
తవ్వేకొద్దీ అక్రమాలు
ఉదయగిరి : దుత్తలూరు మండలంలో ఉపాధి అక్రమాలకు అంతులేదు. తవ్వే కొద్దీ ఈ అక్రమాల జాబితా చాంతాడు లా బయటపడుతూనే ఉన్నాయి. పనులు చేయకుండానే చేసినట్లుగా కాగితాల్లో రికార్డ్ చేసి జేబులు నింపు కుంటున్నారు. ఉపాధి అక్రమాలపై జిల్లా విజిలెన్స్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. అనేక పనులకు సంబంధించి అవినీతి చోటుచేసుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని ఓ అంచనాకు వచ్చిన అధికారులు వివిధ బృందాలను మండలంలో నియమించి అన్ని పనులకు సంబంధించి తనిఖీలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.
మంగళ, బుధవారం నుంచి మండలంలో విజిలెన్స్ తనిఖీలు విస్తృతంగా జరగనున్నాయి. చెక్‌డ్యాం పనుల్లోనే కాకుండా మట్టిరోడ్ల నిర్మా ణం, నాడెప్‌లు, ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, ఫాం పాండ్స్‌లలో పను లు చేయకుండానే లక్షల్లో నిధులు స్వా హా చేశారు. ఇంతవరకు వెలుగుచూసిన అక్రమాలు చాలా స్వల్పమని, పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఈ అవినీతి రూ.కోట్లలో ఉంటుం దని అధికార పార్టీకి చెందినవారే వ్యాఖ్యానిస్తున్నారు.
రోడ్లు వేయకుండానే నిధుల స్వాహా
మండలంలో 26 మట్టిరోడ్లకు రూ.79 లక్షలు, 37 చెక్‌డ్యాంలకు రూ.1 కోటి, 350 ఫాంపాండ్స్‌కు రూ.3.60 కోట్లు, 18 చెక్‌డ్యాంల మరమ్మతులకు రూ.30 లక్షలు ఖర్చుచేసినట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే చెక్‌డ్యాంలకు సంబంధించి పనులు చేయకుండానే పెద్దమొత్తం నిధులు స్వాహా చేసిన విషయం ఆధారాలతో సహా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ పరంపరలో మట్టిరోడ్లకు సంబంధించి కూడా అనేక పనులు జరగకుండానే నిధులు స్వాహా చేసినట్లు సాక్షి క్షేత్రపరిశీలనలో వెలుగులోకొచ్చింది. పలు గ్రామాలలో జరిగిన ఫాంపాండ్స్ పనుల్లో కూడా తీవ్ర అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి.
మండలంలో జరిగిన ఫాంపాండ్స్ తవ్వకాలలో తొంభై శాతం పనులు యంత్రాలతో చేయించారని ఆయా గ్రామస్తులు బహిరంగంగానే చెబుతున్నారు. కొన్ని గ్రామాలలో ఫాంపాండ్స్ తవ్వకుండానే తవ్వినట్లుగా బినామీ మస్టర్లు వేసుకొని లక్షల రూపాయలు అధికార పార్టీ నేతలు దిగమింగారు. మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా తీవ్ర అవినీతి, ఆరోపణలున్నాయి గతంలో ఎప్పుడో నిర్మించిన పాత మరుగుదొడ్లు చూపించి కొత్తగా నిర్మించినట్లు రికార్డులు నమోదుచేసి నిధులు కాజేశారు. నాడెప్‌ల నిర్మాణంలో కూడా నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా గాలికొదిలేశారు. ఫాంపాండ్స్ తవ్వకాలలో దుత్తలూరు మండలం జిల్లా స్థాయిలోనే మొదటిస్థానంలో ఉండటం గమనార్హం. దుత్తలూరు మండలంలో ప్రతి ఏడాదీ రూ.4కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య పనులు జరుగుతాయి.
కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా రూ.11 కోట్లు పైగా పనులు జరగడం చూస్తే పెద్దస్థాయిలో అవినీతి జరిగిందని తెలుస్తోంది. మండలంలో పథకం ప్రారంభించినప్పటి నుంచి ఉన్న గ్రూపులు అనేకం పనిచేయలేదు. కానీ ఈ ఏడాది అన్ని గ్రూపులు పనులు చేయ టమే కాకుండా ఎక్కువ పనిదినాలు చేసినట్లుగా రికార్డుల ప్రకారం నమోదై ఉంది. అంతేకాకుండా కొత్తగా అనేక గ్రూపులు ఏర్పాటయ్యాయి. అయితే కేవలం కొంతమంది నేతలు ఉపాధి నగదును స్వాహా చేయడానికి రచించిన వ్యూహంలో భాగంగానే ఇవి ఏర్పాటయ్యాయనే ఆరోపణలున్నాయి.
అధికారుల పర్యవేక్షణ ఏమైంది?
మండలంలో భారీస్థాయిలో ఉపాధి పనులు జరుగుతున్నాయి. పైగా పనుల్లో జరుగుతున్న అవినీతిపై అనేక గ్రామాల ఉపాధి కూలీ లు, ప్రతిపక్ష పార్టీలు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నాలు కూడా నిర్వహించాయి. జరుగుతున్న అవినీతిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ పథకాన్ని పర్యవేక్షించాల్సిన ఎంపీడీవో, ఏపీవో పట్టించుకోకకపోవడం అక్రమార్కులకు మరింత ఊతమిచ్చినట్లయింది. కమీషన్ల వలలో పడి జేబులు నింపుకునే పనిలో నిమగ్నమయ్యారే తప్ప పర్యవేక్షణ పూర్తిగా వదిలేశారు. కోట్లాది రూపాయల సామగ్రి బిల్లుల చెల్లింపులో కీలక పాత్ర ఉన్న ఎంపీడీవో పనులు పర్యవేక్షణ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అవినీతి వ్యవహారం బయటపడిన వెంటనే తనపై ఎక్కడ వేటు పడుతుందన్న భయంతో మండలంలో జరిగిన అనేక పనులు అవినీతి వ్యవహారం గురించి తమ పైస్థాయి అధికారులకు నివేదిక అందజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తమ్మీద ఈ ఉపాధి అవినీతి, అక్రమాలలో భాగస్వామ్యం ఉన్న కొంతమంది ఉపాధి సిబ్బందిని సస్పెండ్ చేసినప్పటికీ పై స్థాయిలోవున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచిచూడాలి.