Appendicitis
-
నటుడు అర్జున్ బిజ్లానీకి అపెండిసైటిస్ సర్జరీ! ఇది ఎందుకొస్తుందంటే..!
బాలీవుడ్ బుల్లి తెర నటుడు అర్జున్ బిజ్లానీకి గతవారమే ముంబై ఆస్పత్రిలో అపెండిసైటిస్ అపరేషన్ జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ విషయాన్నే ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. శస్త్ర చికిత్స బాగా జరిగిందని, తాను కోలుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. తనకు పూర్తిగా నయం అయ్యేంత వరకు వైద్యులు మంచి కేరింగ్‌గా చూసుకున్నారని అన్నాడు. తనను కోలుకునేలా చేసిన వైద్య బృందానికి, అలాగే అత్యంత జాగ్రతగా చూసుకున్న భార్య నేహ స్వామికి కృతజ్ఞతలంటూ పోస్ట్ పెట్టాడు. అసలేంటీ అపెండిసైటిస్? ఎందువల్ల వస్తుందంటే.. కడుపులో ఉండే పెద్ద పేగుకు తోకలా అనుసంధానమై ఉండేదే అపెండిక్స్. దీనివల్ల ఏర్పడే సమస్యనే అపెండిసైటిస్ అని పిలుస్తారు. అపెండిక్స్‌లో మలినాలు చేరడం వల్ల లేదా బ్యాక్టీరియా సోకినా వాటి గోడలు వాచిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా కడుపులో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. ఆ నొప్పినే అపెండిసైటిస్ లేదా 24 గంటల నొప్పి అని అంటారు. ఈ అపెండిక్స్ కేవలం 3 నుంచి 4 అంగుళాల పొడవే ఉంటుంది. పెద్ద ప్రేగుకు అనుసంధానమై చిన్న ట్యూబ్ తరహాలో కనిపిస్తుంది. ఇందులోకి మలినాలు చేరితే అపెండిసైటిస్ సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది. View this post on Instagram A post shared by Arjun Bijlani 🧿 (@arjunbijlani) ఎందుకు వస్తుందంటే.. అపెండిక్స్ లోపలి పొరలు శ్లేష్మం లేదా చీమును ఉత్పత్తి చేస్తాయి. ఆ చీము పెద్ద పేగు మొదటి భాగం (Cecum)లోకి వెళ్తుంది. ఈ సెకమ్ మలాన్ని అపెండిక్స్‌లోకి రాకుండా అడ్డుకుంటుంది. ఒక వేళ ఈ చీము సెకమ్‌లోకి ప్రవేశించకపోతే పెద్ద పేగులోని మలం అపెండిక్స్‌లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా అపెండిక్స్ గోడలు వాచిపోయి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. లేదా అపెండిక్స్‌లో ఏదైనా పూడిక ఏర్పడితే.. అందులోని బ్యాక్టీరియా గోడలపై దాడి చేస్తుంది. ఫలితంగా అపెండిక్స్‌లో వాపు ఏర్పడి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. ఒక్కోసారి కేన్సర్ వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు. 24 గంటల నొప్పి అనడానికి రీజన్.. సాధారణ కడుపు నొప్పిలా వస్తుంది. ఆ తర్వాత క్రమేణ కొన్ని రోజులకు నొప్పి తీవ్రమవుతుంది. జ్వరం కూడా వస్తుంది. ఈ నొప్పి కాస్త తారాస్థాయికి చేరుకుని భరించలేనిధిగా ఉన్నప్పుడూ 24 గంటల్లోపు సర్జరీ చేయాలి లేదంటే చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల దీన్ని 24 గంటల నొప్పి అని అంటారు. ఎలా గుర్తిస్తారంటే.. అంత సులభంగా ఈ వ్యాధిని గుర్తించలేం. ఇది ఉదరంలో ఏర్పడే గాల్ బ్లాడర్, మూత్రకోశాలు, పేగుల ఇన్ఫెక్షన్, ఓవరీ, క్రాన్ వాటికి సంబంధించిన సాధారణ నొప్పిలా ఉంటుంది. అందువల్ల వైద్యులు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ పరీక్షలు చేసి ఈ సమస్యను గుర్తిస్తారు. పెండిసైటిస్ ప్రారంభంలో తెల్లరక్త కణాలు సాధారణంగానే ఉంటాయి. కానీ, ఇన్ఫెక్షన్ మొదలైన తర్వాత వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. వాటి ఆధారంగా వైద్యులు అపెండిసైటిస్ సమస్యను గుర్తిస్తారు. సర్జరీ తప్పదా అంటే.. చాలా కేసుల్లో సర్జరీ ద్వారా అపెండిక్స్ను పూర్తిగా తొలగిస్తుంటారు. నొప్పి తీవ్రమైన వెంటనే సర్జరీ చేయకపోతే అపెండిక్స్ పగిలిపోయి అందులోని పదార్థాలు ఉదరంలోకి చేరుతాయి. ఫలితంగా అక్కడ కూడా వాపు ఏర్పడి ‘పెరిటోనైటిస్’ అనే సమస్య ఏర్పడుతుంది. వెంటనే సర్జరీ చేసి అపెండిక్స్ తొలగించకపోతే ప్రాణాలు పోతాయి. ఈ సమస్య ముందుగానే గుర్తిస్తే సర్జరీ అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ ద్వారా తగ్గించొచ్చు అని వైద్యులు చెబుతున్నారు. నివారణ.. ఈ అపెండిక్స్ అవయవం రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో పెరిగే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు ఔషదంలా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి. అపెండిక్స్లోని గోడల్లో ఉండే లింఫాటిక్ కణజాలం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది. అయితే దీన్ని పూర్తిగా తొలగించినా పెద్దగా సమస్యలు కూడా ఏమీ లేవని పలు పరిశోధనల్లో నిరూపితమయ్యింది. కానీ అపెండిసైటిస్ రాకుండా నివారణ మార్గాలు మాత్రం ఏమీ లేవు. పరిశోధనల్లో మాత్రం అధిక పీచు పదార్థాలను ఆహారంగా తీసుకొనేవారిలో ఈ సమస్య తక్కువగా ఉన్నట్లు తేలింది. (చదవండి: హీరో అజిత కుమార్ ఎదుర్కొంటున్న వ్యాధేంటీ? దేని వల్ల వస్తుందంటే..!) -
కడుపునొస్తే.. ‘కోతే’
సంగాయిగూడ తండాలో ఆ‘పరేషాన్’ ► 18 శాతం అపెండిసైటిస్ శస్త్ర చికిత్సలు ► ఒక్కొక్కరికి రూ.30 వేలకు పైగా ఖర్చు ► గిరిజనుల జీవితాలతో ప్రైవేటు వైద్యుల చెలగాటం మెదక్ జోన్: అమాయక గిరిజన యువకుల జీవితాలతో ప్రైవేట్ వైద్యులు చెలగాటమాడుతున్నారు. కడుపునొప్పి అని ఆస్పత్రికి వెళితే.. ప్రాణాలకే ప్రమాదం ఉందంటూ శస్త్ర చికిత్స చేసి పంపుతున్నారు. ఈ రకంగా ఓ తండాలో ఏకంగా 18 శాతం మంది గిరిజనులకు అపెండిక్స్ ఆపరేషన్లు చేసి రూ.లక్షలు దండుకున్నారు. మెదక్ జిల్లా చిట్యాల పంచాయతీ పరిధిలోని సంగాయిగూడ తండాలో సుమారు 500 మంది జనాభా ఉంది. వీరికి ఆరోగ్య సమస్యలు ఏం వచ్చాయో తెలియదు కానీ, కొంతకాలంగా దాదాపు 80 మందికి పైగా అపెండిక్సు ఆపరేషన్లు అయ్యాయి. అందులో 75 శాతం 20 ఏళ్ల లోపువారే ఉన్నారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.25 వేల నుంచి రూ.30 వేల దాకా ఖర్చయ్యాయి. విచిత్రమేమిటంటే కొన్ని కుటుంబాల్లో ఆరుగురు సభ్యులు ఉంటే, అందులో ఐదుగురు సభ్యులు ఈ ఆపరేషన్లు చేయించుకున్నవారు ఉన్నారు. రకరకాల రోగాలు అంటగట్టి.. అపెండిసైటిస్ ఆపరేషన్‌తోపాటు, రక్తం తక్కువ ఉందని పచ్చ కామెర్లు అయ్యాయని రకరకాలుగా చెప్పి ఆపరేషన్లు చేసినట్లు పలువురు బాధితులు చెబుతున్నారు. నిత్యం రెక్కల కష్టంపై ఆధారపడే కష్టజీవుల కడుపులు కోయడంతో బరువు పనులు చేయలేక అల్లాడిపోతున్నారు. ఆపరేషన్ల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు నానా యాతన పడుతున్నారు. కొందరు రైతులు భూములను తాకట్టు పెట్టుకోగా, మరికొందరు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. ఆ గిరిజన తండాలో ఏ కుటుంబాన్ని కదిలించినా.. ఆపరేషన్ లేని వ్యక్తి కనిపించడంటే అతిశయోక్తికాదు. వరుస కడుపు కోతలతో ఎంతో మంది పెళ్లి పేరంటాలను వాయిదా వేసుకొని అప్పులు కట్టుకున్నారు. మీకే ఎందుకు ఇంతగా ఆపరేషన్లు చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే తండాలోని చేతి పంపు నీటిని తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆపరేషన్ చేసిన వైద్యులు చెప్పారని ఆ అమాయక గిరిజనులు వాపోయారు. ఒకే కుటుంబంలో ఐదుగురికి.. లంబాడీ సంగ్యా – మంగి దంపతులకు నలుగురు కొడుకులు. వారందరికీ పెళ్లిళ్లు చేశారు. ఈ లెక్కన ఆ కుటుంబంలో మొత్తం 10 మందికి చేరారు. ఇందులో ముగ్గురు కొడుకులు తరుణ్, రాజు, రమేశ్లతోపాటు, ఇద్దరు కోడళ్లు శోభ, శాంతికి అపెండిసైటిస్ ఆపరేషన్లు జరిగాయి. ఆపరేషన్ సమయంలో రక్తం తక్కువగా ఉందని, కళ్లకు జాండీస్ వచ్చిందని ఇలా ఒక్కొక్కరి వద్ద రూ.30 వేల చొప్పున రూ.1.50 లక్షలు వసూలు చేశారు. -
ఆస్పత్రులు బంద్
► ఇబ్బందులుపడ్డ రోగులు ► హైకోర్టుకు వెళ్లిన వైద్యుల బృందం ► హెచ్ఆర్సీ, ఎంపీ కవితకు విన్నపం జగిత్యాల అర్బన్/కోరుట్ల : అపెండిసైటిస్, గర్భసంచుల ఆపరేషన్ల కేసులో జగిత్యాలకు చెందిన తాటిపాముల సురేష్‌కుమార్, కోరుట్లకు చెందిన డాక్టర్ మనోజ్‌కుమార్‌ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల వైద్యులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈమేరకు కోరుట్ల, మెట్పల్లిలో నిరవధిక బంద్‌కు పిలుపునివ్వగా జగిత్యాలలోనూ బంద్ కొనసాగుతోంది. శనివారం జిల్లా వ్యాప్తంగా బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కి శుక్రవారం విన్నవించారు. అంతేకాకుండా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను సైతం కలిసి డాక్టర్ల సమస్యపై వినతిపత్రం అందజేశారు. హైకోర్టులో క్రాస్ పిటిషన్, రిట్ పిటిషన్ సైతం దాఖలు చేశారు. ఫిర్యాదు చేసిన బాధితులు ఏడాది క్రితం ఆపరేషన్ చేసుకున్నారని, మళ్లీ కడుపునొప్పి ఉందనే చెప్పారే తప్ప బలవంతంగా చేయలేదన్నారు. కానీ పోలీసులు 420 కేసులు నమోదు చేశారని హెచ్ఆర్సీ ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేశా రు. హెచ్ఆర్సీ సైతం పత్రికల్లో వచ్చిన కథనాల మేరకే దర్యాఫ్తు చేయమన్నామే తప్ప వేరేగా ప్రయత్నించలేదని చెప్పినట్లు తెలిసింది. ఈ సమస్యలన్నీ ఎంపీ కవిత దృష్టికి సైతం తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని ఆమె చెప్పినట్లు సమాచారం. నేటి బంద్‌కు నిర్ణయం? శనివారం జిల్లాస్థాయిలో ఆస్పత్రులను బంద్ చేయడంతోపాటు సమావేశం సైతం నిర్వహించనున్నట్లు తెలిసింది. అక్రమంగా అరెస్ట్‌లు చేస్తే నిరవధిక సమ్మె చేపట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రోగులకు తప్పని తిప్పలు వైద్యులందరూ నిరవధిక బంద్ చేపడుతుండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తెలియక నిత్యం హాస్పిటల్‌కు వస్తూ పోతున్నారు. ఉన్నతాధికారులు స్పందిస్తేగానీ సమస్య పరిష్కారం అయ్యేలా లేదు. కోరుట్ల-మెట్పల్లి బంద్ కాల్ ఆఫ్ వైద్యుల ఆరెస్టుతో బంద్‌కు పిలుపునిచ్చిన ఐఎంఏ ప్రతినిధులు రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో బంద్ పిలుపును ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఐఎంఏ సెంట్రల్ కమిటీ సభ్యుడు వైద్యుడు అనూప్‌రావు ‘సాక్షి’తో మాట్లాడారు. శనివారం నుంచి తాము ఆస్పత్రులు తెరిచి వైద్యసేవలు అందిస్తామన్నారు. కోరుట్ల-మెట్పల్లి ప్రాంతంలో రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. శనివారం నుంచి ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు చెప్పారు. కోరుట్లలో రోగుల పాట్లు ఈమె పేరు సామల్ల మహేశ్వరి. కోరుట్లలోని 21వ వార్డులో నివాసముంటుంది. తొమ్మిది నెలల గర్భిణి మహేశ్వరీ శుక్రవారం ఉదయం పురిటినొప్పులతో ఇబ్బందులు పడుతుండడంతో బంధువులు హడావిడిగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బంద్ బోర్డు ఉండడంతో.. ఏం చేయూలో తెలియలేదు. అన్ని ఆస్పత్రులు బంద్ ఉన్నాయని తెలుసుకుని చివరికి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ మహేశ్వరి బాబుకు జన్మనిచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో పిల్లల డాక్టర్ లేకపోవడంతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు వెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఈ పరిస్థితి మహేశ్వరీదే కాదు. ఈ ప్రాంతంలో ప్రైవేట్ ఆస్పత్రులు బంద్ ఉండడంతో చాలా మంది ఇబ్బందులుపడ్డారు. హృద్రోగి కోరుట్లకు చెందిన ఎక్కల్దేవి నారాయణ, కథలాపూర్ మండలం తుర్తికి చెందిన గర్భిణి జమున అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగి చివరికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. -
డొంక కదిలింది
► అనవసరపు ఆపరేషన్ల కేసులో సర్జన్ సురేష్, ఆర్ఎంపీ గణేష్ అరెస్ట్ ► కొనసాగుతున్న కేసు విచారణ ► మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ► వైద్యులు, ఆర్‌ఎంపీల్లో గుబులు కాసులకోసం కక్కుర్తిపడి కడుపు‘కోత’లు కోసిన వ్యవహారంలో చర్యలు మొదలయ్యాయి. అవసరం లేకున్నా కమీషన్ల కోసం పలువురు ఆర్ఎంపీలు, వైద్యులు కలిసి అపెండిసైటిస్, గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కథలాపూర్ మండలంలో మొదట వెలుగుచూసిన ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారుల కోసం అన్వేషించిన పోలీసులు జగి త్యాల వైద్యుడు టి.సురేష్‌కుమార్‌ను, కథలాపూర్ మండలం తాండ్య్రాల ఆర్ఎంపీ జక్కని గణేష్‌ను మంగళవారం అరెస్టు చేయడంతో ఈ దందాలో డొంక కదలినట్లయింది. - కథలాపూర్/జగిత్యాల అర్బన్/కోరుట్ల అనవసరపు ఆపరేషన్ల వ్యవహారం మానవహక్కుల కమిషన్‌కు వెళ్లగా కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్, రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు వేర్వేరుగా విచారణ చేపట్టి నివేదిక అందించారు. దీని ప్రకారం... కథలాపూర్ మం డలంలో 2011 నుంచి 2016 వరకు 620 అపెండిసైటిస్, 422 గర్భసంచుల ఆపరేషన్లు తొలగించినట్లు తేలింది. తర్వాత సారంగాపూర్, రాయికల్ మండలాల్లోనూ ఈ దందా సాగినట్లు వార్తలు వచ్చాయి. జగిత్యా ల, కోరుట్లలోని ఇద్దరు ముగ్గురు వైద్యులే ఈ ఆపరేషన్లు చేసినట్లు తేలింది. ఇద్దరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోరుట్ల సీఐ రాజశేఖరరాజు, కథలాపూర్ ఎస్సై నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేసి మంగళవారం అరెస్టుల ప్రక్రియ ప్రారంభించారు. వైద్యుల్లో గుబులు డాక్టర్ సురేశ్‌కుమార్, ఆర్ఎంపీ గణేశ్‌ను అరెస్టు చేయడంతో పలువురు వైద్యుల్లో గుబులు మొదలైంది. మరికొందరికి సైతం ఈ వ్యవహారంలో పాత్ర ఉన్నట్లు వెల్లడి కాగా, ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. రాయికల్ మండలం మూటపల్లి, గొల్లపల్లి మండలం యశ్వంతరావుపేట, సారంగాపూర్ మండలం బీర్పూర్ తదితర చోట్ల సైతం పలువురు ఆర్ఎంపీలు, వైద్యులు అపెండిసైటిస్, గర్భసంచి ఆపరేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో కేసుకు తమకు వచ్చే రూ.6 నుంచి రూ.8 వేల కమీషన్ కోసం ఆర్ఎంపీలు పలువురిని ఈ ఆపరేషన్లకు ప్రోత్సహించినట్లు తేలిన విషయం తెలిసిందే. రాజకీయ ఒత్తిళ్లతో జాప్యం! అనవసరపు ఆపరేషన్ల వ్యవహారం బహిర్గతమైనప్పటినుంచి 40 రోజుల్లోగా ఏం జరుగుతుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. వ్యవహారం మానవహక్కుల కమిషన్ దృష్టికి వెళ్లడం, విచారణలు, నివేదికలతో చర్చనీయాంశంగా మారింది. చివరకు ఇద్దరి అరెస్టుతో కీలక మలుపు తిరిగినట్లయింది. మరింత లోతుగా విచారణ చేపట్టి... ఈ దందాలో పాత్ర ఉన్న గ్రామీణ వైద్యులను మరికొందరిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 10 మంది ఆర్ఎంపీల పాత్ర ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చినా... రాజకీయ పలుకుబడితో పలువురిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే దర్యాప్తులో జాప్యం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. అతని రూటే సప‘రేటు’ డాక్టర్ టి.సురేశ్‌కుమార్ మొదటినుంచి తన రూటే సప‘రేటు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జగిత్యాలలో విజయలక్ష్మి నర్సింగ్‌హోం, కోరుట్లలో పల్లవి ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. పల్లవి ఆస్పత్రికి డీఎంహెచ్‌వో అనుమతి లేదని విచారణలో తేలింది. ఈ విషయంపై పోలీసులు డీఎంహెచ్‌వోకు లేఖ రాశారు. సర్జన్ సురేశ్ ఇచ్చే కమీషన్ల ఆశతో కడుపునొప్పితో వచ్చే రోగులను కథలాపూర్ మండలం తాండ్య్రాలకు చెందిన ఆర్ఎంపీ గణేశ్ తప్పుదోవ పట్టించి ఆపరేషన్లు చేయించినట్లు తేలింది. ఆర్ఎంపీ గణేశ్ సిఫారసుతో ఒక్క తాండ్య్రాలలోనే 50 మందికి అపెండిసైటిస్ ఆపరేషన్లు చేశారు. సురేశ్‌కుమార్ గతంలో ధర్మారంలోని ఓ నర్సింగ్‌హోమ్‌లో శస్త్రచికిత్స చేయగా, అనస్తీషియా సైతం సురేశ్‌కుమారే ఇవ్వడంతో మందు వికటించి రోగి ఆపరేషన్ థియేటర్లోనే మరణించినట్లు ఆరోపణలొచ్చాయి. బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించి, ఒత్తిడి తీసుకువచ్చి కేసు మాఫీ చేసినట్లు సమాచారం. కొనసాగుతున్న విచారణ అనవసరపు ఆపరేషన్ల వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని కోరుట్ల సీఐ రాజశేఖరరాజు వెల్లడించారు. మరికొందరు వైద్యులు, ఆర్ఎంపీలు కూడా ఈ తతంగంలో పాలుపంచుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పూర్తిస్థాయి విచారణ అనంతరం బాధ్యులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. విచారణ నిక్కచ్చిగా జరిపిన ఎస్సై నిరంజన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు జలీల్, రాజ్‌కుమార్, సురేశ్‌ను సీఐ అభినందించారు. బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. మోసాలు చేస్తున్న ఆర్ఎంపీలపై నిఘా ఉంచామన్నారు.