పాట్నా: దేవాలయంలో దేవుని ప్రసాదం తిని 95 మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ సంఘటన బీహార్లోని దర్భంగా జిల్లాలోని భద్రపూర్ బ్లాక్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎప్పటిలాగే స్థానిక దేవాలయంలో దేవుడ్ని భక్తులు సందర్శించుకున్నారు. అనంతరం భక్తులకు దేవాలయ ప్రతినిధులు ప్రసాదం వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆ ప్రసాదం తిన్న భక్తులు వెంటనే కడుపులోనొప్పి అంటూ వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారు. దాంతో దేవాలయం యాజమాన్యం భక్తులను హుటాహుటిన దర్బంగా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. 95 మందిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని మిగిలిన వారి పరిస్థితి బాగానే ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. భద్రపూర్ రాష్ట్ర రాజధాని పాట్నాకు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనారోగ్యం పాలైన వారిలో మహిళలు, చిన్నారులు, వృద్దులు ఉన్నారని ఉన్నతాధికారి తెలిపారు.