ఖానాపూర్, న్యూస్‌లైన్ : పేదరికం ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. తీవ్ర జ్వరంతో బాధపడుతు న్న తనయుడిని ప్రైవేటు వాహనంలో నిర్మల్ ఆస్పత్రికి తీసుకెళ్లే ఆర్థిక స్థోమత లేక ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే మృత్యువు ముంచుకొచ్చింది. తనయుడిని విగతజీవిగా మార్చింది. కొడుకును కాపాడుకోలేని పేదరికాన్ని నిందించుకుంటూ గుండెలవిసేలా రోదించారు. ఈ సంఘటన శనివారం మండల కేంద్రమైన ఖానాపూర్‌లో చోటు చేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పస్పుల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు రెడ్డి బుచ్చన్న, నర్సవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ (8) స్థా నిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా అతడు జ్వరంతో బాధపడుతున్నాడు. శనివారం జ్వరం తీవ్రం కావడంతో తల్లిదండ్రులు పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యుడు మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి సిఫారసు చేశారు. ఖానాపూర్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు నిర్మల్‌కు వెళ్లాలని సూచించారు. ప్రైవేటు వాహనంలో వెళితే డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయని తల్లిదండ్రులు స్థానిక బస్టాండ్‌లో కొడుకును పట్టుకుని ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో పరిస్థితి విషమించి శ్రీకాంత్ చనిపోయూడు. కళ్లముందే కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ పేదరికాన్ని నిందించుకున్నారు.
ప్రాణం తీసిన పేదరికం
Published Sun, Oct 20 2013 3:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
Advertisement