ఖానాపూర్ : మహిళలపై వివక్షతోపాటు అనేక రకాలుగా హింస పెరిగిందని, రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ అన్నారు. మండల కేంద్రంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం జరిగిన ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జిల్లా ఐదవ మహాసభల్లో ఆమె మాట్లాడారు.
పురుషులతోపాటు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించడం లేదని, శ్రమదోపిడీకి గురవుతున్నారని అన్నారు. పురుషాధిక్యత వల్ల మహిళను ఒక విలాస వస్తువుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహహింస, వరకట్న నిషేధ చట్టం, లైంగిక దాడుల నిరోధక చట్టాలు ఉన్నా ప్రభుత్వాల వైఫల్యం వల్ల శిక్షలు పడడం లేదని ఆరోపించారు. మహిళలపై యాసిడ్ దాడులు, ప్రేమోన్మాద ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని తెలిపారు.
అనంతరం పీవోడబ్ల్యూ ముసాయిదా ప్రణాళికను రాష్ట్ర కార్యదర్శి చండ్ర అరుణ, జిల్లా నివేదికను జిల్లా కార్యదర్శి జ్యోతి వివరించగా.. సభలో చర్చించి ఆమోదించారు. అంతకుముందు సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ జెండాను ఆవిష్కరించారు. అమరులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కె.లక్ష్మీ, వి.పుష్ప, పి.మంగ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా నాయకురాళ్లు సమత, సరస్వతీ, విజయ, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి.శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శి నంది రామయ్య, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి కె.రాజన్న, నాయకులు రాజు, దేవన్న, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలం
Published Tue, Aug 5 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement
Advertisement