పొట్టంతా టైట్‌గా ఉండి... కడుపంతా ఉబ్బరం’’ ఒకరి ఆవేదన. ‘‘అబ్బా... గొంతులోంచి పైకి వస్తున్న మంటలా ఏదో బర్నింగ్ సెన్సేషన్’’ ఇంకొకరి ఆక్రందన. ‘‘తిన్నవెంటనే రొమ్ముమీదే అతుక్కున్నట్టుగా ఉంటోంది. యాంటాసిడ్ ఏదైనా ఉందా’’ మరొకరి అభ్యర్థన. ఇలాంటి మాటలన్నీ ఏ కుటుంబంలోనైనా ఎవరో ఒకరి నుంచి తరచూ వినిపిస్తుండేవే. గతంలో కాస్తంత పెద్దవాళ్లు మాత్రమే అనే ఈ మాటల్ని ఇటీవలి లైఫ్‌స్టైల్‌తో మరీ కొందరు చిన్నపిల్లల్ని మినహాయిస్తే... యువతా, మధ్యవయస్కులూ, పెద్దలూ ఇలా వయసు తేడాల్లేకుండా అందరూ మాట్లాడేస్తున్నారు. కారణం గ్యాస్ చేరి కడపంతా ఉబ్బరంగా ఉంటూ, పొట్ట టైట్‌గా అనిపిస్తూ ఏమాత్రం స్థిమితం లేకుండా చేయడం. కడుపులో ‘గ్యాస్’ చేరుతుందనే ఈ గ్యాస్ట్రిక్ సమస్య గురించి తెలుసుకుందాం.
సాధారణంగా మనం ఆహారంతోపాటు గాలినీ మింగేస్తుంటాం. దాంతో అది పెరిస్టాలిటిక్ చలనంతో జీర్ణవ్యవస్థలోకి వెళ్తుంది. చాలా సందర్భాల్లో తేన్పు రూపంలో బయటికొస్తుంది. మరీ కాస్త కిందికి వెళ్లి ఉంటే పెద్ద పేగుల ద్వారా మలద్వారం గుండా కింది నుంచి వెళ్లే గ్యాస్ రూపంలో బయటకు పోతుంటుంది. అయితే కొంతమందిలో ఆ గ్యాస్ కడుపులో చిక్కుకుపోయినట్టుగా మారి పోట్టఉబ్బరంగా, ఇబ్బందికరంగా మారుతుంది. మొదట్లోనే ఈ సమస్యను పట్టించుకోకపోతే అది దీర్ఘకాలంలో మలబద్ధకం, పొట్టనొప్పి, హైపర్ అసిడిటీలకు దారితీయవచ్చు.
ఈ సమస్య ఎవరెవరిలో...
ఆహారాన్ని బాగా వేగంగా తినేసేవారు వదులుగా ఉండే కట్టుడుపళ్లు ఉన్నవారు... (వీళ్లు గ్యాస్ ఎక్కువగా మింగుతుంటారు) ∙పోగతాగే అలవాటున్నవారు చ్యూయింగ్‌గమ్ నమిలేవారు ఏవైనా పదార్థాలను చప్పరిస్తూ ఉండేవారు ∙కార్బొనేటెడ్ డ్రింక్స్ / కూల్‌డ్రింక్స్ (గ్యాస్ కలిగి ఉండేవి) ఎక్కువగా తాగేవారిలో.
ఛాతీలో/కడుపులో మంట ఎందుకంటే...?
ఆహారం తిన్న తర్వాత సరిగా అరగకపోవడం; కొన్ని తిన్న తర్వాత అవి ఛాతీలోపల అంటుకున్నట్టుగా ఉండటం; ఛాతీలో / గుండెలో మంటగా అనిపించడం అనే సమస్య నిత్యం చాలామంది ఎదుర్కొనేదే. ఎందుకిలా జరుగుతుంటుందంటే... ఆహారం తీసుకున్న వెంటనే దాన్ని జీర్ణం చేసేందుకు కడుపులో కొన్ని ఆమ్లాలు (యాసిడ్స్) స్రవిస్తాయి. ఈ యాసిడ్స్ కొందరిలో కడుపునకు పై భాగంలో ఉండే బిరడా వంటి స్ఫింక్టర్ కండరం కాస్తంత వదులైనందువల్ల పైకి వచ్చేస్తుంటాయి. ఇలా గొంతులోకి పుల్లటి పదార్థాలు రావడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. సదరు యాసిడ్ గ్యాస్ కారణంగా అన్నవాహిక నుంచి పైకి పయనించడాన్ని యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. ఈ యాసిడ్ వల్లనే ఛాతీలో / కడుపులో మంట వస్తుంటుంది.
గ్యాస్‌కు కారణమయ్యే ఆహారాలు ఏమిటంటే...
కొన్ని రకాల ఆహారాలు తీసుకునేవారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అవి...
పోట్టు ఉండే ఆహారధాన్యాల్లో గోధుమలు, ∙కూరగాయల్లో బ్రాకొలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లిగడ్డలు, బీన్స్ ∙పండ్లలో పియర్స్, ఆపిల్స్, పానీయాల్లో గ్యాస్ ఎక్కువగా ఉండే సోడాలు, కూల్‌డ్రింక్స్, ∙పాలు, పాల ఉత్సాదనల్లో పెరుగు, ఐస్‌క్రీమ్స్, చీజ్, ∙ప్యాకేజ్‌డ్ ఫుడ్స్‌లో బ్రెడ్స్ వంటివి తినే వారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ పోవడం ఎక్కువ. అయితే వీటిలో సోడా, కూల్‌డ్రింక్స్ మినహాయిస్తే మిగతావి ఆరోగ్యకరం. కాబట్టి సమస్య రానంత మేరకు వాటిని తగు మోతాదులో తీసుకోవాలి.
గ్యాస్ సమస్య తగ్గాలంటే...
ఆహారం తీసుకునే సమయంలో గాలి ఎక్కువగా నోట్లో పోకుండా చేయడం వల్ల చాలావరకు గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు.
దీనికోసం తీసుకోవాల్సి జాగ్రత్తలు..
తినే సమయంలో మెల్లగా, నింపాదిగా తినాలి ∙పెదవులు మూసి తినడం మేలు ∙పోగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి కట్టుడు పళ్లు ఉన్నవారు డెంటిస్ట్ సహాయంతో అవి సరిగా అమరేలా చూసుకోవాలి ∙సోడాలు, కూల్‌డ్రింక్స్, బీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి జ్యూస్ రూపంలో కాకుండా పండ్లను కొరికి, నమిలి తినాలి గ్యాస్ ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవడం ∙కొవ్వులు ఉండే పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం ∙వేళకు తినడం (చాలా మంది వేళకు తినకుండా చాలా ఆలస్యంగా తింటుంటారు. వారిలో గ్యాస్‌తో కడుపు ఉబ్బరం రావడం చాలా ఎక్కువ) ∙ఏం తింటున్నామో గమనిస్తూ, వాటిలో దేనివల్ల గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువవుతోందో గుర్తించి, ఆ ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో చాలావరకు ఈ సమస్యను అధిగమించవచ్చు.
మరో సూచన : పాలు, పాల ఉత్పాదనలు తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా మారిపోయి, గ్యాస్ సమస్య పెరుగుతుంటే... మార్కెట్‌లో ఇటీవల ల్యాక్టోజ్ రహిత పాలు, పాల ఉత్పాదనలు దొరుకుతున్నాయి. వీటితో గ్యాస్, పోట్ట ఉబ్బరం సమస్యను దూరం చేసుకోవచ్చు.
కడుపు ఉబ్బరం సమస్యకు సాధారణ పరిష్కారాలు...
∙తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. రోజుకు రెండు మూడు సార్లు ఎక్కువగా తినడం కంటే... తక్కువ మోతాదుల్లో 4 నుంచి 6 సార్లు తినడం మేలు ∙ఆహారం పీచు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఇందుకు... పోట్టుతో ఉండే ధాన్యాలతో చేసిన ఆహారం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తినాలి ∙చేపలు తినేవారు తమ ఆహారంలో చేపలను వారంలో కనీసం రెండు–మూడు సార్లకంటే ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది ∙ఎక్కువ కొవ్వుతో ఉండేవి, బాగా వేయించిన ఆహారపదార్థాలను వీలైనంత పరిమితంగా తీసుకోవాలి
తినకముందే పాక్షికంగా పులిసే పదార్థాలైన ఇడ్లీ, దోసెల వంటివాటిని (పూరీ, చపాతీల కంటే) మీ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఎక్కువగా తీసుకోండి. అలాగే ఇలా పులిసేందుకు అవకాశం ఉన్న మజ్జిగ వంటి ఆహారాల్లో జీర్ణవ్యవస్థకు మేలు చేసే ‘్రపో–బయాటిక్’ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అయితే అది పూర్తిగా పులియకముందే తాజాగా ఉన్నప్పుడు తినడం మంచిదని గుర్తుంచుకోవాలి ∙మాంసాహారం తినాలనుకునేవారు వేటమాంసం, రెడ్‌మీట్ కంటే కొవ్వు తక్కువగా ఉంటే చికెన్‌ను ఎంచుకోవడం అన్నివిధాలా మంచిది.
రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. ఇక కాఫీలు, ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. కాఫీలు పరిమితంగా తీసుకున్నప్పటికీ, పోగతాగే అలవాటుకు దూరంగా ఉండాలి. ఆల్కహాలిక్ డ్రింక్స్ పూర్తిగా మానేయాలి ∙రోజూ చురుగ్గా ఉండండి. వ్యాయామం చేయండి .బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.
ఇక్కడ పేర్కొన్న ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నంత కాలం మన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుందని గుర్తుంచుకోండి.
ఈ సమస్యను పెంచేవి ఇవే...
ఎక్కువగా నమలకుండానే గబగబా ఆహారాన్ని మింగేయడం ∙సాధారణం కంటే ఎక్కువగా ఆహారం తీసుకోవడం
తీసుకున్న ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉండటం ∙కొందరిలో పుల్లటి ఆహారాలైన టొమాటో, పులుపు ఎక్కువగా ఉండే నిమ్మ జాతి పండ్లు, కూల్‌డ్రింక్స్‌లో కోలా డ్రింక్స్ ఎక్కువగా తాగడం, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీతో పాటు కొన్నిసార్లు టీ ఎక్కువగా తాగడం వంటి అంశాలన్నీ ఛాతీలో మంటకు కారణమవుతాయి. ఈ పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం లేదా వీలైతే తీసుకోకుండా ఉండటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment