Ticket Fight In Adilabad District: Survey Reports - Sakshi
Sakshi News home page

సోషల్‌మీడియాలో సర్వే రిపోర్టులు!

Published Wed, Jul 26 2023 1:39 PM | Last Updated on Wed, Jul 26 2023 5:24 PM

ticket fight in adilabad district - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రస్తుత వాతావరణం చల్లబడినా జిల్లాలోని రాజకీయ పరిణామాలు మాత్రం వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. సోషల్‌ మీడియాలో సర్వే రిపోర్టులు వెల్లడి కాగా ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సర్వే ఫలితం ఏ పార్టీలో ఎవరికి అనుకూలంగా ఉందని సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా, సర్వే అనుకూలంగా ఉన్న నేతలు సైలెంట్‌గా ఉంటుండగా, మిగతావరు ఫేక్‌ సర్వే అని కొట్టి పడేస్తున్నారు. మరో పక్క అధికార పార్టీలో ప్రధానంగా బోథ్, ఖానా పూర్‌ నియోజకవర్గాలో ఆశావహులు పోటాపోటీగా తమ బలబలాలను ప్రదర్శిస్తున్నారు. అధిష్టానం దృష్టిలో పడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.  

బోథ్‌లో..
నియోజకవర్గంలో అధికార పార్టీ లో నేతల మధ్య తీవ్రపోటీ నెలకొంది. మొన్నటివరకు సైలెంట్‌గా ఉన్న మాజీ ఎంపీ గోడం నగేశ్‌ ఇటీవల దూకుడు పెంచారు. నియోజకవర్గంలో విస్తతంగా పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందుంటున్నారు. ఆయన వెంట తాంసి, భీంపూర్‌ జెడ్పీటీసీలు తాటిపెల్లి రాజు, కుమ్ర సుధాకర్, బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌ ఉంటున్నారు. ఇటీవల తన బర్త్‌డే వేడుకలతో హంగామా చేసిన నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్‌జాదవ్‌ కూడా తన అనుచరులతో కలిసి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందుంటున్నారు.

ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక.. బీజేపీలో సాకటి దశరథ్, బలరాం జాదవ్‌ టికెట్‌ ఆశిస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు బోథ్‌ నియోజకవర్గంపైనే ఫోకస్‌ పెట్టారు. ప్రధానంగా ఆయన ఈ నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి నేతలు నరేశ్‌జాదవ్, ఆడె గజేందర్, వన్నెల అశోక్‌తో పాటు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు రాథోడ్‌ పార్వతి టికెట్‌ ఆశిస్తున్నారు.

ఖానాపూర్‌లో..
ఖానాపూర్‌ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార పార్టీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ మరోసారి టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. రవాణాశాఖలో పని చేస్తూ స్వచ్ఛంద విరమణ పొందిన శ్యాంనాయక్‌తోపాటు శర్వన్‌ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు అధిష్టానం ఆశీస్సులు తనకూ ఉన్నాయని జాన్సన్‌ నాయక్‌ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందుంటున్నారు.

బీజేపీ నుంచి రాథోడ్‌ రమేశ్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇక.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో పార్టీ కార్యక్రమాల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు ముందుంటున్నారు. గతంలో మహేశ్వర్‌రెడ్డి అనుచరులుగా ఉన్న చారులత ప్రస్తుతం ప్రేమ్‌సాగర్‌రావు వర్గంగా కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి భరత్‌చౌహాన్‌ కూడా రేసులో ఉన్నారు. 

ఆదిలాబాద్‌లో..
ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న మరోసారి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రంగినేని మనీషా టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే జోగు రామన్న నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాల నిర్వహణలోనూ ముందుంటున్నారు. అధిష్టానం ఆశీస్సులు తనవైపే ఉన్నాయన్న భరోసాతో ఉన్నారు.

ఇక.. కాంగ్రెస్‌లో సర్వేల అలజడి నెలకొంది. ఆదిలాబాద్‌ నుంచి కంది శ్రీనివాస్‌రెడ్డి, గండ్రత్‌ సుజాతతోపాటు అనూహ్యంగా భార్గవ్‌ దేశ్‌పాండే పేరు వినిపిస్తుండడం గమనార్హం. టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో మకాం వేశారు. ప్రధానంగా పార్టీ చేపట్టిన సర్వే వేటిని ప్రామాణికంగా తీసుకున్నారనే విషయంపై కొంతమంది రాష్ట్ర నేతలను కలిసి అసంతృప్తి వ్యక్తంజేశారు.

ఇటీవల హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారులతో జరిగిన సమావేశంలోనూ సాజిద్‌ఖాన్‌ పాల్గొన్నారు. ఈ పరిణామాలన్నీ ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌లో ఆసక్తి కలిగిస్తున్నాయి. బీజేపీలో జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చిట్యాల సుహాసినిరెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి ఎన్నికైన తర్వాత తమకు అనువుగా పరిస్థితులను మార్చుకునేందుకు ఇద్దరు నేతలు యత్నిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement