ఖానాపూర్, న్యూస్‌లైన్ : ఖానాపూర్ మండల కేంద్రంలోని జంగల్‌హన్మాన్ చౌరస్తాలో ఉన్న కొమురం భీమ్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు. రాజ్‌గోండ్ సేవాసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భీమ్ విగ్రహాన్ని ఆయన మనవడు సోనేరావు, ఎంపీ రాథోడ్ రమేశ్ 15 రోజుల క్రితం ఆవిష్కరించారు. ఈ విగ్రహం దిమ్మెకు ఉన్న శిలాఫలకాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. తలభాగం స్వల్పంగా దెబ్బతింది. శనివారం దీనిని నిరసిస్తూ స్థానిక రాజ్‌గోండ్ సేవా సంఘం నాయకులు విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.
భీమ్ విగ్రహం ధ్వంసానికి యత్నించి, శిలాఫలకం పగులగొట్టిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, అప్పటివరకు ఆందోళన కొనసాగిస్తామని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య డిమాండ్ చేశారు. ఈ సంఘటనను సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తరఫున ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయమై ఈ నెల 11న ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. విగ్రహాన్ని ఎస్సై రాము పరిశీలించారు. కార్యక్రమంలో రాజ్‌గోండ్ సేవాసంఘం అధ్యక్ష, కార్యదర్శులు అంకుశ్‌రావు, కుడిమెత మధు, నాయకులు కొమురం దేవరావు, లక్ష్మణ్, ఎల్లయ్య, శంకర్, బుక్య గోవింద్, మాలవత్ రోహిదాస్, మక్కల బీమన్న, గాండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.