పెళ్లయిన ఆరునెలలకే విషాదాంతం | married woman commit to suicide | Sakshi
Sakshi News home page

పెళ్లయిన ఆరునెలలకే విషాదాంతం

Published Wed, Jan 17 2018 9:12 AM | Last Updated on Wed, Jan 17 2018 9:12 AM

married woman commit to suicide  - Sakshi

భర్త సంజయ్‌కుమార్‌తో సోనీ , మృతురాలు సోనీ

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): పెళ్లయిన ఆరు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. యల్లపువానిపాలెంలో తీవ్ర విషాదం నింపిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. పొన్నపు సోనీ(26)కి శ్రీకాకుళం జిల్లా నర్సిపురం ప్రాంతానికి చెందిన సంజయ్‌కుమార్‌తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. సంజయ్‌కుమార్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సోనీ కన్నవారి ఇంట్లోనే దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం ఆయన ఉద్యోగ రీత్యా క్యాంపు వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఇంటి బయట సోనీ తల్లిదండ్రులు కాలెమ్మ, అప్పారావు ఉండగా, కూతురు ఎంతకీ బయటకు రావడం లేదేంటని గదిలోకి వెళ్లి చూశారు. ఫ్యానుకి వేలాడుతూ కనిపించడంతో వీరు నిశ్చేష్టులయ్యారు.

స్థానికుల సహకారంతో ఆమెను బతికించుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మరణించింది. ఘోరం జరిగిపోయిందంటూ సోనీ తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగారు. కన్నీరుమున్నీరై విలపించారు. జరిగిన సంఘటనపై గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ తమ్మినాయుడు సిబ్బందితో విచారణ చేపట్టారు. సోనీ తల్లిదండ్రులను ఆరా తీశారు. తమకు ఎలాంటి అనుమానాలూ లేవని, కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోందని, కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సోనీ సున్నిత మనస్కురాలు అని స్ధానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. ఎస్‌ఐ తమ్మినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భర్త ఊళ్లోలేని సమయంలో...
అప్పారావు, కాలెమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. మూడో కుమార్తె సోనీ. ఆరునెలల క్రితమే శ్రీకాకుళం జిల్లా నర్సిపురం ప్రాంతానికి చెందిన సంజయ్‌కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. ప్రైవేటు సంస్థలో ఇంజినీరుగా పని చేస్తున్నాడు.  శ్రీకాకుళం నుంచి క్యాంపు వెళ్లే ముందు గోపాలపట్నంలోని  యల్లపువానిపాలెంలో సోనీ కన్నవారి ఇంట్లో ఈ నెల12న దించి వెళ్లారు. ఆయన చిత్తూరు క్యాంపు వెళ్లారు. ఇంతలోనే సోనీ ఆత్మహత్యకు పాల్పడడంతో జరిగిన సంఘటన తెలిసి హుటాహుటిన నగరానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement