నెరవేరనున్న వైఎస్సార్ కల | sadar mart barrage Rs .486 crore construction | Sakshi
Sakshi News home page

నెరవేరనున్న వైఎస్సార్ కల

Published Fri, Feb 14 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM

sadar mart barrage Rs .486 crore construction

 ఖానాపూర్, న్యూస్‌లైన్ :  శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు దిగువనున్న సదర్‌మాట్ ఆనకట్టను ఫ్రెంచ్ ఇంజినీర్ జేజే ఒటాలే ఆధ్వర్యంలో 114 సంవత్సరాల క్రితం ఖానాపూర్ మండలం సుర్జాపూర్  పంచాయతీ పరిధి మేడంపల్లి శివారులోని గోదావరి నదిపై నిర్మించారు. ఈ ఆనకట్ట కాలువ ద్వారా కడెం, ఖానాపూర్ మండలాల్లో 26 గ్రామాల్లోని 15 వేల ఎకరాలకు అధికారికంగా, సుమారు 25 వేల ఎకరాలకు అనధికారికంగా నీరందుతోంది. అయితే ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యంలేక వర్షాకాలంలో నీరంతా గోదావరిలోకి వృథాగా పోతోం ది. దీంతో ఆనకట్ట పరిధిలో ఖరీఫ్ మినహా మిగతా సీజన్‌లో సాగుకు అవకాశం లేకుండా పోయింది.

 ఇక్కడ నీటి నిల్వ కోసం ఇక్కడ బ్యారేజీ నిర్మించాలని శతాబ్దకాలంగా రైతులు కోరుతున్నారు. బ్యారేజీ నిర్మిస్తే సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు ఖరీఫ్, రబీ సీజన్లలో కలిసి రెండు, మూడు పంటలు వేసుకునే వీలు కలుగుతుంది. ఇదే డిమాండ్‌తో శతాబ్దకాలంగా రైతులు, వివిధ సంఘాలు దశలవారీగా ఆందోళనలు నిర్వహించాయి. అయినా వీరి సమస్యను పట్టించుకునేవారు కరువయ్యారు.

 రైతుబాంధవుడి రాకతో..
 2008-09 ఉప ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పర్యటించారు. ఆ సమయంలో మండల రైతులు సదర్‌మాట్ బ్యారేజీ నిర్మించాలని వివిధ రూపాల్లో ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సదర్‌మాట్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. స్పం దించిన వైఎస్సార్ రైతుల విజ్ఞప్తిని మన్నించి ఒకరోజు ఖానాపూర్‌లోనే బసచేశారు. మండల కేంద్రం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సదర్‌మాట్‌ను సందర్శించారు. బ్యారేజీ నిర్మాణంతో రెండు సీజన్లలో రైతులు పంటలు పండించుకునే వీలుందని గమనించిన ఆయన బ్యారేజీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. సర్వే చేసి ప్రతిపాదనలు పంపాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు.

 ఈ మేరకు అధికారులు బ్యారేజీ నిర్మాణానికి రూ.305 కోట్లు అవసరమని పేర్కొంటూ నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు 2009 జనవరి 27న ఖానాపూర్ బ హిరంగ సభ కు వచ్చిన వైఎస్సార్ రూ.305 కోట్లతో బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన అకాల మరణానంతరం ఆర్థికశాఖ క్లియరెన్స్ లేక పనులకు టెండర్లు నిర్వహించలేదు.

 మళ్లీ విజ్ఞప్తులు..
 సదర్‌మాట్ బ్యారేజీ పనులు ప్రారంభించాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బ్యారేజీ నిర్మాణానికి రూ.486.27 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. దీనికి అదనంగా ఐదుశాతం నిధులు కలిపి రూ.514 కోట్లతో అంచనాలు సమర్పించారు. ఎట్టకేలకు బుధవారం భారీ మధ్యతరహా నీటిపారుదలశాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి రూ.486.27 కోట్లు మంజూరు చేస్తూ జీవో నంబర్ 71 విడుదల చేశాడు. దీంతో బ్యారేజీ నిర్మాణంపై స్థానిక ప్రజల ఆశలు చిగురించాయి.

 పొన్‌కల్ వద్ద నిర్మాణం?
  సదర్‌మాట్ బ్యారేజీ నిర్మాణాన్ని నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలం పొన్‌కల్ గ్రా మ సమీపంలో గోదావరి నదిపై నిర్మించనున్నా రు. గతంలో కేవలం కడెం, ఖానాపూర్ మండలాలకు కాలువ ద్వారా నీరందేది. బ్యారేజీ నిర్మాణం పూర్తయితే మామడ మండలంలోని గ్రామాలకు తాగునీటి సమస్య తీరడంతోపాటు భూగర్భజలాలూ పెంపొందనున్నాయి.

 దీంతో కడెం ప్రాజెక్టు ఫీడింగ్ సైతం పెరగడంతోపాటు జన్నారం మీదుగా లక్సెట్టిపేట వరకు సాగునీరందే అవకాశముందని అధికారులు పేర్కొం టున్నారు. బ్యారేజీ నిర్మిస్తే ఖరీఫ్, రబీలో పంట లు పండించొచ్చని ఈ ప్రాంత రైతులు ఆశిస్తున్నారు. ఇందుకు మూలకారకుడైన వైఎస్సార్‌కు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement