ఠంచనుగా అదే టైమ్‌కు వాంతులు!
మెడిక్షనరీ
ఈ వాంతులు ఎందుకు అవుతాయో తెలియదు. కారణం ఏమిటో అర్థం కాదు. కాసేపు వాంతులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. లేదంటే వికారంగానైనా ఉంటుంది. అలా కొన్ని గంటలు గడిచాక... మళ్లీ అంతా హాయిగా ఉంటుంది. కానీ క్రమం తప్పకుండా రోజూ అదే టైమ్‌కు వాంతులు అవుతుంటాయి. క్రితం రోజు ఎంత సేపు అయ్యాయో, ఆ మర్నాడు సైతం అంతే సమయం పాటు అవుతాయి. అంతేకాదు... ఆ వాంతుల తీవ్రత కూడా అంతే సమానంగా ఉంటుంది.
ఇలాంటి చిత్రమైన లక్షణం ఉన్న జబ్బు పేరే... ‘సైక్లిక్ వామిటింగ్ సిండ్రోమ్’. సంక్షిప్తంగా సీవీఎస్ అంటారు. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ. కొందరు పెద్ద వయసు వారలోనూ కనిపిస్తుంది. సాధారణంగా ఈ ‘సీవీఎస్’తో పాటు కడుపునొప్పి, తలనొప్పి, మైగ్రేన్ కూడా కనిపించే అవకాశాలు ఎక్కువ. ఇదమిత్థంగా చికిత్స లేకపోయినా... అవసరాన్ని బట్టి శరీరంలో లవణాలు లోపిస్తే సెలైన్ పెట్టడం వంటివి చేస్తారు. ఈ జబ్బు ఉన్నవారికి జీవనశైలిలో మార్పులను సూచిస్తారు. వాంతులను, వికారాన్ని తగ్గించే మందులైన ‘యాంటీ-ఎమెటిక్’ డ్రగ్స్‌తో చికిత్స చేస్తారు.