గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 48 ఏళ్లు. పదేళ్ల క్రితం నాకు ఆపరేషన్ చేసి ఎడమవైపు రొమ్ము తొలగించారు. ఇంతకాలంగా నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ నెల రోజుల నుంచి కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. ఆకలి కూడా తగ్గింది. నీరసంగా ఉంటోంది. అప్పుడప్పుడూ కడుపులో నొప్పి వస్తోంది. గతంలో రొమ్ముకు వచ్చిన వ్యాధి ఇప్పుడు కడుపులోకి పాకిందంటారా? నాకు తగిన సలహా ఇవ్వండి. - ఒక సోదరి, గుంటూరు
మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే క్యాన్సర్ కారణంగా మీకు రొమ్ము తొలగించారని అర్థమవుతోంది. ప్రస్తుతం మీరు కామెర్లతో బాధపడుతున్నారు. గతంలో ఉన్న రొమ్ముక్యాన్సర్ ప్రభావం కాలేయంపైన కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, కాలేయానికి సంబంధించిన రక్తపరీక్షలు చేయించుకోండి. ఈ పరీక్షల్లో మీ సమస్య బయటపడుతుంది. ఒకవేళ క్యాన్సర్ వల్ల మీ లివర్ ప్రభావితమైతే, దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి, వెంటనే చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, అవసరమైన చికిత్స తీసుకోగలరు.
నా వయసు 41 ఏళ్లు. నేను చాలాకాలం నుంచి అసిడిటీతో బాధపడుతున్నాను. మూడు నెలల క్రితం కొన్ని టాబ్లెట్లు కూడా వాడాను. ఇప్పుడు మళ్లీ అసిడిటీ కోసం కొన్ని మందులు వాడుతున్నాను. అయినా కడుపు నొప్పి, మలబద్దకం, తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నాను. దయచేసి సలహా ఇవ్వండి. - ప్రసాద్, ఒంగోలు
మీరు మందులు వాడుతున్నా ఫలితం లేదని అంటున్నారు. ఇప్పటివరకూ మీరు ఎండోస్కోపీ చేయించుకోనట్లయితే ముందుగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి ఆ ప్రొసీజర్ చేయించుకోండి. రెండో అంశం... మీకు మలబద్దకం, కడుపులో నొప్పి అని రాశారు. మీకు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఉండే అవకాశం ఉంది. ఇందులో కడుపునొప్పి, మలబద్దకం లేదా విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. యాంగ్జైటీతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవనశైలి ఉన్నవాళ్లలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి ఐబీఎస్ కాంపోనెంట్ ఉందేమో చూపించుకొని నిర్ధారణ చేసుకోండి.
డాక్టర్ భవానీరాజు సీనియర్
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
బ్రాంకైటిస్‌కు పరిష్కారం చెప్పండి?
ఆయుర్వేద కౌన్సెలింగ్
నా వయసు 54 ఏళ్లు. బరువు 62 కేజీలు. ఏడాది నుంచి దగ్గు వస్తోంది. అప్పుడప్పుడు కళ్లె పడుతోంది. డాక్టర్లు అన్ని పరీక్షలు చేయించి, ఇది ‘క్రానిక్ బ్రోంకైటిస్’ అన్నారు. ఏదో తెలియని పదార్థాలకు, వాతావరణానికి ఎలర్జీ కావచ్చని అన్నారు. మందులు చాలా వాడాను. కేవలం తాత్కాలిక ప్రయోజనం, అదీ అంతంతమాత్రం. దయచేసి సంపూర్ణ నిర్మూలనకు ఆయుర్వేద మందులు తెలియజేయగలరు. - నాగమల్లేశ్వరి, రాజమండ్రి
ఆయుర్వేద పరిభాషలో దగ్గును ‘కాస’ అంటారు. మీరు చెప్పినదానిని బట్టి మీరు ‘పిత్త ప్రధాన కఫానుబంధ’ కాసతో సతమతమవుతున్నారు. అసాత్మ్యతను (అలర్జీని) ఖచ్చితంగా కనిపెట్టలేకపోయినా ఈ కింది సూచనలు పాటిస్తే ఈ సమస్య సమసిపోతుంది. నూనె పదార్థాలు, వేపుళ్లు; ఉప్పు పులుపు కారాలు అతిగా తినడం, బజారులో అమ్మే తినుబండారాలపై మక్కువ చూపడం వంటి వాటిని త్యజించండి. వాతావరణంలో తేమ, అతిశీతలత్వం వంటివాటికి గురికావద్దు. చుట్టుపక్కల కర్మాగారాల నుంచి వెలువడే విషవాయువులు, కెమికల్స్ మొదలైన వాటిని పరిశీలించి, వాటికి దూరంగా ఉండండి.
మీకు సరిపడని వస్తువులు స్పష్టంగా తెలిస్తే వాటిని దూరం చేయ్యండి. కేవలం ఉడికించిన కూరలు, పొట్టుతీయని తృణధాన్యాలు, మొలకెత్తే గింజలు, వెజిటబుల్ జ్యూసులు (సలాడ్స్, శాకాలు పచ్చివి, గోరువెచ్చని ఉప్పునీటిలో అరగంట నానబెట్టి, కడిగి-జ్యూస్ చేసుకోవాలి), ముడిబియ్యపు అన్నం, నూనె వెయ్యని గోధుమరొట్టెలు (పుల్కాలు) మొదలైనవి శరీరానికి బలకరంగానూ, సాత్మ్యంగానూ ఉంటాయి. ఆవుపాలు, ఆవునెయ్యి తగు మోతాదులో సేవించండి. శుష్క ఫలాలు (డ్రైఫ్రూట్స్) కూడా తీసుకోవాలి.
ఔషధాలు : మహాలక్ష్మీవిలాసరస (మాత్రలు) : ఉదయం 1 రాత్రి 1
సితోపలాది చూర్ణం : 3 గ్రాములు (అరచెంచా) తేనెతో మూడుపాటలా తీసుకోవాలి.
వాసారిష్ట : నాలుగు చెంచాలు మోతాదులో మూడు పూటలా నీళ్లతో తాగాలి. (ఇవి 15 రోజులు వాడండి)
తర్వాత : ఈ కిందివి రెండు నెలల పాటు వాడాలి.
యష్టిమధు (మాత్రలు): మూడుపూటలా రెండేసి దశమూలారిష్ట (ద్రావకం) : మూడు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి తాగాలి. (మూడు పూటలా మూడు మోతాదులు)
గృహవైద్యం : శొంఠి చూర్ణం 1 గ్రాము, కరక్కాయల పొడి 1 గ్రాము, ఎండు ద్రాక్షలు 5 కలిపి ముద్దగా చేస్తే ఒక మోతాదు అవుతుంది. దీన్ని రెండుపూటలా దగ్గు పూర్తిగా తగ్గే వరకు సేవించాలి.
గమనిక : రెండు పూటలా పదేసి నిమిషాలు ప్రాణాయామం చెయ్యండి.
నేను 40 ఏళ్ల గృహిణిని. కాళ్ల వేళ్ల మధ్య అతి తరచుగా ఒరిసిపోతూ ఉంటుంది. నీళ్లలో కాళ్లుమోపి ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. వేళ్ల మధ్య పగుళ్లు, నొప్పి, మంట కూడా ఉంటుంది. చికిత్స తెలుపగలరు. - యాదమ్మ, కరీంనగర్
ఆయుర్వేదంలో దీన్ని చిన్న రోగాలలో ‘అలసక’ అని వర్ణించారు. మీరు తడికాళ్లను శుభ్రం చేసి పొడిగా ఆరబెట్టి ‘టంకణభస్మ’ను వేళ్ల మధ్య జల్లుకోవాలి. రోజూ రెండు మూడుసార్లు ఇలా చేయండి. రాత్రిపూట నింబతైల (వేపనూనె) లేదా గంధకతైలాన్ని పూతగా రాసుకోవాలి. మీరు క్యాన్వాస్ షూస్ వేసుకొని పనులు చేసుకోండి. త్వరగా తగ్గిపోతుంది. ఇంట్లో తిరిగేటప్పుడు హవాయి స్లిపర్స్ వాడండి.
డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్