నిర్మల్‌లోని గ్రిల్–9హోటల్‌లో ఘటన..
మధ్యప్రదేశ్ యువతి మృతి.. మరో 25 మందికి అస్వస్థత
నిర్మల్: మంచిబోజనం ఆరగిద్దామని హోటల్‌కి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఆ కస్టమర్స్. ఆహారం విషతుల్యం కావడంతో ఏకంగా ఒకరి ప్రాణంపోగా, 20 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్–9 హోటల్‌లో ఈనెల 2, 3 తేదీల్లో భోజనం చేసిన వారంతా ఆస్పత్రుల పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
యువతి మృతి..
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర క్రాస్‌రోడ్డు వద్ద గల సెయింట్ థామస్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ స్మితా జార్జ్, వైస్ ప్రిన్సిపాల్ దీపక్, ఉపాధ్యాయులు సోఫీ, ఫిజీ, వంటమనిషి ఫూల్‌కాలీబైగా (19) ఈనెల 2న షాపింగ్ కోసం నిర్మల్‌కు వచ్చారు. రాత్రి తిరిగి వెళ్తూ గ్రిల్–9 హోటల్‌లో రాత్రి భోజనం చేశారు. చికెన్–65, తందూరి చికెన్, చికెన్ ఫ్రైడ్‌రైస్ ఆరగించారు. అదేరోజు అర్ధరాత్రి నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి.
స్థానిక బోథ్ సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి ఫూల్‌కాలీబైగా మంగళవారం మృతిచెందింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఫూల్‌కాలీబైగా ఉపాధి నిమిత్తం సెయింట్ థామస్ స్కూల్‌లో వంటపని చేసేందుకు వచ్చింది. ప్రిన్సిపాల్ స్మితాజార్జ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోథ్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిర్మల్ పోలీసులకు పంపించారు.
25 మందికిపైగా..
గ్రిల్–9 హోటల్‌లో వండిన ఆహారం విషతుల్యం కావడం వల్లే భోజనం చేసినవారిలో పదుల సంఖ్యలో అస్వస్థతకు గురైనట్లు తేలింది. ఖానాపూర్‌కు చెందిన పదిమంది వరకు యువకులు ఈ హోటల్‌లో ఆరగించి వెళ్లగానే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు.
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మరో ఆరుగురు కుటుంబ సభ్యులు ఇక్కడి మండీ విభాగంలో చికెన్ ఆరగించడంతో వారూ బాధితులయ్యారు. బోథ్ స్కూల్ స్టాఫ్‌తో కలిసి దాదాపు 25 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలో గ్రిల్–9 హోటల్ పరిసరాలను ‘సాక్షి’పరిశీలించగా, ఏమాత్రం శుభ్రత, నాణ్యత పాటించడం లేదన్న విషయం స్పష్టమైంది.
హోటల్ వ్యర్థాలు, మురికినీరు అంతా వెనుకభాగంలో నిలిచి ఉంది. దీనిపై ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ ప్రత్యూషను ఫోన్‌లో వివరణ కోరగా, తాము సదరు హోటల్‌కు వెళ్లామని, తాళం వేసి యాజమాన్యం, వర్కర్లు పరారీలో ఉన్నారని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment