సమయం రెండేళ్లే..సహకరించండి
జిల్లా కలెక్టర్లను కోరిన సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: తమ ప్రభుత్వానికి ఇంకా రెండేళ్లే సమయం ఉందని, సహకరించాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లను కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలని పరోక్షంగా వారికి సూచించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తిని పెంచేలా పనితీరు ఉండాలని పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఉదయం ఆయన కలెక్టర్లతో అల్పాహార విందు సమావేశం నిర్వహించారు. పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై కలెక్టర్లకు తన మనసులోని మాట చెప్పి అందుకనుగుణంగా పని చేయాలని బాబు కోరినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తేనే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని, వారితో సర్దుకుపోతూ పని చేయాలని కలెక్టర్లకు సూచించారు.
లోకేశ్‌తో సహా అమెరికా పర్యటనకు బాబు: ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌తో సహా వచ్చే నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమె రికాలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్‌ప్రా న్సిస్కో, చికాగో, న్యూయార్క్, న్యూజెర్సీల్లో చంద్రబాబు బృందం పర్యటించనుంది. యుఎస్‌ఐబీసీ వార్షిక వెస్ట్ కోస్ట్ సదస్సు అండ్ టైకాన్–2017 సదస్సులో పాల్గొం టారు. పదిహేడు మంది ఉన్న ఈ బృందంలో మంత్రులు, అధికారులు ఉన్నారు.ఈ బృందం పర్యటనకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి నిధుల నుంచి భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.