బాలీవుడ్ బుల్లి తెర నటుడు అర్జున్ బిజ్లానీకి గతవారమే ముంబై ఆస్పత్రిలో అపెండిసైటిస్ అపరేషన్ జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ విషయాన్నే ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. శస్త్ర చికిత్స బాగా జరిగిందని, తాను కోలుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. తనకు పూర్తిగా నయం అయ్యేంత వరకు వైద్యులు మంచి కేరింగ్‌గా చూసుకున్నారని అన్నాడు. తనను కోలుకునేలా చేసిన వైద్య బృందానికి, అలాగే అత్యంత జాగ్రతగా చూసుకున్న భార్య నేహ స్వామికి కృతజ్ఞతలంటూ పోస్ట్ పెట్టాడు. అసలేంటీ అపెండిసైటిస్? ఎందువల్ల వస్తుందంటే..
కడుపులో ఉండే పెద్ద పేగుకు తోకలా అనుసంధానమై ఉండేదే అపెండిక్స్. దీనివల్ల ఏర్పడే సమస్యనే అపెండిసైటిస్ అని పిలుస్తారు. అపెండిక్స్‌లో మలినాలు చేరడం వల్ల లేదా బ్యాక్టీరియా సోకినా వాటి గోడలు వాచిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా కడుపులో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. ఆ నొప్పినే అపెండిసైటిస్ లేదా 24 గంటల నొప్పి అని అంటారు. ఈ అపెండిక్స్ కేవలం 3 నుంచి 4 అంగుళాల పొడవే ఉంటుంది. పెద్ద ప్రేగుకు అనుసంధానమై చిన్న ట్యూబ్ తరహాలో కనిపిస్తుంది. ఇందులోకి మలినాలు చేరితే అపెండిసైటిస్ సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది.
ఎందుకు వస్తుందంటే..
అపెండిక్స్ లోపలి పొరలు శ్లేష్మం లేదా చీమును ఉత్పత్తి చేస్తాయి. ఆ చీము పెద్ద పేగు మొదటి భాగం (Cecum)లోకి వెళ్తుంది. ఈ సెకమ్ మలాన్ని అపెండిక్స్‌లోకి రాకుండా అడ్డుకుంటుంది. ఒక వేళ ఈ చీము సెకమ్‌లోకి ప్రవేశించకపోతే పెద్ద పేగులోని మలం అపెండిక్స్‌లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా అపెండిక్స్ గోడలు వాచిపోయి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. లేదా అపెండిక్స్‌లో ఏదైనా పూడిక ఏర్పడితే.. అందులోని బ్యాక్టీరియా గోడలపై దాడి చేస్తుంది. ఫలితంగా అపెండిక్స్‌లో వాపు ఏర్పడి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. ఒక్కోసారి కేన్సర్ వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు.
24 గంటల నొప్పి అనడానికి రీజన్..
సాధారణ కడుపు నొప్పిలా వస్తుంది. ఆ తర్వాత క్రమేణ కొన్ని రోజులకు నొప్పి తీవ్రమవుతుంది. జ్వరం కూడా వస్తుంది. ఈ నొప్పి కాస్త తారాస్థాయికి చేరుకుని భరించలేనిధిగా ఉన్నప్పుడూ 24 గంటల్లోపు సర్జరీ చేయాలి లేదంటే చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల దీన్ని 24 గంటల నొప్పి అని అంటారు.
ఎలా గుర్తిస్తారంటే..
అంత సులభంగా ఈ వ్యాధిని గుర్తించలేం. ఇది ఉదరంలో ఏర్పడే గాల్ బ్లాడర్, మూత్రకోశాలు, పేగుల ఇన్ఫెక్షన్, ఓవరీ, క్రాన్ వాటికి సంబంధించిన సాధారణ నొప్పిలా ఉంటుంది. అందువల్ల వైద్యులు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ పరీక్షలు చేసి ఈ సమస్యను గుర్తిస్తారు. పెండిసైటిస్ ప్రారంభంలో తెల్లరక్త కణాలు సాధారణంగానే ఉంటాయి. కానీ, ఇన్ఫెక్షన్ మొదలైన తర్వాత వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. వాటి ఆధారంగా వైద్యులు అపెండిసైటిస్ సమస్యను గుర్తిస్తారు.
సర్జరీ తప్పదా అంటే..
చాలా కేసుల్లో సర్జరీ ద్వారా అపెండిక్స్‌ను పూర్తిగా తొలగిస్తుంటారు. నొప్పి తీవ్రమైన వెంటనే సర్జరీ చేయకపోతే అపెండిక్స్ పగిలిపోయి అందులోని పదార్థాలు ఉదరంలోకి చేరుతాయి. ఫలితంగా అక్కడ కూడా వాపు ఏర్పడి ‘పెరిటోనైటిస్’ అనే సమస్య ఏర్పడుతుంది. వెంటనే సర్జరీ చేసి అపెండిక్స్ తొలగించకపోతే ప్రాణాలు పోతాయి. ఈ సమస్య ముందుగానే గుర్తిస్తే సర్జరీ అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ ద్వారా తగ్గించొచ్చు అని వైద్యులు చెబుతున్నారు.
నివారణ..
ఈ అపెండిక్స్ అవయవం రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో పెరిగే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడు ఔషదంలా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి. అపెండిక్స్‌లోని గోడల్లో ఉండే లింఫాటిక్ కణజాలం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది. అయితే దీన్ని పూర్తిగా తొలగించినా పెద్దగా సమస్యలు కూడా ఏమీ లేవని పలు పరిశోధనల్లో నిరూపితమయ్యింది. కానీ అపెండిసైటిస్ రాకుండా నివారణ మార్గాలు మాత్రం ఏమీ లేవు. పరిశోధనల్లో మాత్రం అధిక పీచు పదార్థాలను ఆహారంగా తీసుకొనేవారిలో ఈ సమస్య తక్కువగా ఉన్నట్లు తేలింది.
(చదవండి: హీరో అజిత కుమార్ ఎదుర్కొంటున్న వ్యాధేంటీ? దేని వల్ల వస్తుందంటే..!)
Comments
Please login to add a commentAdd a comment