హోమియో కౌన్సెలింగ్స్
నా వయసు 46 ఏళ్లు. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా?
– డి. గురుప్రసాద్, ఒంగోలు
జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్‌ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి.
కారణాలు : ∙20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది.
లక్షణాలు : కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి.
చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ,
హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
నిద్రలేమి సమస్య వేధిస్తోంది
నా వయసు 34 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ప్రతి 15 రోజులకు ఒకసారి షిఫ్ట్ మారుతుంది. ఈ మధ్యే డే–షిఫ్ట్ కు మారాను. అయినా రాత్రివేళ సరిగా నిద్రపట్టడం లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – కె. నవీన్, హైదరాబాద్
మనిషికి గాలి, నీరు, తిండి లాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర కరువైతే కళ్లలో కళాకాంతులు తగ్గుతాయి. ఉత్సాహం తగ్గుతుంది. అలసట, ఆందోళన మాత్రమే గాక అనేక ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమవుతుంది. శారీరక, మానసిక సమస్యలు తప్పవు. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపట్టినా తెల్లవారుజామున నిద్రలేవడం, రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెలకువరావడం, ప్రశాంతమైన నిద్రలేకపోవడం నిద్రలేమి సమస్యకు సంబంధించిన ఒకటి రెండు లక్షణాలు. అయితే ఇవి అన్నీ గాని... కొన్ని గాని ఉండటాన్ని వైద్య పరిభాషలో ఇన్‌సామ్నియా (నిద్రలేమి)గా చెప్పవచ్చు.
నిద్రలేమి శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆలోచన గమనాన్ని నియంత్రిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
కారణాలు : ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శారీరకంగా వచ్చే మార్పులు ∙చికాకులు ∙చీటికిమాటికి కోపం తెచ్చుకోవడం ∙దీర్ఘకాలిక వ్యాధులు ∙వంశపారంపర్యం ∙అంతులేని ఆలోచనలు
లక్షణాలు : ∙నిద్రలోకి జారుకునేందుకు కష్టపడిపోవడం ∙నిద్రపట్టినా మధ్య మధ్య మెలకువ వస్తూ ఉండటం, నాణ్యమైన నిద్ర లోపించడం ∙తెల్లవారుజామున మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టకపోవడం ∙నిద్రలేచిన తర్వాత విశ్రాంతిగా అనిపించకపోవడం
నిర్ధారణ పరీక్షలు : రక్తపరీక్షలు, పాలీసామ్నోగ్రామ్ (పీఎస్‌జీ)
చికిత్స : హోమియోలో నిద్రలేమి సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది. నక్స్‌వామికా, ఓపియమ్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బమ్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పాసీఫ్లోరా 20 – 25 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్రపడుతుంది.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి,
ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
యానల్ ఫిషర్ నయమవుతుందా?
నా వయసు 66 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. హోమియోలో దీనికి చికిత్స ఉందా? – ఏ. సూర్యనారాయణమూర్తి, ఏలూరు
మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది.
కారణాలు : ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది.
లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట.
చికిత్స : ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది.
డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్,
పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్
Comments
Please login to add a commentAdd a comment