ఇంట్లో వివరాలు సేకరిస్తున్న డీఎస్పీ,ఇంటి తాళం, బీరువాలు పగులగొట్టిన దొంగలు దొంగతనం జరిగిన ఇంట్లో వివరాలు సేకరిస్తున్న డీఎస్పీ,ఇంటి తాళం,
సాక్షి, ఖానాపూర్ (ఆదిలాబాద్) : గత మూడు నెలలుగా ఖానాపూర్‌లో దొంగల బెడదతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తూ పగలు, రాత్రి అనే తేడా లేకుండా యథేచ్చగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆయా నివాసాల్లో విలువైన బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్తున్నారు. వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు దొంగలను పట్టుకోలేక పోతున్నారు. దొంగతనాలు నియంత్రించడంలో కూడా విఫలం అవుతున్నారని పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరుస చోరీలతో మారని తీరు
పోలీస్ స్టేషన్ సమీపంలో గల అటవీ శాఖ కార్యాలయం ముందు గల వాచ్‌ల దుకాణంలో రూ. 30 వేల నగదుతో పాటు గడియారాలను దొంగలు ఎత్తుకెళ్లారు. జగన్నాథ్‌రావు చౌరస్తాలోని రాజేశ్వర్ అనే వ్యక్తికి చెందిన బంగారం దుకాణంలో చొరబడి వెండితో పాటు పలు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. విద్యానగర్‌లోని నారాయణ ఇంట్లో టీవీతో పాటు ఇతర సామాగ్రిని, కొంత నగదును ఎత్తుకెళ్లారు. జేకే నగర్‌లోని టీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఖాన్ నివాసంలో చొరబడి ఇంట్లోని పలు సామాగ్రితో పాటు కొంత నగదు కూడా ఎత్తుకెళ్లారు.
పట్టపగలే చోరీ
ఈ నెల 9న శాంతినగర్ కాలనీకి చెందిన శేఖర్ అనే వ్యక్తి నివాసంలో పట్టపగలే చొరబడి దొంగలు పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని 11 తులాల బంగారంతో పాటు రూ. లక్షా 40 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసు యంత్రాంగం ఎస్‌ఐ, సీఐతో పాటు డీఎస్పీ సైతం ఘటనా స్థలానికి చేరుకొని, పోలీసు జాగిలాలతో పాటు ఫ్రింగర్ ఫ్రింట్ క్లూస్ టీంలతో క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేపట్టారు. తాజాగా ఈ నెల 14న బాలికల ఉన్నత పాఠశాలలో చొరబడ్డ దొంగలు, క్వింటాల్‌న్నర బియ్యంతో పాటు పప్పు దినుసులు, నూనెలు, తదితర సామగ్రినీ ఎత్తుకెళ్లారు. 15న రాత్రి రిటైర్డ్ వీఆర్వో ఇంట్లో ఎవరు లేకపోవడంతో తాళాలు, బీరువాలు పగులగొట్టి తులం బంగారం ఎత్తుకెళ్లారు. హడలెత్తిస్తున్న దొంగలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
త్వరలో పట్టుకుంటాం
వరుస దొంగతనాల నేపథ్యంలో పట్టణంలో పెట్రోలింగ్ ముమ్మరం చేశాం. దొంగలను త్వరలో పట్టుకొని ప్రజలకు దొంగల బెడదను తొలగిస్తాం. ప్రజలు ఎటువంటి భయాందోళన చెందవద్దని విజ్ఙప్తి చేస్తున్నాం. విలువైన వస్తులు, బంగారం, వెండి, నగదు ఇంట్లో ఉంచుకోవద్దు. దూర ప్రయాణాలు చేసే వారు పోలీస్ ష్టేషన్‌లో ముందస్తుగా సమాచారం ఇవ్వాలి.
-జయరాం, సీఐ, ఖానాపూర్
Comments
Please login to add a commentAdd a comment