముందుకు రావడం లేదు. నిజానికి ఈ సమస్య అంత పెద్దది కాదు. అయినప్పటికీ మానసికంగానూ, శారీరకంగానే కాకుండా సామాజికంగా కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఒక్కోసారి ఈ సమస్య ఉన్నవారిలో మూత్రం వల్ల ఏర్పడిన చెమ్మ కారణంగా చర్మ సంబంధిత అలర్జీలు కూడా వస్తాయి. సమస్య తీవ్రత పెరిగి సర్జరీ వరకు దారితీయవచ్చు. దీనికి పూర్తి చికిత్స అందించకపోతే ఇది కిడ్నీలపైన కూడా ప్రభావం చూపుతుంది. మూత్ర విసర్జక వ్యవస్థ ఇన్ఫెక్షన్కు గురవడానికి ప్రధానమైన కారణం ‘ఈ–కొలి’ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా బయటి వాతావరణంలోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇది మూత్ర విసర్జన మూత్రనాళాల్లోకి వెళ్తుందో అప్పుడు దీనివల్ల కిడ్నీకి అత్యంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇందులోని ‘క్లెబిసియల్లా, ఇంటరోకోకస్ ఫైకలిస్’ అనే రెండు బ్యాక్టీరియాలు చాలా కీడు చేస్తాయి. పైగా యాంటీబయాటిక్స్లాంటి మందులకు కూడా ఇవి పెద్దగా లొంగవు. నివారణే మేలు : ►వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలో భాగంగా మల, మూత్ర విసర్జన తర్వాత ప్రైవేటు పార్ట్స్ శుభ్రపరచుకునే సమయంలో పై వైపు నుంచి కింది వైపునకు కడుక్కోవాలి. లేకపోతే మల మార్గంలో ఉండే రోగకారక క్రిములు/సూక్ష్మజీవులు మూత్ర మార్గం వైపునకు వచ్చి ఇన్ఫెక్షన్లు కలిగించే అవకాశం ఉంది ►రోజూ తగినంత నీరు తాగకపోవడమే సాధారణంగా మూత్ర సంబంధిత వ్యాధులకు కారణమని వైద్యులు అంటున్నారు. ఇప్పుడు మహిళల్లో చాలామంది ఉద్యోగలతో క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. కనీసం మంచినీరు కూడా తగినంత తాగేంత తీరిక కూడా వారికి ఉండటం లేదు. దాంతో మహిళల్లోనే మూత్ర సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ►తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేయాలి. ►కాఫీ, టీ, జంక్ఫుడ్స్ లాంటి వాటి జోలికి వెళ్లకూడదు ∙గ్రామీణ ప్రాంతాల్లోని వారితో పాటు పట్ణణాల్లోని మురికివాడల వంటి అంతగా పరిశుభ్రత లేని ప్రాంతాల్లో నివసించే మహిళలు కూడా శుభ్రతపాటించేలా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రయత్నించాలి. చికిత్స సాధారణంగా వచ్చే మూత్ర వ్యాధులకు డాక్టర్లు నోటి ద్వారా తీసుకునే మందులతోనే చికిత్స చేస్తుంటారు. అవసరాన్ని బట్టి ఒక్కోసారి కాస్త ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ ఇస్తారు. సమస్య ఇంకాస్త ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసే, పరీక్షలు నిర్వహించి, అందుకు అనుగుణంగా చికిత్స పద్ధతిని అవలంబిస్తారు. పుట్టుకతో వచ్చే లోపాలకు, మూత్రపిండాల్లో రాళ్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు అవసరమైతే సర్జరీ చేసి... ఆయా లోపాల్ని సరిచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మూత్రావయవాల్లో టీబీ వల్ల కూడా మాటిమాటికీ ఇన్షెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ డాక్టర్‌కి అనుమానం వస్తే టీబీ క్రిముల కోసం ప్రత్యేకమైన మూత్రపరీక్షలు చేసి, చికిత్సను అందిస్తారు. -
కడుపు నొప్పి అని వెళితే.. కండోమ్స్ తెమ్మన్నాడు
రాంచీ : కడుపునొప్పితో బాధపడుతున్న ఓ మహిళ ఆస్పత్రికి వెళితే.. ప్రిస్కిప్షన్‌లో కండోమ్స్ రాసిచ్చాడో కీచక డాక్టర్. అది తెలియక మెడికల్ దుకాణానికి వెళ్లిన మహిళ.. మందుల చీటీ చూపించి మందులు అడగ్గా కండోమ్స్ ప్యాకెట్‌ను చేతిలో పెట్టారు. ఇది చూసి కంగుతిన్న మహిళ సదరు డాక్టర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. జిల్లాకు చెందిన నాలుగో తరగతి మహిళా ఉద్యోగికి ఈనెల 23న కడుపు నొప్పి రావడంతో ఘాట్షీలా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షలు నిర్వహించిన కాంట్రాక్ట్ డాక్టర్ అస్రప్ మందులు తెచ్చుకోమని ప్రిస్కిప్షన్ రాసిచ్చారు. డాక్టర్ రాసిచ్చిన మందుల చీటీని తీసుకున్న సదరు మహిళ.. సమీపంలో ఉన్న మెడికల్ దుకాణానికి వెళ్లి మందులు ఇవ్వమని అడిగారు. ప్రిస్కిప్షన్ చూసిన సిబ్బంది ఆమెకు కండోమ్స్ ప్యాకెట్‌ను అందజేశారు. ఇదేంటి మందులు అడిగితే ఈ ప్యాకెట్ ఇచ్చారని సదరు మహిళ సీరియస్ అవ్వగా.. మందుల చీటీలో అదే రాసి ఉందని మెడికల్ సిబ్బంది చెప్పింది. దీంతో షాక్‌కు గురైన మహిళ.. జార్ఖండ్ ముక్తి మోర్చా శాసన సభ్యులు కునాల్ సారంగికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కునాల్ సారంగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని సీనియర్ డాక్టర్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సీనియర్ డాక్టర్లు విచారణ ప్రారంభించారు. మెడికల్ విభాగ సిబ్బంది, ఓ మానసిన వైద్యుడుతో కూడిన కమిటీ ఈ ఘటనపై విచారణ జరుపుతోందని ఆస్పత్రి ఇన్చార్జ్ శంకర్ పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై డాక్టర్ అస్రఫ్ ఇంతవరకూ స్పందిచకపోవడం గమనార్హం. -
కడుపులో దాచుకోకండి
బాధని కడుపులో దాచిపెట్టుకుంటాం... కష్టాన్ని కూడా. మనం కష్టాలను బయటివాళ్లకు చెప్పుకుంటే కడుపు చింపుకున్నట్లే... కాళ్ల మీద వేసుకున్నట్లే. ఇదంతా ఓకే... కానీ సమస్యే కడుపు అయితే? కాదు... కాదు.. కాదు... కడుపే సమస్య అయితే..? అప్పుడు కూడా దాచిపెట్టుకుంటే ఆరోగ్యాన్ని కంపు చేసుకున్నట్టే! ఈ రోజుల్లో జస్ట్ ముప్ఫయి ఏళ్ల వయసుకు చేరిన వారిలో ఏదో ఒక రకమైన జీర్ణసమస్య కనపడుతుండటం మామూలైపోయింది. తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపించడమో, పొట్ట రాయిలా మారడమో, అదే పనిగా తేన్పులు రావడమో... ఇలా ఏదో ఒక ఇబ్బంది ఉండనే ఉంటోంది. ప్రతి ఇంట్లోనూ తమకు మలబద్దకం ఉందనో, కిందినుంచి గ్యాస్ పోతోందనో, గుండెల్లో మంటగా ఉంటోందనో చెప్పడం చాలా సాధారణం. ఇందుకు ఏ ఇల్లూ మినహాయింపు కాదంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క కుటుంబానికీ ఉపకరించేలా ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియలోనూ, జీర్ణవ్యవస్థలోనూ మనం ప్రతిరోజూ ఎదుర్కొనే సాధారణ సమస్యలూ, వాటి పరిష్కారాల వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. కడుపులో గ్యాస్ పైకి తన్నడం మనం ఆహారం తీసుకోగానే ఈసోఫేగస్ అనే పైప్ ద్వారా అది జీర్ణాశయంలోకి వెళ్తుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం ఆసిడ్ ఉత్పత్తి అవుతుంటుంది. మనం జీర్ణం అవడానికి తగినంత పరిమాణంలో అక్కడ ఆహారం లేకపోతే ఆ యాసిడ్ మన కడుపు కండరాలపై ప్రభావం చూపుతుంది. యాసిడ్ దేనినైనా కాల్చేస్తుందన్న విషయం తెలిసిందే కదా. అందుకే అది మన కడుపు కండరాల మీద పని పనిచేస్తుంటే కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. అంతేకాదు ఆ తాలూకు పొగలు (యాసిడ్ ఫ్యూమ్స్) ఒక్కోసారి పైకి చిమ్ముతుంటాయి. అలా పైకెగసినప్పుడు దాని ప్రభావం గొంతులోనూ తెలుస్తుంది. అప్పుడు ఆసిడ్ గొంతులోకి, కొన్నిసార్లు నోట్లోకి కూడా ప్రవేశించి, మనకు చేదు తెలుస్తుంటుంది. దీన్నే ‘వెట్ బర్ప్’ అని కూడా అంటారు. అప్పుడు గొంతు మంటగా అనిపించడం సహజం. అందుకే గ్యాస్ పేరుకున్నప్పుడు కడుపులో మంటగానూ, గొంతులోకి గ్యాస్ఫ్యూమ్స్ ఎగజిమ్మినప్పుడు గ్యాస్ పైకి ఎగతన్నుతున్నట్లు అనిపించడం చాలా సాధారణం. కారణాలు: కడుపులో గ్యాస్ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఇవి కొన్ని... ∙కడుపులో కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా తినడం ∙తిన్నవెంటనే పడుకోవడం ∙ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం. ∙ఉప్పు, కారం, మసాలాలు అధికంగా ఉండటం. ∙మనం తీసుకున్న ఆహారంలో తగినన్ని పీచుపదార్థాలు ఉండకపోతే... అలాంటప్పుడు యాసిడ్ పనిచేసే సమయంలో కడుపు కండరాలకు తగినంత రక్షణ దొరకదు. యాసిడ్ నేరుగా కడుపు కండరాలపై పనిచేస్తుండటంతో కడుపులో మంట, గ్యాస్ పైకి ఎగజిమ్మడం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ♦ ఆహారనాళం, జీర్ణకోశంలోకి ఈ రెండూ కలిసే జంక్షన్లో ఒక మూత (స్ఫింక్టర్) లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ మూతను వైద్యపరిభాషలో ‘జీఈ జంక్షన్’ అని పిలుస్తారు. ఒకసారి జీర్ణకోశంలోకి వెళ్లిన ఆహారాన్ని మళ్లీ పైకి రాకుండా ‘జీఈ జంక్షన్’ అనే మూతలాంటి నిర్మాణం అడ్డుపడుతుంది. అయితే కొన్నిసందర్భాల్లో అది బలహీనంగా ఉండటం వల్ల గొంతులోకి ఆహారపు మెతుకులు రావడం, దాంతోపాటు గ్యాస్, ఆసిడ్ రావడం వంటి లక్షణాలు కూడా చాలా మందిలో కనిపిస్తుంటాయి. ‘జీఈ జంక్షన్’ సరిగా పనిచేయడానికి ఎన్నో అంశాలు దోహదం చేయాలి. ఉదాహరణకు... కడుపు కండరాలు మృదువుగా ఉండటం, అక్కడ స్రవించాల్సిన రకరకాల హార్మోన్లు సక్రమంగా స్రవించడం వంటివి. ఒకసారి కడుపులోకి ఆహారమంతా చేరుకున్న తర్వాత ఆ స్ఫింక్టర్ పూర్తిగా, సక్రమంగా మూసుకుపోవాలి. మనం తీసుకునే ఆహారం, కొన్నిరకాల మందులు, నరాల నుంచి ఆదేశాలు కూడా ఈ జీఈ జంక్షన్ అనే నిర్మాణం బలహీన పడటానికి దోహదం చేస్తుంటాయి. అంతేకాదు... మనం ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అన్ని కండరాలూ రిలాక్స్ అయినట్లుగానే ఈ స్ఫింక్టర్ కండరాలూ రిలాక్స్ అవుతాయి. అలాంటప్పుడు ఆహారంతో పాటు ఆసిడ్ పైకి ఎగజిమ్మి ఒక్కోసారి నోట్లోకి వస్తుంది. ఆల్కహాల్ తాగి నిద్రపోతున్న సమయంలో ఇలా నోట్లోకి చేదు వస్తుండటం చాలామందికి అనుభవంలోకి వచ్చే సంఘటనే. అలాగే కొన్నిసార్లు కొన్ని రకాల మందులు కూడా గ్యాస్ట్రబుల్కు కారణమవుతుంటాయి. గ్యాస్ సమస్యను నివారించడం ఎలా ♦ ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని మూడు పూటల్లో కాకుండా చిన్న చిన్న మోతాదుల్లో రోజులో ఎక్కువసార్లు తినడం ∙ఊబకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవడం ∙పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానివేయడం. ∙రాత్రిపూట చాలా ఆలస్యంగా తినకూడదు. ∙రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరం నడవాలి. ∙రాత్రిపూట తీసుకునే చిరుతిండ్లను వీలైనంత వరకు మానేయాలి. ∙రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందర రెండుగంటల పాటు ఏమీ తినకూడదు. ∙పక్కమీదకు వెళ్లగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. వీలైనంతవరకు కుడివైపు తిరిగి పడుకోకూడదు. ఎందుకంటే... అలా పడుకుంటే స్ఫింక్టర్ మీద ఒత్తిడి పడి అది తెరుచుకుని, ఆహారం మళ్లీ వెనక్కు రావచ్చు. ఆసిడ్ కూడా వెనక్కు వచ్చే అవకాశం ఎక్కువ. ∙మీ తల వైపు భాగం ఒంటి భాగం కంటే కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఒక మెత్త (దిండు)ను ఎక్కువగా పెట్టుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ దిండు తల కింద మాత్రమేగాక మీ భుజాల కిందివరకూ ఉంటే మేలు. చికిత్స: ఈ సమస్య విషయంలో నివారణే మంచి చికిత్సగా భావించవచ్చు. అంటే మన జీవనశైలిని ఆరోగ్యవంతంగా మార్చుకోవడం. అంటే తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం, ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం. వీటన్నింటితో గుణం కనిపించనప్పుడే హెచ్2 బీటాబ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతో చికిత్స అవసరమవుతుంది. గృహ వైద్యం: అప్పుడే తయారు చేసిన మజ్జిగ తీసుకోవడం ఇలాంటి సమస్యల్లో మంచి గృహవైద్యం. అప్పుడే చిలికిన మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని ఆసిడ్ (ఆమ్లం)తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఈ గృహవైద్యం కోసం అప్పటికప్పుడు తయారు చేసిన తాజామజ్జిగనే (ఉప్పు లేకుండా) వాడాలి. ఎందుకంటే... కాస్త ఆలస్యం చేసినా మజ్జిగ పులవడం మొదలై అది కూడా అసిడిక్ (ఆమ్ల)గుణాన్ని పొందుతుంది. కాబట్టి ఆసిడ్‌లో ఆసిడ్ కలిసి సమస్య మరింత తీవ్రం కావచ్చు. కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రొ–బయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి. హార్ట్ ఎటాక్‌గా పొరబడటమూ సహజమే! మనం తిన్న ఆహారం ఈ ఈసోఫేగస్‌లోకి వెళ్లగానే అక్కడ దానిపై యాసిడ్ ప్రభావం మొదలవుతుంది. ఈసోఫేగస్ దాదాపు గుండె ఉన్న ప్రాంతంలోనే ఉండటంతో ఈ ఛాతీలో మంటను ఒక్కోసారి గుండెమంటగా కూడా పొరబడి ‘గుండెపోటు’ గా అపోహపడుతుంటారు. అందుకే దీన్ని ‘హార్ట్‌బర్న్’ అనుకోవడం సహజంగా జరిగేదే. అయితే కొందరు తమకు నిజానికి హార్ట్ఎటాక్ వచ్చినప్పుడు కూడా దాన్ని గ్యాస్‌ట్రబుల్‌గా పొరబడ్డ ఉదంతాలూ ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉన్నవారు ఒకసారి తగిన వైద్య పరీక్షలు చేయించుకుని, అది గుండెకు సంబంధించిన సమస్య కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాతే నిశ్చింతగా ఉండటం మంచిది. నివారణ అసిడిక్ నేచర్ (ఆమ్ల స్వభావం) ఎక్కువగా ఉండే ఆహారాలైన టమాటా, నిమ్మజాతి పండ్లు, పులుపు ఎక్కువగా ఉండే పండ్లు, కూల్‌డ్రింక్స్‌లో కార్బొనేటెడ్ కోలా డ్రింక్స్ ఎక్కువగా తాగడం, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, కొన్ని సందర్భాల్లో టీ ఎక్కువగా తాగడం వంటి అంశాలన్నీ ఛాతీలో మంట, గుండెల్లో మంటకు దోహదపడతాయి. పైన పేర్నొన్న వాటిని చాలా పరిమితంగా తీసుకోవడం లేదా వీలైతే తీసుకోకుండా ఉండటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. కింది నుంచి గ్యాస్ పోవడం ఇది చాలామందిలో చాలా ఇబ్బంది కలిగించే సమస్య. మనం ఆహారాన్ని మింగే సమయంలో గాలిని కూడా మింగుతుంటాం. ఇది పెరిస్టాలిటిక్ చలనం రూపంలో జీర్ణవ్యవస్థ పొడవునా వెళ్తూనే ఉంటుంది. ఈ గ్యాస్... జీర్ణవ్యవస్థ భాగంలో ఉంటే తేన్పు రూపంలో వెళ్తుంది. కానీ జీర్ణవ్యవస్థ కింది భాగానికి దగ్గరగా అంటే పెద్దపేగు, రెక్టమ్‌లో ఉన్నప్పుడు కిందన... మలద్వారం గుండా పోతుంటుంది. అలాంటప్పుడు ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంటుంది. ఎవరెవరిలో ఈ సమస్య ఎక్కువ... ? ♦ బాగా వేగంగా తినేవారు, బాగా వేగంగా తాగేవారు ∙పొగతాగే అలవాటు ఉన్నవారు ∙చ్యూయింగ్‌గమ్ నమిలేవారు ∙ఎప్పుడూ ఏదో చప్పరిస్తూ ఉండేవారు ∙కార్బొనేటెడ్ డ్రింక్స్ / కూల్‌డ్రింక్స్ (గ్యాస్ ఉన్నవి) ఎక్కువగా తాగేవారు ∙వదులుగా ఉండే కట్టుడుపళ్లు ఉన్నవారు... వీరంతా గ్యాస్ ఎక్కువగా మింగుతుంటారు. ఇక కొన్ని రకాల ఆహారాలు కూడా కింది నుంచి గ్యాస్ పోవడం అనే సమస్యను తీవ్రతరం చేసుంటాయి. ఆ ఆహారాలివే... ♦ బీన్స్, ∙కూరగాయల్లో బ్రాకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లిగడ్డలు ∙పండ్లలో పియర్స్, ఆపిల్స్ ∙పొట్టు ఉన్న ధాన్యాల్లో గోధుమలు ∙గ్యాస్ ఉన్న పానీయాలైన సోడాలు, కార్బొనేటేడ్ సాఫ్ట్‌డ్రింక్స్ ∙పాలు, పాల ఉత్సాదనల్లో చీజ్, ఐస్‌క్రీములు, పెరుగు ∙ప్యాకేజ్‌ఫుడ్స్‌లో బ్రెడ్స్ వంటివి తినేవారిలో గ్యాస్ పోవడం ఎక్కువ. కిందినుంచి గ్యాస్ పోయే సమస్యకు పరిష్కారం మనం ఆహారం తీసుకునే సమయంలో గాలి ఎక్కువగా నోట్లో పోకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. ఆ జాగ్రత్తలివే... ♦ తినే సమయంలో చాలా మెల్లగా, నింపాదిగా తినాలి. ∙నమిలేటప్పుడు పెదవులు మూసి తినాలి ∙పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి. ∙కట్టుడు పళ్లు ఉన్నవారు డెంటిస్ట్ సహాయంతో అవి సరిగా అమరి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి ∙సోడాలు, కూల్‌డ్రింక్స్, బీర్ వంటి గ్యాస్ నిండిన పానీయాలకు దూరంగా ఉండాలి. ∙పండ్లను కొరికి, నమిలి తినాలి. ఇలాంటి జాగ్రత్తలతో చాలావరకు ఈ సమస్యను అధిగమించవచ్చు. మందులు : ∙మనం బీన్స్ లేదా గ్యాస్‌కు దోహదం చేసే కూరగాయలతో ఎక్కువగా భోజనం చేసినప్పుడు డాక్టర్ల సలహా మేరకు అల్ఫా–గెలాక్టోసైడేజ్ మందులు తీసుకోవడం ద్వారా గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. ♦ కడుపులో గ్యాస్ పెరిగి ఇబ్బందికరమైన నొప్పితో బాధపడుతున్నప్పుడు డాక్టర్ సలహా మేరకు సైమెథికోన్ (గ్యాస్–ఎక్స్, మైలాంటా గ్యాస్) వంటి మందులతో ఈ సమస్యను అధిగమించవచ్చు. గమనిక: పాలు, పాల ఉత్పాదనలు తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా మారిపోయి, గ్యాస్ సమస్య పెరుగుతుంటే... మార్కెట్లో ఇటీవల ల్యాక్టోజ్ రహిత పాలు, పాల ఉత్పాదనలు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగిస్తే గ్యాస్ సమస్య బాగా తగ్గుతుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్): దీని వల్ల సాధారణ ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఎలాంటి ప్రమాదమూ, ప్రాణాపాయమూ ఉండదు. కానీ అనుభవించేవారికి ఇదెంతో పెద్ద సమస్య. సామాజిక జీవనానికి పెద్ద అడ్డంకి. ఓ డిన్నర్‌కీ లేదా లంచ్‌కీ వెళ్దామన్నా ఇబ్బంది. ఎక్కడకు వెళ్లినా బాత్రూమ్ ఎక్కడ ఉందో అని మొదటే వెతుక్కోవాల్సిన ఇబ్బందికరమైన స్థితి. భోజనం ముగిసిన వెంటనే టాయిలెట్‌కు పరుగుపెట్టాల్సిన పరిస్థితి. నలుగురిలో ఇబ్బంది ఎప్పుడు కలుగుతుందో అన్న ఆందోళన. లక్షణాలివి... ఒక్కోసారి మలబద్దకం, కొన్నిసార్లు నీళ్ల విరేచనాలు... కొన్నిసార్లు ఈ రెండూ కలిసి ఉన్నట్లు అనిపిస్తాయి. ఉబ్బినట్లుగా ఉన్న పొట్ట, కింది నుంచి గ్యాస్ పోవడం మామూలే. భోజనం ముగించిన వెంటనే కడుపునొప్పితో ఆపుకోలేని విధంగా టాయిలెట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. మలవిసర్జన తర్వాత కడుపు తేలికై, నొప్పి తగ్గుతుంది. కారణాలు: ఐబీఎస్‌కు నిర్దిష్టమైన కారణం తెలియదు. అయితే... మన దేహంలో జీర్ణక్రియ ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతుంది. రోజూ ఉదయాన్నే మలవిసర్జన మొదలుకొని, ఆయా వేళలకు ఆకలైనప్పుడు తినాలనిపించడం అంతా మెదడునుంచి జీర్ణవ్యవస్థకు అందే ఆదేశాల ఆధారంగా ఒక క్రమబద్ధమైన రీతిలో జరుగుతూ ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల మెదడుకూ, జీర్ణవ్యవస్థకూ మధ్య సమాచార వ్యవస్థ దెబ్బతిని, అక్కడినుంచి అందే ఆదేశాలు అస్తవ్యస్తమైతే అది ఐబీఎస్‌కు దారితీస్తుందన్నది ఒక వాదన. ఇక రోజువారీ జీవితంలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనేవారిలో ఇది ఎక్కువ. ఏదైనా ఒత్తిడితో కూడిన పరిస్థితి ఎదురుకాగానే మలం వస్తున్న ఫీలింగ్‌తో బాత్రూమ్కు వెళ్లాల్సి రావడం చాలామందిలో కనిపించే లక్షణమే. అదే ప్రక్రియ ఐబీఎస్ ఉన్నవారిలోనూ జరుగుతుంది. అధిగమించడం ఎలా: ఇటీవల ఆహారానికీ, ఐబీఎస్కూ ఏదో తెలియని అంతర్లీన సంబంధం ఉందన్న విషయాన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రధానంగా ‘ఫోడ్‌మ్యాప్స్’ అనే ఆహారం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఫోడ్మ్యాప్ ఆహారం అంటే... మనం తిన్న తర్వాత పేగుల్లో పూర్తిగా జీర్ణం కాకుండా కేవలం పాక్షికంగా మిగిలిపోయే ఆహారం అన్నమాట. ఇది అలా పాక్షికంగా జీర్ణమై మిగతాది మిగిలిపోవడంతో అది పులియడం (ఫెర్మెంటేషన్ ప్రక్రియ) మొదలవుతుంది. ఈ ప్రక్రియలో గ్యాస్ వెలువడటం, అది కింది నుంచి మాటిమాటికీ పోతూ ఉండటం, గ్యాస్ నిండిపోయి పొట్టబిగుతయ్యేలా చేయడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఫోడ్‌మ్యాప్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు: మనం తినే ఆహారంలో కృత్రిమ చక్కెరలు, కొన్ని తీపిపదార్థాలు, పాలు, పండ్లలో మామిడి, ఆపిల్, కూరగాయల్లో బీట్రూట్, క్యాబేజీ, ఉల్లి వంటివి ఎక్కువ ఫోడ్‌మ్యాప్స్ ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి. ఫోడ్మ్యాట్ తక్కువగా ఉండే ఆహారాలు: అరటిపండ్లు, బ్లూబెర్రీ, ద్రాక్ష, నిమ్మ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ వంటి వాటిల్లో ఫోడ్‌మ్యాప్స్ తక్కువగా ఉంటుంది. ఇలాగే గుమ్మడి, పాలకూర, టొమాటో, చిలగడదుంప (మోరంగడ్డ), కొత్తిమీర, అల్లం, ల్యాక్టోజ్ లేని పాలు, ఆలివ్ ఆయిల్, పెరుగు వంటి వాటిల్లోనూ ఫోడ్మ్యాప్ తక్కువ. ఇక గోధుమల కంటే వరి, ఓట్స్‌లో ఫోడ్ మ్యాప్స్æ తక్కువ. గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... ఐబీఎస్‌తో బాధపడేవారు ఫోడ్మ్యాప్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఫోడ్మ్యాప్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని వీలైనంత తక్కువగా తీసుకోవాలి. జీర్ణసంబంధమైన అనేక సమస్యలకు కొన్ని సాధారణ పరిష్కారాలు ♦ తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినండి. రోజుకు రెండు మూడు సార్లు ఎక్కువగా తినడం కంటే... తక్కువ మోతాదుల్లో 4, 5 సార్లు తినండి. ♦ మీ ఆహారం పీచు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోండి. ఇందుకోసం పొట్టుతో ఉండే ధాన్యాలతో చేసిన ఆహారం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తినండి. ♦ మీ ఆహారంలో చేపలను వారంలో కనీసం రెండు–మూడు సార్ల కంటే ఎక్కువగా తీసుకోవడం మంచిది. ♦ ఎక్కువ కొవ్వుతో ఉండేవి, బాగా వేయించిన ఆహారపదార్థాలను వీలైనంత దూరంగా ఉండండి. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోండి. ♦ తినకముందే పాక్షికంగా పులిసే పదార్థాలైన ఇడ్లీ, దోసెల వంటివాటిని, (పూరీ, చపాతీల కంటే) మీ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఎక్కువగా తీసుకోండి. అలాగే ఇలా పులిసేందుకు అవకాశం పెరుగు, మజ్జిగ వంటి ఆహారాల్లో మనకూ, మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే ‘ప్రో–బయాటిక్’ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. అయితే అది పూర్తిగా పులియకముందే తాజాగా ఉన్నప్పుడు తినడం మంచిదని గుర్తుంచుకోండి. ♦ మీకు మాంసాహారం తీసుకోవాలని అనిపించినప్పుడు వేటమాంసం కంటే కొవ్వు తక్కువగా ఉంటే చికెన్‌ను ఎంచుకోండి. ♦ రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగండి. ఇక కాఫీలు, ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు తూరంగా ఉండండి. ♦ రోజూ చురుగ్గా ఉండండి. వ్యాయామం చేయండి. పొగతాగే అలవాటుకు, మద్యానికి దూరంగా ఉండండి. ♦ మీ బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ♦ ఇక్కడ పేర్కొన్న ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నంత కాలం మన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుందని గుర్తుంచుకోండి. -
తినగానే కడుపునొప్పితో టాయిలెట్‌కు...
నా వయసు 42 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపుఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. ఈ సమస్యతో ఏ అంశంపైనా దృష్టి పెట్టలేకపోతున్నాను. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి.– ఎమ్. సత్యవతి, విజయనగరం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ఒత్తిడిని నివారించుకోవాలి పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలిరోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు.డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్,పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
‘గ్యాస్ట్రైటిస్’కు పరిష్కారం ఉందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 46 ఏళ్లు. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? – డి. గురుప్రసాద్, ఒంగోలు జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు : ∙20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు : కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నిద్రలేమి సమస్య వేధిస్తోంది నా వయసు 34 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ప్రతి 15 రోజులకు ఒకసారి షిఫ్ట్ మారుతుంది. ఈ మధ్యే డే–షిఫ్ట్ కు మారాను. అయినా రాత్రివేళ సరిగా నిద్రపట్టడం లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – కె. నవీన్, హైదరాబాద్ మనిషికి గాలి, నీరు, తిండి లాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర కరువైతే కళ్లలో కళాకాంతులు తగ్గుతాయి. ఉత్సాహం తగ్గుతుంది. అలసట, ఆందోళన మాత్రమే గాక అనేక ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమవుతుంది. శారీరక, మానసిక సమస్యలు తప్పవు. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపట్టినా తెల్లవారుజామున నిద్రలేవడం, రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెలకువరావడం, ప్రశాంతమైన నిద్రలేకపోవడం నిద్రలేమి సమస్యకు సంబంధించిన ఒకటి రెండు లక్షణాలు. అయితే ఇవి అన్నీ గాని... కొన్ని గాని ఉండటాన్ని వైద్య పరిభాషలో ఇన్సామ్నియా (నిద్రలేమి)గా చెప్పవచ్చు. నిద్రలేమి శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆలోచన గమనాన్ని నియంత్రిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కారణాలు : ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శారీరకంగా వచ్చే మార్పులు ∙చికాకులు ∙చీటికిమాటికి కోపం తెచ్చుకోవడం ∙దీర్ఘకాలిక వ్యాధులు ∙వంశపారంపర్యం ∙అంతులేని ఆలోచనలు లక్షణాలు : ∙నిద్రలోకి జారుకునేందుకు కష్టపడిపోవడం ∙నిద్రపట్టినా మధ్య మధ్య మెలకువ వస్తూ ఉండటం, నాణ్యమైన నిద్ర లోపించడం ∙తెల్లవారుజామున మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టకపోవడం ∙నిద్రలేచిన తర్వాత విశ్రాంతిగా అనిపించకపోవడం నిర్ధారణ పరీక్షలు : రక్తపరీక్షలు, పాలీసామ్నోగ్రామ్ (పీఎస్జీ) చికిత్స : హోమియోలో నిద్రలేమి సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది. నక్స్‌వామికా, ఓపియమ్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బమ్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పాసీఫ్లోరా 20 – 25 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్రపడుతుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్ నయమవుతుందా? నా వయసు 66 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. హోమియోలో దీనికి చికిత్స ఉందా? – ఏ. సూర్యనారాయణమూర్తి, ఏలూరు మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు : ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స : ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య
పటాన్చెరు టౌన్ : కడుపునొప్పి తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఉన్నాయి. పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌కు చెందిన నర్సమ్మ(33) ఇస్నాపూర్‌లో నివాసముంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో రోజువారి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పితో బాధపడుతోంది. నొప్పి ఎక్కువగా వచ్చినప్పుడల్లా టాబ్లెట్లు వేసుకునేది. ఈ క్రమంలో సోమవారం ఉదయం కూడా తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో లోపలి నుండి గడియ పెట్టుకుని ఇంటి పైకప్పుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి రాధమ్మ పోలీసులకు తెల్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లయిన ఆరునెలలకే విషాదాంతం
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): పెళ్లయిన ఆరు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. యల్లపువానిపాలెంలో తీవ్ర విషాదం నింపిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. పొన్నపు సోనీ(26)కి శ్రీకాకుళం జిల్లా నర్సిపురం ప్రాంతానికి చెందిన సంజయ్‌కుమార్‌తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. సంజయ్‌కుమార్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సోనీ కన్నవారి ఇంట్లోనే దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం ఆయన ఉద్యోగ రీత్యా క్యాంపు వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఇంటి బయట సోనీ తల్లిదండ్రులు కాలెమ్మ, అప్పారావు ఉండగా, కూతురు ఎంతకీ బయటకు రావడం లేదేంటని గదిలోకి వెళ్లి చూశారు. ఫ్యానుకి వేలాడుతూ కనిపించడంతో వీరు నిశ్చేష్టులయ్యారు. స్థానికుల సహకారంతో ఆమెను బతికించుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మరణించింది. ఘోరం జరిగిపోయిందంటూ సోనీ తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగారు. కన్నీరుమున్నీరై విలపించారు. జరిగిన సంఘటనపై గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ తమ్మినాయుడు సిబ్బందితో విచారణ చేపట్టారు. సోనీ తల్లిదండ్రులను ఆరా తీశారు. తమకు ఎలాంటి అనుమానాలూ లేవని, కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోందని, కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సోనీ సున్నిత మనస్కురాలు అని స్ధానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. ఎస్ఐ తమ్మినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త ఊళ్లోలేని సమయంలో... అప్పారావు, కాలెమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. మూడో కుమార్తె సోనీ. ఆరునెలల క్రితమే శ్రీకాకుళం జిల్లా నర్సిపురం ప్రాంతానికి చెందిన సంజయ్‌కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. ప్రైవేటు సంస్థలో ఇంజినీరుగా పని చేస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి క్యాంపు వెళ్లే ముందు గోపాలపట్నంలోని యల్లపువానిపాలెంలో సోనీ కన్నవారి ఇంట్లో ఈ నెల12న దించి వెళ్లారు. ఆయన చిత్తూరు క్యాంపు వెళ్లారు. ఇంతలోనే సోనీ ఆత్మహత్యకు పాల్పడడంతో జరిగిన సంఘటన తెలిసి హుటాహుటిన నగరానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. -
కడుపులో కాయిన్లు, బ్లేడ్లు, సూదులు
ఫుడ్ పాయిజన్ అయితేనే కడుపు నొప్పితో గిలగిల గింజుకుంటాము.. అలాంటిది కడుపులో బ్లేడ్లు, సూదులు, గొలుసులు ఉంటే ఇక ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.. మధ్యప్రదేశ్‌లోని సంజయ్‌గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీ నిర్వహించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. వ్యక్తి కడుపు నుంచి ఏకంగా ఐదు కిలోల ఇనుప వస్తువులను బయటకు తీశారు. అందులో 263 కాయిన్లతోపాటు షేవింగ్ బ్లేడ్లు, సూదులు, గొలుసులు ఉన్నాయి. మహ్మద్ మసూక్ అనే వ్యక్తి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ గత నెల 18వ తేదీన ఆస్పత్రిలో చేరాడు. కడుపునొప్పికి కారణమేంటో తెలుసుకునేందుకు వైద్యులు రకరకాల పరీక్షలు నిర్వహించారు. దీంతో కడుపులో ఏవో వస్తువులున్నట్లు ఎక్స్‌రేలో గుర్తించారు. దీంతో శస్త్రచికిత్స చేసి, వాటిని బయటకు తీయాలని ప్రయత్నించిన వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కడుపులో 263 నాణేలు, పదుల సంఖ్యలో బ్లేడ్లు, ఐదారు గొలుసులు, సూదులను బయటకు తీశారు. ఇనుము, సంబంధిత లోహాల వస్తువులను బాధితుడు మింగినట్లు గుర్తించారు. రోగి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా మింగి ఉంటాడని చెప్పారు. అయితే ఇన్ని వస్తువులు కడుపులోకి చొప్పించుకున్నా బతకి బట్టకట్టడంతో ఈ విషయం తెలుసుకున్న అక్కడివారు ఇదెలా సాధ్యమబ్బా అని చెవులు కొరుక్కుంటున్నారు. -
యువకుడి కడుపులో అర కిలో రాళ్లు!
అయిజ: కడుపునొప్పితో బాధపడుతున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు అర కిలో రాళ్లను తొలగించారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండకు చెందిన తిప్పన్నమారెమ్మ కుమారుడు మధుబాబు (30) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. కొన్ని రోజులుగా మూత్రం సరిగా రాకపోవడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అయితే, కడుపు నొప్పి ఎక్కువ కాగా.. గ్రామస్తులు పలువురు విరాళాలు సేకరించి అయిజలోని సాయి శివ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ జనరల్ సర్జన్ బ్రహ్మారెడ్డి మంగళవారం శస్త్రచికిత్స చేసి మధుబాబు మూత్ర కోశంలో ఉన్న రాళ్లను తొలగించారు. ఫాస్ఫేట్ ఎక్కువ కావడంతో పదిహేనేళ్లుగా మధు కడుపులో రాళ్లు పెరుగుతూ వచ్చాయని డాక్టర్ బ్రహ్మారెడ్డి తెలిపారు.