Progressive Womens Association
-
అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేదెప్పుడు..?
ఒంగోలు టౌన్ : ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్నా.. మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పసిమొగ్గ మొదలుకుని పండు ముదుసలి వరకు అత్యాచారాల బారిన పడుతూనే ఉన్నారు. అత్యాచారాలు ఆగేదెన్నడు.? వీటికి అడ్డుకట్ట వేసేదెప్పుడు..?’ అంటూ ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. లైంగిక హింస, అవమానాలకు గురైన మహిళ న్యాయదేవత ముందు కూర్చుని ‘మాపై హింసలు ఇంకానా? అత్యాచారాలు ఆగేదెన్నడు’.? అని దీనంగా ప్రశ్నిస్తున్నట్లుగా నిర్వహించిన ప్రదర్శన ఆలోచింపజేసింది. ‘స్వాతంత్య్రం జెండా మీకే భరోసా ఇవ్వకపోతే.. ఇక మా భవిష్యత్ ఏమిటి’ అని ఒక చిన్నారి ప్రశ్నిస్తున్నట్లు ఏర్పాటు చేసిన ప్రదర్శన అనేకమంది మనసులు కదిలించింది. తమ భవిష్యత్ పోరాటాలకే అనే అర్థం వచ్చే విధంగా నిర్వహించిన మరో ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నానుద్దేశించి పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పద్మ మాట్లాడుతూ దేశంలో వావీవరసలు, పిల్లలు, వృద్ధులు అనే తారతమ్యం లేకుండా మహిళలపై అత్యాచారాలు జరుగుతుండటం ఏడు పదుల స్వాతంత్య్రానికి సిగ్గుచేటన్నారు. పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు శాఖమూరి భారతి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి వాకా మంజుల, నాయకురాళ్లు సీహెచ్ పద్మ, డి.రేణుక, వై.కోటేశ్వరమ్మ, సుబ్బులమ్మ, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్యాంసన్, అఖిల భారత రైతు కూలీ సంఘ జిల్లా కార్యదర్శి కె.నాంచార్లు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ జాలన్న, అరుణోదయ అంజయ్య, పీవైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.నాగరాజు పాల్గొన్నారు. ధర్నా అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎన్జీఓ హోమ్‌లో జిల్లా సదస్సు నిర్వహించారు. రచయిత్రి కె.సూర్యకుమారి, లీగల్‌సెల్ కౌన్సిలర్ సిరిగిరి సరళ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
పీవోడబ్ల్యూ రాష్ట్ర కమిటీ ఎన్నిక
ఖమ్మం: ప్రగతి శీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలిగా గాదె ఝాన్సీ ఎన్నికయ్యా రు. మంగళవారం ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శిగా చంద్ర అరుణ, ఉపాధ్యక్షురాలిగా వి.గోదావరి (నిజామాబాద్), జ్యోతి (ఆదిలాబాద్), జ్యోతి (కరీంనగర్), సహాయ కార్యదర్శిగా కె.కల్పన, జయ (మహబూబ్‌నగర్), ఇ.పద్మ (కరీంనగర్), కోశాధికారిగా మంగ (ఆదిలాబాద్), రాష్ట్ర కమిటీ సభ్యులుగా సంధ్య, సత్తెక్క(నిజామాబాద్), హరిత, లక్ష్మి (ఆదిలాబాద్), అనసూయ (హైదరాబాద్), సిహెచ్.శిరోమణి, జి.లలిత, ఝాన్సీ, సావిత్రి (ఖమ్మం), విజయ(మహబూబ్‌నగర్)లను ఎన్నుకున్నారు. వీరితోపాటు మరో 21 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటం
జనవరి 3వ తేదీ భారతీయ తొలి ఉపాధ్యాయు రాలు సావిత్రీబాయి ఫూలే 185వ జయంతి. స్త్రీలపై సామాజిక అణచివేత, కులవ్యవస్థ పీడన, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె గత శతాబ్దంలోనే సామాజిక ఉద్యమాలను సాగించారు. సావిత్రీబాయి ఫూలే జయంతి రోజునే ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) ఖమ్మం జిల్లాలో 6వ రాష్ట్ర మహా సభలు జరుపుకోబోతోంది. జనవరి 3 నుంచి 5 వరకు జరుగనున్న ఈ మహాసభ తెలంగాణ రాష్ట్రంలో తొలి మహాసభ. 2006లో విశాఖపట్నం లో జరిగిన 5వ రాష్ట్ర మహాసభ నుంచి నిర్వహిం చిన కార్యక్రమాలను పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలను రూపొందించుకో వడానికి ఖమ్మంలో 6వ మహాసభలను జరుపు కుంటోంది. ప్రగతిశీల మహిళా సంఘం 1974లో ఉస్మా నియా విశ్వవిద్యాలయంలో అభ్యుదయ మహిళా సంఘంగా ఆవిర్భవించింది. ప్రారంభమైనప్పటి నుంచి మహిళల సాధారణ సమ స్యలపై కేంద్రీకరించడమే కాకుం డా రమీజాబీ, మధురలపై అత్యా చారం వంటి సామాజిక సమస్య లపై పీఓడబ్ల్యూ తీవ్రంగా పోరా డింది. సారా వ్యతిరేక ఉద్యమం లో, మహిళల్ని వ్యభిచార కూపా ల్లోకి లాగే ముఠాలకు, అందాల పోటీలకు వ్యతిరేకంగా సంస్థ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టి అరెస్టయ్యారు. గిరిజన తండాల్లో ఆడపిల్లల్ని అమ్మే యడం, వారిని విదేశాలకు ఎగుమతి చేయడంలో డీజీపీ భార్య తోడ్పాటు వంటి ఘటనలపై ఆందో ళన చేపట్టింది. నిర్భయ ఘటనపై దేశవ్యాప్త ఉద్య మంలో పీఓడబ్ల్యూ భాగస్వామ్యం తీసుకుంది. చట్టాలను అమలు చేసే పోలీసులు, న్యాయమూ ర్తులు, రాజకీయ నేతలకు మహిళా దృక్పథాన్ని అల వర్చాల్సిన అవసరముందని ఎలుగెత్తింది. స్త్ర్రీలపై వివక్షతకు వ్యతిరేకంగానూ, గౌరవ ప్రదమైన జీవితం కోసం పీఓడ బ్ల్యూ పోరాడుతోంది. విద్యార్థిను లపై జరుగుతున్న అవమానాలకూ, వేధింపులకూ వ్యతిరేకంగా పీఓడ బ్ల్యూ తన పిడికిలి బిగించింది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా, వరకట్న హత్యలు, అత్యాచారాలు, బాల్య వివాహాలు, అశ్లీలత సమస్య లపై ఉద్యమాలు నిర్మించింది. వివ క్షత, అవిద్య, దోపిడీ, అణచివేతలో మగ్గిపోతున్న మహిళల విముక్తికి సామాజిక మార్పు అవసరాన్ని గుర్తించి దాన్ని తన లక్ష్యంగా మార్చుకుంది. స్త్రీలు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే చైతన్యాన్ని అంది స్తూనే సమాజ మార్పు కోసం జరిగే పోరాటాల్లో మమేకమవుతోంది. నేడు సమాజంలో మహిళల మనుగడ, భద్రత, ఉపాధి ప్రశ్నార్థకంగా మారిన ప్రత్యేక పరిస్థితుల్లో ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ 6వ మహా సభను జరుపుకుంటున్నది. ఖమ్మం జిల్లాలో మహి ళలకు తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఉన్న పోరాట వారసత్వం స్ఫూర్తిని పీఓడబ్ల్యూ అందిపుచ్చుకుంటుంది. ఆనాడు రాంబాయమ్మ, గోదావరి లోయ ప్రతిఘటన పోరులో శాంతక్క, లలితక్క ప్రాణాలర్పించారు. పీఓడబ్ల్యూ జిల్లా నేతలు సుశేన, చింతా లక్ష్మిలను బూటకపు ఎన్‌కౌం టర్లలో పోలీసులు కాల్చిచంపారు. ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కూడా సంస్థ క్రియాశీ లకంగా ఉద్యమించింది. పార్లమెంటులో బిల్లుపె ట్టాలని ఆందోళన నిర్వహించింది. తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపులో అగ్రభాగాన ఉంది. మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్ రోకో, బంద్ కార్యక్ర మాల్లో పాల్గొంది. స్త్రీలపై శారీరక, మానసిక హింస లను అరికట్టడానికి ఉద్యమాలను నిర్మించాల్సిన కర్త వ్యం మహిళా ఉద్యమంపై ఉంది. - జి. ఝాన్సీ పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు -
మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలం
ఖానాపూర్ : మహిళలపై వివక్షతోపాటు అనేక రకాలుగా హింస పెరిగిందని, రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ అన్నారు. మండల కేంద్రంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగిన ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జిల్లా ఐదవ మహాసభల్లో ఆమె మాట్లాడారు. పురుషులతోపాటు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించడం లేదని, శ్రమదోపిడీకి గురవుతున్నారని అన్నారు. పురుషాధిక్యత వల్ల మహిళను ఒక విలాస వస్తువుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహహింస, వరకట్న నిషేధ చట్టం, లైంగిక దాడుల నిరోధక చట్టాలు ఉన్నా ప్రభుత్వాల వైఫల్యం వల్ల శిక్షలు పడడం లేదని ఆరోపించారు. మహిళలపై యాసిడ్ దాడులు, ప్రేమోన్మాద ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని తెలిపారు. అనంతరం పీవోడబ్ల్యూ ముసాయిదా ప్రణాళికను రాష్ట్ర కార్యదర్శి చండ్ర అరుణ, జిల్లా నివేదికను జిల్లా కార్యదర్శి జ్యోతి వివరించగా.. సభలో చర్చించి ఆమోదించారు. అంతకుముందు సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ జెండాను ఆవిష్కరించారు. అమరులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కె.లక్ష్మీ, వి.పుష్ప, పి.మంగ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా నాయకురాళ్లు సమత, సరస్వతీ, విజయ, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి.శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శి నంది రామయ్య, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి కె.రాజన్న, నాయకులు రాజు, దేవన్న, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
చట్ట సభల్లో 50 శాతం కోటా ఇవ్వాలి
హైదరాబాద్, న్యూస్‌లైన్: చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు హక్కుగా కల్పించాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) డిమాండ్ చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న ఇదే డిమాండ్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రదర్శనలు, సదస్సులు జరపాలని పిలుపునిచ్చింది. రాష్ట్ర మహాసభల్లో చేసిన తీర్మానాల వివరాలను పీవోడబ్ల్యూ ఇరు రాష్ట్రాల సయన్వయ కమిటీ సభ్యులు సంధ్య, రమాసుందరి, డి. పద్మ, ఊకే పద్మ, ఎన్.విష్ణు మంగళవారం విలేకరులకు వివరించారు. వరకట్న వేధింపులను నిరోధిస్తూ చే సిన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఆదివాసీ మహిళల ఉపాధి, నివాస, అటవీ హక్కులను పరిరక్షించే 5వ షెడ్యూల్‌ను అమలు చేయాలని, పోడు, అటవీ భూములపై ఆదివాసీలకే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కుగా గుర్తించాలని, స్టీలు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. 108 మాదిరిగా మహిళల రక్షణకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణకు సంధ్య, ఆంధ్రప్రదేశ్‌కు విష్ణు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభల్లో రెండు రాష్ట్రాలకు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశారు. పీవోడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా వి. సంధ్య, ఉపాధ్యక్షులుగా నర్సక్క, ఐలమ్మ, ప్రధానకార్యదర్శిగా ఊకే పద్మ, కార్యదర్శులుగా అనసూయ, సీత, కోశాధికారిగా సుభద్ర, సభ్యులుగా నిర్మల, రమ, లత, మేకల భారతి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీవోడబ్ల్యూ అధ్యక్షులుగా ఎన్. విష్ణు, ఉపాధ్యక్షులుగా బి. రమాసుందరి, జయమ్మ, ప్రధానకార్యదర్శిగా బి. పద్మ, కార్యదర్శులుగా విజయ, శీలం ఏసమ్మ, కోశాధికారిగా అనసూయ, సభ్యులుగా రమ, శాంతి, ఎన్. సామ్రాజ్యం, ఎస్. భారతి, మేకల కల్పనలను ఎన్నుకున్నారు. ఇరు రాష్ట్రాల సయన్వయ కమిటీ సభ్యులుగా వి. సంధ్య, ఊకే పద్మ, ఎన్. విష్ణు, బి. పద్మ, బి. రమాసుందరిలను ఎన్నుకున్నారు.