అగ్ని ప్రమాదాలను తగ్గించిన ‘ఫైర్‌లైన్స్‌’ | Firelines Success In Mancherial | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాలను తగ్గించిన ‘ఫైర్‌లైన్స్‌’

Published Fri, Mar 8 2019 3:18 PM | Last Updated on Fri, Mar 8 2019 3:20 PM

Firelines Success In Mancherial - Sakshi

బ్లోయర్స్‌తో ఆకులు లేకుండా దారులు శుభ్రం చేస్తున్న సిబ్బంది

సాక్షి, జన్నారం(మంచిర్యాల): వేసవిలో అడవిలో సంభవించే అగ్నిప్రమాదాల నివారణకు అమలు చేస్తున్న ఫైర్‌లైన్స్‌ విధానం సత్ఫలితాలనిస్తోంది. అడవుల్లో అగ్నిప్రమాదాల వల్ల అడవి కాలడంతోపాటు వన్యప్రాణులు, పక్షులకు ప్రమాదం పొంచి ఉంటుంది. అగ్ని ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో అటవీ శాఖ నూతన విధానాన్ని రూపొందించింది. వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారించి, అడవికి నిప్పు తగులకుండా ఆపేందుకు అధికారులు కొత్త పద్ధతి అమలు చేస్తున్నారు. అడవిలో కూలీల ద్వారా ఫైర్‌లైన్స్‌(అగ్గి వరుస) ఏర్పాటు చేసి వాటికి నిప్పు పెడితే అడవంతా రగిలే అవకాశం ఉండదనే ఉద్దేశంతో వాటిని ఏర్పాటు చేశారు. దీంతో వేసవిలో అడవికి నిప్పు తగులకుండా మంచి ఫలితాలు ఇస్తున్నాయి.

టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌లో మూడు అటవీ రేంజ్‌ల పరిధి అన్ని బీట్‌లలో ఫైర్‌లైన్‌ పనులు చేయిస్తున్నారు. జిల్లాలో ఫైర్‌లైన్స్‌ కోసం కాంపా స్కీం కింద రూ.10 లక్షలు కేటాయించారు. గత సంవత్సరం 40 కిలోమీటర్ల దూరం ఫైర్‌లైన్స్‌ చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 22 కిలోమీటర్ల దూరం చేశారు. ఆకులు శుభ్రం చేసే బ్లోయర్లు గత సంవత్సరం ఆరు కొనుగోలు చేయగా ఈసారి మరో నాలుగు బ్లోయర్లు కొనుగోలు చేశారు.

ఫైర్‌లైన్స్‌ అంటే

అడవిలో ప్రస్తుతం ఆకులు రాలిపోతాయి. దీంతో పశువుల కాపరులు గాని, అడవికి వెళ్లిన వారు గాని బీడీ, చుట్ట తాగి అలాగే పడేస్తే ఎండిన ఆకులకు అంటుకుని అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. దీని ద్వారా మంటలు అడవంతా వ్యాపించి, పక్షులు, చెట్లు, వన్యప్రాణులకు ప్రాణహాని కలిగే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఫైర్‌లైన్‌ సిస్టం ఏర్పాటు చేశారు.

ప్రతీ బీట్‌లోని అటవీ ప్రాంతాల్లో ఎడ్లబండ్ల తొవ్వలు, కాలి నడక తొవ్వలకు ఇరువైపులా ఎండిన ఆకులను 5 మీటర్ల వెడల్పులో పోగు చేస్తారు. ఈ తొవ్వలపై వేసి అడవికి అంటకుండా నున్నగా చేసి పోగు చేసిన ఆకులకు నిప్పు పెట్టి కాలుస్తారు. ఆకులు కాలే వరకు పర్యవేక్షిస్తారు. ఫలితంగా  దారి వెంట ఎవరైన బీడీ కోసం నిప్పంటించుకుని పడేస్తే నిప్పంటుకునే అవకాశం ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు దారులపై ఎండిన ఆకులను ఉండకుండా చూస్తారు. ప్రమాదవశాత్తు నిప్పంటినా ఈ దారుల వరకే వ్యాపించి ఆగుతుంది. దీంతో అడవిలో అగ్ని ప్రమాదం జరుగకుండా ఉంటుం ది. అన్ని డివిజన్లలోని కంపార్ట్‌మెంట్, బీట్, డివిజన్, బౌండరీలలో ఈ అగ్గి వరుసలు వేస్తారు.

శాటిలైట్‌ ద్వారా ఫైర్‌ అలర్ట్‌

అటవీశాఖ ఉన్నత అధికారులు అగ్ని ప్రమాదాలను నివారించేందుకు శాటిలైట్‌ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డెహ్రడూన్‌ ఆధ్వర్యంలో శాటిలైట్‌ ద్వారా ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా సమాచారం చేరవేస్తారు. ప్రతీ రోజు ఉదయం 5.30 గంటలకు ప్రమాదం జరుగుతున్న ప్రదేశం గురించి సంబంధిత అధికారులకు మొబైల్‌ ఫోన్‌కు మేసేజ్‌ వస్తుంది. కంపార్టుమెంట్‌ నంబర్, ఏరియాతో సహా తెలియపరుస్తారు.

దీంతో సంబంధిత అధికారులు జీపీఎస్‌ ద్వారా ఆ ప్రాంతానికి వెళ్లి మంటలు ఆర్పివేస్తారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో కూడా శాటిలైట్‌ ద్వారా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు. గత సంవత్సరం 90 సార్లు డివిజన్‌లో అగ్ని సమాచారాలు రాగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదని, ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఫైర్‌లైన్‌ చేసి ఆకులు కాల్చుతున్న కూలీలు

కూలీలకు చేతినిండా పని

వేసవిలో కూలీలకు చేతినిండా పని ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మే మాసం వరకు ఈ పనులు నిరంతరంగా జరుగుతాయి.  ఎండిన ఆకులను ఉండకుండా ఎప్పటికప్పుడు పోగు చేసి నిప్పంటించడం, ఆ నిప్పు అడవిలోకి వ్యాపించకుండా చూడడం కూలీల పని. ఇందుకు 5 మీటర్ల వెడల్పు, ఒక మీటర్‌ పొడవుకు రూ.5.50 కూలి ఇస్తారు. ఒక్కో కూలీ రోజుకు 20 నుంచి 40 మీటర్ల వరకు ఫైర్‌లైన్‌ వేస్తారు. దీంతో మూడు నెలల వరకు కూలీలకు పని దొరుకుతుంది.

గ్రామాల్లో అవగాహన సదస్సులు

అటవీ సమీప గ్రామాల్లో శాటిలైట్‌ ద్వారా ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు అగ్ని ప్రమాదాలు సంభవించే అటవీ సమీప గ్రామాల ప్రజలకు అగ్ని ప్రమాదాలు, నష్టంపై అటవీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.  పశువుల కాపరులు అగ్గిపెట్టలు, సిగరేట్, బీడీలు అడవులకు పట్టుకెళ్లకుండా చూస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు పొలాల్లో గడ్డికి నిప్పు పెట్టడం, చెత్త అడవిలో వేసి కాల్చడం వంటివి చేయకుండా అవగాహన కల్పిస్తున్నారు.

కొందరు బీడీ ఆకులు, ఇప్ప పువ్వు కోసం చెట్లకు నిప్పు పెట్టే అవకాశం ఉన్నందున అలాంటివి జరుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతంలోకి ఎవ్వరినీ అనుమతించకపోవడం, పశువులను మేత కోసం పంపకపోవడం, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి అవగాహన కల్పించడంతోపాటు హెచ్చరికలు జారీ చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి.

జీరో పర్సెంట్‌ ప్రమాదాలకు చర్యలు
గత సంవత్సరం 80 వరకు ప్రమాదాలు జరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్కటి కూడా జరుగకుండా చూశాం. గత సంవత్సరం మొత్తం 90 సార్లు శాటిలైట్‌ ద్వారా అగ్నిప్రమాదాల గురించి మేసేజ్‌లు వచ్చాయి. ఈ సంవత్సరం ఒక్కటి కూడా రాలేదు. అంటే డివిజన్‌లోని అడవుల్లో జీరో పర్సెంట్‌ అగ్ని ప్రమాదాలకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫైర్‌లైన్‌ పనులు జరుగుతున్నాయి. ప్రతీ రోజు బీట్‌ల వారీగా పనుల వివరాలు తెలుసుకుని ఉన్నత అధికారులకు తెలియజేస్తున్నాం.
– రవీందర్‌గౌడ్, ఎఫ్‌డీవో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement