ఒంగోలు టౌన్ : ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్నా.. మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పసిమొగ్గ మొదలుకుని పండు ముదుసలి వరకు అత్యాచారాల బారిన పడుతూనే ఉన్నారు. అత్యాచారాలు ఆగేదెన్నడు.? వీటికి అడ్డుకట్ట వేసేదెప్పుడు..?’ అంటూ ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. లైంగిక హింస, అవమానాలకు గురైన మహిళ న్యాయదేవత ముందు కూర్చుని ‘మాపై హింసలు ఇంకానా? అత్యాచారాలు ఆగేదెన్నడు’.? అని దీనంగా ప్రశ్నిస్తున్నట్లుగా నిర్వహించిన ప్రదర్శన ఆలోచింపజేసింది.
‘స్వాతంత్య్రం జెండా మీకే భరోసా ఇవ్వకపోతే.. ఇక మా భవిష్యత్ ఏమిటి’ అని ఒక చిన్నారి ప్రశ్నిస్తున్నట్లు ఏర్పాటు చేసిన ప్రదర్శన అనేకమంది మనసులు కదిలించింది. తమ భవిష్యత్ పోరాటాలకే అనే అర్థం వచ్చే విధంగా నిర్వహించిన మరో ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నానుద్దేశించి పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పద్మ మాట్లాడుతూ దేశంలో వావీవరసలు, పిల్లలు, వృద్ధులు అనే తారతమ్యం లేకుండా మహిళలపై అత్యాచారాలు జరుగుతుండటం ఏడు పదుల స్వాతంత్య్రానికి సిగ్గుచేటన్నారు.
పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు శాఖమూరి భారతి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి వాకా మంజుల, నాయకురాళ్లు సీహెచ్ పద్మ, డి.రేణుక, వై.కోటేశ్వరమ్మ, సుబ్బులమ్మ, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్యాంసన్, అఖిల భారత రైతు కూలీ సంఘ జిల్లా కార్యదర్శి కె.నాంచార్లు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ జాలన్న, అరుణోదయ అంజయ్య, పీవైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.నాగరాజు పాల్గొన్నారు. ధర్నా అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎన్‌జీఓ హోమ్‌లో జిల్లా సదస్సు నిర్వహించారు. రచయిత్రి కె.సూర్యకుమారి, లీగల్‌సెల్ కౌన్సిలర్ సిరిగిరి సరళ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేదెప్పుడు..?
Published Wed, Mar 9 2016 3:56 AM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM
Advertisement