
తల్లిదండ్రులతో బాలుడు మహేశ్
ఖానాపూర్ : ఆధునిక యుగంలోనూ జనం మూఢనమ్మకాలను వీడడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంతమంది మూఢనమ్మకాలను విశ్వసిస్తూ అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. గుప్త నిధుల కోసం మనుషులను బలిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామపంచాయతీ పరిధిలోని రంగపేట గ్రామంలో సొంత తమ్ముడి కుమారుడినే బలిచ్చే ప్రయత్నం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆలస్యంగా వెలుగులోకి..
రంగపేట గ్రామానికి చెందిన గోనె లచ్చన్న–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వీరికి ఎదురుకాళ్లతో జన్మించిన చిన్న కుమారుడు మహేశ్(13) ఉన్నాడు. లచ్చన సోదరుడు (అన్న) లింగన్న గత పదిహేను రోజుల క్రితం తమ్ముడిని కలిశాడు. ఎదురుకాళ్లతో ఉన్న నీ కుమారుడు మహేశ్‌ను తమకు ఇస్తే తమకు వచ్చే దాంట్లో నీకు సగం బంగారం ఇస్తానని చెప్పాడు.
వచ్చే దాంతో పెద్ద ఇల్లు కట్టుకోవచ్చని ఆశచూపాడు. దీంతో ఆందోళనకు గురైన మహేశ్ తల్లి లక్ష్మి తానేందుకు కుమారున్ని ఇస్తానని వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన జరిగి పదిహేను రోజులైంది. ఈ క్రమంలో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తన కుమారుడికి ప్రాణభయం ఉందని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై గోగికారి ప్రసాద్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment