సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లకు బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ నిరాకరించింది. అసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చింది. ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ అసంతృప్తి నేతలపై ఫోకస్ పెట్టింది. బీఆర్‌ఎస్ నుంచి టికెట్ రాని నేతలతో చర్చలు జరుపుతోంది.
సాయంత్రం కాంగ్రెస్‌లోకి?
ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ రావడంతో ఖానాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. కాంగ్రెస్‌లో చేరాలని ఆమె నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ కానున్నారు. సాయంత్రం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని.. పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఖానాపూర్ క్యాడర్ తనతోనే ఉందని ధీమా వ్యక్తం చేశారు.
త్వరలోనే నిర్ణయం
ఏదైనా అనుచరులతో కలిసి నిర్ణయం తీసుకుంటానని రేఖా నాయక్ పేర్కొన్నారు. ఖానాపూర్‌లో నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పారు. త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. కాగా ఇప్పటికే రేఖా నాయక్ భర్త, మాజీ రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్ సోమవారం రాత్రే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన ఆసిఫాబాద్ స్థానం నుంచి రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలోనే రేఖా నాయక్‌ను కూడా కాంగ్రెస్‌లో చేర్చుకొని ఖానాపూర్ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
ఆయన కూడా అసంతృప్తితోనే
కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బోథ్, ఆసిఫాబాద్ స్థానాలకు కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థులను మార్చింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ పార్లమెంటు సీటు ఇస్తామని చెప్పినా.. ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. సక్కు గత ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి గెలిచి వెంటనే బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇలావుండగా బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌కు కూడా ఈసారి బీఆర్‌ఎస్ టికెట్ దక్కలేదు.
చదవండి: కేసీఆర్ వ్యూహం.. ఇది ప్రత్యర్దులకు రాజకీయ సవాల్
Comments
Please login to add a commentAdd a comment