అప్పుల భారం తాళలేక సాగు చేసే రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కష్టపడి పండించగా దిగుబడి రాక, మార్కెట్‌లో ధర పలకకపోవడంతో ఆ రైతులు తమ ప్రాణాలను తీసుకున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక తమను తాము బలి తీసుకున్నారు. పొలంలో పురుగుల నియంత్రణకు వాడాల్సిన మందు వారిద్దరూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబాన్ని పోషించలేక... అప్పులు తీర్చలేక తనువు చాలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకేరోజు ఇద్దరూ రైతులు ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది.
తానూరు (ముధోల్): మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడం, చేసిన అప్పులు తీరే దారి కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైన యువరైతు అశోక్ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజన్న తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బెంబర గ్రామానికి చెందిన చుక్కబొట్ల అశోక్ తనకున్న రెండెకరాలతోపాటు మరో ఎకరం భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. బ్యాంకు రుణాలతోపాటు ప్రైవేట్‌గా తీసుకున్న అప్పులు సుమారు రూ.3 లక్షల వరకు ఉన్నాయి. అప్పులు తీరడం లేదని మనస్తాపానికి గురైన అశోక్ మంగళవారం మధ్యాహ్నం పశువుల పాకలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భైంసా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య రాధిక, కుమారులు అభిరాం, మణికంఠ ఉన్నారు. అశోక్ తండ్రి భుజంగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు
మరో ఘటన
పెంబి (ఖానాపూర్): అప్పుల బాధతో పురుగుల మందు తాగిన మండలంలోని రాయదారి గ్రామానికి చెందిన రైతు రాథోడ్ బాబుసింగ్ (35) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. రాథోడ్ బాబుసింగ్ పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలు సాగుచేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తిపంట పూర్తిగా దెబ్బతినగా.. మొక్కజొన్ని పంట సైతం అడవి పందుల దాడిలో ధ్వంసమైంది. దీంతో అప్పు చేసి పెట్టిన పెట్టుబడులు కూడా రావేమోనని ఆందోళన చెందిన బాబుసింగ్ శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సోమవారం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
చదవండి: రాజకీయ నాయకుడి వేధింపులకు మహిళ బలి
Comments
Please login to add a commentAdd a comment