శశికుమార్ , శ్రీనివాస్
జమ్మికుంట: కొడుకును కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి కర్కశత్వంగా మారాడు. తాగుడుకు బానిసై.. విచక్షణ కోల్పోయి శరీరం కమిలిపోయేలా చిత్రహింసలకు గురిచేశాడు. తండ్రి అనే మమకారం లేకుండా పసి హృదయాన్ని గాయపరిచాడు. తండ్రి బాధలు భరించలేక 11 ఏళ్ల బాలుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. ‘ఈ తండ్రి నాకొద్దు.. జైల్లో పెట్టండి’అని ఫిర్యాదు చేశాడు. జమ్మికుంట నగర పంచాయతీ పరిధిలోని మోత్కులగూడెంకు చెందిన మొలుగూరు శ్రీనివాస్ తాగుడుకు బానిసగా మారాడు. మేస్త్రీ పని చేస్తూ చేతికి వచ్చిన డబ్బులతో తాగుడుకు ఖర్చు చేస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య, కుమారుడిపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం శ్రీనివాస్ భార్య రమ్య, పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో కూలి పని చేసేందుకు వెళ్లింది.
కుమారుడు శశికుమార్ పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అప్పటికే నిషాలో ఉన్న తండ్రి.. కొడుకును చూసి కోపంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న రూ.3 వేలు తీశావా అంటూ కర్రకు కారం రాసి విపరీతంగా చితక్కొట్టాడు. దీంతో బాలుడి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. తాను డబ్బులు తీయలేదని కొడుకు ఎంత చెప్పినా వినకుండా తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. దెబ్బలకు తాళలేక విలవిల్లాడుతున్న శశికుమార్‌ను పెద్దమ్మ వచ్చి విడిపించింది. రాత్రి ఇంటికొచ్చిన తల్లికి విషయం విలపించాడు.
అనంతరం జమ్మికుంట పోలీసు స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేశాడు. మా నాన్నతో ఎప్పటికైనా అమ్మకు, తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. తాగి వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటామని విలపిస్తూ చెప్పాడు. పోలీసులు బాలుడి ఒంటిపై ఉన్న గాయాలను చూసి చలించిపోయారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. తన అక్క శ్వేత కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతోందని, తానూ అక్కడే ఉండి చదువుకుంటానని శశికుమార్ చెప్పాడు. కాగా, నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్లు సీఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment