నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆస్పత్రిలో ఘటన
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు కాలం చెల్లిన మందులతో చికిత్స చేస్తున్నారు. శుక్రవారం ఓ రోగికి కాలం చెల్లిన సెలైన్ పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఎస్.కె.అజారుద్దీన్ జ్వరంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అతడిని అడ్మిట్ చేసుకుని వైద్యుల సూచన మేరకు అతడికి సెలైన్ పెట్టారు. అక్కడే ఉన్న అజారుద్దీన్ సోదరుడు ఆసిఫ్..సెలైన్ సరిగ్గా ఎక్కడం లేదని దానిని పరిశీలించగా ఎక్స్‌పైరీ డేట్ చూసి షాక్ అయ్యాడు.
ఈ ఏడాది మార్చితోనే సెలైన్ కాలపరిమితి ముగిసినట్లు గుర్తించిన వెంటనే అక్కడి వైద్యులు, సిబ్బందిని నిలదీశాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మీడియా ఆస్పత్రి ఆవరణలోని ఓ మెడిసిన్ ట్రాలీలోని మందులను పరిశీలించగా, మూడు వాయిల్స్ కాలం చెల్లినవి కనిపించాయి. అక్కడి నుంచి ఇంజెక్షన్ ఓపీకి వెళ్లి చూడగా అందులో సైతం ఓ వాయిల్ 3 నెలల ముందే గడువు ముగిసినట్లు కనిపించింది.
దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ వంశీ మాధవ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు. కాగా, ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం రాత్రి డీసీహెచ్ సురేశ్, డీఎంహెచ్‌వో రాజేందర్ సందర్శించారు. కాలంచెల్లిన మందులు వాడటంపై కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిని తని ఖీ చేసినట్లు తెలిపారు. అజారుద్దీన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment