Employment irregularities
-
తవ్వేకొద్దీ అక్రమాలు
ఉదయగిరి : దుత్తలూరు మండలంలో ఉపాధి అక్రమాలకు అంతులేదు. తవ్వే కొద్దీ ఈ అక్రమాల జాబితా చాంతాడు లా బయటపడుతూనే ఉన్నాయి. పనులు చేయకుండానే చేసినట్లుగా కాగితాల్లో రికార్డ్ చేసి జేబులు నింపు కుంటున్నారు. ఉపాధి అక్రమాలపై జిల్లా విజిలెన్స్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. అనేక పనులకు సంబంధించి అవినీతి చోటుచేసుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని ఓ అంచనాకు వచ్చిన అధికారులు వివిధ బృందాలను మండలంలో నియమించి అన్ని పనులకు సంబంధించి తనిఖీలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. మంగళ, బుధవారం నుంచి మండలంలో విజిలెన్స్ తనిఖీలు విస్తృతంగా జరగనున్నాయి. చెక్‌డ్యాం పనుల్లోనే కాకుండా మట్టిరోడ్ల నిర్మా ణం, నాడెప్‌లు, ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, ఫాం పాండ్స్‌లలో పను లు చేయకుండానే లక్షల్లో నిధులు స్వా హా చేశారు. ఇంతవరకు వెలుగుచూసిన అక్రమాలు చాలా స్వల్పమని, పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఈ అవినీతి రూ.కోట్లలో ఉంటుం దని అధికార పార్టీకి చెందినవారే వ్యాఖ్యానిస్తున్నారు. రోడ్లు వేయకుండానే నిధుల స్వాహా మండలంలో 26 మట్టిరోడ్లకు రూ.79 లక్షలు, 37 చెక్‌డ్యాంలకు రూ.1 కోటి, 350 ఫాంపాండ్స్‌కు రూ.3.60 కోట్లు, 18 చెక్‌డ్యాంల మరమ్మతులకు రూ.30 లక్షలు ఖర్చుచేసినట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే చెక్‌డ్యాంలకు సంబంధించి పనులు చేయకుండానే పెద్దమొత్తం నిధులు స్వాహా చేసిన విషయం ఆధారాలతో సహా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ పరంపరలో మట్టిరోడ్లకు సంబంధించి కూడా అనేక పనులు జరగకుండానే నిధులు స్వాహా చేసినట్లు సాక్షి క్షేత్రపరిశీలనలో వెలుగులోకొచ్చింది. పలు గ్రామాలలో జరిగిన ఫాంపాండ్స్ పనుల్లో కూడా తీవ్ర అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. మండలంలో జరిగిన ఫాంపాండ్స్ తవ్వకాలలో తొంభై శాతం పనులు యంత్రాలతో చేయించారని ఆయా గ్రామస్తులు బహిరంగంగానే చెబుతున్నారు. కొన్ని గ్రామాలలో ఫాంపాండ్స్ తవ్వకుండానే తవ్వినట్లుగా బినామీ మస్టర్లు వేసుకొని లక్షల రూపాయలు అధికార పార్టీ నేతలు దిగమింగారు. మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా తీవ్ర అవినీతి, ఆరోపణలున్నాయి గతంలో ఎప్పుడో నిర్మించిన పాత మరుగుదొడ్లు చూపించి కొత్తగా నిర్మించినట్లు రికార్డులు నమోదుచేసి నిధులు కాజేశారు. నాడెప్‌ల నిర్మాణంలో కూడా నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా గాలికొదిలేశారు. ఫాంపాండ్స్ తవ్వకాలలో దుత్తలూరు మండలం జిల్లా స్థాయిలోనే మొదటిస్థానంలో ఉండటం గమనార్హం. దుత్తలూరు మండలంలో ప్రతి ఏడాదీ రూ.4కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య పనులు జరుగుతాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా రూ.11 కోట్లు పైగా పనులు జరగడం చూస్తే పెద్దస్థాయిలో అవినీతి జరిగిందని తెలుస్తోంది. మండలంలో పథకం ప్రారంభించినప్పటి నుంచి ఉన్న గ్రూపులు అనేకం పనిచేయలేదు. కానీ ఈ ఏడాది అన్ని గ్రూపులు పనులు చేయ టమే కాకుండా ఎక్కువ పనిదినాలు చేసినట్లుగా రికార్డుల ప్రకారం నమోదై ఉంది. అంతేకాకుండా కొత్తగా అనేక గ్రూపులు ఏర్పాటయ్యాయి. అయితే కేవలం కొంతమంది నేతలు ఉపాధి నగదును స్వాహా చేయడానికి రచించిన వ్యూహంలో భాగంగానే ఇవి ఏర్పాటయ్యాయనే ఆరోపణలున్నాయి. అధికారుల పర్యవేక్షణ ఏమైంది? మండలంలో భారీస్థాయిలో ఉపాధి పనులు జరుగుతున్నాయి. పైగా పనుల్లో జరుగుతున్న అవినీతిపై అనేక గ్రామాల ఉపాధి కూలీ లు, ప్రతిపక్ష పార్టీలు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నాలు కూడా నిర్వహించాయి. జరుగుతున్న అవినీతిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ పథకాన్ని పర్యవేక్షించాల్సిన ఎంపీడీవో, ఏపీవో పట్టించుకోకకపోవడం అక్రమార్కులకు మరింత ఊతమిచ్చినట్లయింది. కమీషన్ల వలలో పడి జేబులు నింపుకునే పనిలో నిమగ్నమయ్యారే తప్ప పర్యవేక్షణ పూర్తిగా వదిలేశారు. కోట్లాది రూపాయల సామగ్రి బిల్లుల చెల్లింపులో కీలక పాత్ర ఉన్న ఎంపీడీవో పనులు పర్యవేక్షణ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అవినీతి వ్యవహారం బయటపడిన వెంటనే తనపై ఎక్కడ వేటు పడుతుందన్న భయంతో మండలంలో జరిగిన అనేక పనులు అవినీతి వ్యవహారం గురించి తమ పైస్థాయి అధికారులకు నివేదిక అందజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తమ్మీద ఈ ఉపాధి అవినీతి, అక్రమాలలో భాగస్వామ్యం ఉన్న కొంతమంది ఉపాధి సిబ్బందిని సస్పెండ్ చేసినప్పటికీ పై స్థాయిలోవున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచిచూడాలి. -
సర్కారుకు కోటింగ్!
- రూ.2.11 కోట్ల రికవరీకి రూ.కోటి ఖర్చు - సామాజిక తనిఖీల్లో అధికారుల పనితనం - ‘ఉపాధి’ వెలుగు చూస్తున్న అవకతవకలు - ఆరేళ్లలో రూ.4.54 కోట్ల స్వాహా పావలా కోడికి ముప్పావలా మసాలా.. అన్నట్టుంది అధికారుల తీరు. ఉపాధి హామీ పథకం పనుల్లో భారీగా నిధుల స్వాహా జరిగింది. దీనిపై సామాజిక తనిఖీలు, విచారణలకు అక్షరాలా రూ.కోటికి పైగా ఖర్చయింది. ఇంతాచేస్తే కేవలం రూ.2.11 కోట్లు వసూలైంది. అవినీతిపరులకు కళ్లెం వేయాల్సిన సామాజిక త నిఖీలు వారికే ఊతమిస్తున్నాయి. కిందిస్థాయి సిబ్బందిని బలిపశువుల్ని చేయడం తప్ప స్వాహా అయిన నిధులను రాబట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని 39 మండలాల్లో 5,803 హేబిటేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 4,68,632 కుటుంబాలకు జాబ్‌కార్డులు జారీ చేశారు. 31,503 శ్రమశక్తి సంఘాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఈ గ్రూపుల్లో 6,75,453 మంది కూలీలున్నారు. ఏటా సరాసరిన నాలుగు లక్షల మం దికి డిసెంబర్ నుంచి మార్చి వరకు 70 లక్షలకు పైగా పనిది నాలు కల్పిస్తుంటారు. వీరికి వేతనాల కింద సుమారు రూ. 75 కోట్లు చెల్లిస్తుంటారు. రూ.300కోట్లకుపైగా విలువైన పను లు జరుగుతుంటాయి. సోషల్ ఆడిట్ రిపోర్టు ప్రకారం ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు అంటే ఆరేళ్ల లో రూ.4,54,31,793లు ప్రజాధనం స్వాహా అయినట్టుగా నిర్ధారించారు. ఈ మొత్తంలో ఇప్పటి వరకు రూ.2,11,86,010లు మాత్రమే రికవరీ చేయగలిగారు. ఈ అవకతవకలకు బాధ్యులుగా వివిధ స్థాయిల్లో పనిచేసే 296 మందిని తొలిగించగా, 2260 మందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఇదంతా ఒక ఎత్తయితే ఈ రూ.రెండుకోట్ల రికవరీకోసం సామాజిక తనిఖీలు, విచారణల పేరిట అక్షరాల రూ.కోటికి పైగా ఖర్చు చేశారని చెబుతున్నారు. అంటే ఈ లెక్కన రూ.4.54కోట్లు అవినీతి జరిగితే రికవరీ చేసింది కేవలం రూ.కోటి మాత్రమేనన్న మాట. ఇది కొండను తవ్వి ఎలుకను పట్టిన తీరుకు అద్దంపడుతోంది. ఆరేళ్లలో జరిగిన ఉపాధి హామీ పనులపై మరింత లోతైన విచారణ చేపడితే స్వాహా సొమ్ము కూడా పెద్ద ఎత్తునే ఉంటుందన్న వాదన ఉంది. చాలా కేసుల్లో అక్రమార్కులకు కొమ్ముకాసేలా అధికారులు వ్యవహరించారనే విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. -
ఉపాధి అక్రమాలపై కూలీల ఆగ్రహం
ఖానాపూర్, న్యూస్‌లైన్ : మండలంలోని వెంకంపోచంపాడ్ పంచాయతీ పరిధి పోచంపల్లిలో ఉపాధిహామీ పనుల్లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయంటూ గ్రామానికి చెందిన కూలీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సోమవారం ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధి పనులు, ఖర్చు వివరాలు తెలపాలని సమాచారం హక్కు చట్టం కింద సంబంధిత అధికారులను అడిగి నెల రోజులు గడుస్తోందని పేర్కొన్నారు. అయితే వారు మాత్రం పూర్తి సమాచారం ఇవ్వకుండా అసంపూర్తిగా కేవలం కూలీల వివరాలే ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆందోళనకు ఆత్మగౌరవ వేదిక కన్వీనర్ మాలవత్ రోహిదాస్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య, మండల అధ్యక్షుడు మాన్క దేవన్న మద్దతు తెలిపి వారితో పాటు కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఏపీడీ, ఏపీవోల నిలదీత గ్రామస్తులు మాట్లాడుతూ, పోచంపల్లిలో 2006 నుంచి 2013 వరకు 200 మందికి పైగా కూలీలు పనిచేశారని పేర్కొన్నారు. రూ.95,29,170 పనులు జరిగాయని, అయితే అధికారులు మాత్రం రూ.4,70,410 మాత్రమే చెల్లించారని మిగతా డబ్బులు చెల్లించలేదని తెలిపారు. ఈ విషయమై గ్రామానికి చెందిన యువకుడు మాలవత్ ప్రవీణ్ తోటి యువకులతో కలిసి వేలాది రూయపాలు వెచ్చించి జిల్లా కేంద్రం నుంచి సమాచారం సేకరించడంతో అక్రమాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఇందులో చనిపోయిన వారి పేరుపై కూడా బిల్లులు చెల్లించినట్లు ఉందని తెలిపారు. కేవలం 2012లోనే రూ.30 లక్షల వరకు నిధులు మంజూరైనట్లు ఉందని అదికారులు దీనిపై పూర్తి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకొన్న ఏపీడీ ప్రకాశ్, ఏపీవో దివ్యలను గ్రామస్తులు నిలదీశారు. దీంతో వారం రోజుల్లో పూర్తి సమాచారం అందించడంతో పాటు సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్‌కు దేహశుద్ధి ఉపాధి అక్రమాలపై గ్రామస్తులు అధికారులను నిలదీస్తున్న క్రమంలో ఎర్వచింతల్ ఫీల్డ్ అసిస్టెంట్ పీర్యా మధ్యలో కలుగజేసుకొని పనులు చేసిన డబ్బులు ఎప్పుడో చెల్లించామని, కావాలనే ఆందోళన చేస్తున్నారనడంతో.. గ్రామస్తులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. తీవ్ర ఆగ్రహంతో ఎఫ్ఏను చితకబాదారు. తామంతా 50 కిలోమీటర్ల పైచిలుకు దూరం నుంచి వచ్చి ఉపాధి అక్రమాలపై అధికారులను ప్రశ్నిస్తే తమ గ్రామానికి సంబంధం లేని ఎర్వచింతల్ ఫీల్డ్ అసిస్టెంట్ తమదే తప్పనడం ఎంత వరకు సబబని అధికారులను ప్రశ్నించారు. ఎర్వచింతల్‌లో అతడు భారీగా అక్రమాలకు పాల్పడ్డాడని, అందుకే అవినీతిని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నాడని, అతడిని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. ఎఫ్‌ఏపై ఉన్నతాధికారులకు నివేదిస్తానని గొడవ వద్దని ఏపీడీ ప్రకాశ్ సముదాయించారు. గ్రామస్తులు ప్రవీణ్, రమేశ్, దినేశ్, గోవింద్, కుమార్, గణేశ్, సంతోష్, గోపాల్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.