చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరంలో గల ఓ పాఠశాలలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనతో పలువురు విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. గ్యాస్ లీకేజీ కారణంగా పిల్లలతో పాటు కొందరు ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువొత్తియూర్‌లోని మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 30 మందికి పైగా విద్యార్థులు గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థత బారిన పడ్డారు. బాధితులను స్కూలు సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, వారికి చికిత్స జరుగుతున్నదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
విద్యార్థులకు సాయం అందించేందుకు వచ్చిన ఎన్‌డీఆర్‌ఎఫ్ కమాండర్ ఏకే చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ గ్యాస్ లీకేజీకి ఖచ్చితమైన కారణం తెలియరాలేదన్నారు. తమ బృందం బాధితులకు సహాయం అందిస్తున్నదన్నారు. బాధిత విద్యార్థి ఒకరు మాట్లాడుతూ గ్యాస్ లీకేజీతో ఇబ్బంది ఎదుర్కొన్న మేము తరగతి గది నుండి బయటికి పరుగుపరుగున వచ్చేశామన్నారు. ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారని, కొంతమంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. వెంటనే బాధిత విద్యార్థులకు ఉపాధ్యాయులు సాయమందించాన్నారు.
పాఠశాలలో నుంచే గ్యాస్ లీకేజీ జరిగిందా లేదా రసాయన కర్మాగారం నుంచి వచ్చిందా అనేది స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం తెలియగానే విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూలుకు చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పాఠశాల సిబ్బంది స్పష్టమైన సమాచారం అందించడం లేదని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: డెడ్ డ్రాప్ పంథాలో సింథటిక్ డ్రగ్స్ దందా!
Comments
Please login to add a commentAdd a comment