ఇంట్లో ఫేవరేట్ వంటలు చేస్తే ఆరోజు మన చేతికి ఎముక ఉండదు. లాగించెయ్యడమే... ఇక రోడ్డు పక్క స్టాల్స్, హోటళ్ల ఇష్టమైన, ఘుమఘుమలాడే చిరుతిండ్లు కనిపిస్తే ఇంకేముంది.. క్షణాల్లో అక్కడ వాలిపోతాం! ఆనక.. తిన్నది అరగక.. పడేతిప్పలు అన్నీఇన్నీకాదు. కడుపునొప్పితో ప్రారంభమై వాంతులు, మలబద్ధకం/విరేచనాలు... ఒక్కోసారి.. క్లైమాక్స్‌లో హాస్పిటల్ బిల్ చూసి మూర్చపోయేంత పనౌతుంది. పిల్లలు, పెద్దల్లో సర్వసాధారణంగా కనిపించే కడుపునొప్పికి వంటింట్లో దొరికే ఈ 5 రకాల పదార్థాలతో ఏ విధంగా ఉపశమనం పొందవచ్చో నిపుణుల మాటల్లో..
అల్లం
కడుపునొప్పి సాధారణ లక్షణాలు వికారం, వాంతులు. వీటి నివారణకు ఎప్పుడైతే చర్యలు తీసుకుంటామో అప్పుడు మన శరీరం కొంత తేరుకుంటుంది. వికారం, వాంతులకు సహజమైన నివారణ మంత్రం అల్లం అని చెప్పవచ్చు. అల్లం నేరుగా తిన్నా లేదా వంటల్లో వాడినా ఎంతో మేలు చేస్తుంది. ద్రావణ రూపంలో తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు, తాపనివారణకు అల్లం అద్భుతమైన ఔషధమని ఫోర్టిస్ హాస్పిటల్‌కు చెందిన డా. అహుజా తెలిపారు.
సీమ చామంతి
కడుపునొప్పితో సహా వివిధ వ్యాధుల నివారణకు పూర్వకాలం నుంచే సీమ చామంతి వాడుకలో ఉంది. పేగు సంబంధిత వ్యాధులు అంటే గ్యాస్, అజీర్ణం, డయేరియా, వాంతులకు ఈ ఔషధమొక్క బాగా పనిచేస్తుంది. దీనిని కషాయం రూపంలో పిల్లలకు పట్టిస్తే కడుపునొప్పి ఇట్టే మాయం అవుతుంది. ఈ వ్యాధుల నివారణలో సీమ చామంతి ఔషదమొక్క కీలకపాత్రపోషిస్తున్నప్పటికీ, దీని పనితీరుపై మరికొంత అధ్యయనం చేయవలసి ఉంది.
పెప్పర్‌మింట్(పుదీనా)
ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనేది పెద్ద పేగు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధి. కడుపునొప్పి, ఉబ్బసం, మలబద్ధకం, డయేరియా వంటివి దీని ప్రధాన లక్షణాలు. అసౌకర్యాన్ని కలిగించే ఈ లక్షణాలను పెప్పర్‌మింట్ హెర్బల్‌తో నివారించవచ్చు. పేగుల్లో ఆకస్మికంగా సంభవించే కండరాల నొప్పి తగ్గించడానికి, వాంతులు, డయేరియాల నివారణకు పెప్పర్‌మింట్‌లోని మెంథాల్ ఉపయోగపడుతుందని బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అధ్యయనాలు వెల్లడించాయి.
చదవండి: Red Lady Finger: ఎర్ర బెండీ.. భలే భలే.. వాళ్లకి మేలు!
గ్రీన్ బనానా
డయేరియా తీవ్రతను పచ్చ అరటితో తగ్గించవచ్చు. పచ్చ అరటిలో రెసిస్టెంట్ స్టార్చ్ అనే ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. అది యాంటి డయేరియా కారకాలు కలిగి ఉంటుంది. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల్లో నెమ్మదిగా పులిసిన షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పేగులు ఎక్కువ నీటిని పీల్చుకొనేలా ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా అరటిలో విటమిన్ ‘బి6’, పొటాషియం, ఫోలిక్ యాసిడ్‌లు కూడా ఉంటాయి.
ఈ పోషకాలు తిమ్మిరి, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. డయేరియా నివారణలో పచ్చ అరటి ప్రయోజనాలపై వెనుజులాకు చెందిన పీడియాట్రీషియన్ డా. థైజ్ అల్వరెజ్ అకోస్టా నిర్వహించిన పరిశోధనాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
పెరుగు
జీర్ణక్రియ కార్యకలాపాల్లో మార్పుల కారణంగా కడుపునొప్పి సంభవిస్తుంది. అంటే కడుపులోని బ్యాక్టీరియా అసమతుల్యతం అవుతుందన్నమాట. ప్రోబయోటిక్స్ (మంచి సూక్ష్మజీవులు) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గ్యాస్, ఉబ్బసం వంటి రుగ్మతలకు పుల్‌స్టాప్ పెట్టవచ్చు. పెరుగులో జీవించి ఉండే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది.
ఇది మలబద్ధకం, డయేరియా (అతిసారా) నివారణకు తోడ్పడుతుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగిన వారు పెరుగు సేవిస్తే సులభంగా జీర్ణం అవుతుంది. ప్రోబయోటిక్ ఉత్పత్తులు ఐబీఎస్ రుగ్మతలకు ఉపశమనం కలిగిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలోని జువాలజీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ఎనా రే బెనర్జి వెల్లడించారు.
చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే...
Comments
Please login to add a commentAdd a comment