Khanapur
-
ఎక్స్పైరీ సెలైన్ ఎక్కించేశారు!
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు కాలం చెల్లిన మందులతో చికిత్స చేస్తున్నారు. శుక్రవారం ఓ రోగికి కాలం చెల్లిన సెలైన్ పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఎస్.కె.అజారుద్దీన్ జ్వరంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అతడిని అడ్మిట్ చేసుకుని వైద్యుల సూచన మేరకు అతడికి సెలైన్ పెట్టారు. అక్కడే ఉన్న అజారుద్దీన్ సోదరుడు ఆసిఫ్..సెలైన్ సరిగ్గా ఎక్కడం లేదని దానిని పరిశీలించగా ఎక్స్పైరీ డేట్ చూసి షాక్ అయ్యాడు.ఈ ఏడాది మార్చితోనే సెలైన్ కాలపరిమితి ముగిసినట్లు గుర్తించిన వెంటనే అక్కడి వైద్యులు, సిబ్బందిని నిలదీశాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మీడియా ఆస్పత్రి ఆవరణలోని ఓ మెడిసిన్ ట్రాలీలోని మందులను పరిశీలించగా, మూడు వాయిల్స్ కాలం చెల్లినవి కనిపించాయి. అక్కడి నుంచి ఇంజెక్షన్ ఓపీకి వెళ్లి చూడగా అందులో సైతం ఓ వాయిల్ 3 నెలల ముందే గడువు ముగిసినట్లు కనిపించింది.దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ వంశీ మాధవ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు. కాగా, ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం రాత్రి డీసీహెచ్ సురేశ్, డీఎంహెచ్‌వో రాజేందర్ సందర్శించారు. కాలంచెల్లిన మందులు వాడటంపై కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిని తని ఖీ చేసినట్లు తెలిపారు. అజారుద్దీన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
తమ్ముడు మాట వినడం లేదని.. అన్న విషాదం!
ఆదిలాబాద్: మద్యానికి బానిసై తమ్ముడు ఏ పనిచేయడం లేదని, తన మాట వినడం లేదని మనస్తాపంతో అన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని మస్కాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై లింబాద్రి కథనం ప్రకారం.. పట్టణంలోని పద్మావతినగర్ కాలనీకి చెందిన లోనికి సత్తవ్వ, పెంటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.పెద్ద కుమారుడు శివకుమార్(33) మలేషియా వెళ్లి మూడు నెలల క్రితమే ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో కుటుంబీకులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాగా, తమ్ముడు రాకేశ్ ఇంటి వద్దే ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. పలుమార్లు అతన్ని హెచ్చరించినా మార్పురాలేదు. దీంతో శివకుమార్ మనస్తాపం చెంది శనివారం రాత్రి మస్కాపూర్ శివారులోని ఓ వేప చెట్టుకు తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
Snake bite: ఇంటి పామే కాటు వేసింది!
ఖానాపూర్: మండలంలోని గోసంపల్లెకు చెందిన అరుగుల గంగమ్మ (65)మంగళవారం పాముకాటుతో మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వృద్ధురాలు నివాసం ఉంటున్న ఇంట్లోనే పాముల పుట్ట ఉంది. పలుమార్లు పుట్టలోంచి బయటకు వచ్చిన పాము పరిసరాల్లో సంచరిస్తూ ఉండేది. సోమవారం ఇంటిని శుభ్రం చేసే క్రమంలో పుట్టవద్ద శుభ్రం చేస్తుండగా నాగుపాము బయటకు వచ్చి వృద్ధురాలిని కాటువేసింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి కుమార్తె రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. -
నిర్మల్ జిల్లాలో దారుణం.. ప్రియురాలి దారుణ హత్య
-
కేసీఆర్,కేటీఆర్‌కు ఉద్యోగాలివ్వకండి: ప్రియాంక గాంధీ
సాక్షి, ఖానాపూర్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మీరు మాత్రం కేసీఆర్,కేటీఆర్ కు ఉద్యోగాలు ఇవ్వకండని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ తెలంగాణ ప్రజలను కోరారు. ఖానాపూర్‌లో జరిగిన విజయభేరి సభలో ప్రియాంక ప్రసంగించారు.కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను లూఠీ చేశాడని ఫైర్ అయ్యారు. ‘అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. ధరణి పోర్టల్ లో అన్ని తప్పులున్నాయి. ఇలాంటి ధరణిని బంద్ చేసి మంచి కార్యక్రమం తీసుకువస్తాం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. బీజేపీ పెద్ద కంపెనీలతో దోస్తానీ చేసి దేశాన్ని నాశనం చేస్తోంది. పది సంవత్సరాల నుంచి తెలంగాణను కేసీఆర్ నాశనం చేస్తున్నాడు. మోదీ తెలంగాణకు వచ్చి కాళేశ్వరం గురించి మాట్లాడడు. ఇద్దరు ఒక్కటే. బీజేపీ, బీఆర్ఎస్ ఎంఐఎం మూడు పక్కపక్కనే ఉండి డ్రామాలాడుతున్నాయి. పవర్లోకి రాగానే రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇస్తాం. కర్ణాటక తరహాలో తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తాం. కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదు. ఇతర స్టేట్స్కు వెళ్లి పోటీచేసే ఎంఐఎం తెలంగాణలో 9 స్థానాల్లోనే ఎందుకు పోటీ చేస్తోంది. తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై కాంగ్రెస్‌కు ఒక విజన్ ఉంది. మోదీ సర్కార్ కార్పొరేట్లకు రుణమాఫీ చేస్తుంది తప్ప రైతుల గురించి పట్టించుకోదు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌ను పక్కాగా అమలు చేస్తుంది. ఇప్పటికే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాం. కాంగ్రెస్ విపక్ష నేతలే టార్గెట్‌గా ఈడీ, సీబీఐలతో మోదీ దాడులు చేయిస్తారు. ఇందిరాగాంధీ గిరిజనులు,ఆదివాసీల కోసం ఎంతో చేశారు. ఆమె చనిపోయి నలభై ఏళ్లయినా ప్రజలు ఇంకా ఆరాధిస్తూనే ఉన్నారు. గిరిజనులు, ఆదివాసీల కోసం ఇందిర ఎంతో చేశారు. ఇవాళ క్రికెట్ ప్రపంచ కప్ ఉంది భారత్ ప్రపంచ కప్ గెలవాలని అందరం కోరుకుందాం’అని ప్రియాంక అన్నారు. ఇదీచదవండి..బాబూ మోహన్‌కు తనయుడి షాక్ -
ఖానాపూర్‌లో విచిత్ర పరిస్థితి, ఎవరికి వారే యమునా తీరే!
అది ఒకప్పుడు గోండు రాజుల రాజ్యం. ఆ రాజ్యంలో పాలన సాగించారు. కోటలను నిర్మించారు. మళ్లీ ఆ రాజ్యం కోసమే గోండులు ఎన్నికల యుద్దానికి సై అంటున్నారు. లంబడాలతో పోరుకు సిద్దమవుతున్నారు. అదివాసీ, లంబడాల మధ్య పోరులో విజయం ఏవరిని వరిస్తుందా? ఖానాపూర్ అదివాసీల వశం అవుతుందా? ఖానాపూర్‌లో గోండు రాజులు వర్సేస్ లంబడాల మధ్య ఎన్నికల యుద్దంపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంగా గోండు రాజులు పాలనా సాగించారు. తెలంగాణ నుండి మహరాష్ట్ర వరకు రాజ్యాన్ని విస్తరించారు. ఉట్నూరు కేంద్రంగా పాలన సాగించిన చరిత్ర ఉన్నా నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గం నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో విస్తరించి ఉంది. ఎస్టీ రిజర్వుడ్‌గా ఉన్న ఈ నియోజకవర్గంలో ఉట్నూర్, ఇంధ్రవేల్లి, ఖానాపూర్, కడెం,పెంబి, దస్తురాబాద్, జన్నారం మండలాలున్నాయి. ఇక్కడ 2,05,753 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో అదివాసీ, లంబడా, బిసీ, ఎస్సీ ,మైనారిటీ సామాజిక వర్గాల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ రేఖానాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా ఈ సారి భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కి అధిష్టానం టికెట్ కట్టబెట్టింది. ఈ క్రమంలో రేఖానాయక్ అసంతృప్తితో పార్టీ మారతానని ప్రకటించడం ఇక్కడి రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఖానాపూర్ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి బీఅర్ఎస్ ఎమ్మెల్యేగా రేఖానాయక్ 2014, 2018 ఎన్నికలలో విజయం సాధించారు. 2018 ఎన్నికలలో 67,138 ఓట్లతో 44శాతం ఓట్లు సాధించారు. అదేవిధంగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ 46,428 ఓట్లతో 15% ఓట్లు సాధించారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్‌పై రేఖానాయక్ 20,710 ఓట్లతో విజయం సాధించారు. రెండుసార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖనాయక్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. నియోజకవర్గంలో సాగునీరు సదర్ మఠ్ బ్యారేజి నిర్మాణం పనులు చేపట్టారు. ఇంకా పనులు కోనసాగుతున్నాయి. అదేవిధంగా ఉట్నూరులో ఆసుపత్రిని ముప్పై పడకల నుండి వందల పడకలకు పెంచేలా చర్యలు చేపట్టారు. అదే విధంగా కోన్ని ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు మేరుగుపరిచారు. కడెం మండలం గంగాపూర్ వాసులు కడెం వాగును దాటడానికి వంతేన పనులు ప్రారంభించారు. అయితే రెండు సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలుపోందిన చేసిన అభివృద్ధి పనులు అంతంత మాత్రమే. సదర్ మఠ్ ప్రాజెక్ట్ ఖానాపూర్ నియోజకవర్గానికి సాగునీరు అందించడంలో స్థానికంగా నాగర్జున సాగర్ రైతులు భావిస్తున్నారు. ఇది గోదావరిపై అప్పటి నిజామ్ సర్కారు ఖానాపూర్ మండలంలొని మ్యాడమ్పల్లిలో నిర్మించారు. ఆనకట్ట ద్వారా నీటిని నిల్వ చేసి కాల్వ ద్వారా ఖానాపూర్, కడెం మండలాల ఆయకట్టుకు సాగు నీరిందిస్తున్నారు. అలాంటి సదర్ మఠ్‌ను అదే ప్రాంతంలో నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా ఆనకట్ట నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అదే పనుల ప్రారంభం కోసం ఖానాపూర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలం పోన్కల్ ప్రాంతంలో సదర్ మఠ్ నిర్మిస్తున్నారు. చివరి దశకు పనులు చేరుకున్నాయి. ఇక్కడి నుండి జగిత్యాల మల్లాపూర్ మండలంలో పంటపోలాలకు సాగునీటిని అందించనున్నారు. పైనా ఆనకట్ట నిర్మించడం వల్ల పాత సదర్ మఠ్ ఆయకట్టు ఖానాపూర్, కడేం మండలాల ఆయకట్టు ఏడారిగా మారుతుందని రైతులు అందోళన చెందుతుమ్నారు. ఎగువ ప్రాంతంలో ఆనకట్ట నిర్మించడం వల్ల పాత సదర్ మఠ్ ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఆయకట్టు క్రింద ఒకప్పుడు రెండు పంటలు పండేవి. కానీ, ఇప్పడు ఒక్కోసారి పంటలు కూడా పండటం లేదు. గోదావరి నీళ్లు మళ్లీంచడంపై రైతులు మండిపడుతున్నారు. కొత్త సదర్ మఠ్ నుండి పాత సదర్ మఠ్ ఆయకట్ట అయినా ఖానాపూర్, కడెం ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా కాల్వను ఏర్పాటు చేయాలని రైతులు ఉద్యమిస్తున్నారు. సదర్ మఠ్ తరలిపోవడానికి ఎమ్మెల్యే రేఖ నాయక్ కారణమని ఆమెపై మండిపడుతున్నారు. సదర్ మఠ్ తరలిపోయినా ఎమ్మెల్యే పట్టించుకోలేదంటున్నారు రైతులు. ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా నియోజకవర్గంలో చాలా అదివాసీ గూడాలున్నాయి. గూడాలకు రోడ్లు లేవు. అదేవిధంగా త్రాగునీరు కూడా లేదు. ఈ ప్రాంతాలలో రోగం వస్తే అదివాసీలకు దేవుడే దిక్కు అన్నట్టుగా మారింది. అంతేకాదు అదివాసీలు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు హక్కు పత్రాలు పంపిణీ చేశారు. కానీ అందరికి రాలేదు. తమ సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే వైఫల్యంపై అదివాసీలు అసంతృప్తితో ఉన్నారు. సమస్యలన్ని ఒక ఎత్తయితే నియోజకవర్గంలో అర్ఎస్ టాక్స్ సంచలనంగా మారిందట. దీనిని స్థానికులు రేఖనాయక్ సర్వీస్ టాక్స్ పిలుస్తారని ప్రజల్లో ప్రచారం ఉంది. ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలన్నా, అభివృద్ధి ముందుకు జరగాలన్నా ఆర్ఎస్ టాక్స్ ఎమ్మెల్యే వసూలు చేస్తారని ప్రచారం ఉంది. దళితబంధుకు యూనిట్ రెండు లక్షలు ముట్టజెప్పితే తప్ప పథకం మంజూరు కావడం లేదట.రేఖనాయక్‌కు ఆర్ఎస్ టాక్స్ చెల్లిస్తేనే ఫథకాలు దక్కుతాయట. లేదంటే అంతే సంగతులట. ఇవన్ని అనుచరుల ద్వారా ఎమ్మెల్యే వసూలు చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు రేఖనాయక్ విమర్శలు సందిస్తున్నాయట. సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి పథకాలైనా రోడ్లు, చెక్ డ్యామ్‌లు, భవనాలు, పనులేవైనా వదలడం లేదట. లేదంటే పనులు అడుగు ముందుకు కదలవని ప్రచారం ఉంది. అభివృద్ధి సంక్షేమ, పథకాలతో అప్రతిష్టను మూటగట్టుకున్నా ఎమ్మెల్యేకు పార్టీలో అసంతృప్తి తలనోప్పిగా మారిందట. ప్రజల్లో రేఖనాయక్‌కు వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుండి మాజీ ఎంపి రమేష్ రాథోడ్, హరినాయక్, పెంబి జడ్పీటీసీ జానుబాయి టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుండి ఎడ్మా బోజ్జు, ఉట్నూరు జడ్పీటీసీ చారులత పోటీపడుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపి రమేష్ రాథోడ్ గ్రామాల్లో ప్రజలను కలుస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజల నుండి మంచి స్పందన లబిస్తోంది. కానీ రమేష్ రాథోడ్ లంబడా సామాజిక వర్గానికి చెందిన వారు. రమేష్ రాథోడ్‌పై అదివాసీ సామాజికవర్గం వ్యతిరేకంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో అదివాసీలు ఓట్లు వేయలేదు. దీనికి తోడు రమేష్ రాథోకు మైనారీటీ ఓట్ల భయం ఉంది. గతంలో అండగా ఉన్న మైనారీటీలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఓట్లు వేస్తారా లేదా అనేది భయం పట్టిపీడిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు ఎడ్మాబోజ్జు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తానే అభ్యర్థినని రాబోయే ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అదివాసీ అభ్యర్థిగా తనకు అనుకూలంగా మారుతుందని ఎడ్మాబోజ్జు అంచనా వేసుకుంటున్నారు. నియోజకవర్గంలో అదివాసీలంత అండగా నిలబడితే తన విజయం ఖాయమని భావిస్తున్నారు బోజ్జు. బొజ్జుకు వ్యతిరేకంగా టిక్కెట్ దక్కించుకోవాలని ఉట్నూరు జడ్పీటీసీ చారులత భావిస్తున్నారు. కానీ గత జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ జడ్పీటీసీగా ఎన్నికై బీఆర్ఎస్ ఓటు వేశారు. అయితే అమ్ముడుపోయే అభ్యర్థిగా చారులతకు ముద్ర ఉండటంతో ఆమెకు టిక్కెట్ దక్కదని బోజ్జు కోట్టిపారేస్తున్నారు. ఫైనల్‌గా ఎవరికి వారే తమకు విజయం దక్కుతుందంటూ, తమదే సీటు అంటున్నారు. బీజేపీ రమేష్ రాథోడ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అదే విధంగా 2019 ఎన్నికలలో ఓటమి సానుభూతి ఉందని ఈసారి గెలిచి తీరుతామంటున్నారు. ఇక కాంగ్రెస్ నాయకుడు అదివాసీ అస్త్రంతో తనదే విజయమంటున్నారు. కాంగ్రెస్ నాయకుడు బోజ్జు మరి ఈ ముగ్గురిలో ప్రజలు ఏవరిని గెలిపిస్తారో చూడాలి. -
ఎమ్మెల్సీ కవితను కలిసిన జాన్సన్‌నాయక్
ఖానాపూర్: బీఆర్ఎస్ ఖానాపూర్ అభ్యర్థిగా ఎంపిక అనంతరం బుక్యా జాన్సన్‌నాయక్ ఇప్పటికే జిల్లా మంత్రి ఐకేరెడ్డితో పాటు జి ల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులను రా ష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి పు ష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తె లిపారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్యే టికె ట్ను కేటాయించిన సీఎం కేసీఆర్‌తో పా టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జాన్సన్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన అనిల్ జాదవ్ నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని బోథ్ ని యోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా మంత్రిని శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. -
ఖానాపూర్‌లో నా సత్తా ఏంటో చూపిస్తా: రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించింది. అసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చింది. ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ అసంతృప్తి నేతలపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని నేతలతో చర్చలు జరుపుతోంది. సాయంత్రం కాంగ్రెస్‌లోకి? ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ రావడంతో ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. కాంగ్రెస్‌లో చేరాలని ఆమె నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ కానున్నారు. సాయంత్రం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని.. పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఖానాపూర్ క్యాడర్ తనతోనే ఉందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే నిర్ణయం ఏదైనా అనుచరులతో కలిసి నిర్ణయం తీసుకుంటానని రేఖా నాయక్ పేర్కొన్నారు. ఖానాపూర్‌లో నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పారు. త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. కాగా ఇప్పటికే రేఖా నాయక్ భర్త, మాజీ రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్ సోమవారం రాత్రే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన ఆసిఫాబాద్ స్థానం నుంచి రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలోనే రేఖా నాయక్‌ను కూడా కాంగ్రెస్‌లో చేర్చుకొని ఖానాపూర్ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆయన కూడా అసంతృప్తితోనే కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బోథ్, ఆసిఫాబాద్ స్థానాలకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ పార్లమెంటు సీటు ఇస్తామని చెప్పినా.. ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. సక్కు గత ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి గెలిచి వెంటనే బీఆర్ఎస్లో చేరారు. ఇలావుండగా బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌కు కూడా ఈసారి బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. చదవండి: కేసీఆర్ వ్యూహం.. ఇది ప్రత్యర్దులకు రాజకీయ సవాల్ -
నీ సంగతి చూస్తా..
కడెం(ఖానాపూర్): కలెక్టర్ వరుణ్‌రెడ్డి, గ్రామస్తుల సమక్షంలో ఎమ్మెల్యే రేఖానాయక్..సర్పంచ్ నరేందర్‌రెడ్డి నువ్వెంత.. అంటే నువ్వెంత.. అని గొడవకు దిగారు. మంగళవారం మండల కేంద్రంతో పాటుగా కన్నాపూర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల గ్రామసభలో ఎమ్మెల్యే రేఖా నాయక్ స్థానిక సర్పంచ్(బీఆర్ఎస్ పార్టీ) నరేందర్‌రెడ్డి పేరును ప్రస్తావించలేదు. దీంతో సర్పంచ్ నా ఊరికి వచ్చి నా పేరు ప్రస్తావించకుండా ఎలా మాట్లాడుతున్నావ్ అని ఎమ్మెల్యేను నిలదీశాడు. దీంతో ఆవేశానికి లోనైనా ఎమ్మెల్యే రేఖానాయక్ నేను నియోజవర్గానికి ఎమ్మెల్యేను..నీ పేరు చెప్పలేదు కావచ్చు అయితే ఏంది.. నేను ఎస్టీ మహిళ అని నువ్వు రెచ్చిపోతున్నావ్..రేపు నీ సంగతి చూస్తా.. అని సర్పంచ్‌ను బెదిరింపులకు గురిచేసింది. -
నువ్వు ఏం చేస్తవ్ నన్ను? సర్పంచ్‌పై ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రతాపం
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక వివాదస్పదంగా మారింది. కడెం మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం మంగళవారం ఖన్నపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, గ్రామ సర్పంచ్‌తో సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ.. వేదిపై ఉన్న వారి పేర్లు చెబుతూ సర్పంచ్ పేరు పలకడం మర్చిపోయారు. ఈ విషయాన్ని గమనించిన సర్పంచ్ నరేందర్ రెడ్డి తన పేరు ప్రస్తావించలేదని ఎమ్మెల్యేకు తెలిపారు. సర్పంచ్ పేరు చెప్పకుండా ప్రోటోకాల్‌న ఉల్లంఘించారని అన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సర్పంచ్ సీరియస్‌గా స్పందించారు. రేపు నీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎమ్మెల్యే మాటలకు బయపడని సర్పంచ్.. మీరు నన్నేం చేస్తారు మేడం, ఏం చేస్తారో చేసుకోండని అని బదులిచ్చారు. దీంతో సర్పంచ్‌పై ఎమ్మెల్యే తన ప్రతాపం చూపించారు. నువ్వు నన్నేం చేస్తావ్?. ఎస్టీ మహిళ అని మాట్లాడుతున్నావా. ఒక ఎమ్మెల్యే కలెక్టర్‌ను తీసుకొస్తే.. ఇది నా ఊరు అని ఎలా అంటావ్. మా పార్టీ తరపునే మీ ఊరు డెవలప్ అవుతుంది. మా పార్టీ వల్లే రోడ్లు, ఇళ్లు వచ్చాయి’ అని సర్పంచ్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై సర్పంచర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తన పేరు పలకలేదని అడిగినందుకు ఎమ్మెల్యే దుర్బాషాలాడారని అన్నారు. ప్రోటోకాల్ పాటించలేదని చెప్పినందుకు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పక్షాల సర్పంచ్‌లపై రేఖనాయక్ చిన్న చూపు చూస్తుందనడానికి ఇదొక నిదర్శనమని అన్నారు. -
గంగాపూర్ గ్రామానికి తెప్పలపై వెళ్లిన ఎమ్మెల్యే రేఖా నాయక్
-
పెళ్లి బంధంతో ఒక్కటైన మూగ జంట
ఖానాపూర్: మండలంలోని గోడలపంపు గ్రామానికి చెందిన మూగజంటకు గురువారం వివాహం జరిగింది. గ్రామానికి చెందిన ఆమంద లక్ష్మి–సుదర్శన్ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు సుకృత్(మూగ)కు నిజామాబాద్ జిల్లా రేంజర్ల మండలం ఈరన్నగుట్టకు చెందిన లాస్య(మూగ)తో పట్టణంలోని జేకే ఫంక్షన్హాల్లో సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. ఈ వివాహానికి పలు జిల్లాల నుంచి మూగ యువతీ, యువకులు హాజరై దంపతులను ఆశీర్వదించారు. చదవండి: (రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి) -
Telangana: ఆకాశంలో అద్భుతం
ఖానాపూర్: ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. సోమవారం ఉదయం కొన్ని గంటలపాటు సూర్యుడి చుట్టు ఇంద్రధనుస్సు తరహాలో వలయాన్ని ఏర్పడింది. జిల్లా ప్రజలు పలువురు వీక్షించారు. కొందరు కళ్లద్దాల్లో, మరికొందరు సెల్ఫోన్లలో సూర్యుడి ఫొటో, వీడియోల్లో చిత్రీకరించారు. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. వాతావరణంలో నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడంతో ఈ తరహా వలయాలు ఏర్పడుతాయని మస్కాపూర్ ప్రభుత్వ పాఠశాల సైన్స్ టీచర్ జాడి శ్రీనివాస్ తెలిపారు. దీన్ని కెలడోస్కోప్ ఎఫెక్ట్ అంటారని పేర్కొన్నారు. చదవండి: (టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్ఆర్టీసీకి రాబడి) -
వరంగల్ జిల్లా: చెరువు కట్టపై నుంచి ట్రాక్టర్ బోల్తా
-
వరంగల్: చెరువు కట్ట నుంచి ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురి దుర్మరణం
సాక్షి, వరంగల్: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఖానాపూర్ మండలం అశోక్ నగర్ దగ్గర చెరువు కట్టపై నుంచి కొంతమందితో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందడంతో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. పెళ్లి సామాగ్రి కోసం వాళ్లంతా నర్సంపేట ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రుల్ని నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు గుగులోతు సీతమ్మ(32), జాట్టోతు బిచ్య(45), గుగులోత్ స్వామి(55),గోవింద్(35) గూగులోతు శాంతమ్మ(45)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు అదనపు సమాచారం అందించాల్సి ఉంది. -
పోలీసులు కొట్టారని.. పెళ్లి బృందం పోలీస్ స్టేషన్ ముట్టడి
సాక్షి,(ఖానాపూర్)ఆదిలాబాద్: పోలీసులు కొట్టారని పెండ్లి బృందం పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన సంఘటన పెంబి మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పెళ్లి కుటుంబం వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బడుగు కళ్యాణ్‌యాదవ్ వివాహ వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పెండ్లి కుమారుడు తన ఇంటి వద్ద డీజేతో డ్యాన్స్ చేస్తున్నాడు. రాత్రి 11గంటలకు ఎస్సై మహేశ్ అక్కడికి చేరుకుని డ్యాన్స్ చేస్తున్న మహిళలు, చిన్నారులను కూడా చూడకుండా లాఠీతో కొట్టాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన పెళ్లి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సుమారు మూడు గంటలపాటు ఆందోళన కొనసాగించారు. సీఐ అజయ్‌బాబు, ఖానాపూర్, కడెం ఎస్సైలు రజనీకాంత్, రాజు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఈ విషయమై ఎస్సై మహేశ్‌ను వివరణ కోరగా.. డీజేకు అనుమతి లేదని చెప్పినా వినలేదని, లాఠీ తీయగానే తొక్కిసలాటలో కొందరికి గాయాలయ్యాయని చెప్పారు. మద్యం మత్తులో ఉన్న వారే తనవెంట ఉన్న సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. స్టేషన్లో కిటికీల అద్దాలు పగలగొట్టిన వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. పోలీసులపై దాడిచేసిన వారిపై చర్యలు ఖానాపూర్: పెంబిలో బుధవారం రాత్రి బి.కళ్యాణ్ వివాహ వేడుకలో అనుమతి లేకుండా డీజే నిర్వహిస్తుండగా.. ఆపేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బందిపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టామని సీఐ అజయ్‌బాబు తెలిపారు. పట్టణంలో గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. డీజే విషయమై ఏఎస్సై గంగారెడ్డి, కానిస్టేబుల్ సంతో«ష్ అక్కడికి వెళ్లారు. ఇందులో సంతోష్‌పై పలువురు దాడిచేయడంతో గాయాలయ్యాయి. కానిస్టేబుల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఎస్సైని సైతం ఘెరావ్ చేశారన్నారు. ఈ విషయమై నిందితులతో పాటు డీజే నిర్వాహకులపై కేసులు నమోదు చేశామన్నారు -
Sakshi Malik: 60 లక్షలకుపైగా సబ్స్క్రైబర్స్.. ఇంతకీ ఆమె ఏం చేస్తుంది?
ప్రతికూల పరిస్థితుల్లోనూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగేవారు కొందరైతే, తమ అభిరుచులను కెరియర్‌గా మలుచుకుని ఉన్నత స్థాయికి చేరి స్ఫూర్తిగా నిలుస్తుంటారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే ప్రముఖ మోడల్ సాక్షి మాలిక్. సాంకేతిక విద్యనభ్యసించి, కార్పొరేట్ ఉద్యోగం చేసే అవకాశం ఉన్నప్పటికీ తనకిష్టమైన ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టి మంచి మోడల్‌గా రాణిస్తోంది. తన శరీర ఆకతిని ఫిట్‌గా ఉంచుకోవడమేగాక, అందంగా ఫిట్‌గా ఉండేందుకు ఏం చేయాలో చెబుతూ లక్షలాది వీక్షకులను ఆకట్టుకోవడమేగాక, తన ప్రతిభతో ఫ్యాషన్ , బ్యూటీ, లైఫ్‌స్టైల్ ఇన్ ఫ్లుయెన్సర్‌గా రాణిస్తూ ఎందరికో ప్రేరణగా నిలుస్తోంది. ఖాన్పూర్లోని మధ్యతరగతి కుటుంబంలో సాక్షి పుట్టింది. ఈమెకు ఒక సోదరి కూడా ఉంది. స్కూలు చదువు పూర్తయ్యాక ఉన్నతవిద్యకోసం న్యూఢిల్లీ వెళ్లింది. అక్కడే బీటెక్ పూర్తిచేసింది. చిన్నప్పటినుంచి మోడలింగ్ అంటే బాగా ఇష్టం. దీంతో స్కూలు, కాలేజీలలో జరిగే వివిధ రకాల ఫ్యాషన్ షోలలో చురుకుగా పాల్గొంటుండేది. బీటెక్ అయ్యాక ఎమ్బీఏ చేద్దామనుకున్నప్పటికీ.. ఫ్యాషన్ పై ఉన్న ఇష్టాన్ని వదులుకోలేక ముంబై వెళ్లి మోడల్‌గా ప్రయత్నాలు ప్రారంభించింది. ఆకర్షణీయమైన రూపం, మెరిసిపోయే మేనిఛాయ, తీరైన ఆకృతితో మోడలింగ్ ఏజెన్సీలను సంప్రదించింది. సాక్షి రూపం నచ్చిన వారంతా మోడలింగ్ చేసేందుకు అవకాశాలు ఇవ్వడంతో వాణిజ్య ప్రకటనలు, సౌందర్య ఉత్పత్తుల యాడ్స్‌లో నటించింది. వీటిలో నైకా, పీసీ జ్యూవెలర్స్, ఫ్రెష్బుక్, అడిడాస్, ఫేసెస్ కెనడా వంటి ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. హిందీ, పంజాబీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే సాక్షి ఆయా భాషల్లో మోడల్‌గా విజయవంతంగా రాణిస్తోంది. సోనుకీ టిటు.. యాడ్స్‌లో మంచి గుర్తింపు వచ్చిన తరువాత మ్యూజిక్ వీడియోలలో నటించడం మొదలు పెట్టింది సాక్షి. దీనిలో భాగంగానే పంజాబీ మ్యూజిక్ వీడియో ‘కుడియే స్నాప్‌చాట్ వాలియే’ నటించింది. ఈ పాటకు ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీని తరువాత 2018లో విడుదలైన బాలీవుడ్ సినిమా ‘‘సోను కీ టిటు కీ స్వీటీ’లో ‘బమ్ డిగి డిగి బమ్ బమ్’ పాటలో నటించింది. దీంతో ద్వారా సాక్షి మరింత పాపులర్ అయ్యింది. ఈ ఏడాది ఎమ్టీవీలో ప్రసారమైన ప్రముఖ డేటింగ్ షో స్ప్లిట్స్ విల్లా13 లో ప్రముఖులతో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. అంతేగాక బిగ్‌బాస్ ఫేమ్ అసిమ్ రియాజ్‌తో కలిసి ‘విహం’ పాటలో నటించింది. ఈ పాట కూడా సాక్షికి మంచి పేరు తీసుకువచ్చింది. అనేక పంజాబీ మ్యూజిక్ వీడియోలలో నటించడంతో సోషల్ మీడియాలో సాక్షికి మంచి గుర్తింపు వచ్చింది. ఫిట్నెస్ ఫ్రీక్.. మ్యూజిక్ వీడియోలు, సినిమాలతోపాటు సాక్షి తన సొంత యూట్యూబ్ చానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యాక్టివ్‌గా ఉంటూ సోషల్ మీడియా మోడల్ క్వీన్ గానూ పాపులర్ అయ్యింది. అందమైన శరీర ఆకృతిని కాపాడుకునేందుకు జిమ్‌లో ఎటువంటి కసరత్తులు చేస్తుంది? తనలా ఫిట్‌గా అందంగా ఉండేందుకు ఏమేం తినాలి? ఎటువంటి వర్క్‌వుట్స్ చేయాలి... వంటి విషయాలను తన యూట్యూబ్ చానల్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్‌కు చెబుతుంటుంది సాక్షి. ఆమెకు యూ ట్యూబ్‌లో యాభైవేలు, ఇన్‌స్టాగ్రామ్‌లో అరవై లక్షలకుపైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందమైన రూపం... అంతకు మించిన ఆత్మవిశ్వాసంతో మంచి నటిగా రాణిస్తూ, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ గా... మోడల్‌గా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రతిభ, కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా గుర్తింపు తెచ్చుకోవచ్చని ఎందరికో సాక్షి మాలిక్ ఉదాహరణగా నిలుస్తోంది. చదవండి: Nalini Jameela: అందుకే ‘పడుపు వృత్తి’లోకి.. కానీ ఇప్పుడు ఆమె.. Padmini Govind: అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి బెంగుళూరుకు వచ్చి.. -
పొదల చాటున సంతాన వృద్ధి
జన్నారం (ఖానాపూర్): కవ్వాల్ టైగర్ జోన్లో అటవీశాఖ అధికారులు చేపట్టిన గడ్డి క్షేత్రాల పెంపకం సత్ఫాలితాలను ఇస్తోంది. గడ్డి మైదానాల పెంపకంతో రెండేళ్లలో టైగర్‌జోన్ పరిధి లో 40శాతం శాఖాహార జంతువులు పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పులికి సమృద్ధిగా ఆహారం అందుబాటులో ఉంటుందని వారు భావిస్తున్నారు. అడవిలో వన్యప్రాణుల జనాభా వాటి ఆవాస ప్రాంతాల్లో విస్తరించి ఉన్న గడ్డి ప్రాంతాలపై ఆధారపడి ఉంటుంది. శాఖాహార జంతువులు అధికంగా ఉంటే వాటిపై ఆధారపడిన మాంసాహార జంతువుల జనాభా కూడా పెరుగుతోంది. చదవండి: బంగారు చేప.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు 2018లో ప్రారంభం.. కవ్వాల్ టైగర్ జోన్ 893 హెక్టర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించింది. అప్పటి నుంచి అడపాదడపా పులులు రాకపోకలు సాగిస్తున్నా.. స్థానికంగా స్థిర నివాసం ఏర్పర్చుకున్న దాఖలాలు లేవు. జీవావరణ వ్యవస్థలో గడ్డి జాతుల ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఆహారపు గొలుసులో మొక్కలు ప్రథమ ఉత్పత్తి దారులుగా నిలుస్తాయి. వీటిపై జింకలు, దుప్పులు, సాంబర్లు, నీలుగాయిలు, కొండగొర్రెలు, అడవి దున్నలు, ఇతర వన్యప్రాణులు ఆధారపడి ఉంటాయి. శాఖాహార జంతువులపై ఆధారపడి పెద్ద పులులు, చిరుతలు, నక్కలు, అటవీ కుక్కలు, తోడేళ్లు తదితర జంతువులు మనుగడ సాగిస్తాయి. పులులకు స్థానికంగా తగినంత ఆహారాన్ని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో కవ్వాల్ టైగర్ జోన్లో గడ్డి క్షేత్రాల పెంపకానికి అధికారులు శ్రీకారం చుట్టారు. 2018 సంవత్సరంలో మహారాష్ట్రకు చెందిన గడ్డి క్షేత్రాల నిపుణుడు డాక్టర్ జీడీ మురత్కర్ జన్నారం డివిజన్లోని టీడీసీ టైగర్‌జోన్‌లో అటవీశాఖ అధికారులకు గడ్డి పెంపకంపై శిక్షణ ఇచ్చారు. సహజ గడ్డి క్షేత్రాలు, విత్తనాల సేకరణ, ముళ్ల కంచెల తొలగింపు, కలుపుమొక్కల నివారణ, గడ్డి విత్తనాల నిల్వ, సస్యరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదే ఏడాది 600 ఎకరాల్లో గడ్డి మైదానాల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఏటా పెంపకం.. శిక్షణ అనంతరం గడ్డి క్షేత్రాల పెంపకంలో స్థానిక అధికారులు చురుగ్గా పనిచేయడంతో దేశంలోని టైగర్‌జోన్‌లో కవ్వాల్జోన్కు మంచిపేరు వచ్చింది. 2018 సంవత్సరంలో 600 ఎకరాల్లో గడ్డి మైదానాలు పెంచగా.. 2019లో 130 హెక్టర్లలో, 2020లో 200 హెక్టార్లలో, ఈ ఏడాది మరో 180 హెక్టార్లలో గడ్డి మైదానాల పెంపకంపై దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాలలో గడ్డి విత్తనాలను చల్లి సహజసిద్ధంగా గడ్డిని పెంచుతున్నారు. మరికొన్ని ప్రాంతాలలో సహజసిద్ధంగా మొలిచిన గడ్డి చుట్టూ కంచె వేసి, కలుపు తొలగిస్తారు. అడవిలోని వన్యప్రాణులకు ఆహారం, నీరు ఒకచోట అందుబాటులో ఉండేవిధంగా అధికారులు చొరవ తీసుకుంటున్నారు. నీటి కుంట ఉన్న ప్రాంతంలోనే గడ్డి పెంపకం చేపడితే వన్యప్రాణులు అహారం తిని అక్కడే నీరు తాగి సేదదీరేందుకు వీలుంటుందని వారు భావిస్తున్నారు. పెరుగుతున్న శాఖాహారులు.. గడ్డి క్షేత్రాల పెంపకంతో రెండేళ్లుగా శాఖాహార జంతువుల సంఖ్య 40 శాతం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పెరుగుదల ఇదేవిధంగా ఉంటే పది పులులకు సరిపడా ఆహారం స్థానికంగా లభిస్తుందని వారు అంటున్నారు. ప్రస్తుతానికి రెండు పులులు కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌లోకి రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే స్థానికంగా దట్టమైన అడవులు, సరిపడా శాఖాహార జంతువులు ఉన్నా పులులు స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. తిప్పేశ్వర్, తాడోబా టైగర్‌జోన్‌ల నుంచి కూడా పులుల రాకపోకలు ఉన్నాయి. దట్టమైన అటవీప్రాంతం, గడ్డి మైదానాలు, వేటాడేందుకు సరిపడా వన్యప్రాణుల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. అటవీ ప్రాంతంలో అలికిడిని తగ్గించి పులులు స్థానికంగా ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు ఈ ప్రాంతాన్ని అధికారులు తీర్చిదిద్దుతున్నారు. విరివిగా గడ్డి మైదానాలు 2018 నుంచి గడ్డి క్షేత్రాలను విరివిగా పెంచుతున్నాం. గతేడాది 200 హెక్టర్లలో గడ్డి మైదానాలు పెంచాం. దాని నిర్వహణ చూస్తూనే ఈ ఏడాది మరో 180 హెక్టార్లలో గడ్డిక్షేత్రాలను విస్తరిస్తున్నాం. కచ్చితమైన సంఖ్య తెలియకున్నా.. డివిజన్ పరిధిలో వన్యప్రాణుల సంతతి పెరుగుతోంది. రాత్రిపూట అడవి గుండా రాకపోకలు నిషేధించాం. వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. - మాధవరావు, డివిజన్ ఫారెస్టు అధికారి -
కాటేసిన అప్పులు: తెలంగాణలో ఇద్దరు రైతులు బలవన్మరణం
అప్పుల భారం తాళలేక సాగు చేసే రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కష్టపడి పండించగా దిగుబడి రాక, మార్కెట్లో ధర పలకకపోవడంతో ఆ రైతులు తమ ప్రాణాలను తీసుకున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక తమను తాము బలి తీసుకున్నారు. పొలంలో పురుగుల నియంత్రణకు వాడాల్సిన మందు వారిద్దరూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబాన్ని పోషించలేక... అప్పులు తీర్చలేక తనువు చాలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకేరోజు ఇద్దరూ రైతులు ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది. తానూరు (ముధోల్): మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడం, చేసిన అప్పులు తీరే దారి కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైన యువరైతు అశోక్ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజన్న తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బెంబర గ్రామానికి చెందిన చుక్కబొట్ల అశోక్ తనకున్న రెండెకరాలతోపాటు మరో ఎకరం భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. బ్యాంకు రుణాలతోపాటు ప్రైవేట్‌గా తీసుకున్న అప్పులు సుమారు రూ.3 లక్షల వరకు ఉన్నాయి. అప్పులు తీరడం లేదని మనస్తాపానికి గురైన అశోక్ మంగళవారం మధ్యాహ్నం పశువుల పాకలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భైంసా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య రాధిక, కుమారులు అభిరాం, మణికంఠ ఉన్నారు. అశోక్ తండ్రి భుజంగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు మరో ఘటన పెంబి (ఖానాపూర్): అప్పుల బాధతో పురుగుల మందు తాగిన మండలంలోని రాయదారి గ్రామానికి చెందిన రైతు రాథోడ్ బాబుసింగ్ (35) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. రాథోడ్ బాబుసింగ్ పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలు సాగుచేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తిపంట పూర్తిగా దెబ్బతినగా.. మొక్కజొన్ని పంట సైతం అడవి పందుల దాడిలో ధ్వంసమైంది. దీంతో అప్పు చేసి పెట్టిన పెట్టుబడులు కూడా రావేమోనని ఆందోళన చెందిన బాబుసింగ్ శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సోమవారం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. చదవండి: రాజకీయ నాయకుడి వేధింపులకు మహిళ బలి -
రైతు ‘ఐడియా’ అదిరింది.. సమస్య తీరింది
పెంబి (ఖానాపూర్): ఓ యువరైతు కలుపుతీసే పరికరాన్ని తయారుచేసి కూలీల ఖర్చును తగ్గించుకుంటున్నాడు. పెంబి మండలానికి చెందిన పుప్పాల శ్రీనివాస్ పొలంలో కలుపు తీసేందుకు కూలీల కొరత, అధిక ఖర్చును తగ్గించుకోవడానికి యువరైతు యూట్యూబ్‌లో చూసి కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశాడు. మందపల్లి శివారు వద్ద ఉన్న వరిపొలంలో ఆ యంత్రంతో కలుపు తీస్తుండడంతో సాక్షి పలకరించింది. ఈ యంత్రం తయారు చేసే విధానాన్ని వివరించారు. మూడు ఫీట్ల పొడవున్న రెండు ఇంచుల పీవీసీ పైపు, ఆఫ్ ఇంచ్ ఇనుప పైపు, 25 గొలుసులు తీసుకోవాలి. వాటికి కేవలం వెయ్యి నుంచి 12వందల వరకు ఖర్చు వస్తుందని తెలిపారు. ముందుగా ఆఫ్ ఇంచ్ ఇనుప పైపుకు గొలుసులు వెల్డింగ్ చేయించి దానిని పీవీసీ పైపునకు తీగతో కట్టాలి. అంతే కలుపు నివారణ పరికరం తయారు అయినట్లే.. ఒక తాడు సాయంతో ఒక్కరితో ముందుకు నడుస్తూ పోతే చిన్న చిన్న కలుపు మొక్కలు గొలుసులకు తట్టుకోని బయటకు వచ్చి చనిపోతాయి. అంతే కాకుండా వరి మొక్కలను నాశనం చేసే కీటకాలు సైతం నీటిలో పడిపోతాయి. ఈ పరికరం గత సంవత్సరం నుంచి వాడుతున్నట్లు తెలిపాడు. దీంతో కూలీల ఖర్చు తగ్గిందని వివరించాడు. -
వావ్.. జలజల జలపాతాలు
వర్షాలతో తెలంగాణలోని జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కొండల నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహాలను చూసి సందర్శకులు పులకించిపోతున్నారు. జలకాలాటలతో సందడిగా గడుపుతున్నారు. సందడిగా బొగత.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధి చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకుంది. చిలుకల పార్క్, ప్రకృతి అందాలను వీక్షిస్తూ పర్యాటకులు ఆనందంగా గడిపారు. – వాజేడు సదర్మాట్కు జలకళ నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం మండలాల ఆయకట్టుకు సాగు నీరందించే సదర్మాట్ 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలకళ సంతరించు కుంది. కనీస నీటిమట్టం 7.6 అడుగులు కాగా ప్రస్తుతం 8 అడుగుల మేర నుంచి వరద వెళుతోంది. జల సోయగాన్ని తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. – ఖానాపూర్ ఆహ్లాదం.. భీమునిపాదం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీపంలోని అటవీ ప్రాంతంలో భీమునిపాదం జలపాతం కనువిందు చేస్తోంది. ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి గుట్టలపైనుంచి వరద నీరు జలపాతానికి చేరడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. – గూడూరు జలజల జలపాతం.. ఇటీవల కురిసిన వర్షాలతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. శని, ఆదివారాల్లో భారీవర్షాలు కురవడంతో జలపాతం ఉధృతి పెరిగింది. దీంతో పర్యాటకుల రద్దీ నెలకొంది. – సైదాపూర్ (హుస్నాబాద్) కన్నుకుట్టేలా.. మిట్టే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని మిట్టే జలపాతం జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో జాలువారుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ వాగుపై సప్తగుండాలు ఉండటం విశేషం. – సిర్పూర్ (యూ) (ఆసిఫాబాద్) -
Photo Feature: వర్షం కురిసింది.. వాగు పొంగింది..
రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. దీంతో గిరిజన ప్రాంతాల్లో కరోనా టీకాలు వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతోంది. దేశ రాజకీయాలు, ఇతర విశేషాలతో స‘చిత్ర’ కథనం.. -
మంచాన పడ్డ భార్యను చూసేందుకు బైక్‌పై; 20 మీటర్లు ఎగిరి చెట్టు కొమ్మకు
ప్రమాదాలు చెప్పి రావు.. రోడ్డుపై మనం జాగ్రత్తగా వెళ్తున్నా.. అవతలి వాహనదారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ఇక చెప్పేదేముంది? సోయం మాన్కు (30) విషాదాంతమే అందుకు నిదర్శనం. పుట్టింట్లో మంచాన ఉన్న భార్యను చూసేందుకు బైక్‌పై బయల్దేరిన ఈ యువకుడిని ఎదురుగా రాంగ్ రూట్లో, మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. మాన్కు.. ఆ ధాటికి ఏకంగా 20 మీటర్ల దూరంమేర ఎగిరిపడి.. 12 అడుగుల ఎత్తయిన చెట్టు కొమ్మకు చిక్కుకుని దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం దోస్త్‌నగర్ అటవీ ప్రాంతంలోని నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై బుధవారం జరిగింది. కడెం (ఖానాపూర్): కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగానికి ఓ యువకుడి ప్రాణం గాల్లో కలిసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నీలగొండి (హస్నాపూర్)కి చెందిన సోయం మాన్కు.. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. భార్య సోయం జంగుబాయికి కాలు విరగడంతో పుట్టింటి వద్ద ఉన్న ఆమెను చూడటానికి నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చెన్ ఎల్లాపూర్‌కు బైక్‌పై బయల్దేరాడు. దోస్త్‌నగర్ సమీపంలోని అటవీ ప్రాంతానికి రాగానే నిర్మల్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి వేగంగా బైకును ఢీకొట్టింది. దీంతో మాన్కు ఎగిరి పడ్డాడు. చెట్టుపైనే మృతదేహం.. కారు వేగం ధాటికి మాన్కు 20 మీటర్ల దూరం ఎగిరి.. 12 అడుగుల ఎత్తున్న చెట్టుపై పడ్డాడు. తల, కాళ్లు, చేతులు, ఛాతీకి తీవ్ర గాయాలు కావడంతో మాన్కు చెట్టుపైనే మృతి చెందాడు. చెట్టు కొమ్మకు అతడి చొక్కా చిక్కుకోవడంతో మృతదేహం వేలాడుతూ ఉంది. పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి మృతదేహాన్ని చెట్టుపై నుంచి దింపి పంచనామా నిర్వహించారు. ప్రమాదంలో బైక్ పూర్తిగా దెబ్బతినగా, కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కాలుకు గాయమైనట్లు సమాచారం. కారు రాంగ్రూట్లో రావడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య జంగుబాయి, కూతురు, కుమారుడు ఉన్నారు. చదవండి: కడుపులో కత్తితోనే పోలీస్‌స్టేషన్‌కు పరుగు -
సాసర్‌వెల్స్ సక్సెస్; వన్యప్రాణులు ఖుష్
వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి ఇబ్బంది రాకుండా తెలంగాణ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ సాసర్‌వెల్స్ (నీటి తొట్టీలు) సత్ఫలితాలిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లోని జన్నారం, ఇందన్పల్లి, తాళ్లపేట అటవీ రేంజ్‌లలో సుమారు 90 వరకు నీటితొట్టీలను ఏర్పాటు చేశారు. సంబంధిత బీట్ అధికారి, బేస్‌క్యాంపు సిబ్బంది నీటితొట్టీల్లోని నీటిని పర్యవేక్షిస్తూ.. అయిపోగానే ట్యాంకర్ల ద్వారా నింపుతారు. రెండు స్క్వైర్ కిలోమీటర్లకు ఒక నీటితొట్టీని ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలోని వన్యప్రాణులు నీరు తాగడానికి అనుకూలంగా ఉంటోంది. అడవిలో వాగులు, కుంటల్లో నీరు ఎండిపోతున్న నేపథ్యంలో నీటితొట్టీలు వన్యప్రాణుల దాహం తీరుస్తున్నాయి. గతేడాదివి 60 నీటితొట్టీలుండగా ఈ సంవత్సరం మరో 30 కొత్తవి నిర్మించారు. కాగా, నీరు తాగడానికి వచ్చిన వన్యప్రాణులు అధికారులు అమర్చిన సీసీ కెమెరాకు చిక్కాయి. ఈ దృశ్యాలను పరిశీలిస్తే సాసర్‌వెల్స్ సత్ఫలితాలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎఫ్‌డీవో మాధవరావును సంప్రదించగా ఎప్పటికప్పుడు నీటితొట్టీలను పరిశీలిస్తున్నామని, సిబ్బంది వారానికి రెండు రోజులు నీటిని పోసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. – జన్నారం(ఖానాపూర్) -
రూ. రెండు వేల కోసం ప్రాణం తీశాడు
ఖానాపూర్: తీసుకున్న డబ్బులు రూ. రెండు వేలు ఇవ్వలేదని తోటి వలస కూలీ హన్మంతరావును పథకం ప్రకారమే బాపూజి హత్య చేశాడని ఖానాపూర్ సీఐ శ్రీధర్‌గౌడ్ తెలిపారు. బుధవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వలస కూలీ హత్య కేసు వివరాలను సీఐ వెల్లడించారు. పట్టణానికి చెందిన మేస్త్రీ నవీన్‌వద్ద పనిచేసేందుకు ప్రకాశం జిల్లా ఇంకోలుకు చెందిన కడియాల హన్మంతురావు(38), బాపూజిలు వారం క్రితం ఖానాపూర్‌కు వచ్చారు. గతంలోనూ వీరిద్దరు కలిసి పనిచేశారు. విద్యానగర్‌లోని ఓ ఇంట్లో వీరిద్దరు అద్దెకు ఉంటున్నారు. ఆదివారం విద్యానగర్‌లోని వైన్స్‌లో మద్యం సేవించే సమయంలో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. తదనంతరం ఇంటికి వెళ్లాక కూడా గొడవ జరగ్గా హన్మంతుపై పగ పెంచుకున్న బాపూజి రాడుతో తలపై పలుమార్లు బాది హతమార్చాడు. అనంతరం నిందితుడు మృతదేహాన్ని బయట పడేసి గ్రామ శివారు ప్రాంతానికి పారిపోయాడు. దాడి సమయంలో నవీన్ సోదరుడు ప్రేమ్ కూడా అక్కడే ఉన్నాడని సీఐ వివరించారు. రూ. 2 వేల కూలీ డబ్బులు ఇవ్వలేదని, తాగడానికి బీడీలు కూడా ఇవ్వలేదని దాడిచేసి హత్యచేశాడని సీఐ తెలిపారు. బుధవారం తర్లపాడ్ క్రాస్‌రోడ్డు వద్ద నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశామన్నారు. ఇంటి యజమాని భారతీ వీరకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కాగా విచారణకు కృషిచేసిన ఎస్సై రామునాయక్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ తుకారం, ఐడీపార్టీ కానిస్టేబుల్ ఉషన్న, హోంగార్డు శ్రీనివాస్‌లను సీఐ అభినందించారు. -
అతనితో పెళ్లి జరిపించాలి.. లేకపోతే చచ్చిపోతా
ఖానాపూర్: మండలంలోని సత్తన్‌పల్లి గ్రామంలో ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. గ్రామానికి చెందిన గుగ్లావత్ రాజశేఖర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ అతడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. గతంలో ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వాపోయింది. యువకుడితో పెళ్లి జరిపించాలని లేకుంటే తనకు చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం యువతిని పోలీసులు సఖి కేంద్రానికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతో కళాకారుడి ఆత్మహత్య కౌటాల(సిర్పూర్): మండలంలోని శీర్షా గ్రామానికి చెందిన కందూరి పోశమల్లు(39) అనే ఒగ్గు కళాకారుడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో మంగళవారం వేకువజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు.. శీర్షా గ్రామానికి చెందిన పోశమల్లు 20 ఏళ్లుగా ఒగ్గు కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్నెళ్ల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ఆయన ఎలాంటి పనులకు వెళ్లడం లేదు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇబ్బందులు తాళలేక పోశమల్లు మంగళవారం వేకువజామున ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. మృతుడికి భార్య సుమలత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తెలంగాణ జానపద కళాకారుల సంఘం సభ్యుడిగా, ఒగ్గు కళాకారుడిగా సేవలందించిన పోశమల్లు మృతి చెందడంపై జానపద కళాకారులు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. -
అటవీశాఖ కార్యాలయంపై రాళ్ల దాడి
ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీశాఖ కార్యాలయంపై సోమవారం పలువురు రాళ్లతో దాడి చేశారు. ఈ నెల 6న మండలంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్న యువకుడిని అటవీ అధికారులు పట్టుకున్నారు. విచారణ పేరుతో రెండు రోజులుగా చిత్రహింసలు పెట్టడంతో ప్రాణాపాయ స్థితికి చేరాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు కార్యాలయంపై దాడి చేశారు. రేంజ్ కార్యాలయంతో పాటు ఎఫ్‌డీవో గెస్ట్‌హౌస్ అద్దాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. పలువురు అధికారులు, సిబ్బంది కార్యాలయ తలుపులు వేసుకుని లోపలే ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. కాగా పలు వన్యప్రాణులను వేటాడిన యువకుడు చిరుతను హతమార్చేందుకు యత్నించాడని, తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. కేసులు నమోదు చేస్తామనే భయంతో యువకుడు స్పృహ కోల్పోయాడని ఎఫ్‌డీవో కోటేశ్వర్, ఎఫ్ఆర్వో వినాయక్ తెలిపారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చెప్పుతో కొట్టిన సర్పంచ్.. యువకుడి ఆత్మహత్య) -
'మద్యం మత్తులోనే అత్యాచారాలు, హత్యలు'
సాక్షి, ఖానాపూర్ : రాష్ట్రాన్ని తాగు బోతుల తెలంగాణగా మార్చడంతో పాటు మహిళలపై అత్యాచారాలు, హత్యలకు కేరాఫ్‌గా రాష్ట్రాన్ని నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ ఎద్దేవా చేశారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా ఎల్లాపటార్ ఘటన బాధిత కుటుంబాన్ని, అలాగే.. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని దీన్‌దయాళ్ నగర్ కాలనీలో తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పరామర్శించిన తమ్మినేని మానస కుటుంబాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానస ఘటనలో పోలీసులు ముగ్గురిని కీలక నిందితులుగా గుర్తించి ఒక్కరినే అరెస్టు చేసి కీలక నిందితుడిగా పేర్కొనడం సరైంది కాదన్నారు. -
భర్త చిత్రహింసలతో భార్య బలవన్మరణం
సాక్షి, ఖానాపూర్: భర్త చిత్రహింసలు తాళలేక భార్య పురుగుల మందుతాగి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ జయరాం నాయక్, ఎస్సై భవానిసేన్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బీర్నంది పంచాయతీ పరిధిలోని కొమ్ముతాండ గ్రామానికి చెందిన లక్ష్మి (40) భర్త బుక్య బలిరాం సోదరుడు గతంలో మృతిచెందాడు. అతడి భార్యతో బలిరాం వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ విషయంపై భార్యతో తరుచుగా గొడవలు జరిగేవి. గ్రామస్తులు సైతం పలుమార్లు హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో పాటు భార్యను తరుచుగా వేధించేవాడు. శుక్రవారం ఉదయం పంటచేనుకు వెళ్లిన లక్ష్మిని అక్కడికి వెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో పంట చేనులోని పురుగుల మందు తాగి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు వెంకటేశ్, కూతుల్లు చంద్రకళ, స్వప్న ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ -
బినామీ పేరుపై ‘కల్యాణలక్ష్మి’
సాక్షి, ఖానాపూర్: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్రప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం.. స్థానిక అధికారుల నిర్లక్ష్యం.. వెరసి పథకం అమలులో చోటు చేసుకుంటున్న లోపాలతో ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుందని పలువురు పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తన్‌పల్లిలో బినామి పేర్లతో కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసిన దళారులు అధికారులతో కుమ్మకై చెక్కును మంజూరు చేయించుకోవడంతో పాటు డబ్బులు స్వాహా చేసేందుకు ప్రయత్నించారనే బలమైన ఆరోపణలు ఇప్పుడు మండలంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలిలా ఉన్నాయి. నలుగురు మనుషులు లేకున్నా ఉన్నట్లు సృష్టి సత్తన్‌పల్లి గ్రామంలోని దొమ్మటి రమ–వెంకటేశ్‌గౌడ్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కూతురు లేదు. కాని కుటుంబ సభ్యులకు సంబందం లేకుండా గ్రామాలోని ఇద్దరు దళారులు ఆదంపతులకు కూతురు శ్యామల ఉన్నట్లు సృష్టించడంతో పాటు గ్రామంలో అసలే లేని పెళ్లికొడుకు, వారి తల్లిదండ్రులను కల్పితంగా సృష్టించి వివాహ ఆహ్వాన కార్డును ముద్రించారు. ఇరువురికి గ్రామంలోనే గత సంవత్సరం డిసెంబర్ 14న వివాహం జరిగినట్టు సృష్టించి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేశారు. దీంతో గ్రామానికి చెందిన దొమ్మటి రమ పేరుపై చెక్కు మంజూరైంది. ఈ నెల 4న స్తానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ తతంగం అధికారుల దృష్టికి వచ్చింది. అధికారులు చెక్కును ఇవ్వకుండా లోలోపల సమస్య సమసిపోయేలా గోప్యత ప్రదర్శించారనే విమర్శలొచ్చాయి. రమ–వెంకటేశ్‌లు మాత్రం ఇందులో తమ ప్రమేయం ఏమీలేదన్నారు. అధికారుల తీరుపైనే అనుమానం.. గ్రామస్థాయిలోరెవెన్యూ అధికారి, మండల స్థాయిలో గిరిధవార్లు క్షేత్రస్థాయిలో నిర్థారించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తే చెక్కు మంజూరవుతుంది. కానీ అధికారులు మాత్రం పోర్జరీ చేసి దరఖాస్తు చేశారని, తమ ప్రమేయం లేదని దాటవేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ సత్యనారాయణను వివరణ కోరగా తహసీల్దార్ విజయారెడ్డి ఘటన జరిగినరోజు విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక ఇచ్చామన్నారు. విధుల బహిష్కరణ సందర్భంగా ఇంకా విచారణ జరుపలేదన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత దోషులపై చట్టపరమైన చర్యలకోసం పైఅధికారులకు నివేదిస్తామన్నారు. -
ఖానాపూర్‌లో నేటికీ చెదరని జ్ఞాపకాలు
సాక్షి, ఖానాపూర్ : ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో నేటికి చెదరని నెత్తుటి చేదుజ్ఞాపకాలు.. తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసిన అన్నల అలజడి... తుపాకీ చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నక్సలైట్లు విధ్వంస చర్యలు జరుగుతూనే ఉండేవి. తరుచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి... నక్సలైట్ల కవ్వింపు చర్యలు తిప్పికొట్టే ప్రయత్నాల్లో ప్రాణాలర్పించిన పోలీసుల సేవలు మరువలేనివి. ఈ క్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. దాదాపు 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్‌లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో మెల్లమెల్లగా నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ సర్కిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్ల తూటాలకు 19 మంది పోలీసులు బలి అయ్యారు. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో నక్సలైట్లు స్థావరాలు ఎర్పరచుకున్నారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే విద్రోహ చర్యలకు శ్రీకారం చుట్టారు. సంఘటనల వివరాలివే.. 1987 ఆగస్టు 18న కడెం మండలం అల్లంపల్లి క్యాంపునకు పోలీసులు నడిచి వెళ్తుండగా అద్దాల తిమ్మాపూర్ వద్ద 30 మంది నక్సలైట్లు పకడ్బందీ పథకం ప్రకారం మాటువేసి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు కానిస్టేబుళ్లు తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. 1989 పిభ్రవరి ఒకటిన జరిగిన సంఘటకు ఒక రోజు ముందు ఖానాపూర్ మండలంలోని రాజూరా గ్రామంలో నక్సలైట్లు దోపిడికి పాల్పడ్డారు. దోపిడి నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామానికి వెళ్తుండగా కడెం మండలం సింగాపూర్ గ్రామ సమీపంలో పకడ్బందీ వ్యూహంతో నక్సలైట్లు పోలీసుల జీపును పేల్చివేశా రు. ఎస్ఐ ఖాదర్‌ఉల్‌హక్, ఆరుగురు కానిస్టేబుళ్లు జీ. బాపురావు, ఎండీ జలీల్, షేక్‌హైదర్, వేణుగోపాల్, బోజరావు, ఎస్. మోహన్‌దాస్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కానిస్టేబుల్ ప్రాణాలతో బయటపడ్డాడు. 1999 డిసెంబర్ ఐదున కడెం మండలంలో బందోబస్తుకు వెళ్లి వస్తుండగా ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామసమీపంలో నక్సలైట్లు రిమోట్‌కంట్రోలర్ సహాయంతో పోలీసు జీపును పేల్చివేశారు. ఎస్ఐ మల్లేశ్‌తో పాటు కానిస్టేబుల్, జీపు డ్రైవర్ దుర్మరణం చెందారు. ఖానాపూర్‌లో అమరుల స్థూపం ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో అమవీరుల స్మారాకర్థం స్థూపం లేకపోవడంతో స్టేషన్ ఆవరణలోని ఓ వేపచెట్టు కింద శిలాఫలకంపై పేర్లు రాసి ఉంచేవారు. అనంతరం 2008 సంవత్సరంలో అప్పటి సీఐ, ఎస్ఐలు స్మారక స్థూప నిర్మాణానికి కృషి చేశారు. ప్రస్తుత సీఐజయరాంనాయక్‌తో పాటు ఎస్ఐ గోగికారి ప్రసాద్‌లు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. -
మౌనపోరాటంతో అనుకున్నది సాధించింది
సాక్షి, ఖానాపూర్(ఆదిలాబాద్) : ప్రియుడితో పెళ్లి చేయాలని ఓ యువతి చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మండలంలోని బుట్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గ మహేష్ ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ఈనెల 18న ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి మౌనదీక్షకు దిగిన విషయం తెల్సిందే. బాధితురాలి కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బెంగళూర్‌లోని భాగ్యపల్లికి చెందిన కె.సునిత పనినిమిత్తం ముంబైకి వెళ్లి ఓ ఇంట్లో హౌస్ కీపింగ్‌గా పనిచేస్తోంది. అదే ఇంట్లో మండలంలోని బుట్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం మహేష్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో మూడేళ్లుగా వారు ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మహేశ్ ఆమె నుంచి రూ. 1.80 లక్షలు తీసుకున్నా డు. శారీరకంగా దగ్గరకావడంతో యువతి గర్భం దాల్చింది. తీరా పెళ్లి విషయం తెచ్చేసరికి మహేశ్ ముంబై నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఇక్కడికొచ్చాక పెళ్లి చేసుకోనంటూ సునితతో చెప్పి సెల్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో బాధితురాలు మహేశ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ముంబై వెళ్లి అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ముంబయి పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆందోళన చెందిన మహేశ్ కుటుంబ సభ్యులు ఇద్దరికి వివాహం చేయడానికి రాజీ కుదించారు. మండలంలోని గొడిసెర్యాల శ్రీ రాజరాజేశ్వర ఆలయం లక్ష్మణ స్వామి ఆలయంలో వివాహం చేయడంతో బాధితురాలికి న్యాయం చేసినట్లయ్యింది. -
దొంగలు బాబోయ్.. దొంగలు
సాక్షి, ఖానాపూర్ (ఆదిలాబాద్) : గత మూడు నెలలుగా ఖానాపూర్‌లో దొంగల బెడదతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తూ పగలు, రాత్రి అనే తేడా లేకుండా యథేచ్చగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆయా నివాసాల్లో విలువైన బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్తున్నారు. వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు దొంగలను పట్టుకోలేక పోతున్నారు. దొంగతనాలు నియంత్రించడంలో కూడా విఫలం అవుతున్నారని పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస చోరీలతో మారని తీరు పోలీస్ స్టేషన్ సమీపంలో గల అటవీ శాఖ కార్యాలయం ముందు గల వాచ్‌ల దుకాణంలో రూ. 30 వేల నగదుతో పాటు గడియారాలను దొంగలు ఎత్తుకెళ్లారు. జగన్నాథ్‌రావు చౌరస్తాలోని రాజేశ్వర్ అనే వ్యక్తికి చెందిన బంగారం దుకాణంలో చొరబడి వెండితో పాటు పలు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. విద్యానగర్‌లోని నారాయణ ఇంట్లో టీవీతో పాటు ఇతర సామాగ్రిని, కొంత నగదును ఎత్తుకెళ్లారు. జేకే నగర్‌లోని టీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఖాన్ నివాసంలో చొరబడి ఇంట్లోని పలు సామాగ్రితో పాటు కొంత నగదు కూడా ఎత్తుకెళ్లారు. పట్టపగలే చోరీ ఈ నెల 9న శాంతినగర్ కాలనీకి చెందిన శేఖర్ అనే వ్యక్తి నివాసంలో పట్టపగలే చొరబడి దొంగలు పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని 11 తులాల బంగారంతో పాటు రూ. లక్షా 40 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసు యంత్రాంగం ఎస్ఐ, సీఐతో పాటు డీఎస్పీ సైతం ఘటనా స్థలానికి చేరుకొని, పోలీసు జాగిలాలతో పాటు ఫ్రింగర్ ఫ్రింట్ క్లూస్ టీంలతో క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేపట్టారు. తాజాగా ఈ నెల 14న బాలికల ఉన్నత పాఠశాలలో చొరబడ్డ దొంగలు, క్వింటాల్‌న్నర బియ్యంతో పాటు పప్పు దినుసులు, నూనెలు, తదితర సామగ్రినీ ఎత్తుకెళ్లారు. 15న రాత్రి రిటైర్డ్ వీఆర్వో ఇంట్లో ఎవరు లేకపోవడంతో తాళాలు, బీరువాలు పగులగొట్టి తులం బంగారం ఎత్తుకెళ్లారు. హడలెత్తిస్తున్న దొంగలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. త్వరలో పట్టుకుంటాం వరుస దొంగతనాల నేపథ్యంలో పట్టణంలో పెట్రోలింగ్ ముమ్మరం చేశాం. దొంగలను త్వరలో పట్టుకొని ప్రజలకు దొంగల బెడదను తొలగిస్తాం. ప్రజలు ఎటువంటి భయాందోళన చెందవద్దని విజ్ఙప్తి చేస్తున్నాం. విలువైన వస్తులు, బంగారం, వెండి, నగదు ఇంట్లో ఉంచుకోవద్దు. దూర ప్రయాణాలు చేసే వారు పోలీస్ ష్టేషన్లో ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. -జయరాం, సీఐ, ఖానాపూర్ -
బావిలో చిరుతపులి..
-
బావిలో చిరుత.. నిచ్చెన ద్వారా జంప్
సాక్షి, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఒక చిరుతపులి పడింది. బావిలోని నీటిలో అటు-ఇటు తిరుగుతూ.. దిక్కుతోచనిస్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉన్న చిరుతను గ్రామస్తులు గుర్తించారు. బావి నీటిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న చిరుత గురించి పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు బావిలోని చిరుతను బయటకు తెచ్చేందుకు ఓ నిచ్చెనను ఏర్పాటటు చేశారు. నిచ్చెనను గుర్తించి.. అతికష్టం మీద ఎగబాకుతూ బయటకు వచ్చిన చిరుత.. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి సమీప అడవిలోకి పరుగు తీసింది. బావిలో చిరుత పడ్డ సమాచారం తెలియడంతో దానిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల పెద్ద ఎత్తున ప్రజలు బావి వద్ద గుమిగూడారు. మొత్తానికి చిరుత బావి నుంచి బయటపడటంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా..
ఖానాపురం: అంత్యక్రియలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. మండలంలోని అశోక్‌నగర్ గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబర్‌పేట గ్రామానికి చెందిన బెల్లంకొండ ఏసు(35)తో పాటు మరో నలుగురు బుధవారం హాజరయ్యారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆటోలో తిరిగి వెళ్తున్న క్రమంలో అయోధ్యనగర్ శివారులో గుర్తు తెలియని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. ప్రమాదంలో ఏసుకు తీవ్ర గాయాలు కాగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అందించారు. ఏసు పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అగ్ని ప్రమాదాలను తగ్గించిన ‘ఫైర్‌లైన్స్’
సాక్షి, జన్నారం(మంచిర్యాల): వేసవిలో అడవిలో సంభవించే అగ్నిప్రమాదాల నివారణకు అమలు చేస్తున్న ఫైర్‌లైన్స్ విధానం సత్ఫలితాలనిస్తోంది. అడవుల్లో అగ్నిప్రమాదాల వల్ల అడవి కాలడంతోపాటు వన్యప్రాణులు, పక్షులకు ప్రమాదం పొంచి ఉంటుంది. అగ్ని ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో అటవీ శాఖ నూతన విధానాన్ని రూపొందించింది. వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారించి, అడవికి నిప్పు తగులకుండా ఆపేందుకు అధికారులు కొత్త పద్ధతి అమలు చేస్తున్నారు. అడవిలో కూలీల ద్వారా ఫైర్‌లైన్స్(అగ్గి వరుస) ఏర్పాటు చేసి వాటికి నిప్పు పెడితే అడవంతా రగిలే అవకాశం ఉండదనే ఉద్దేశంతో వాటిని ఏర్పాటు చేశారు. దీంతో వేసవిలో అడవికి నిప్పు తగులకుండా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్లో మూడు అటవీ రేంజ్‌ల పరిధి అన్ని బీట్లలో ఫైర్‌లైన్ పనులు చేయిస్తున్నారు. జిల్లాలో ఫైర్‌లైన్స్ కోసం కాంపా స్కీం కింద రూ.10 లక్షలు కేటాయించారు. గత సంవత్సరం 40 కిలోమీటర్ల దూరం ఫైర్‌లైన్స్ చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 22 కిలోమీటర్ల దూరం చేశారు. ఆకులు శుభ్రం చేసే బ్లోయర్లు గత సంవత్సరం ఆరు కొనుగోలు చేయగా ఈసారి మరో నాలుగు బ్లోయర్లు కొనుగోలు చేశారు. ఫైర్‌లైన్స్ అంటే అడవిలో ప్రస్తుతం ఆకులు రాలిపోతాయి. దీంతో పశువుల కాపరులు గాని, అడవికి వెళ్లిన వారు గాని బీడీ, చుట్ట తాగి అలాగే పడేస్తే ఎండిన ఆకులకు అంటుకుని అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. దీని ద్వారా మంటలు అడవంతా వ్యాపించి, పక్షులు, చెట్లు, వన్యప్రాణులకు ప్రాణహాని కలిగే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఫైర్‌లైన్ సిస్టం ఏర్పాటు చేశారు. ప్రతీ బీట్‌లోని అటవీ ప్రాంతాల్లో ఎడ్లబండ్ల తొవ్వలు, కాలి నడక తొవ్వలకు ఇరువైపులా ఎండిన ఆకులను 5 మీటర్ల వెడల్పులో పోగు చేస్తారు. ఈ తొవ్వలపై వేసి అడవికి అంటకుండా నున్నగా చేసి పోగు చేసిన ఆకులకు నిప్పు పెట్టి కాలుస్తారు. ఆకులు కాలే వరకు పర్యవేక్షిస్తారు. ఫలితంగా దారి వెంట ఎవరైన బీడీ కోసం నిప్పంటించుకుని పడేస్తే నిప్పంటుకునే అవకాశం ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు దారులపై ఎండిన ఆకులను ఉండకుండా చూస్తారు. ప్రమాదవశాత్తు నిప్పంటినా ఈ దారుల వరకే వ్యాపించి ఆగుతుంది. దీంతో అడవిలో అగ్ని ప్రమాదం జరుగకుండా ఉంటుం ది. అన్ని డివిజన్లలోని కంపార్ట్మెంట్, బీట్, డివిజన్, బౌండరీలలో ఈ అగ్గి వరుసలు వేస్తారు. శాటిలైట్ ద్వారా ఫైర్ అలర్ట్ అటవీశాఖ ఉన్నత అధికారులు అగ్ని ప్రమాదాలను నివారించేందుకు శాటిలైట్ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రడూన్ ఆధ్వర్యంలో శాటిలైట్ ద్వారా ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా సమాచారం చేరవేస్తారు. ప్రతీ రోజు ఉదయం 5.30 గంటలకు ప్రమాదం జరుగుతున్న ప్రదేశం గురించి సంబంధిత అధికారులకు మొబైల్ ఫోన్‌కు మేసేజ్ వస్తుంది. కంపార్టుమెంట్ నంబర్, ఏరియాతో సహా తెలియపరుస్తారు. దీంతో సంబంధిత అధికారులు జీపీఎస్ ద్వారా ఆ ప్రాంతానికి వెళ్లి మంటలు ఆర్పివేస్తారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో కూడా శాటిలైట్ ద్వారా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు. గత సంవత్సరం 90 సార్లు డివిజన్లో అగ్ని సమాచారాలు రాగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదని, ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఫైర్‌లైన్ చేసి ఆకులు కాల్చుతున్న కూలీలు కూలీలకు చేతినిండా పని వేసవిలో కూలీలకు చేతినిండా పని ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మే మాసం వరకు ఈ పనులు నిరంతరంగా జరుగుతాయి. ఎండిన ఆకులను ఉండకుండా ఎప్పటికప్పుడు పోగు చేసి నిప్పంటించడం, ఆ నిప్పు అడవిలోకి వ్యాపించకుండా చూడడం కూలీల పని. ఇందుకు 5 మీటర్ల వెడల్పు, ఒక మీటర్ పొడవుకు రూ.5.50 కూలి ఇస్తారు. ఒక్కో కూలీ రోజుకు 20 నుంచి 40 మీటర్ల వరకు ఫైర్‌లైన్ వేస్తారు. దీంతో మూడు నెలల వరకు కూలీలకు పని దొరుకుతుంది. గ్రామాల్లో అవగాహన సదస్సులు అటవీ సమీప గ్రామాల్లో శాటిలైట్ ద్వారా ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు అగ్ని ప్రమాదాలు సంభవించే అటవీ సమీప గ్రామాల ప్రజలకు అగ్ని ప్రమాదాలు, నష్టంపై అటవీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పశువుల కాపరులు అగ్గిపెట్టలు, సిగరేట్, బీడీలు అడవులకు పట్టుకెళ్లకుండా చూస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు పొలాల్లో గడ్డికి నిప్పు పెట్టడం, చెత్త అడవిలో వేసి కాల్చడం వంటివి చేయకుండా అవగాహన కల్పిస్తున్నారు. కొందరు బీడీ ఆకులు, ఇప్ప పువ్వు కోసం చెట్లకు నిప్పు పెట్టే అవకాశం ఉన్నందున అలాంటివి జరుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతంలోకి ఎవ్వరినీ అనుమతించకపోవడం, పశువులను మేత కోసం పంపకపోవడం, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి అవగాహన కల్పించడంతోపాటు హెచ్చరికలు జారీ చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. జీరో పర్సెంట్ ప్రమాదాలకు చర్యలు గత సంవత్సరం 80 వరకు ప్రమాదాలు జరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్కటి కూడా జరుగకుండా చూశాం. గత సంవత్సరం మొత్తం 90 సార్లు శాటిలైట్ ద్వారా అగ్నిప్రమాదాల గురించి మేసేజ్‌లు వచ్చాయి. ఈ సంవత్సరం ఒక్కటి కూడా రాలేదు. అంటే డివిజన్లోని అడవుల్లో జీరో పర్సెంట్ అగ్ని ప్రమాదాలకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫైర్‌లైన్ పనులు జరుగుతున్నాయి. ప్రతీ రోజు బీట్ల వారీగా పనుల వివరాలు తెలుసుకుని ఉన్నత అధికారులకు తెలియజేస్తున్నాం. – రవీందర్‌గౌడ్, ఎఫ్‌డీవో -
బాదన్‌కుర్తి.. బుద్ధుడి ధాత్రి!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మహాజనపదం అస్మక రాజ్యం.. ఆ రాజ్యంలో గోదావరి రెండుగా చీలిన ప్రాంతంలో ఉన్న ఓ జనావాసం.. అది తెలంగాణలోనే ఉంది. అక్కడికి చేరువలో నది మధ్యలో చిన్న దీవి.. ఆ దీవిలో ఉందీ ఓ అద్భుతమైన బౌద్ధ స్థూపం.. ఇటీవలే జరిపిన తవ్వకాల్లో ఈ స్థూపం బయల్పడింది. ఇది తెలంగాణలో బయటపడ్డ అతి పురాతన స్తూపంగా చరిత్రకారులు భావిస్తున్నారు. బావరి గ్రామానికి సమీపంలో.. క్రీ.పూ.1 నుంచి 3 శతాబ్దాల మధ్య కాలానికి చెందినదిగా అంచనా వేస్తున్నారు. విశేషమేంటంటే బుద్ధుడిని స్వయంగా కలసి ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు నడుం బిగించిన బావరి అనే వ్యక్తి నివసించిన ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్తూపం ఉంది. అంటే బుద్ధుడు సజీవంగా ఉన్నప్పుడు ఆయన బోధనలను ప్రచారం చేసిన వారి తాలూకు వ్యక్తులే వీటిని నిర్మించారని తెలుస్తోంది. గోదావరి నది మధ్యలో చిన్న దీవిలో ఉన్న ఈ స్తూపంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఇతర బౌద్ధ నిర్మాణాలను వెలుగులోకి తెస్తే ఇది పెద్ద పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతుందని చెబుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో గోదావరి నది మధ్యలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు చరిత్రకారుల దృష్టిని ఆకర్షిస్తోంది. బౌద్ధ సాహిత్యంలో ప్రస్తావన.. బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావించే సుత్త నిపత గ్రంథంలో ఈ ప్రాంత ప్రస్తావన ఉంది. ఇప్పటివరకు బయటి ప్రపంచానికి దీని గురించి తెలియకపోవటంతో బౌద్ధ పర్యాటకులు ఇక్కడికి రావట్లేదు. నిర్మాణాలు వెలుగు చూసి, వాటి ప్రాధాన్యంపై ప్రచారం చేస్తే దేశవిదేశీ బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సుత్త నిపత గ్రంథంలోని పారాయణ వగ్గ చాప్టర్లో తెలంగాణ ప్రాంతం ప్రస్తావన ఉందని గతంలోనే నిపుణులు గుర్తించారు. ‘అస్మక రాజ్యంలో గోదావరి నది రెండుగా చీలిన ప్రాంతంలోని ఆవాసానికి చెందిన వారు బుద్ధుడిని దర్శనం చేసుకుని ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు నడుం బిగించారు’అని అందులో లిఖితపూర్వకంగా ఉంది. అస్మక పరిధిలో తెలంగాణ ఉండటంతో ఇక్కడ గోదావరి రెండుగా చీలిన ప్రాంతంలో జనావాసం ఎక్కడుందా అని నిపుణులు శోధించి.. అది ఖానాపూర్ మండలంలోని బాదన్‌కుర్తి గ్రామంగా గుర్తించారు. ఆ గ్రామం నది చీలికలో ఉంటుంది. అక్కడ ప్రాథమికంగా తవ్వకాలు జరిపి బౌద్ధ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. కానీ వాటిపై ఓ దేవాలయం సహా వేరే నిర్మాణాలు రావటంతో ఏమీ చేయలేకపోయారు. తాజాగా దానికి చేరువలో అతి పురాతన బుద్ధ స్తూపంతోపాటు ఇతర నిర్మాణాలను గుర్తించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదేశంతో బుద్ధవనం అధికారి శ్యాంసుందర్, పుణేలోని డెక్కన్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీకాంత్, ఔత్సాహిక చరిత్రకారులు జితేంద్రబాబు, శ్రీరామోజు హరగోపాల్ తదితరులు ఇటీవల పర్యటించి వాటిని గుర్తించారు. ►బాదన్‌కుర్తి గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో బావాపూర్ సమీపంలో గోదావరి మధ్యలో రెండు చిన్న దీవులున్నాయి. వాటిల్లో దాదాపు 57 ఎకరాల మేర విస్తరించి ఉన్న ఒక దీవిని పరిశీలించగా ఇవి వెలుగు చూశాయి. ►దాదాపు 17 అడుగుల ఎత్తున మట్టి దిబ్బను పరిశీలించగా అది బౌద్ధ స్తూపమని తేలింది. ►3 అంచెలుగా ఈ స్తూపం నిర్మితమైంది. ►ఇందులో దిగువ ఉన్న చివరి అంచె రాతి కట్టడంగా ఉండగా, పై 2 అంచెలు పెద్ద ఇటుకలతో నిర్మితమై ఉన్నాయి. చివరి వరుస వ్యాసం 40 చదరపు అడుగులు ఉంది. ►దీనికి చేరువలో 20 అడుగుల వ్యాసంతో మరో రెండు స్తూపాలున్నాయి. ఇలా ఒకేచోట 3 స్తూపాలుండటం, పెద్ద స్తూపం మూడు అంచెలుగా ఉండటం అరుదని నిపుణులంటున్నారు. గుప్త నిధుల కోసం కొందరు ఆ మూడు స్తూపాల మధ్య తవ్వటంతో అవి కొంతమేర దెబ్బతిన్నాయి. ఎంతగానోఆకట్టుకుంటుంది చాలా పురాతనమైన స్తూపాలుండటం, బుద్ధుడి బోధనలు స్వయంగా విని బౌద్ధాన్ని ప్రచారం చేసిన బావరి నివసించిన ప్రాంతం కావటం, గోదావరి నది మధ్యలో ఉండటంతో ఇది పర్యాటకంగా బాగా అభవృద్ధి చెందే ప్రాంతం. అందుకే అక్కడ వెంటనే తవ్వకాలు జరిపి నిర్మాణాలను వెలుగులోకి తేవాలని హెరిటేజ్ తెలంగాణ శాఖను కోరాం. సమీపంలోనే కడెం రిజర్వాయర్, దట్టమైన అడవి, గోదావరి నది.. పర్యాటక ప్రాంతంగా ఎలా తీర్చిదిద్దాలన్న విషయంలో ప్రతిపాదనలు రూపొందిస్తాం –మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రత్యేకాధికారి -
‘ఏపీ ప్రజలను గాలికొదిలేసి.. తెలంగాణలో ప్రచారం’
సాక్షి, ఉట్నూర్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గడ్డం గీసుకోకుంటే తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాశనం చేసిన తెలంగాణను ఇప్పుడిప్పుడే బాగు చేసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్ర ప్రజలను గాలికి వదిలేసి తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు టీఆర్ఎస్ మేలు చేసిందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ 200 రూపాయల పెన్షన్ ఇస్తే.. టీఆర్ఎస్ దేశంలో ఎక్కడా లేని విధంగా 1000 రూపాయలు ఇచ్చిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. 12 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నట్టు హామీ ఇచ్చారు. ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు గుంపులుగా వస్తున్నాయని విమర్శించారు. సంక్రాతికి ముందే గంగిరేద్దులా మహాకూటమి అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 3400 తాండాలు, గూడేలను గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. ఒకప్పుడు ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడేవారని.. కానీ నేడు 35 శాతానికి పైగా ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. మిగతా పార్టీల బాసులు ఢిల్లీలో, అమరావతిలో ఉంటారని.. తమ బాసులు మాత్రం గల్లీల్లో ఉంటారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్న పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. -
టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్‌పై ట్విస్ట్
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని ఖానాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ దాఖలు చేసిన నామినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. గత బుధవారం ఆమె మూడు సెట్లు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అయితే మూడు సెట్లలోని ఒక కాలమ్‌ను ఖాళీగా ఉంచారు. దీంతో రిటర్నింగ్ అధికారి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉట్నూరుకు చెందిన రితేష్ రాథోడ్ అనే వ్యక్తి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ప్రతిపక్షాలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రేఖానాయక్ నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. -
టీఆర్ఎస్లో ముసలం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారు తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. వరంగల్ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్ఎస్పై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో గులాబీ నేత టీఆర్ఎస్పై తిరుగబాటు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ టికెట్ తనకు కేటాయించకపోవడంతో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్దమైయ్యారు. ఈ మేరకు శనివారం స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశమైన రాథోడ్.. ఖానాపూర్‌లో సీఎం కేసీఆర్ పోటీచేసినా.. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తానాని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన కొడుకు రితీష్ రాథోడ్‌ను జోగు రామన్నకు వ్యతిరేకంగా బరిలో నిలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఖానాపూర్ టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆ మాట ప్రకారమే తాను గతంలో టీఆర్ఎస్లో చేరినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లోకి వలసల జోరు మరోవైపు రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వార్తలు వస్తున్నాయి. త్వరలో కాంగ్రెస్ నేతలతో చర్చించి.. అసెంబ్లీ స్థానంపై క్లారిటీ తీసుకుని హస్తం గూటికి చేరుతారని సమాచారం. దీనిపై స్పందించిన రాథోడ్ తన అభిమానులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. మరోవైపు టీఆర్ఎస్ అసంతృప్తులను చేరదీసేందుకు కాంగ్రెస్ రంగంలోని దిగింది. టీఆర్ఎస్పై తిరుగుబాటు ఎగరేసిన కొండా దంపతులను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ దూతలను పంపినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి త్వరలో హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. బీజేపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు సమరసింహరెడ్డి, నందీశ్వర్ గౌడ్ శనివారం కమళానికి గుడ్‌బై చెప్పి హస్తంకు చేయందించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో దగ్గరపడుతున్నకొద్ది మరెంతమంది అసంతృప్త నేతలు కారుదిగుతారోనని టీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. -
గుప్తనిధుల కోసం తమ్ముడి కొడుకునే...
ఖానాపూర్ : ఆధునిక యుగంలోనూ జనం మూఢనమ్మకాలను వీడడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంతమంది మూఢనమ్మకాలను విశ్వసిస్తూ అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. గుప్త నిధుల కోసం మనుషులను బలిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామపంచాయతీ పరిధిలోని రంగపేట గ్రామంలో సొంత తమ్ముడి కుమారుడినే బలిచ్చే ప్రయత్నం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆలస్యంగా వెలుగులోకి.. రంగపేట గ్రామానికి చెందిన గోనె లచ్చన్న–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వీరికి ఎదురుకాళ్లతో జన్మించిన చిన్న కుమారుడు మహేశ్(13) ఉన్నాడు. లచ్చన సోదరుడు (అన్న) లింగన్న గత పదిహేను రోజుల క్రితం తమ్ముడిని కలిశాడు. ఎదురుకాళ్లతో ఉన్న నీ కుమారుడు మహేశ్‌ను తమకు ఇస్తే తమకు వచ్చే దాంట్లో నీకు సగం బంగారం ఇస్తానని చెప్పాడు. వచ్చే దాంతో పెద్ద ఇల్లు కట్టుకోవచ్చని ఆశచూపాడు. దీంతో ఆందోళనకు గురైన మహేశ్ తల్లి లక్ష్మి తానేందుకు కుమారున్ని ఇస్తానని వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన జరిగి పదిహేను రోజులైంది. ఈ క్రమంలో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తన కుమారుడికి ప్రాణభయం ఉందని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై గోగికారి ప్రసాద్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు. -
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఖానాపూర్: ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తుందని గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పెంబి మండలం మందపల్లి పంచాయతీ పరిధి నాగాపూర్ గ్రామంలో నాల్గో విడత మిషన్ కాకతీయ పథకం కింద రూ.2.50 కోట్లతో మంజూరైన రాగిచెరువు పనులను ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మిషన్ కాకతీయ పథకానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.4వేలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. మందపల్లి గ్రామంలోని పల్కేరు వాగు ఎత్తు పెంచడానికి అధికారులు సర్వే చేస్తున్నారన్నారు. సరస్వతి కాలువ, ఉప కాలువలతో పాటు సదర్మాట్ బ్యారేజీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. కోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి సహకారంతో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. రాగి చెరువు నిధుల మంజూరుకి కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు గ్రామస్తులు మంత్రి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నల్ల శ్రీనివాస్, పెంబి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, ఎంపీటీసీ పోతురాజుల లచ్చవ్వ, ఎఫ్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్, నాయకులు గోవింద్, శేఖర్‌గౌడ్, లక్ష్మీనారాయణ, రాజవ్వ, ఈఈ రమేశ్, డీఈ శరత్‌బాబు, ఏఈఈ శ్రీనివాస్ తదితరులున్నారు. -
తల్లి, చెల్లిని రోడ్డుపైకి గెంటేసిన సోదరులు
ఖానాపూర్ : వ్యవసాయ భూమికోసం అన్నదమ్ములు మధ్య సఖ్యతలేక కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని రోడ్డుపై వదిలేసిన సంఘటన ఖానాపూర్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పాత ఎల్లాపూర్ పంచాయతీ పరిధి ఒడ్డెవాడలోని పల్లెపు ఎంకవ్వ, మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లున్నారు. మల్లయ్య ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు కూతుళ్లకు వివాహం అయినప్పటికీ ఒక కూతురు నర్సవ్వ తల్లి ఎంకవ్వతోనే ఉంటోంది. పదేళ్లుగా ఎంకవ్వ పెద్ద కొడుకు ఎంకటి, చిన్న కొడుకు జగన్ తల్లీచెల్లి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో వారిద్దరూ కూలీ పనులు చేసుకునే చిన్న కొడుకు ఇంటి వద్ద ఉన్న ఓ గుడిసెలో నివసిస్తున్నారు. కాగా.. గ్రామంలోని చెరువు వద్ద ఆర్‌ఓఎఫ్‌ఆర్‌కు చెందిన సుమారు రెండెకరాల భూమి ఉంది. ఆ భూమి పదేళ్లకుపైగా పెద్ద కుమారుడు ఎంకటి సాగు చేసుకుంటున్నాడు. దీంతో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలో నుంచి తనకు సగం వాటా ఇవ్వాలని జగన్ అన్నను కోరాడు. దానికి అన్న ససేమిరా అన్నాడు. దీంతో అన్న ఇంటి వద్ద కు పోవాలని ఇంటి నుంచి తల్లీచెల్లిని గెంటివేశా డు. పెద్ద కుమారుడు కూడా తన వద్ద వద్దనడం తో గ్రామంలోని ప్రధాన రహదారి వద్ద గల చెట్టు కిందకు తల్లీచెల్లి చేరారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో పోలీసులు శుక్రవారం ఈ ఘటనపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. -
రైతుబంధు చెక్కులు ఇప్పించాలి
ఖానాపూర్ : కడెం మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన తమ భూములను టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి చెర నుంచి కాపాడాలని గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు ఆదివారం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సంబందిత నాయకుడు ఇదివరకు తమ భూములు పెద్ద సంఖ్యలో కబ్జాకు పాల్పడ్డాడని, సాగులో ఒక్కొక్కరికి ఐదెకరాలకు పైగా ఉన్నప్పటికీ ఒక్కో ఎకరంతో పట్టాలు వచ్చాయని అన్నారు. కబ్జాపోను మిగిలిన ఒక్కో ఎకరం భూమికి ప్రభుత్వం రైతుబంధు ద్వారా చెక్కులు ఇస్తే వాటిని కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. గ్రామ శివారులో గల జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం బోర్నపెల్లిలో ఉన్న తమ భూములకు ప్రభుత్వం నుంచి రైతుబంధు ద్వారా వచ్చిన చెక్కులను ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ విషయమై ఎంతటివారైనా సరే తాను సంబందిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెడ్మ గంగు, తోడసం గంగు, వెడ్మ లింగు, వెడ్మ దేవేందర్, ఆత్రం గంగు, లింబారావ్, బాదిరావ్, లింగు, మోహన్, జుగాదిరావ్, శ్రీను, జ్యోతిరాం, మారుతి, ఆనంద్, బుచ్చవ్వ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన అతివేగం
జన్నారం(ఖానాపూర్) : అతివేగం యువకుని ప్రాణాలు తీసింది. హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని ఒకపక్క పోలీసులు చెబుతు న్నా పట్టించుకోకుండా మద్యం సేవించి అతివేగంగా వాహనం నడిపి అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం పాలైన సంఘటన ఉట్నూర్ మండలంలోని కన్నెపల్లిలో చోటు చేసుకుంది. ఉట్నూర్ మండలం కన్నెపల్లికి చెందిన తొడసం నాగరాజు(19) తన స్నేహితులైన ఇంద్రవెల్లికి చెందిన మె స్రం మారుతి, గొడిసర్యాలకు చెందిన జుగునక మ హేశ్‌లతో కలిసి శుక్రవారం ద్విచక్ర వాహనంపై ఉ ట్నూర్ నుంచి జన్నారం మండలం ధర్మారం బయలు దేరారు. మార్గమధ్యలో ఇందన్పల్లి వద్ద మద్యం సేవించి జన్నారం మీదుగా ధర్మారం వెళ్లి స్నేహితున్ని కలిసి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ధర్మారం, జన్నారం గ్రామాల మధ్యన ఉన్న కల్వర్టును ఢీకొట్టా డు. దీంతో బైక్ నడుపుతున్న నాగరాజుకు తీవ్రగాయాలై సంఘటనాస్థలంలోనే మృతి చెందగా అతని స్నేహితులిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న నాగరాజు తండ్రి నాలుగేళ్ల క్రితమే మృతి చెందగా ప్రస్తుతం తల్లి ఉన్నా రు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని స్వల్పగాయాలైన ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అతివేగమే ప్రమాదానికి కారణమని ఎస్సై తహసినొద్దీన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట్‌కు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
కడెం(ఖానాపూర్): మండలంలోని కొండుకూరు గ్రామానికి చెందిన మద్ది శ్రావణ్(24) గురువారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై అజయ్‌బాబు తెలిపిన వివరాలివీ..శ్రావణ్ మండలంలోని పాండ్వాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. కాని మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ప్రేమించిన అమ్మాయి గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి చెందిన యువకుడు మద్దిపడగ గ్రామసమీపంలోని అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుంటుంబీకులు అపస్మారక స్థితిలో ఉన్న యువకున్ని 108లో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి పోశవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కరెంట్ షాక్‌తో మాజీ సర్పంచ్ మృతి
సాక్షి, రాయపర్తి : వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో పొలం పనులకు వెళ్లిన నాగపూరి వెంకటేశ్వర్లు అనే మాజీ సర్పంచ్ విద్యుదాఘాతంతో మృతిచెందాడు. సోమవారం ఉదయం వెంకటేశ్వర్లు తన పొలానికి నీళ్లు కట్టెందుకు వెళ్లాడు. నెలపై తెగిపడిన విద్యుత్ తీగని గమనించకుండా తొక్కడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన కుటుంబసభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. -
ముగ్గురు గురుకుల విద్యార్థునుల అదృశ్యం
ఖానాపూర్(నిర్మల్ జిల్లా): ఖానాపూర్ మండలకేంద్రంలోని గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్దినులు మంగళవారం అదృశ్యమయ్యారు. గురుకుల పాఠశాల హాస్టల్ గది కిటీకీ నుంచి దూకి పారిపోయారు. పారిపోయిన విద్యార్థునులు ఆశ్రియ, మైత్రి, సహస్రికలుగా గుర్తించారు. వీరంతా ఆరో తరగతి చదువుతున్నారు. హాస్టల్ నుంచి పారిపోయిన వారు ఇంటికి కూడా వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు, పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పదోన్నతులు వెంటనే చేపట్టాలి
► ఎస్సీ, ఎస్టీ ఉఫాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న జన్నారం(ఖానాపూర్): ఉమ్మడి సర్వీసు రూల్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్రవేయడంతో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు మార్గం సుగమం అయిందని ఎస్సీ, ఎస్టీ ఉఫాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎంఈవో, డిప్యూటీఈవో, డైట్, బీఈడీ, జూనియర్ లెక్చరర్ పోస్టులను, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో అమలవుతున్న మూల్యంకన విధానాన్ని తనిఖీకి శాశ్వత ప్రతిపాదినక అకాడమిక్ మానిటరింగ్ బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రాజలింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్య రాజన్న, జిల్లా కార్యదర్శి రమేశ్, మండల అధ్యక్షుడు తుంగూరి గోపాల్, ప్రధాన కార్యదర్శి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రిడ్జి నిర్మాణంతో రాకపోకలు
► నాడు పడవ ప్రయాణం.. ► గతంలో కాలినడక,ఎడ్లబండ్లే దిక్కు ► బలోపేతమవుతున్న ఇరు జిల్లాల ప్రజా సంబంధాలు ఖానాపూర్: నాడు పడవ ప్రయాణం.. ప్రస్తుతం బస్సు ద్వారా రాకపోకలు. ఖానాపూర్ మండలంలోని బాదన్‌కూర్తిలో 2009లో బ్రిడ్జి నిర్మా ణం చేపట్టి పూర్తవడంతో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. బాదన్‌కూర్తి గ్రామం మీదుగా అంతర్జిల్లా రోడ్డు మార్గం ఉంది. ఈ రోడ్డుతో రెండు జిల్లాల (నిర్మల్, జగిత్యాల) ప్రయాణికులకు రవాణా సౌకర్యం ఉంది. ఎక్కడైన వెళ్లాలంటే రోడ్డు మార్గాన ద్వారా వెళ్తున్నారు. దీం తో ఇరు జిల్లాల ప్రజాసంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంలో కాలినడకన, ఎడ్లబండ్ల ద్వారా వెళ్లేవారు. 8 ఏళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణం పూర్తవడంతో ఇరువైపులా బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మండలంలోని మస్కాపూర్, సుర్జాపూర్, బాదన్‌కూర్తి గ్రామాల మీదుగా జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం ఒగులాపూర్‌కు చేరుకోవచ్చు. అక్కడి నుంచి గతంలో ఉన్న ప్రధాన రోడ్డు ద్వారా మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లవచ్చు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన నాటి నుంచి ఆయా గ్రామాల నుంచి ప్రతిరోజు బస్సులు వచ్చి వెళ్తున్నాయి. రెండు వైపులా జిల్లా సరిç ßæద్దు గ్రామాలు కావడంతో బంధుత్వాలు రెండు జిల్లాలో ఉన్నాయి. మండల కేంద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ కంటే దగ్గరగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్పల్లి ప్రాంతానికి ఇటీవలకాలం అత్యధికంగా ఇక్కడి ప్రజలు ప్రయాణిస్తున్నారు. పెరుగుతున్న వ్యాపార లావాదేవీలు ఇరు జిల్లాలోని రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి అటువైపు, ఇటువైపు మంచి మార్కెట్ కేంద్రాలు ఉన్నాయి. మెట్ పల్లి మార్కెట్‌కు చెందిన వ్యాపారులకు గతకొద్ది రోజులుగా ఖానాపూర్ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లు చేపట్టారు. ఆయా గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్‌తోపాటు మంచి మార్కెట్ సౌకర్యం ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం గతంలో రైతుల తమ పంట ఉత్పత్తులను ఎక్కడ గిట్టుబాటు ధరలు ఉంటే అక్క డ అమ్ముకోవచ్చని ఉన్న ఆంక్షలు ఎత్తేయడంతో గిట్టుబాటు ధర ఉన్న చోట అమ్ముకుంటున్నారు. అదేవిధంగా మండల కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్‌పల్లికి వెళ్లి, ఆసుపత్రుల్లో చికిత్సలు సైతం చేయించుకుం టారు. ఖానాపూర్‌లో జరిగే వారసంతలో కూరగాయలు, బట్టలు మసాలా దినుసులను ఇతర వ్యాపార లావాదేవీలకు కోసం సమీప మండలాల్లోని వ్యాపారులు, ప్రజలు అధికసంఖ్యలో వచ్చి అమ్మకాలు, కొనుగోలు చేపడతారు. ప్రç Ü్తుతం ఆయా జిల్లాలకు చెందిన డిపోల నుంచి సైతం ప్రతిరోజు బస్సులు నడుస్తున్నాయి. నాడు అష్టకష్టాలు.. నేడు రాచమార్గం గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాలకు వెళ్లాలంటేనే ఎడ్లబండ్ల ద్వారా, కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. రవాణా మార్గం కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇరుజిల్లాల సరిహద్దు గ్రామాల్లో పిల్లలకు పెళ్లిల్లు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. దాంతో ఇరు జిల్లాల్లో బంధుత్వాలు ఎక్కువై ప్రజా సంబంధాలు బలపడుతున్నాయి. రవాణా సౌకర్యం మెరుగైన క్రమంలో మరిన్ని బస్సు ట్రిప్పులు ఆయా గ్రామాలకు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. -
ఖానాపూర్‌లో కార్డెన్ సెర్చ్
నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్‌లో బుధవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 53 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, ఓ ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు లక్ష రూపాయల విలువైన కలప, పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు, 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. -
దహన సంస్కారాలకు వెళ్లి వస్తూ..
► ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ ► ఇద్దరు మృతి ఖానాపురం: బంధువు మృతి చెందగా దహన సంస్కారాల కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు తిరుగు ప్రయాణంలో జరి గిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘ టన శుక్రవారం వరంగల్ రూరల్ జిల్లా ఖానపురం మండలం బుధరావుపేటలో చోటుచేసుకుంది. బం« దువుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మి గ్రామ పంచాయతీ పరిధిలోని కొర్రతండా(రామన్నగూడెం)కు చెందిప బానోతు వీరన్న(40), వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాలతండాకు చెందిన అజ్మీరా రాజు(35)లు తమ సమీప బంధువు అయిన ఖా నాపురం మండలంలోని మంగళవారిపేట గ్రామపంచాయతీ పరిధిలోని భద్రుతండాకు చెందిన బానోతు ఈర్య గురువారం మృతి చెందడంతో మృతుడి దహ న సంస్కారాల నిమిత్తం శుక్రవారం వీరన్న, రాజు వేర్వేగా భద్రుతండాకు వచ్చారు. దహన సంస్కారా లు పూర్తి అయిన అనంతరం ఇంటికి వెళ్లే క్రమంలో బానోతు వీరన్న తన ద్విచక్ర వాహనంపై అజ్మీరా రా జుతో కలసి నర్సంపేట వైపునకు వస్తున్నాడు. బుధరావుపేట గ్రామం దాటిన తర్వాత సంగెం కాల్వ స మీపంలో రాగానే ఎదురుగా అతివేగంతో వచ్చిన ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బానోతు వీరన్న, అజ్మీరా రాజులు అక్కడికక్కడే మృ తి చెందారు. విషయం తెలుసుకున్న మృతుల కు టుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకోని బోరున విలపించారు. ప్రమాదానికి కారణ మైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో రూరల్ సీఐ బోనాల కిషన్, ఎస్సై దుడ్డెల గురుస్వామి ఆందోళనకారులతో మాట్లాడి పరి స్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. మృ తుడు బానోతు వీరన్నకు భార్య యాదమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అజ్మీరా రాజుకు భార్య రజిత, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
ఆ ఊరికి కేసీఆర్ కూతురు కవిత పేరు
నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అభిమానం మాదిరిగానే ఆయన కూతురు, ఎంపీ కల్వకుంట్ల కవితపై కూడా ఆమె నియోజవర్గ ప్రజలకు ప్రేమ పొంగిపోతోంది. ఎంతలా అంటే ఆ నియోజకవర్గంలోని ఓ గ్రామ ప్రజలు ఆ గ్రామానికి ఆమె పేరే పెట్టుకునేంత. ఎంపీ కవిత నిజామాబాద్ నుంచి పార్లమెంటు నియోజవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే జిల్లాలోని అర్మూర్ బ్లాక్‌లో ఖానాపూర్ అనే గ్రామపంచాయతీ ఉంది. శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) పనుల కారణంగాఘా గ్రామంలోని 274 కుటుంబాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కవిత అండగా నిలిచారంట. తమ సొంత గ్రామం నుంచి కొన్ని కిలో మీటర్ల దూరంలోని ఓ కొత్త ప్రాంతానికి తామంతా వెళ్లాల్సి వచ్చిందని, అలాంటి సమయంలో తమకు కొత్త స్థలం ఎంపిక గ్రామ నిర్మాణంలో కవిత కృషి చేశారని, ముందస్తు చర్యలు తీసుకున్నారని అక్కడి గ్రామస్తులు చెప్పారు. ‘మేం ఎంపీ కవితను కొద్ది రోజుల కిందట కలిశాం. మా 274కుటుంబాలకు డబుల్ బెడ్రూంలు కట్టించాలని కోరాం. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. దీంతో ఆమెపై గౌరవంతో మా ఖానాపూర్ గ్రామానికి ఇక నుంచి కవితాపురంగా మార్చాలని నిర్ణయించుకొని రెండు రోజుల కిందటే తీర్మానం చేశాం’ అని గ్రామ సర్పంచి పెంబర్తి మమత నరేశ్ తెలిపారు. తమ దృష్టిలో ఇక ఖానాపూర్ కవితాపురం అయినట్లేనని అన్నారు. అయితే, దీనిపై ఆర్మూర్ తహశీల్దారు రాజేందర్ స్పందిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు ఖానాపూర్ గానే ఉంటుందని స్పష్టం చేశారు. కానీ, సర్పంచ్ మాత్రం తమది కవితాపురమే అని చెబుతున్నారు. ఇప్పటికే అదే పేరిట వారు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఇది ముమ్మాటికి కేసీఆర్ కుటుంబాన్ని పొగడ్తల్లో ముంచె చర్యలని, రహస్యంగా ఆ కుటుంబ సభ్యులే కావాలని ఇలాంటి చర్యలు కొంతమందితో చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలోని దండేపల్లి అనే గ్రామంలో కేసీఆర్‌కు ఆయన మద్దతుదారులు గుడి కూడా నిర్మించిన విషయం తెలిసిందే. కేసీఆర్ కు భారత రత్న కూడా ఇవ్వాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ఇప్పటికే చక్కర్లు కొడుతుందట. -
వాగులో పడి బాలిక గల్లంతు
ఖానాపూర్ (ఆదిలాబాద్) : వాగులో ఆడుకుంటున్న ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. ఇది గుర్తించిన ఇతర కుటుంబ సభ్యులు ఇద్దరు బాలికలను రక్షించగా.. మరో బాలిక గల్లంతైంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సదర్మాటు వాగు వద్ద శనివారం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన ఓ ముస్లిం కుటుంబం సదర్మాటు వాగును సందర్శించడానికి వచ్చింది. ఆ సమయంలో వాగులో ఆడుకుంటున్న ముగ్గురు బాలికలు నీట మునిగి గల్లంతయ్యారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఇద్దరిని రక్షించగా.. మరో బాలిక(15) నీట మునిగి గల్లంతైంది. గల్లంతైన బాలిక కోసం స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం
ఆదిలాబాద్ : జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో కడెం ప్రాజెక్ట్ నిండు కుండగా మారింది. ప్రాజెక్టులోని 5 గేట్లను అధికారులు ఎత్తివేసి... నీటిని కిందకి వదిలారు. ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 64,440 క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 59,550 క్యూసెక్కులు ఉంది. నిర్మల్ వద్ద కనకాపూర్ వాగు పొంగిపొర్లుతుంది. దీంతో నిర్మల్ - మంచిర్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణ ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువలకు విడుదల చేశారు. అలాగే నిర్మల్ పట్టణంలో పిడుగుపడి ఇల్లు ధ్వంసమైంది. -
అత్తపై కోడలి హత్యాయత్నం
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. నిజామాబాద్ రూరల్ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని అత్తనే హత్య చేయాలని చూసిందో కోడలు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖానాపూర్‌కు చెందిన సుమన్ బతుకు దెరువు కోసం దుబాయికి వెళ్లాడు. అతడి భార్య మంజుల ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని అత్త బాగవ్వ దుబాయిలో ఉన్న తన కుమారుడు సుమన్‌కు ఫోన్ ద్వారా తెలిపింది. దీంతో కక్ష పెంచుకున్న మంజుల.. అత్త అడ్డు తొలగించుకోవడానికి కుట్ర పన్నింది. శుక్రవారం రాత్రి సేమియాలో విషం కలిపి అత్తకు ఇచ్చింది. అయితే సేమియా చేదుగా అనిపించడంతో భాగవ్వ దానిని తినలేదు. మంజుల పథకం ప్రకారం భాగవ్వ తల్లి గంగవ్వను ఇంట్లో నుంచి మరో బంధువు సాగరవ్వ ఇంటికి పంపించింది. రాత్రి నిద్రపోతున్న సమయంలో భాగవ్వ గొంతుకోసి చంపేందుకు యత్నించింది. భాగవ్వ కేకలు వేయడంతో మంజుల పారిపోయింది. ఈ దాడిలో భాగవ్వ మెడకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని వారు భాగవ్వను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఆమె వాంగ్మూలాన్ని స్వీకరించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రెండున్నర ఏళ్లలోనే అభివృద్ధి
మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం తలకొండపల్లి : 70ఏళ్లలో చేయలేని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రెండున్నర ఏళ్లలో చేసి బంగారు తెలంగాణ దిశలో పయనిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ జెడ్పీహెచ్ఎస్,Sకర్కాస్‌తండా ప్రాథమిక పాఠశాలల్లో మొక్కలు నాటారు. అనంతరం ఖానాపూర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 250గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 1,700ఎకరాలను పంపిణీ చేశామన్నారు. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందిస్తామన్నారు. వచ్చే ఖరీఫ్‌నాటికి కేఎల్ఐ ద్వారా 62వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అలాగే పాలమూర్–రంగారెడ్డి ఎత్తిపోతల చేపట్టి బీడు భూములను సస్యశ్యామలంగా మారుస్తామన్నారు. ఆమనగల్లు మండలం చింతలపల్లి నుంచి ఖానాపూర్ మీదుగా మెదక్‌పల్లి వరకు, పెద్దూర్ నుంచి తలకొండపల్లి వరకు బీటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఎక్కడ? (సెపరేట్ బాక్స్‌లో ఇవ్వండి) కాగా, ఖానాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గత ఏడాది ఉపాధిహామీ పథకం ద్వారా ఎంత ఖర్చు చేశారు, ఎన్ని పని దినాలు కల్పించారు, జాబ్ కార్డులు ఎన్ని, గ్రామంలో ఇళ్లు ఎన్ని?.. అని ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్ఏ) వెంకటేశ్‌ను మంత్రి ప్రశ్నించారు. 440జాబ్ కార్డులకు వందరోజుల పనిదినాలు కల్పిస్తే సుమారు రూ.70 లక్షలు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 12శాతం మాత్రమే చేయడమేమిటని మండిపడ్డారు. మొక్కలు నాటకపోయినా, ఉపాధిహామీ పనులు చేపట్టకపోయినా ఎఫ్ఏతోపాటు టీఏ, ఏపీఓ, ఏంపీడీఓలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సరిగా పనిచేయని వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు నర్సింహ, అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీలు లక్ష్మీదేవీరఘరాం, రాజశేఖర్; ఆయా గ్రామ సర్పంచ్‌లు అంజనమ్మ, మణెమ్మ, ఉపసర్పంచ్లు కరుణాకర్‌రెడ్డి, యాదయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ శ్రీనివాసాచార్య పాల్గొన్నారు. -
మాంసం వదిలి పరార్..
ఖానాపూర్ (ఆదిలాబాద్ జిల్లా) : ఖానాపూర్ అటవీ ప్రాంతంలో అక్రమంగా జంతువులను వేటాడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు దుప్పులు, ఒక మనుబోతు కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు వస్తున్నారని గుర్తించిన వేటగాళ్లు.. మాంసంతో పాటు, వేటాడానికి వినియోగించిన పరికరాలను అక్కడే వదిలి పరారయ్యారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడి
ఖానాపూర్: వరంగల్ జిల్లాలో గుడుంబా స్థావరాలపై ఆదివారం ఉదయం ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. ఖానాపూర్ మండలం నాజీతాండాలో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి 10 క్వింటాళ్ల బెల్లం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడులతో గుడుంబా తయారీదారులు పరారయ్యారు. అక్రమార్కులపై కేసులు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
కాపీ కొడుతూ పట్టుబడిన విద్యార్థులు
ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ నడుస్తోంది. శనివారం డిగ్రీ రెండో సంవత్సరం పరీక్షల సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఖానాపూర్ మండలంలోని పలు కళాశాలల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న 17 మంది విద్యార్థులను పట్టుకుంది. వీరిలో 12 మంది మహిళా విద్యార్థులే ఉన్నారు. మామడ మండలంలోనూ 16 మంది విద్యార్థులను పట్టుకున్నారు. దీన్ని బట్టి ఫలితాల కోసం కళాశాలలు జోరుగా మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ : ఒకరి మృతి
మల్లాపూర్: కరీంనగర్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మల్లాపూర్ మండలం రాఘవాపేట్ శివారులో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వస్తున్న ఖానాపూర్ పట్టణానికి చెందిన వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మెట్పల్లి నుంచి ఖానాపూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటో బోల్తా: ఇద్దరికి తీవ్రగాయాలు
ఖానాపూర్ (ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మందపెల్లి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఆటో బోల్తాపడి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళుతున్న ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో రమేష్, భీమ్రావు అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. -
పిచ్చికుక్క దాడి : ఐదుగురికి తీవ్రగాయాలు
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లాలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఖానాపూర్లోని పలు కాలనీల్లో ఆదివారం ఉదయం ఓ పిచ్చికుక్క స్థానికులను కరించింది. దీంతో ఐదుగురి బాధితులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక అసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పిచ్చికుక్కను పట్టుకోవడంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
వికటించిన మధ్యాహ్న భోజనం
ఖానాపూర్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం నర్సాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనం తిన్న చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. బడిలో చదువుకునే బాలల్లో 23 మంది వాంతులు, కడుపునొప్పితో బాధపడటంతో అందరినీ ఖానాపూర్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించారు. వారిలో ఐదుగురికి సెలైన్ ఎక్కిస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. -
బావిలో పడి యువకుడు మృతి
ఖానాపూర్ (ఆదిలాబాద్) : మతిస్థిమితం లేని ఓ యువకుడు బావిలో పడి మృతిచెందాడు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడుకు చెందిన ఎడ్ల పెద్ద మల్లేశ్, రాజవ్వ దంపతుల కుమారుడు మధు(20) ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఇంటి వద్దే తల్లిదండ్రులకు సాయంగా ఉంటున్నాడు. అయితే అతనికి మతిస్థిమితం సరిగా లేదు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు. కాగా శుక్రవారం మండలంలోని జిల్లాపూర్ గ్రామం వద్ద ఉన్న వ్యవసాయ బావిలో మృతదేహం ఉండగా స్థానికులు గమనించి వెలికితీశారు. అది మధుగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఖానాపూర్‌లో కార్డన్ సెర్చ్
ఖానాపూర్: అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని గొసంపల్లి గ్రామంతో పాటు పలు లంబాడి తండాలను పోలీసులు, అటవీ శాఖ, ఎక్సైజ్ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ గ్రామాల పరిధిలో ఇప్పటికే భారీగా టేకు దుంగలు, పెద్ద ఎత్తున గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఖానాపూర్ లో పెద్దపులి సంచారం
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఇక్బాల్‌పూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి నిర్మల్ వైపు నుంచి ఓ కుటుంబం కారులో వస్తున్న సయమంలో పెద్దపులి కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సోమవారం ఉదయం డీఎఫ్‌వో ప్రభాకర్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు ఇక్బాల్‌పూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగుజాడలు గుర్తించారు. గర్భంతో ఉన్న పెద్దపులి సంచరిస్తున్నట్టు తెలుసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. పెద్ద పులి సంచారం నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలో ఉన్నారు. -
రెండు కార్లు ఢీ : ఐదుగురికి గాయాలు
చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద బుధవారం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
ఖానాపూర్ (ఆదిలాబాద్ జిల్లా) : అక్రమంగా తరలిస్తున్న రూ.30 వేల విలువ చేసే కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జల్లా ఖానాపూర్ మండలం ఇక్బాల్‌పూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... అక్రమంగా ఒక వాహనంలో కలప దుంగలను తరలిస్తున్నట్లు అటవీ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు తనిఖీలు నిర్వహించి వాహనాన్ని పట్టుకున్నారు. కాగా నిందితులు పరారైనట్లు అటవీ అధికారులు తెలిపారు. కలపను స్వాధీనం చేసుకొని, వాహనాన్ని సీజ్ చేశారు. -
24 రోజుల్లో 173 కట్టించారు..
కర్నాటకలో ఓ గ్రామం సక్సెస్ స్టోరీ ప్రతి ఇంటికీ ఓ మరుగుదొడ్డి పథకం అమలు చేయడంటూ టీవీ చానెళ్లు, వార్తా పత్రికల్లో బాలీవుడ్ తార విద్యాబాలన్ ప్రకటన కనిపిస్తుంటుంది. దాన్ని ఎంతమంది ప్రేక్షకులు పట్టించుకున్నారో తెలియదుగానీ కర్నాటకలోని ఖానాపూర్ గ్రామం పంచాయతీ నాయకురాలు ప్రేమ తిమ్మనగౌడర్ మాత్రం చాలా సీరియస్‌గా తీసుకున్నారు. గ్రామంలోని 173 ఇళ్లలో 24 రోజుల్లో 173 మరుగుదొడ్లను కట్టించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం.. ఖానాపూర్తోపాటు మరో రెండు గ్రామాలకు చైర్‌పర్సన్‌గా ప్రేమ గత నెలలోనే ఎన్నికయ్యారు. అప్పుడు గ్రామంలో పది శాతం ఇళ్లలో కూడా మరుగుదొడ్లు లేవు. ఉన్నవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. మరుగుదొడ్ల ఆవశ్యకత గురించి ఆమె ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. మొదట్లో దాదాపు 90 శాతం మంది ప్రజలు ఆమె ప్రతిపాదనను వ్యతిరేకించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఒప్పుకోలేదు. తన ఆందోళనను అర్థం చేసుకున్న పది శాతం మంది ప్రజలు, ముఖ్యంగా చదువుకుంటున్న యువతను తీసుకొని కాళ్లరిగేలా మళ్లీ ఇంటింటికీ తిరిగారు. వారికి నచ్చచెప్పేందుకు శాయశక్తులా యత్నించారు. ఫలితంగా కొంత సానుకూలత పెరిగింది. తలా ఓ చేయి.. మరుగుదొడ్ల నిర్మాణానికి అంగీకరించిన ఇళ్లలో ముందుగా ఆ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో మొత్తం 173 టాయిలెట్లు నిర్మించాలని పంచాయతీ సమక్షంలో ప్రేమ నిర్ణయం తీసుకున్నారు. ఖర్చు నాలుగు లక్షల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. అంత సొమ్ము పంచాయతీ వద్ద లేదు. ప్రేమతోపాటు పంచాయతీ సిబ్బంది, యువత శక్తిమేరకు చందాలు వేసుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానంతరం కేంద్ర ప్రభుత్వం ఖర్చును తిరిగి చెల్లిస్తుందని తెలిసిన ప్రేమ ధైర్యంగా కొంత అప్పుకూడా చేశారు. ఊరిలో అందరి నుంచి సహాయం అర్థించారు. కొందరు సమీపంలోని వాగు నుంచి ఇసుకను తీసుకు రావడానికి అద్దె లేకుండా వాహనాలు ఇచ్చారు. మరికొందరు శక్తిమేరకు ఇటుకలు, రాళ్లు ఇచ్చారు. కొన్ని రోజులు కొంతమంది స్వచ్ఛందంగా కూలి చేశారు. సిమెంటును మాత్రం కొనుగోలు చేయక తప్పలేదు. ఇలా తలా ఓ సాయం చేస్తూ ఊరంతా కలిసిపోగా మరుగుదొడ్లను వద్దన్నవారు కూడా ముందుకొచ్చారు. అంతే... రికార్డు స్థాయిలో 24 రోజుల్లో 173 మరుగుదొడ్లను విజయవంతంగా నిర్మించారు. చైర్పర్సన్ ప్రేమ తిమ్మనగౌడర్ కృషిని ప్రశంసిస్తూ కేంద్రం మరుగుదొడ్ల నిర్మాణానికైన ఖర్చును తక్షణమే రీయింబర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
24 రోజుల్లో 173 మరుగుదొడ్లు
కర్నాటకలో ఓ గ్రామం సక్సెస్ స్టోరీ బెంగళూరు: ‘ప్రతి ఇంటికి ఓ మరుగుదొడ్డి’ పథకం అమలు చేయడంటూ టెలివిజన్, వార్తా పత్రికల్లో బాలివుడ్ ప్రముఖ తార విద్యాబాలన్ యాడ్ కనిపిస్తుంది. దాన్ని ఎంతమంది ప్రేక్షకులు సీరియస్‌గా తీసుకుంటారో తెలియదుగానీ కర్నాటకలోని ఖానాపూర్ గ్రామం పంచాయతీ నాయకురాలు ప్రేమ తిమ్మనగౌడర్ మాత్రం యమ సీరియస్‌గా తీసుకున్నారు. గ్రామంలోని 173 ఇళ్లలో 24 రోజుల్లో 173 మరుగుదొడ్లను కట్టించారు. ఖానాపూర్తోపాటు మరో రెండు గ్రామాలకు చైర్‌పర్సన్‌గా ప్రేమ గత జూలై నెలలోనే ఎన్నికయ్యారు. తాను ఎన్నికయ్యే వరకు గ్రామంలో పది శాతం ఇళ్లలో కూడా మరుగుదొడ్లు లేవు. ఉన్నవికూడా పరిశుభ్రంగా లేకుండా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆమె వెంటనే మరుగుదొడ్ల ఆవశ్యకత గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. దాదాపు 90 శాతం మంది ప్రజలు ఆమె ప్రతిపాదనను వ్యతిరేకించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి అంగీకరించేందుకు ఒప్పుకోలేదు. తన ఆందోళనను అర్థం చేసుకున్న పది శాతం మంది ప్రజలు, ముఖ్యంగా చదువుకుంటున్న యువతను తీసుకొని కాళ్లరిగేలా మళ్లీ ఇల్లిళ్లూ తిరిగారు. కొంత సానుకూలత పెరిగింది. ముందుగా మరుగుదొడ్ల నిర్మాణానికి అంగీకరించిన ఇళ్ల నుంచి పథకాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు. మొత్తం గ్రామంలో 173 మరుగుదొడ్లు నిర్మించాలని పంచాయతి సమక్షంలో ప్రేమ నిర్ణయం తీసుకున్నారు. ఖర్చును అంచనా వేశారు. నాలుగు లక్షల రూపాయలు అవుతుందని లెక్క తేల్చారు. అంత సొమ్ము పంచాయతీ వద్ద లేదు. ప్రేమతోపాటు పంచాయతీ సిబ్బంది, యువత శక్తిమేరకు చందాలు వేసుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానంతరం ఎలాగు కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుకు చెల్లింపులు చేస్తారని తెలిసిన ప్రేమ ధైర్యంగా కొంత అప్పుకూడా చేశారు. ఊరిలో అందరి నుంచి సహాయం అర్థించారు. కొందరు సమీపంలోని వాగు నుంచి ఇసుకను తీసుకరావడానికి అద్దె లేకుండా వాహనాలు ఇచ్చారు. మరికొందరు శక్తిమేరకు ఇటుకలు, రాళ్లు ఇచ్చారు. కొన్ని రోజులు కొంతమంది స్వచ్ఛందంగా కూలి చేశారు. సిమ్మెంటును మాత్రం కొనుగోలు చేయక తప్ప లేదు. ఇలా తలా ఓ సాయం చేస్తూ ఊరంతా కలిసిపోగా మరుగుదొడ్లను వద్దన్నవారు కూడా ముందుకొచ్చారు. అంతే రికార్డు స్థాయిలో 24 రోజుల్లో 173 మరుగుదొడ్లను విజయవంతంగా పూర్తి చేశారు. చైర్పర్సన్ ప్రేమ తిమ్మనగౌడర్ కృషిని ప్రశంసిస్తూ కేంద్రం మరుగుదొడ్ల నిర్మాణానికయిన ఖర్చును తక్షణమే రీఎంబర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఖానాపూర్ ను దత్తత తీసుకున్న సీవీ ఆనంద్
హైదరాబాద్ : 'గ్రామ జ్యోతి' కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతి మండలానికో ఊరును దత్తత తీసుకోవాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుకు అనూహ్యంగా స్పందన వస్తోంది. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ....రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. కాగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి (ఆగస్టు 17) 'గ్రామ జ్యోతి' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. -
ముగ్గురు అటవీ అధికారుల సస్పెన్షన్
ఖానాపూర్ (ఆదిలాబాద్) : కలప అక్రమ తరలింపులో స్మగ్లర్లను వదిలిపెట్టడంతోపాటు కేసును పక్క దోవ పట్టించారనే ఆరోపణలపై ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ డీఎఫ్‌వో శనివారం ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం.. ఖానాపూర్ మండలం ఎక్బాల్‌పూర్ అటవీ కార్యాలయం ఆవరణలో ఉన్న 14 దుంగలను కొందరు వ్యక్తులు గత నెల 27వ తేదీన టాటా ఏస్ వాహనంలో తరలించుకుపోయారు. దీనిపై అప్పట్లో అధికారులు.. కరీంనగర్ జిల్లా వైపు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ.50 వేల విలువైన కలపను పట్టుకున్నట్లు ప్రకటించారు. అయితే ఆ కలప తరలింపు వెనుక స్థానిక అటవీ అధికారుల ప్రోద్బలం ఉందని, స్మగ్లర్లను వదిలిపెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పట్టుబడిన వాహనం నంబర్ ఆధారంగా అధికారులు విచారణ చేయగా అది నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన రొయ్యల సురేశ్‌దిగా తేలింది. అతనిని విచారించగా షాకీర్ అనే వ్యక్తికి వాహనాన్ని లీజుకిచ్చినట్లు వెల్లడించాడు. దీంతో షాకీర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కలప అక్రమ తరలింపు రుజువైంది. ఈ విషయంతో సంబంధమున్న సత్తన్‌పల్లి ఎఫ్ఎస్వో ఎ.రవీందర్, స్పెషల్ డ్యూటీపై ఖానాపూర్ మండలం బాదన్‌కుర్తి చెక్‌పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న ఎఫ్ఎస్వో సమీ ఉల్లాఖాన్, ఎక్బాల్‌పూర్ ఎఫ్‌బీవో జాఫర్ హైమద్‌లను సస్పెండ్ చేస్తూ శనివారం నిర్మల్ డీ ఎఫ్‌వో సీపీ వినోద్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆరుగురు బాలకార్మికులకు విముక్తి
ఖానాపూర్ (ఆదిలాబాద్ జిల్లా) : ప్రభుత్వాలు బాలకార్మికుల విముక్తి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడో ఒక చోట బాలలు కార్మికులుగా పని చేస్తూనే ఉన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం కులంగూడ ఏజెన్సీ గ్రామంలో ఆరుగురు బాలకార్మికులను గుర్తించి పోలీసులు విముక్తులను చేశారు. గ్రామంలోని పలువురు రైతుల వద్ద పని చేసే ఆరుగురు బాలకార్మికులు రైతులు పెట్టే బాధలను తట్టుకోలేక వారి వద్ద నుంచి తప్పించుకొని వెళ్లారు. ఈ క్రమంలోనే వెళ్తున్న ఆరుగురు బాలకార్మికులు(నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు)లను అడవిసారంగపురి గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన నాయకులు గుర్తించారు. బాలురుని విషయాలు అడిగి తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలకార్మికులలో బాలికలను స్థానిక కస్తూర్బా బాలికల పాఠశాలకు, బాలురను ఆశ్రమ పాఠశాలలకు తరలించారు. ఈ బాలకార్మికులు ఉల్వంపాండె గ్రామానికి చెందిన పన్నేండేళ్లలోపు బాలబాలికలుగా పోలీసులు గుర్తించారు. కాగా పోలీసులు ప్రాథమిక విచారణలో రైతులు ఈ బాలకార్మికులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఖానాపూర్‌లో క్షుద్ర పూజలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో క్షుద్ర పూజలతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత రెండు నెలలుగా మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గుర్తు తెలయని వ్యక్తులు ప్రతి పౌర్ణమి, అమావాస్యలకు కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో పూజలు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం కాలనీలో మళ్లీ పూజలు నిర్వహించారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. (ఖానాపూర్) -
బస్సు బ్రేకులు ఫెయిల్ : నలుగురికి గాయాలు
ఆదిలాబాద్ (ఖానాపూర్) : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. బస్టాండ్‌లో బస్సును పార్క్ చేస్తుండగా బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో బస్సు అదుపు తప్పడంతో నలుగురు గాయపడ్డారు. కోపోద్రిక్తులైన స్థానికులు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం నిర్మల్‌కు తరలించారు. -
పాముకాటుతో యువకుడి మృతి
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మందపెల్లి గ్రామానికి చెందిన గంధం నరేశ్ (20) అనే యువకుడు సోమవారం ఉదయం పాముకాటుతో మృతిచెందాడు. మొక్కజొన్న చేనుకు కాపలాగా వెళ్లిన నరేశ్ అక్కడ మంచంపై పడుకుని ఉండగా పాము కాటు వేసింది. సోమవారం ఉదయం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చేనుకు వెళ్లి చూడగా.. మంచంపై పడి ఉన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పాముకాటు మందు అందుబాటులో లేకపోవడంతో నరేశ్ మృతిచెందాడు. -
ఖానాపూర్ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి
ఖానాపూర్ (ఆదిలాబాద్) : తమ వేతనాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 32 వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆదివారం ఉదయం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాం నాయక్ ఇంటిని కార్మికులు ముట్టడించారు. డప్పుల దరువులతో ఊరేగుతూ వచ్చిన కార్మికులు ఎమ్మెల్యే ఇంటి ముందు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. -
గంట నుంచి నిలిచిన పుష్కర స్నానాలు
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లోని పుష్కర ఘాట్‌లో స్నానాలు నిలిచిపోయాయి. గోదావరిలో పుష్కర స్నానం ఆచరించేందుకు మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 11 గంటల వరకు సుమారు 15 వేల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే, ఆ తర్వాత విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ గోదావరిలో సరిపడా నీరు లేకపోవడంతో షవర్లు ఏర్పాటు చేసి వాటి కింద పుష్కర స్నానానికి ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అయితే, విద్యుత్ లేకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.