హోమియో కౌన్సెలింగ్
నా వయసు 43 ఏళ్లు. నేను ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్రై్టటిస్ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? – దిలీప్‌కుమార్, వరంగల్
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అధిక పని ఒత్తిడి వల్ల, దూరాభారాలు ప్రయాణాలు చేస్తూ ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న నేపథ్యంలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో చాలామంది గ్యాస్రై్టటిస్ సమస్యతో ఇప్పుడు బాధపడుతున్నారు. జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర వాపునకు గురికావడాన్ని గ్యాస్రై్టటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై, కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే ఎక్యూట్ గ్యాస్రై్టటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్రై్టటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి.
కారణాలు: 20 నుంచి 50 శాతం ఎక్యూట్ గ్యాస్రై్టటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్రై్టటిస్ సమస్య కనిపిస్తుంది.
లక్షణాలు: కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం lకొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి.
చికిత్స: హోమియో వైద్య విధానంలో గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి
హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
చిన్న చిన్న వస్తువులను ముక్కులో పెట్టుకుంటే ఏంచేయాలి?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
పిల్లలు తమ ఆటల్లో భాగంగా ముక్కులో అవీ ఇవీ పెట్టుకుంటుంటారు. ఇటీవల మా చిన్నాన్నగారమ్మాయి ఇలాగా చిన్న బలపం ముక్క పెట్టుకుంది. ఇలా జరిగినప్పుడు ఏమి చేయాలో వివరంగా తెలపగలరు. – సుష్మిత, హుజూర్‌నగర్
సాధారణంగా పిల్లలు... గింజలు, పెన్సిల్ ముక్కలు, చిన్న గోలీల వంటి వాటిని ముక్కులో పెట్టుకుంటారు. అలాంటప్పుడు ముక్కులో ఇరుక్కున్న వస్తువును మనమే తీయడానికి ప్రయత్నించినా లేదా ఆ గింజ వంటి వస్తువు గాలిని పీల్చుకునే గొట్టం లోపలి భాగంలోనికి వెళ్లి శ్వాస ప్రక్రియకు అడ్డం పడ్డా అది చిన్నారికి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల వాటిని బయటకు తీయడానికి మనంతట మనమే ప్రయత్నించకూడదు. ఈ ప్రయత్నంలో తమకు తెలియకుండానే ముక్కుకు కూడా మనం హాని చేసినవాళ్లమవుతాం. ఈ సమయంలో బిడ్డను కంగారు పెట్టకుండా అవతలి ముక్కు రంధ్రాన్ని మూసి, ఏ ముక్కు రంధ్రంలో గింజ పెట్టుకుందో అక్కడి నుంచి వేగంగా గింజ బయటకు వచ్చేలా బిడ్డ చేత గట్టిగా తుమ్మించాలి. అదృష్టవశాత్తు గింజ బయటకు వచ్చేసినా కూడా ఒకసారి ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాలి. ఒకవేళ గింజ బయటకు రాకపోతే అప్పుడు తప్పనసరిగా ఈఎన్‌టీ వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. హాస్పిటల్‌కు వెళ్లే దారిపొడవునా చిన్నారి తలను కాస్త ముందుకు ఒంగి ఉంచేలా చూడాలి. హాస్పిటల్‌లో వైద్యులు ఫోర్‌సెప్స్‌తో జాగ్రత్తగా ఆ గింజను తీసేస్తారు.
ఒక్కోసారి పిల్లలు ముక్కులో గింజలూ, అవీ పెట్టుకొని తల్లిదండ్రులకు చెప్పరు. ఎప్పుడైనా ఒక ముక్కు రంధ్రం నుంచి ఎక్కువగా చీమిడి కారుతున్నా, శ్వాసతీసుకునే సమయంలో శబ్దం ఎక్కువగా వస్తున్నా వెంటనే ఈఎన్‌టీ వైద్యనిపుణులను సంప్రదించాలి. లేకపోతే ఇరుక్కున్న గింజల వల్ల చీముపట్టడం, జ్వరం రావడం, మరిన్ని ఇతర సమస్యలు తలెత్తవచ్చు.
చంటిపిల్లలు పాలు తాగిన తర్వాత వాంతులు చేసుకుంటారు. దీనికి పరిష్కారం? – చంద్రిక, నడిగూడెం
చంటిపిల్లలు పాలు తాగిన తర్వాత కాసేపటికి వాంతి చేసుకోవడం సహజం. దీనికి మనం ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు. బిడ్డ ఎదుగుదల బాగుండి, ఈ చిన్న వాంతుల వల్ల దగ్గుగానీ, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు కానీ, నెమ్ము పట్టడం వంటి సమస్యలు రానంతవరకు మనం ఆదుర్దా పడక్కర్లేదు. బిడ్డ పెరిగేకొద్దీ లేదా ఘనాహారం మొదలుపెట్టాక సమస్య దానంతట అదే తగ్గుతుంది. పాలు తాగించేటప్పుడు, తాగించాక కనీసం అర్ధగంట సేపు బిడ్డ తల వైపు భాగం కాస్త ఎత్తుగా ఉండేటట్లు చూసుకుంటే ఈ సమస్య చాలావరకు నివారించవచ్చు. పాలు తాగించాక తేన్పు తెప్పించడం ముఖ్యం. కొంతమంది చంటి పిల్లలు వాంతులు ఎక్కువగా చేసుకుంటారు. దానివల్ల సరిగా బరువు పెరగరు. కొంతమందికి ఈ వాంతుల వల్ల పొలమారి (పొరబోయి) మాటిమాటికీ నెమ్ముపడుతుంది. లేదా ఒక్కోసారి పొరబోయి గొంతులో అడ్డంపడి ఊపిరి అందక ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. కొంతమంది పిల్లలకు వాంతుల సమస్య రెండో నెలలో మొదలు కావచ్చు. కష్టపడి వాంతులు చేస్తున్నట్లు పెద్ద వాంతులు చేస్తారు. బరువు సరిగా పెరగకపోవచ్చు. అయితే కొందరు మామూలుగానే బరువు పెరగవచ్చు. పైలోరిక్ స్టెనోసిస్ అనే కండిషన్ వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి సమస్యకు ఆపరేషన్ తప్పనిసరి. ఏదిఏమైనా పిల్లలు మాటిమాటికీ వాంతులు చేసుకుంటుంటే మాత్రం పిల్లల డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.
డాక్టర్ శివరంజని
హెచ్‌ఓడీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్
మాక్స్‌క్యూర్ షియోషా, మాదాపూర్,
హైదరాబాద్
కడుపులో మంట... ఉబ్బరం... తగ్గేదెలా?
Published Mon, Dec 26 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
Advertisement
Advertisement