కడుపునొస్తే.. ‘కోతే’
సంగాయిగూడ తండాలో ఆ‘పరేషాన్’
► 18 శాతం అపెండిసైటిస్ శస్త్ర చికిత్సలు
► ఒక్కొక్కరికి రూ.30 వేలకు పైగా ఖర్చు
► గిరిజనుల జీవితాలతో ప్రైవేటు వైద్యుల చెలగాటం
మెదక్ జోన్: అమాయక గిరిజన యువకుల జీవితాలతో ప్రైవేట్ వైద్యులు చెలగాటమాడుతున్నారు. కడుపునొప్పి అని ఆస్పత్రికి వెళితే.. ప్రాణాలకే ప్రమాదం ఉందంటూ శస్త్ర చికిత్స చేసి పంపుతున్నారు. ఈ రకంగా ఓ తండాలో ఏకంగా 18 శాతం మంది గిరిజనులకు అపెండిక్స్ ఆపరేషన్లు చేసి రూ.లక్షలు దండుకున్నారు. మెదక్ జిల్లా చిట్యాల పంచాయతీ పరిధిలోని సంగాయిగూడ తండాలో సుమారు 500 మంది జనాభా ఉంది. వీరికి ఆరోగ్య సమస్యలు ఏం వచ్చాయో తెలియదు కానీ, కొంతకాలంగా దాదాపు 80 మందికి పైగా అపెండిక్సు ఆపరేషన్లు అయ్యాయి. అందులో 75 శాతం 20 ఏళ్ల లోపువారే ఉన్నారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.25 వేల నుంచి రూ.30 వేల దాకా ఖర్చయ్యాయి. విచిత్రమేమిటంటే కొన్ని కుటుంబాల్లో ఆరుగురు సభ్యులు ఉంటే, అందులో ఐదుగురు సభ్యులు ఈ ఆపరేషన్లు చేయించుకున్నవారు ఉన్నారు.
రకరకాల రోగాలు అంటగట్టి..
అపెండిసైటిస్ ఆపరేషన్‌తోపాటు, రక్తం తక్కువ ఉందని పచ్చ కామెర్లు అయ్యాయని రకరకాలుగా చెప్పి ఆపరేషన్లు చేసినట్లు పలువురు బాధితులు చెబుతున్నారు. నిత్యం రెక్కల కష్టంపై ఆధారపడే కష్టజీవుల కడుపులు కోయడంతో బరువు పనులు చేయలేక అల్లాడిపోతున్నారు. ఆపరేషన్‌ల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు నానా యాతన పడుతున్నారు. కొందరు రైతులు భూములను తాకట్టు పెట్టుకోగా, మరికొందరు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. ఆ గిరిజన తండాలో ఏ కుటుంబాన్ని కదిలించినా.. ఆపరేషన్ లేని వ్యక్తి కనిపించడంటే అతిశయోక్తికాదు. వరుస కడుపు కోతలతో ఎంతో మంది పెళ్లి పేరంటాలను వాయిదా వేసుకొని అప్పులు కట్టుకున్నారు. మీకే ఎందుకు ఇంతగా ఆపరేషన్లు చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే తండాలోని చేతి పంపు నీటిని తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆపరేషన్ చేసిన వైద్యులు చెప్పారని ఆ అమాయక గిరిజనులు వాపోయారు.
ఒకే కుటుంబంలో ఐదుగురికి..
లంబాడీ సంగ్యా – మంగి దంపతులకు నలుగురు కొడుకులు. వారందరికీ పెళ్లిళ్లు చేశారు. ఈ లెక్కన ఆ కుటుంబంలో మొత్తం 10 మందికి చేరారు. ఇందులో ముగ్గురు కొడుకులు తరుణ్, రాజు, రమేశ్‌లతోపాటు, ఇద్దరు కోడళ్లు శోభ, శాంతికి అపెండిసైటిస్ ఆపరేషన్లు జరిగాయి. ఆపరేషన్ సమయంలో రక్తం తక్కువగా ఉందని, కళ్లకు జాండీస్ వచ్చిందని ఇలా ఒక్కొక్కరి వద్ద రూ.30 వేల చొప్పున రూ.1.50 లక్షలు వసూలు చేశారు.