సాక్షి, అమరావతి: ‘కర్ణాటకలో బీజేపీ వారు డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనడం ఏమిటి? నీతి, నిజాయితీ అని చెప్పి విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొనే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం? గవర్నర్‌ను ఉపయోగించుకుని పది మంది బీజేపీ నాయకులు బేరసారాలు జరిపారు. ఊరూరా తిరిగారు, మా ప్రభుత్వంలోకి వస్తే వందరెట్లు ఎక్కువ సంపాదించుకోవచ్చని రమ్మన్నారు. ఇంత వింతపోకడ నేనెప్పుడూ చూడలేదు’.. అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
వెలగపూడి సచివాలయంలో శుక్రవారం మీడియా సమావేశంతోపాటు పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలు గతం కంటే ఈసారి ఎక్కువగా బలోపేతమయ్యాయని చెప్పారు. తాను అందరిలా కుప్పిగంతులు వేయనని తృతీయ ఫ్రంట్‌పై కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. ప్రధాని మోడీని కలుస్తారా అని ఓ విలేకరి అడగ్గా.. నువ్వు రాయబారం వహిస్తావా అని ఎదురు ప్రశ్నించి మీడియాను 40 ఏళ్లుగా డీల్ చేస్తున్నానని, ఇప్పుడు కూడా చేస్తానని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఎందుకు ఆమోదింలేదని ప్రశ్నించారు. కాగా, ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేస్తున్న ప్రజలు రేపటి ఎన్నికల్లో ఓట్లు వేస్తారా అని అడిగినప్పుడు ఆలోచిస్తామని చెబుతున్నారే తప్ప ఓటు వేస్తామని చెప్పడంలేదని చంద్రబాబు నిస్పృహ వ్యక్తం చేశారు. మరో కార్యక్రమంలో చంద్రన్న బీమాకు సంబంధించిన ప్రీమియం చెక్‌ను ఎల్‌ఐసీ రీజినల్ మేనేజర్ ఎం. జగన్నాథంకు సీఎం అందించారు.
నేడు నవనిర్మాణ దీక్ష
కాగా, నవ నిర్మాణ దీక్ష శనివారం ఉ.9 గంటలకు ప్రారంభమవుతుందని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ దీనికి మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఏడు రోజులపాటు జరిగే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలన్నారు. ఈ సందర్భంగా ప్రజల్లో పాలనపై సంతృప్తి స్థాయిని పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 2న గాంధీ జయంతి నాటికి రాష్ట్రమంతా ‘భూదార్’ అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జరిగిన సమీక్షలో.. వచ్చే నెల 1 నుంచి 12 జిల్లాల్లోని 12 మండలాలు, 12 మున్సిపాలిటీల్లో పైలెట్ ప్రాజెక్టుగా ‘భూసేవ’ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం, ఉయ్యూరు మున్సిపాలిటీలో పైలెట్ ప్రాజెక్టుగా భూసేవ ప్రారంభించారు. అలాగే, రంజాన్ మాసం సందర్భంగా అన్ని జిల్లాల్లో మసీదుల మరమ్మతులు, ఇఫ్తార్ నిర్వహణకు రూ.5 కోట్లు విడుదల చేశామని చంద్రబాబు చెప్పారు.
ఎమ్మెల్యేలను కొంటారా!? : చంద్రబాబు
Published Sat, Jun 2 2018 2:51 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment