ఖానాపూర్, న్యూస్‌లైన్ : రైతులు ఆయా మండలాలు, సమీపంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి విక్రయించాలని నిర్మల్ ఆర్డీవో అరుణశ్రీ అన్నారు. త్వరలో పత్తి రైతులకు తహశీల్దార్, వీఆర్వోలతో గుర్తింపు కార్డులు జారీ చేయిస్తామని చెప్పారు. గుర్తింపుకార్డులు ఉన్న రైతుల పంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖానాపూర్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ అలెగ్జాండర్ అధ్యక్షతన రైతు సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో అరుణశ్రీ మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల్లోని రైతులు పంటలను దళారులకు విక్రయించి మోసపోకుండా దూరభారమైనా కేంద్రాలకు తీసుకు రావాలని సూచించారు. మాజీ జెడ్పీటీసీ రామునాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కె.గంగారావు, మాజీ అధ్యక్షుడు కె.సురేశ్ మాట్లాడుతూ రైతులు లేకుండా రైతుసదస్సులు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. ముందుగా ప్రచారంలో చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. పైరవీలు చేయనిదే పంట కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. వరుస క్రమంలో కొనుగోలు చేయాలని, తూకంలో మోసం లేకుండా చూడాలని ఆర్డీవో అధికారులను ఆదేశించారు. సర్పంచు నేరెళ్ల సత్యనారాయణ, తహశీల్దార్ కనకయ్య, ఏడీఏ దాదేరావు, కడెం, ఖానాపూర్ తహశీల్దార్లు, ఏవోలు కనకయ్య, వీణ, గాయత్రి పాల్గొన్నారు.
రైతులకు గుర్తింపుకార్డులు
Published Sat, Oct 19 2013 3:27 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement