ఉపాధి అక్రమాలపై కూలీల ఆగ్రహం | labor wrath on employment irregularities | Sakshi
Sakshi News home page

ఉపాధి అక్రమాలపై కూలీల ఆగ్రహం

Published Tue, Dec 31 2013 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM

labor wrath on employment irregularities

ఖానాపూర్, న్యూస్‌లైన్ : మండలంలోని వెంకంపోచంపాడ్ పంచాయతీ పరిధి పోచంపల్లిలో ఉపాధిహామీ పనుల్లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయంటూ గ్రామానికి చెందిన కూలీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సోమవారం ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధి పనులు, ఖర్చు వివరాలు తెలపాలని సమాచారం హక్కు చట్టం కింద సంబంధిత అధికారులను అడిగి నెల రోజులు గడుస్తోందని పేర్కొన్నారు. అయితే వారు మాత్రం పూర్తి సమాచారం ఇవ్వకుండా అసంపూర్తిగా కేవలం కూలీల వివరాలే ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆందోళనకు ఆత్మగౌరవ వేదిక కన్వీనర్ మాలవత్ రోహిదాస్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య, మండల అధ్యక్షుడు మాన్క దేవన్న మద్దతు తెలిపి వారితో పాటు కార్యాలయం ఎదుట బైఠాయించారు.
 ఏపీడీ, ఏపీవోల నిలదీత
 గ్రామస్తులు మాట్లాడుతూ, పోచంపల్లిలో 2006 నుంచి 2013 వరకు 200 మందికి పైగా కూలీలు పనిచేశారని పేర్కొన్నారు. రూ.95,29,170 పనులు జరిగాయని, అయితే అధికారులు మాత్రం రూ.4,70,410 మాత్రమే చెల్లించారని మిగతా డబ్బులు చెల్లించలేదని తెలిపారు. ఈ విషయమై గ్రామానికి చెందిన యువకుడు మాలవత్ ప్రవీణ్ తోటి యువకులతో కలిసి వేలాది రూయపాలు వెచ్చించి జిల్లా కేంద్రం నుంచి సమాచారం సేకరించడంతో అక్రమాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఇందులో చనిపోయిన వారి పేరుపై కూడా బిల్లులు చెల్లించినట్లు ఉందని తెలిపారు. కేవలం 2012లోనే రూ.30 లక్షల వరకు నిధులు మంజూరైనట్లు ఉందని అదికారులు దీనిపై పూర్తి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకొన్న ఏపీడీ ప్రకాశ్, ఏపీవో దివ్యలను గ్రామస్తులు నిలదీశారు. దీంతో వారం రోజుల్లో పూర్తి సమాచారం అందించడంతో పాటు సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
 ఫీల్డ్ అసిస్టెంట్‌కు దేహశుద్ధి
 ఉపాధి అక్రమాలపై గ్రామస్తులు అధికారులను నిలదీస్తున్న క్రమంలో ఎర్వచింతల్ ఫీల్డ్ అసిస్టెంట్ పీర్యా మధ్యలో కలుగజేసుకొని పనులు చేసిన డబ్బులు ఎప్పుడో చెల్లించామని, కావాలనే ఆందోళన చేస్తున్నారనడంతో.. గ్రామస్తులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. తీవ్ర ఆగ్రహంతో ఎఫ్‌ఏను చితకబాదారు. తామంతా 50 కిలోమీటర్ల పైచిలుకు దూరం నుంచి వచ్చి ఉపాధి అక్రమాలపై అధికారులను ప్రశ్నిస్తే తమ గ్రామానికి సంబంధం లేని ఎర్వచింతల్ ఫీల్డ్ అసిస్టెంట్ తమదే తప్పనడం ఎంత వరకు సబబని అధికారులను ప్రశ్నించారు. ఎర్వచింతల్‌లో అతడు భారీగా అక్రమాలకు పాల్పడ్డాడని, అందుకే అవినీతిని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నాడని, అతడిని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. ఎఫ్‌ఏపై ఉన్నతాధికారులకు నివేదిస్తానని గొడవ వద్దని ఏపీడీ ప్రకాశ్ సముదాయించారు. గ్రామస్తులు ప్రవీణ్,  రమేశ్, దినేశ్, గోవింద్, కుమార్, గణేశ్, సంతోష్, గోపాల్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement